=''/>

27, ఆగస్టు 2012, సోమవారం

ఫొటోషాప్ తో నా ప్రయోగాలు




ఏమీ  తోచక ఈ మధ్య ఫొటొషాప్  మీద పడ్డాను.

అస్తమాను ఏంకెలుకుతాలే....  యూట్యూబ్ లో వీడియో చూసి   ఏమనా నేర్చుకోవచ్చేమో అనుకుంటే...  నెట్ కనెక్ట్ ఐతే కరెంట్ పోవడం ,కరెంట్ ఉంటే నెట్ కనెక్ట్ కాకపోవడం .మాకు ఈమధ్య  నెట్  సరిగ్గా కనక్ట్ అవ్వడం లేదు.  ఒకవేళ కనక్టైనా     చాలా స్లో ....ఎన్ని కంప్లైంట్లిచ్చినా అంతే.. ఏమన్నా అంటే మీకు కనెక్షన్ ఇవ్వక ముందే చెప్పాము మీ ఊరికి వచ్చే కేబుల్స్ సరిగా లేవని  అంటారు.  

  ఎప్పుడన్నా మామీద  కరెంటూ ,నెట్టూ రెండూ కలిపి  దయ  చూపితే  మాకు పండగన్నమాట.

అలా క్రితం వారం  రెండూ కరుణించినప్పుడు  యూట్యూబ్ లో  ఫొటోబాగ్రౌండ్ మార్చడం గురించి  వీడియో  దొరికింది. దానిని ఒక   వంద సార్లు చూసి చూసీ అరగ్గొట్టి    ఫొటోబాగ్రౌండ్ మార్చడం నేర్చేసుకున్నా!!



                  






నేను మిక్స్ చేసిన ఫొటోలు ...





  
 కొద్ది కొద్దిగా    తేడాలున్నాయికానీ  ,పరవాలేదనుకుంటున్నాను. ఇంకా బాగారావడానికి ట్రై చేస్తున్నాను.        

8, ఆగస్టు 2012, బుధవారం

పెరుగుపచ్చళ్ళు


తేలికగా  ,తొందరగా చేసేయొచ్చు  అనిపించేవి ఈ   పెరుగుపచ్చళ్ళు.



 తోటకూర,పాలకూర,బచ్చలికూర  పెరుగుపచ్చడికి  బాగుంటాయి. కూరగాయల్లో  పొట్లకాయ పెరుగుపచ్చడికి చాలా  బాగుంటుంది.ఆనపకాయ తో కూడా చేస్తారు కానీ, మావైపు  ఎక్కువగా  పొట్లకాయ తో  చేస్తాము.

 ఆకుకూరైనా ,కూరగాయలైనా   ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఉడకబెట్టుకుని, వాటిలో నీరు  పిండుకోవాలి.పచ్చిమిరపకాయలు వేయించుకుని  ఉప్పు ,పచ్చిమిర్చి,అల్లం  కలిపి నూరి పెరుగులోవేసి పిండుకున్న ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి.నూరుకునేంత టైం లేకపోతే ,   మిరపకాయలు,అల్లం చిన్నముక్కలుగా కట్చేసి తాలింపు లో కలిపి వేయించుకున్నా  పరవాలేదు.కానీ,వేయించిన  మిరపకాయలు నూరి  కలిపితే ఉప్పు ,కారం  బాగా కలుస్తుంది .     వేయించిన అల్లం ముక్కల రుచి  బాగుంటుంది. . అలా ఇష్టమైనవారు  అల్లం ముక్కలు కలుపుకోవచ్చు.

 ఇక తాలింపు  సంగతికొస్తే  ... తాలింపు మినప్పప్పు ,  జీలకర్ర ,ఆవాలు,ఎండుమిరపకాయలు,కరివేపాకు ,తో పాటు మెంతులు కూడా వేసుకుని పెట్టుకోవాలి. మెంతులా...  అని మొహం     చేదుగా  పెట్టకండి. వేగిన మెంతుల రుచి చాలా బాగుంటుంది. మాకైతే మజ్జిగచారు,పెరుగుపచ్చడి కి తాలింపు లో  మెంతులు తప్పనిసరిగా ఉండాల్సిందే.  తాలింపు పెట్టుకున్నాక ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసి  కలుపుకోవాలి.  వీటిని వేయించుకోవక్కర్లేదు.పచ్చి ముక్కలే బాగుంటాయి.

కొబ్బరి తో కూడా చేసుకోవచ్చు.కొబ్బరికోరు,మిరపకాయ తొక్కు,పెరుగులోకలుపుకుని తాలింపు పెట్టుకుకొవడమే.కానీ ,దీనిలో ఉల్లిపాయ ముక్కలేయరు.ఇది  ఇడ్లీల్లోకి  ,దోశల్లోకి  చట్నీలా కూడా బాగుంటుంది. .  

1, ఆగస్టు 2012, బుధవారం

రంగు మార్చిన రేక మందార


రోజూ  ఒకే  రంగు లో  పూసి  బోర్ కొట్టిందో  ....లేకపోతే   దానికి కూడా  కొత్తదనం  కావాలనిపించిందో .....

   మా ఇంట్లో  మందార ఇలా పూసింది. 

 ఎరుపు మందార,  ఇదీ  పక్క పక్క కలిసి పోయి  ఉంటాయి.   అప్పుడప్పుడూ  ఇలా పూస్తూ  ఉంటుంది .  

ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంటారు.  ఈ మందార మొక్కలు రెండూ  పక్కపక్కన ఆరేళ్ల పైనుండీ ఉంటున్నాయి మరి! పూర్తిగా కాకపోయినా  ఆ మాత్రం రంగన్నా  అంటించుకోదా?