=''/>

28, జనవరి 2013, సోమవారం

తిరగలి కోసం తిరగాలి!


ఇవి కొత్త పప్పులు వచ్చేరోజులు. మాకు(మా ఊళ్ళో చాలా మందికి)అపరాలు పండక పోయినా మినుములు,కందులు,పెసలు,బొబ్బర్లు కొనుక్కుని  వాటిని తిరగలితో ఇసురుకుని ,బాగుచేసుకుని జాగర్త చేసుకోవడం అలవాటు.

ఇప్పుడు  చాలామంది కొట్ల మీద కొనుక్కోవడమే... మీ ఊళ్ళోనే  మరీ చాదస్తంగా  చేయిస్తారని మా అమ్మమ్మాళ్ళు  అంటారు కానీ ,మేమెప్పుడూ ఇలానే  చేసుకుంటాము. నలుగురైదుగురం కలిపి తెప్పించుకుంటాము.

 తెప్పించుకోవడంతోనే సరా!వాటిని బాగుచేయించుకున్నాక , మిగిలినవి పరవాలేదుకానీ మినుములిసురుకునే తిరగలికోసం   వేట మొదలెట్టాలి.వేటెందుకంటే?మినుములు చిన్నగా ఉంటాయి కదా!సరైన తిరగలితో  ఇసరక పోతే పప్పు సరిగ్గా రాదు నూక ఎక్కువగా  వస్తుంది.    అందుకని ఈరోజుల్లో మాఊళ్ళో మినుములిసురుకునే తిరగలికి మహా గిరాకీ అన్నమాట! 




 ఈతిరగళ్ళు రెండే ఉంటాయి. ఒకటి పై వీధిలో యెద్దనపూడోళ్ళది,ఇంకోటి మా ఆచంటోళ్ళ నలుగురికీ ఉమ్మడిది.అంటే ఎప్పుడో మా తాతమ్మ వాడింది  .వాళ్ళ పిల్లలైన  మా తాతలది.ఇప్పుడు  వాళ్ళ పిల్లలది .

ఈ రెండు తిరగళ్ళని   వరుసగా ఒకరి అతరువాత ఒకరు బుక్ చేసేసుకుంటారు.మా తిరగలి  కన్నా  యద్దనపూడోళ్లది ఇంకా బాగుంటుంది.చిన్నగా తేలికగా   చిన్నపిల్లలు కూడా ఇసిరేయొచ్చు. అందుకే దానికింకా డిమాండ్! వాళ్ళు తిరగలి పోతే మళ్ళీ అటువంటిది దొరకదని ఈమధ్య ఎవరడిగినా ఎదోవంక చెప్పి ఇవ్వడం లేదు.పాతకాలపు  వస్తువులున్నట్టుగా   ఇప్పటివి  ఉండటం లేదుగా  అందుకే  వాళ్ళలా జాగర్త పడుతున్నట్టున్నారు .



                 మా సాయికి  ఇసరడమంటే చాలా ఇష్టం .తిరగలేసేటప్పటికి తయారైపొతాడు నేను నేనంటూ...


 తిరగలేసుకుని కూర్చుంటే  బస్తాడు ఇసిరే వరకూ అక్కడి నుండి కదిలే వాళ్లము కాదని నానమ్మ అస్తమానూ అనేది. మేమా  ...పనోళ్ళు  ఇసురుతుంటే  సరదాగా ఇసరడానికి  కూర్చున్నా గట్టిగా  అరగంట కూర్చుంటే  గొప్పే !అయినా  మన నానమ్మలు,అమ్మమ్మల్లా  ..మనం చేయగలమా?ఆ  రోజుల్లో  వాళ్ళు తిన్న ఆరోగ్యవంతమైన  ఆహారాన్ని బట్టే    అలా పనులు చేసే  వాళ్ళేమో !

ఇలా ఇసరడం ,చాటతో  చెరగడం వంటి పనులు పనులు చేయడం ఇప్పుడు మాకే  కాదు ,పనోళ్ళ క్కూడా  రావడంలేదు.

ఏదో  చేసే  వాళ్ళున్నారని  కానీ ,ఇలా చేసే వాళ్ళెవరూ  దొరకనప్పుడు  మేమూ పప్పులన్నీ కొనుక్కోవడానికి   అలవాటు పడక తప్పదుకదా!



24, జనవరి 2013, గురువారం

హిందీ సీరియళ్ళు


రాధా మధు ,అమ్మమ్మ డాట్ కామ్ ,అమృతం వంటి మంచి సీరియళ్ళు   తీసిన గుణ్ణంగారి నుండి  ఈమధ్య  ఏమీ సీరియల్ రాలేదు.బాగుంటుంది  అనుకున్న ఆ మొగలిరేకులు  ఎన్ని రోజులున్నా  జీడిపాకంలా ఇంకా సాగుతూనే ఉంది.  మిగిలిన    సీరియళ్ళైతే  చెప్పక్కర్లేదు నాకైతే వాళ్ళ మేకప్పులు చూస్తే చాలు చానల్ మార్చయాలనిపిస్తుంది.

ఇన్ని తెలుగు  చానళ్ళు రాక ముందు   దూరదర్శన్ లో తెలుగులో ఋతురాగాలు,కస్తూరి  ,హిందీ లో ఉడాన్ ,సర్కస్  వంటి  సీరియళ్ళు  బాగా చూసేవాళ్ళము.అప్పుడు వారానికి ఒక్కసారే వచ్చినా ఆ ఎపిసొడ్ కోసం ఇంట్లో అంతా  ఆత్రుతగా ఎదురుచూసేవాళ్ళము. ఇప్పుడూ, ఏదైనా సీరియల్ కాస్త బాగుంటుంది... ఇది చూడొచ్చు అనుకునే టప్పటికి సాగదీయడం మొదలుపెట్టేస్తారు.మనకు విసుగొచ్చి చూడటం మానేయాలి.

పగలు మాకుండే కరెంట్  కోతల వలన  టీవీ చూడాలన్న ద్యాస ఉండదు  కానీ రాత్రి కాసేపు చూద్దామంటే   అన్ని సీరియళ్ళూ ఒకేరకం అత్తాకోడళ్ళ తగువులు,ఎత్తుకుపైఎత్తులు,వంకరనవ్వులూనూ.మన వాళ్ళని తక్కువ చేయడం కాదు కానీ  కాస్త కొత్తగా ఆలోచించి తీయోచ్చుకదా  అనిపిస్తుంది.

  ఇదివరకు అప్పుడప్పుడూ  స్టార్,జీ లో హిందీ సీరియళ్ళు చూసేదానిని కానీ రెండో టీవీ వచ్చాక హిందీ సీరియళ్ళుకు బాగా అలవాటుపడిపోయా .అలా అని అన్నీ చూసేయను .

నార్త్ లో నిజంగా ఉమ్మడికుటుంభాలు ఉంటాయో లేదోకానీ హిందీ సీరియళ్ళలో చాలామటుకు  ఉమ్మడికుటుంభాలకు సంభందించిన కథలే.  వాళ్ళ సెట్టింగులూ,డ్రెస్స్లూ అన్నీ చాలా రిచ్ గా చూపిస్తారు.ఒకదానిలో యాక్ట్ చేసిన వాళ్ళూ ఇంకోదానిలో ఉండరు.ఒకళ్ళిదరు ఉండొచ్చేమోకానీ చాలా వరకూ కొత్తవాళ్ళతోనే తీస్తారు . అందుకే కొత్త సీరియల్ ఏదైనా వస్తే కొన్ని రోజులు చూస్తాను.అసలు కథ ఐపోయి సాగదీయడం మొదలు పెడితే  ఇక చూడను.

జీ  లో 7.30 కి సప్నే సుహానా  బాగుంటుంది.8 గంటలకి  కలర్స్ బాలికావదు  బాగుంటుంది కానీ  సాగదీస్తున్నాడు. స్టార్ లో8.30కి  ఏక్ హజారోమె  మేరే బహెనా  , కలర్స్ లో మధుబాల రెండూ కలిపి ఒకేసారి చూసేస్తా.    స్టార్లోనే రాత్రి  10 గంటలకి వచ్చే ప్యార్ కా దర్ద్  మైనేప్యార్ కియ,హం ఆప్కే హై కౌన్   వంటి   సినిమాలు తీసిన  రాజశ్రీ వాళ్ళది  .టైటిల్  సాంగ్ చాలా బాగుంటుంది.పాత  హిందీ పాట


 


 కొన్నిరోజులు చూసి బోర్ కొట్టి చూడటమ్ మానేసిన వన్నీ  ఇప్పుడు మా టివీ లో డబ్  చేసి వేస్తున్నారు.మద్యాహ్నం 3 గంటలనుండి  7.30 వరకూ అవే.

8, జనవరి 2013, మంగళవారం

ఉడుతలు.


ఉరుకులు పరుగులుతో  ఏదో పనున్నట్టు అస్తమానూ  హడావిడిగా అటూ  ఇటూ  తిరుగుతూ ,కొత్తవాళ్ళెవరన్నా వస్తే ,వీళ్ళు ఉడుతలు పెంచుకుంటున్నారా?అనుకునేలా  తిరుగుతూంటాయి మా ఇంట్లో ఉడుతలు. 

ఒకదాన్నొకటి తరుముకుంటూ ,మధ్య మధ్యలో మా టామీ దగ్గరకొస్తూ,అప్పుడప్పుడూ దానిని కూడా కవ్విస్తుంటాయి.ఒక్కోసారి టామీ వాటి మీద పగ బట్టినట్టు అరుస్తాది.పాపం  ఇదేమో కట్టేసుంటుంది ...అవలా  స్వేచ్చగా తిరుగుతూ ,ఆడుకుంటూంటే ఇది చుడలేక వాటి మీద అలా అరుస్తాదేమో అనుకుంటాము.  

పిల్లలు హాస్టల్ నుండి ఇంటికొచ్చినా,మా చెల్లి పిల్లలొచ్చినా  వాటి వెనుకే తిరుగుతూ,గమనిస్తూ కలక్షేపం చేస్తుంటారు. (కరెంటు లేకపోతే)

సరుకులేవన్న ఎండలో పెడితే చాలు వచ్చేస్తాయి.అవెంత తింటాయిలే అని  పట్టించుకోము కానీ అస్తమానూ తింటానే  ఉంటాయి. 

ముద్దు ముద్దు  మా ఉడుతల   చిత్రాలు మీకోసం ....




గుమ్మడి గింజలు  వలవడానికి  ఎండలో పెడితే (మాకెమీ మిగల్చకుండా ) ఎంతందంగా  వలుచుకుని  తింటుందో ...






ఎండబెట్టడానికి  ఏవిపెట్టినా ఇలా  తయారైపోతాయి .


పొలంనుండి  తెచ్చిన గంటి కంకులు సరదాగా కుండీలో గుచ్చితే  మరునాడికి  ఇలా అయిపోయాయి.






మధ్య మధ్యలో  దాహమై  నీళ్ళు  తాగుతూ ....













ఎవరైనా వస్తారేమో  అని బెదురు  చూపులు  చూస్తూ ...