=''/>

30, జూన్ 2010, బుధవారం

తొలిసారి మిమ్మలి చూసింది మొదలు

1984 లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం లోది ఈపాట .జంద్యాల గారు ఈసినిమాకి దర్శకత్వం వహించారు.చక్కని హస్యముతో చాలాబాగుంటుంది.రమేష్ నాయుడి గారి సంగీతం తో ..వేటూరిగారి ,సాహిత్యము కలిసి ,బాలు,జానికి గార్లు పాడిన పాటలన్నీ ఎప్పటికీ మరుపు రాని మధుర గీతాలే . ఈపాటను జానికి గారు చాలా అద్భుతంగాపాడారు.

ఇంటెర్ నెట్, ఈమైల్స్ లేని ఆరోజులలో ఈ పాట చాలా మంది ప్రేమికులకు ప్రేమలేఖలు రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఉంటుంది.



శ్రీ మన్ మహారాజ,
మార్తాండ తేజా...ప్రియానంద భొజా..

మీ శ్రీ చరణాం భోజములకు ప్రేమతో నమస్కరించి
మిము వరించి ,మీగురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారూ..
భయముతో ..భక్తితో..అనురక్తి తో చాయంగల విన్నపములూ...

సంధ్యారాగం చంద్ర హారతి పడుతున్న వేళ ...
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ....ఓ శుభముహూర్తాన

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలూ ..ఎన్నెన్నొ కధలూ..

జో అచ్చుతానంద జో జో ముకుందా ..
లాలి పరమానంద రామ గోవిందా...జో..జో ..

నిదురపోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా..హూహు హూహు...ప్రేమలేఖ.

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలూ.. .ఎన్నెన్నొ కధలూ...

ఏతల్లి కుమారుడో తెలియదు గానీ,ఎంతటి సుకుమారులో తెలుసునాకు.
ఎంతటి మగధీరులో తెలియలేదు గానీ,నా మనసుని దోచిన చోరులు మీరు.

వలచి వచ్చిన కన్నెను చులకన చేయక
తప్పులుంటె మన్నించి ఒప్పులుగా భావించి
చప్పున బదులివ్వండి..చప్పున బదులివ్వండి..

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలూ.. .ఎన్నెన్నొ కధలూ...

తలలోన తురుముకున్న తుంటరి మల్లె
తలపులలొ ఎన్నెన్నొ మంటలు రేపె

సూర్యుడు చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే
నీజతనే కోరుకునే లతలాగా అల్లుకునే

నాకు మీరు మనసిస్తె ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండి..ఇప్పుడే ..బదులివ్వండి.


24, జూన్ 2010, గురువారం

ఉడుతా..ఉడుతా ఊచ్

మా దొడ్లో మొక్కలెక్కువగా ఉండడంతో ఉడుతలు బాగా తిరుగుతూ ఉంటాయి .అవి గబగబా చెట్లెక్కి దిగుతూండడం చూస్తూంటే బలే ముద్దుగా ఉంటుందికదా .జామకాయలు తినడంలో చిలకలతోనూ,,ధాన్యపు గదిలో నుండి బయటకు పడిన వడ్లను ఒలుచుకుని పిచుకులతోనూ పోటీగా తింటూ ఉంటాయి .చక్కగా ముందుకాళ్లపై నిలబడి తింటూవున్నప్పుడు,నేనెప్పుడైనా ఫొటో తిద్దామని అటువైపు వెళితే చాలు పారిపోతాయి.మా సాయి (మా బాబు)ఐతే అస్తమానూ వాటిని పట్టుకోవాలని ఉంది అని వాటి వెనకాల తిరుగుతూ ఉంటాడు. మా స్నూపీ (కుక్క)కూడా అవి జామచెట్టుపైనుండి కిందకీ పైకీ తిరుగుతూఉంటే వాటిమీదకు పరిగెట్టి ఆడుతూ ఉండేది . (మా స్నూపీ ఇప్పుడులేదు చనిపోయింది).

ఒకరోజు ఉదయాన్నే మా పనమ్మాయి ప్రణతి(అసలుపేరు పెంటమ్మ.కానీ బాగోలేదని మార్చుకుందంట.మాకూ ఈమద్యనే తెలిసింది.)పాపగారూ అంటూ నా దగ్గరకొచ్చి ఉడుత నీళ్ళకుండీలో పడిపోయిందంది.

అయ్యో అని గబగబా కుండీ దగ్గరకెళ్ళి చూస్తే అది పైకి ఎలా రావాలో తెలియక గుండ్రంగా ఆనీళ్లలో తిరుగుతుంది.పట్టుకుని పైకి తీద్దామంటే అదిచాలాసేపు దొరకలేదు ఎలాగో తీసేసాము.కుండీలో ఎప్పుడుపడిందో ఏమో ఒణికిపోతూ ఉంది.వదిలేద్దమనుకుని ,మళ్ళీ సాయి పట్టుకుంటానంటున్నాడుకదాని దానిని ఎలకల బోను ఉంటే దానిలో పెట్టేము.

రోజూ 7గంటలైనా లేపినా లేవడు . ఆరోజు సాయి.. ఉడుత బోనులో ఉంది లే పట్టుకుంటానంటున్నావు కదా అనగానే టక్కున లేచి కూర్చున్నాడు .అసలే అస్తమానూ ఏవోకటి ప్రశ్నలు వేస్తూ బుర్రతింటూ ఉంటాడు.లేపి ఉడుతిదుగో అనగానే పరిగెట్టుకుని వచ్చి దానిని చూస్తూ మళ్ళి ప్రశ్నలు మొదలు పెట్టాడు.ఇది ఎలావచ్చింది బోనులోకి,అసలు నీళ్ళలో ఎందుకు పడిందని ఇలా రకరకాలుగా అడిగి కాసేపు నా బ్రైన్ తినేసి దానికి ఆకలిగా ఉండేమో అని జామకాయ ముక్కలు ,వడ్లు (వాటిని ఉడుతలు తినడం రోజూ చూస్తూంటాడు)తెచ్చి పెట్టాడు.

అది అసలే స్వేచ్చగా తిరుగుతూంటుందికదా . దానికి ఆబోనులో ఉండడం నచ్చలేదు మేము ఏమి పెట్టినా తినలేదు .అమ్మా ఏంటి ఏమీ తినడం లేదు రోజూ తింటుందికదా అనికాసేపు బాదపడి ఏమీ తినటం లేదుకదా ,దాన్నిక వదిలేద్దాము అన్నాడు. కానీ ఒకసారి పట్టుకుని దానితో ఫొటో తీయించుకుంటానన్నాడు . సరే అని ఆ బోనుకి బయటకు వెళ్ళే దారి కిందకి ఉంటుంది .నేను ఆతలుపు తెరిచి అక్కడ చెయ్యి పెట్టాను పట్టుకుందామని . మామీద ఎంత కోపంగా ఉందో కానీ దానికి,పట్టుకుందామని తలుపుదగ్గర పెట్టిన నాచేతివేలిని చటుక్కుని కొరికేసి చిటుక్కున పారిపొయింది .మేము చుసేలోపే వెళ్ళి పోయింది. ఇక నావేలైతే రక్తం వచ్చి కొద్దిగా వాసింది కూడాను. నొప్పి రెండు రొజులుంది. దానిపళ్ళంత పదునుగా ఉన్నాయి.ఇది చూసి మావాడు మాబుక్ లో ఉంది ఉడుతల పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి అందుకే గట్టివికూడా తింటాయి.అని వాడి పరిజ్ఞానమంతా కాసేపు ఏకరువుపెట్టేడు. ఉడుత నావేలు కొరికిన గొడవలో పడి దానిని పట్టుకుని ఫొటో తీయించుకోలేదన్న విషయం కూడా మర్చిపోయాడు.

అప్పటినుండీ రోజూ వాటిని చూస్తున్నాడుకాని, ఉడుతను పట్టుకోవాలి అని అనడంలేదు

21, జూన్ 2010, సోమవారం

ఒక ప్రతేకత గల తరిణీమాత ఆలయం (ఒరిస్సా)


ఈ"తరిణీమాత" ఆలయం ఉత్తర ఒరిస్సాలోని ఘట్ గావ్ లో ఉంది .ఈఆలయం అంటే అక్కడి ప్రజలకు చాలా భక్తీ, నమ్మకము.

ఈ గుళ్ళో రోజూ ఇరవైవేల నుండి ముప్పైవేల కొబ్బరికాయలు కొడుతూ ఉంటారట .పండగలప్పుడు ,ప్రత్యేఖ పర్వదినాలకీ లక్ష ల కొబ్బరికాయలు కొడతారంట .
చాలా గుళ్లలో ఇలాగే జరుగుతుంది కదా అనుకుంటున్నారా.. అన్ని ఆలయాలలాగా కాదు ఈతరిణీమాత ఆలయం. ఈగుడి ప్రత్యేఖత ఏమీటంటే ఇక్కడి ప్రజలు వారి మొక్కులు తీర్చుకోవడానికివాళ్ళేవెళ్ళక్కర్లేదు.మొక్కుబట్టికొబ్బరికాయలు పంపిస్తారుఒక్కోసారి వాటితోపాటు ముడుపులుకూడా కడతారు .


ఘట్ గావ్ వెళ్ళే దారి పొడువునా ఎర్రగుడ్డ చుట్టిన కొబ్బరికాయలు,ముడుపులుకట్టుకొని నిలబడి అటువైపు వెళ్ళే బస్సులకు అందచేస్తారు .బస్సు డ్రైవర్లు కూడా అడుగడుగునా ఆగి అందరూ అందజెసే వాటిని జాగర్తగా తీసుకెళ్ళి అమ్మవారికి అందజేస్తారు. ఒక్కోసారి ఆకొబ్బరికాయలు పట్టుకుని మనుషులెవరూ నిలబడి ఉండరు ,ఐనా బస్సులు ఆపి ఎన్నికాయలుంటే అన్నింటినీ బస్సులో వేసుకుని సర్దు కుంటారు.ఒకవేళ బస్సు ఏదైనా అమ్మవారి ఆలయం ఉన్న ఘట్ గావ్ వరకూ వెళ్ళేది కాకపోతే ఆ దారిలో వెళ్ళే కూడలి దగ్గర దింపేసి వెళ్ళిపోతారు .అటువైపు ఘట్ గావ్ వెళ్ళే బస్సువాళ్ళు వాటిని ఎక్కించుకుంటారు .బస్సంతా నిండినా సరే డ్రవర్ సీటుకిందైనా ,ప్రక్కనా ఎక్కడైనా పెట్టుకుని తీసికెళతారంట. అలా ఆడ్రైవర్లు అందజేసినవాటిని ఆగుళ్ళో పూజారులు ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వంతులేసుకుని మరీ కొడతారంట .

ఎక్కడా మోసం లేదు ,దగాలేదు .కొబ్బరికాయ అమ్మవారిని చేరకపోయే ప్రశ్నే లేదు .బద్దకించో ,నిర్లక్ష్యం చేసో తీసుకెళ్ళకపోతే ఇంజన్ చెడిపోవడమో ,ఆక్సిడెంట్ అవడమో జరుగుతుందని డ్రవర్ల తో సహా అందరి నమ్మకమూను. అంతటి దృడ నమ్మకాలున్నప్పుడు తప్పులకూ ,పొరపాట్లకూ అవకాశం ఎక్కడుంటుంది.

ముంబైలో డబ్బావాలాలు ప్రతీ క్యారేజీనీ దాని యజమానికి జేర్చినట్లు ఉత్తర ఒరిస్సా లో ప్రతీ తరిణీమాత భక్తుడూ, భక్తురాలూ తలచుకోవాలేకానీ తాము కాలు కదపకుండా తమ నివేదననీ,ముడుపులనూ అమ్మవారికి సమర్పించగలరన్నమాట .

17, జూన్ 2010, గురువారం

మా తోట లో విరిసిన గులాబీల అందాలు

మాఇంటిలో అందరికీ మొక్కలు పెంచడం ఇష్టమే.అందరమూ ఏవోకటి మొక్కలు తెచ్చి వేస్త్తూ ఉంటాము. అలాగని మాదేమీ పెద్ద గార్డెన్ కాదు కానీ చిన్న సైజు అడవిలాగా ఉంటుంది . అంజూరు,బత్తాయి,కెజీ జామ,ద్రాక్ష,శ్రీగంధం,దాల్చినచెక్క మొక్క , తమలపాకు తీగ ఇలా చాలా రకాలున్నాయి. అలాగే పునాస, పంచదారకల్తీ అనే రెండు రకాల మామిడి చెట్లున్నాయి. మిరియంతీగకూడా వేసాముకానీ ఈమద్యే దానికి వాతావరణం కుదరక చనిపోయింది. అలాగే రకరకాల పూల మొక్కలు కుడా ఉంటాయి

ఇవన్నీ మా ఇంటిలో పూసిన గులాబీలే .

















వర్షాకాలంలోనూ సీతాకాలములోనూ మాఇంటివద్ద గులాబీలు బాగా పూస్తాయికానీ, వేసవి కాలంలో ఎంత శ్రెద్ద తీసుకున్న సరిగా పూయవు.పైగా ఎండలు తట్టుకోలేక కొన్ని మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి. మళ్ళీ వర్షాలు పడగానే కడియం నర్సరీల నుండి మొక్కలు సైకిల్ మీద తెచ్చి అమ్ముతూ ఉంటారు.వాళ్ళదగ్గర కొని వేస్తాము. హైబ్రీడ్ గులాబీలు మా వాతవరణంలో తొందరగా తెగుళ్ళు వచ్చి చచ్చిపోతుంటాయి. అందుకని ఎక్కువగా నాటు గులాబీమొక్కలే పెంచుతాము.అవైతే వర్షాకాలంలో కొమ్మలు కత్తిరించి పాతినా పెరుగుతాయి .

ఎలాఉన్నాయి మరి అందాలు చిందే గులాబీలు.

10, జూన్ 2010, గురువారం

ఏరువాక ఆరంభం


ఏరువాక సాగాలోరన్నో రైతన్నా..

నీ కష్టమంతా తీరునురోరన్నో రైతన్న...

అని గ్రీష్మఋతువు తరువాత ప్రారంభించే ఏరువాక పురస్కరించుకుని ఒక సినీకవి రాసినపాట ఇది.

జనరంజకమైన ఈపాట గ్రామీణ వ్యవసాయానికి ఏరువాక ప్రాధాన్యతను తెలుపుతుంది .

మంగళవారం నుంచి ప్రారంభమైన మృగశిర కార్తె వ్యవసాయ పనులకు ప్రారంభసూచిక .నాడు నాగళ్ళతో పనులు ప్రారంభిస్తే నేడు యాంత్రీకరణ ఏరువాక రూపు మార్చివేస్తుంది






మృగశిర కార్తె మంగళవారం నుండి ప్రారంభమైంది .రోళ్లను పగలగొట్టే రోహిణీకార్తె (మే నెల మధ్యనుండి) తరువాత వచ్చే ఈ కార్తె కి వ్యవసాయ రంగం లో ఎంతో ప్రాముఖ్యతుంది.
ఖరీఫ్ పనులు ఈకార్తె లోనే ప్రారంభమవుతాయి. ఈశైన్య ౠతుపవనాలు తొందరగా కరుణిస్తే తొలకరి జల్లులతోడ్పాటుతో రైతులు తమ పనులకు శ్రీకారం చుడతారు .

ఏరువాక పేరుతో నాటి రైతులైతే ,నాగళ్ళు బుజాన వేసుకుని కాడెద్దులతో దుక్కిదున్ని భూమాత ,గంగమ్మతల్లికి,వరుణదేవుడికి పూజలు చేసి పనులు ప్రారంభించేవారని మాతాతగారు అంటారు.

రొజులుమారాయికదా ప్రస్తుతం నాగళ్ళకు బదులు ట్రాక్టర్ లతో ఏరువాక పనులు ప్రారంభమవుతున్నాయి.

డెల్టా ప్రాంతాలలో ఈకార్తెలో నే గోదావరి జలాలను వదులుతారు .పనులుకూడా ఇప్పుడే మొదలుపెడతారు . పదకొండురోజుల పాటు ఈకార్తె ఉంటుంది .


6, జూన్ 2010, ఆదివారం

సెలవలలో మా పిల్లల సరదాలు


ఈ వేసవి సెలవలలో ,మా అమ్మగారింటి వద్ద మా అక్క,చెల్లి,మాపిల్లల సరదా ఆట పాటలు








అష్టా -చెమ్మా



మాచెల్లి కొడుకు చెరణ్,వీడో తోకలేని కోతి .ఏదుంటే అదెక్కి వేలాడుతా ఉంటాడు.

నాలుగు గవ్వలాట