=''/>

17, డిసెంబర్ 2012, సోమవారం

ఈ రోజు దిన పత్రిక ఈనాడులో మా ఊరు "గాంధీనగరం"







3, డిసెంబర్ 2012, సోమవారం

యంత్రంతో వరిచేను కోతలు పూర్తయ్యాయి.(చిత్రాలు)


నీలం తుఫాను కి  చేలు  మునగటం  వలన   కాస్త నష్టం  వచ్చినా,జయప్రదంగా  కోతలు పూర్తయ్యాయి.నాలుగేళ్ల నుండి వరిచేను  కోతలు కోత యంత్రం  తోనే  జరుగుతున్నాయి. కూలీల తో  కోయించడానికి   కూలీలు కూడా దొరకటం లేదు .అందరూ యంత్రం తోనే కోయించడానికి  అలవాటు పడిపోయారు.








  






 వరదనీటి తోపాటు చేలోకి  కొట్టుకొచ్చిన ఎర్రమట్టి  వలన యంత్రం కోస్తుంటే  చుట్టూ దుమ్ము ఇలా కమ్మేసిందట.





30, నవంబర్ 2012, శుక్రవారం

చుక్కల కోయిల ఫోటోలు (అస్సలు నచ్చలేదు )


 శ్రీగంధం చెట్టు   సంవత్సరానికి  రెండు సార్లు  కాస్తుంది. కాయలు  నల్లగా చిన్నగా ఉంటాయి.పళ్ళు  తయారైయ్యాక రాలిపొతాయి .విత్తనాలకు ఉంటాయని అవి ఏరి ఎండబెడతాము.  

ఎలా అలవాటు పడిందో ఈ మధ్య ఓ పక్షి రోజూ వచ్చి మా  శ్రీగంధం చెట్టు పళ్ళు మొత్తం తినేస్తుంది. సరిగ్గా  ఉదయం ఆరు గంటలకి  మళ్ళీ  సాయంత్రం ఆరుగంటలకి  వచ్చేస్తుంది. రాగానే   నేనొచ్చేసేనొహో!  అని చేప్పడానికేమో  చెట్టు మీదనుండి  అరుస్తా ఉంటాది .అది అరిసినట్లే కూస్తాది.దాని పిలుపు విని  ఇదప్పుడే వచ్చెసింది టైం ఆరైందా?అనుకోవాలి .నిజంగా  ఐదు పదినిముషాలు  అటూఇటూగా  వస్తుంది.చెట్టుకి ఒక్క పండు కూడా  లేకుండా మొత్తం కానిచ్చేసింది .కింద ఒక్క పండు పడలేదు.

 ఒకరోజు  భరత్ (మా పాలేరు)దానిని చూసి  చుక్కల కోయిల  ఇక్కడకి కూడా వచ్చిందండీ ? ఇవి ఎక్కువగా పొలాల్లోనే కనిపిస్తాయంటే , అప్పుడు తెల్సింది!  దానిని చుక్కల కోయిల అంటారని .

నాకు ఈ చుక్కల కోయిల అస్సలు నచ్చలేదు. కాకినే   చూడటానికి  బాగోదనుకుంటాము  కానీ, నాకైతే  దీని కన్నా కాకే  కాస్త  బెటరేమో  అనిపించింది. 






   
  ఎలా ఉంది ?ఆ నల్ల రంగు మీద  తెల్ల చుక్కలు ,ఎర్ర నోరు  ...



  





























  

26, నవంబర్ 2012, సోమవారం

భారతదేశము నా మాతృభూమి...." ప్రతిజ్ఞ " అందించిన మన తెలుగు వాడు..


 భారతదేశము నా మాతృభూమి.
భారతీయులందరు నా సహోదరులు.
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.
దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును.
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును.
నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.



చదువుతుంటే ... చిన్నప్పుడు  బడిలో రోజూ చేసిన " ప్రతిజ్ఞ "  గుర్తొస్తుందా? అప్పుడు అర్ధమయ్యీ  అవ్వక పోయినా ,దాని వెనకనున్న  స్పూర్తి ఇప్పటికీ  వెంటాడుతుంది కదూ!

మన మనసులపై  అంతటి మహత్తర  ముద్ర వేసిన ఈ " ప్రతిజ్ఞ " 1962  లో పుట్టింది .అంటే ఈ ఏడాదితో  ఏభై  ఏళ్ళు పుర్తవుతన్నాయన్నమాట .


పాఠశాలల్లో ఏ విద్యార్ధి నోట విన్నా....ఒకిటో తరగతి నుండి పదో తరగతి వరకూ ఏ పుస్తకం తొలి పేజీలో నైనా కనిపించే ఈ "భారత జాతీయ ప్రతిజ్ఞ" రూపకర్త శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు.






దేశానికి  జాతీయ   పతాకాన్ని అందించినట్లే ...జాతీయ ప్రతిజ్ఞను అందించిన ఘనత మన తెలుగువాడిదే!

ప్రతీ భారతీయుడి  బాధ్యతను గుర్తు చేసేలా  సాగిన ఈ రచన మన జాతీయ గీతం,జాతీయ గేయాల తరువాత స్థానం  సంపాదించుకుని మన తెలుగు 'వాడి' కి ప్రతీకగా నిలిచింది.

 నల్లగొండ సమీపంలోని "అన్నెపర్తి" పైడిమర్రి వారి స్వగ్రామం.


ఈయన  గురించిన  పూర్తి  వివరాలు   క్రింది చిత్రం లో ఉన్నాయి....






 సేకరణ  ఈనాడు  రామోజీరావు  తెలుగువెలుగు  పుస్తకం నుండి ...

20, నవంబర్ 2012, మంగళవారం

ఆర్. టి .సి బస్సు డ్రైవర్


ఈ మధ్య కొన్ని ఆర్. టి .సి బస్సుల్లో   కండక్టర్  ఉండటం లేదు.  టికెట్లు  కూడా డ్రైవర్  ఇస్తున్నాడు..

అస్సలు ఇలా డ్రైవర్ ని రెండు పనులకీ  వాడుకోవాలనే చెత్త ఆలోచన  (నాకైతే  ఇది చెత్త ఆలోచన అనిపించింది) ఆర్.టి.సి  పెద్దలకి ఎవరికొచ్చిందో మరి!

 డ్రైవింగ్  చేస్తూ ...టికెట్  ఇవ్వాలంటే  వాళ్ళు  దేనిపైనా  మనస్సు సరిగ్గా  పెట్టలేరు కదా! టికెట్లు    సరిగ్గా తీసుకోక పోయినా  నష్టమే! డ్రైవింగ్  జాగ్రత్తగా  చేయలేకపోయినా  కష్టమే!మళ్ళీ అనుకున్న టైం కి బస్సు గమ్యానికి  చేరుకోవాలి .ఇన్ని ఆలోచనలతో  వాళ్ళు  డ్రైవింగ్ పై    ఎలా మనసు లగ్నం చేయగలుగుతారు?


దీపావళి  పండక్కి  మా పాపని హాస్టల్ నుండి తీసుకురావడానికి  ,విజయవాడ వెళ్ళడానికి టెక్కలి విజయవాడ   బస్సు  ఎక్కాను. ఈ బస్సులో   అలానే  డ్రైవరే  టికెట్  ఇచ్చాడు.   డ్రైవర్  వెనకాల  సీటు లోకూర్చున్నాను.మా ఊరు(పక్కూరు)నుండి  విజయవాడ  రెండున్నర గంటల ప్రయాణం .

ఈ బస్సు డ్రైవర్ కం కండక్టర్  ఒకవైపు డ్రైవింగ్  చేస్తూ.....మధ్యలో  బస్సాగినప్పుడల్లా  ఎక్కిన ప్రయాణికులకి  టికెట్లు ఇస్తూ  ...నోటికి నిమిషం రెస్ట్  లేకుండా   ఏదోకటి  మాట్లాడుతూనే ఉన్నాడు.

డ్రైవర్  వెనక  సీటే  కావడంతో  బస్సు దిగేవరకూ  అతని  మాటలు   వింటూ ఉన్నా ...

అయ్యా ! బస్సులో అందరూ  టిక్కెట్    తీసుకున్నారా?

ఎవరి టిక్కెట్టు   వాళ్ళే  తీసుకోండి ?  టిక్కెట్  మారితే    మళ్ళీ చెక్కింగ్ వాళ్ళు  వస్తే  మీకే కష్టం!మధ్యలో  నాకొస్తాయి చిక్కులు!

నిజంగా  నిద్రపోయే వాడినైతే లేపొచ్చు...నిద్ర నటించే  వాళ్ళను లేపలేమండి. మీరు టికెట్  తీసుకోకపోతే టికెట్ మిషన్లో  తెలిసిపోతుంది.

 కుర్రోళ్ళు !మీకు కూడా పది సార్లు చెప్పలయ్యా  టికెట్   తీసుకోమని?మీరే  అందరికీ  చెప్పాలి కానీ!(ఒకతను  బస్సెక్కేక    చాలాసేపటికి టికట్ తీసుకుంటే)  

అందరూ  టికెట్  తీసుకుని  లోనికి వెళ్ళండయ్యా!

డోర్  దగ్గర  నుండి  వెళ్ళండి! బ్రేకేస్తే  బయట పడతారు. అప్పుడు అందరికీ  మొదలవుయి  కష్టాలు!

ఈ బస్సు మీదేనయ్యా!మీరు  టికెట్   తీసుకుంటేనే  మాకు  జీతాలొస్తాయి.మా బొజ్జలు నిండితేనే  కదయ్యా  మేము   పని చేసేది.మేమున్నదే  మీకోసం !

ఏజన్మలో ఏపాపం  చేసుకున్నానో ..ఇలా  ఈ బస్సు డ్రైవర్  ఉద్యోగం  చేస్తున్నా!

టికెట్   తీసుకుని  హాయిగా కూర్చుని  టీవీ చూడండి !  రాముడి  సినిమా వస్తుంది.మీ కోసమే ఆ టీవీ ! ఎంత సౌండ్ కావాలో (ఎవరో  సౌండ్ పెట్టమంటే ) అంత  పెట్టుకోండి.

బస్సు ఇంత  రద్దీగా  ఉన్నప్పుడు  నువ్వు  ఎక్కకూడదు.నీకు సీటిచ్చేంత   దయగలవాళ్ళు  ఎవరూ  ఉండరు.వచ్చే స్టాప్ లో దిగి  ఇంకో బస్సెక్కు . అని అక్కడికే టికెట్  ఇచ్చాడు. (ఒక స్టాప్ లో సరిగ్గా  నిలబడలేని  ముసలతను ఎక్కేడు.అతను  విజయవాడ  వెళ్ళాలి )

ఒకామె  గన్నవరంలో  ఈ బస్సు  ఆగదంటే  విజయవాడకి    టికెట్  ఇమ్మంది. విజయవాడ  వరకూ  ఎందుకండీ ? డబ్బులెక్కువవుతాయి   .హనుమాన్ జంక్షన్  లోదిగితే  గన్నవరం అస్తమాను బస్సులుంటాయని ఆమెకి  సలహా తో  పాటు   ఎలా వెళ్తే  తొందరగా వెళ్ళొచ్చో వివరించి చెప్పేడు .

ఇలా ... విజయవాడ  వెళ్ళే వరకూ  ప్రయాణికులకు జాగర్తలు ,సలహాలు చెప్తూ ....  కండక్టర్  లేకుండా  రెండు పనులు  తనే చేయడం  ఎంత కష్టంగా ఉంటుందో   ఎక్కిన  వాళ్ళు  దిగేవరకు  చెబుతూనే ఉన్నాడు.

బస్సులో డ్రైవర్లు కానీ  కండక్టర్లు కానీ  ఇలా ఉండటం అరుదుగా  చూస్తుంటాం .సర్వీసుని  బట్టి ,వయస్సు ను బట్టి ఇలా చెబుతన్నాడనుకోవడానికి  అతనికి  పెద్ద వయస్సున్నట్టు అనిపించలేదు. ముప్పై  నలబై  మధ్య ఉంటుందేమో !

ప్రయాణికులతో ఇంత  బాధ్యతగా  ,మర్యాదగా  మెలిగే  వాళ్ళు  కనీసం పది శాతం ఉద్యోగులు  ఆర్ .టి .సి లో ఉన్నా  జనాలందరూ ఆర్ .టి.సి  లోనే  ప్రయాణిస్తారు  అనిపించింది.



.



  

5, నవంబర్ 2012, సోమవారం

ఈ నీలం మమ్మల్ని వదిలేటట్టు లేదు!



నీలం ఎఫెక్ట్ మనకుండదులే! తమిళనాడు వైపు ఉంది అనుకున్నారు . వార్తల్లో తీరం దాటి పోయిందన్న వార్త చూసి   పరవాలేదు గండం గడిచింది   అన్నారు .

తీరం దాటిన తరువాత దాని ప్రభావమంతా మన రాష్త్రం మీద పడింది.ఉత్తర ,దక్షిణ  కొస్తా అంతా అతలాకుతల మైపోయింది.

 చాలా చోట్ల వరద నీరంతా ఊళ్లను,పొలాలనూ ముంచెత్తింది.తినడానికి, ఉండడానికి లేక జనమంతా చాలా కష్టాలు పడుతున్నారు.

మా  వరిచేలు పది పదిహేను రోజుల్లో కోతకు సిద్దమవుతాయి. పుగతోటలు (నాట్లు)వేయడం మొదలు పెట్టారు.ఇంకో వారం ఐతే  పూర్తయ్యే  దశలో ఉన్నాయి. ఈ టైం లో  పడిన వర్షాలు ,వరదల వలన మా వరిచేనంతా  వరద నీటిలో మునిగి పోయింది .ఎప్పుడు బయట పడుతుందో తెలియదు. మా   చుట్టూ పక్కల  చాలా మంది పొలాలు కూడా  ఇలాగే  వరదనీటిలో  నానుతున్నాయి..వేసిన పుగతోట ల్లో   మొక్కలు కుళ్ళిపోయాయి.మళ్లీ  తోటలు వెయ్యాల్సిందే .

 పాపం చిన్న రైతులకి ,కౌలు రైతులకి  ఎంత  కష్టం? వాళ్ళతో పోలిస్తే మేము కాస్త పరవాలేదు. కాని,ఇంచుమించు ప్రతీ సంవత్సరమూ కోతల టైము లోనే ఇలా జరుగుతుంది.      
   
 రాత్రంతా పడలేదు తగ్గింది అనుకున్నాము.ఈ రోజు  మళ్లీ  వర్షం పడటం మొదలైంది.ఎప్పుడు  వదులుతుందో ?ఈ నీలం ?




                                                                     మా ఊరి  చెరువు





 





                                   చేతికందాల్సిన  పంట  నీటిపాలు :(

                           
                      చెరువు ని తలపిస్తున్న    మా పొలం వెళ్ళే దారి     

1, నవంబర్ 2012, గురువారం

ఈ రోజు అట్లతద్ది


                                                           
                                                                 అట్లతద్దోయ్ !  ఆరట్లోయ్ !
         
                                                              ముద్దపప్పోయ్ !మూడట్లోయ్ !
                                                         
                                                                 చప్పట్లోయ్ ! తాళాలోయ్ !
               
                                                                 దేవుడి గుళ్ళో  మేళాలోయ్ !
             
                                                                పప్పూ బెల్లం  దేవుడికోయ్ !
                                                             
                                                                పాలూ నెయ్యీ నీకూ నాకోయ్!
                                 
                       

  ఆశ్వీయుజ  పౌర్ణిమ వెళ్ళిన మూడోరోజు వచ్చే  తదియే అట్లతద్ది !

ఇప్పుడు అట్లతద్ది అంటే అట్లు వేసుకుని తినడమే... . మా చిన్నప్పుడు అమ్మావాళ్ళు పూజలు చేసుకుని వాయినాలు ఇచ్చుకోవడం తెలుసు . కానీ మేమూ .. అట్లతద్ది రోజు ప్రతేకంగా ఏమీ పూజకూడా చేయట్లేదు.మా గోదావరి జిల్లాల వైపు పెళ్ళైన వారం లోపులో తద్ది పూజ చేయిచేయించి , ముత్తైదులకు వాయినాలు ఇప్పిస్తారు. తరువాత నాలుగైదేళ్ళు తద్ది ఉపవాసం ఉండి .... అట్లతద్ది జరుపుకుంటాము .తరువాత అదీ ఉండదు.కాకపొతే అట్లతద్ది రోజు అట్లేసి , బెల్లంచారు కాసి పాలేళ్ళకి,కూలీలకి,చాకలి,మంగలి ఇలా అందరికీ పెడతాము. అదేమాకు అట్లతద్ది పండుగ. ఓపిక గా చేయాలి అనుకునే వాళ్ళు ఇలా అన్నా చేస్తున్నారు . .

ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర వంటి వాటిని తినడం ద్వారా కంటిసమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గోర్లకు ఆరోగ్యం కూడా. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత అని ఇట్టే అర్థం అవుతుంది

పట్నాల సంగతెలా ఉన్నా ,పల్లెల్లో కుడా ఇటువంటి కొన్ని పండుగలు అలా ..అలా ... మరుగున పడిపోతాయేమో!

29, అక్టోబర్ 2012, సోమవారం

పొలంలో కమ్ముకున్న పొగమంచు... (ఫోటోలు )

మా ఇంటి పక్కనే  పొలం ఉంటుందన్నాను  కదా!

ఉదయం   లేవగానే   అలా పొలాల  కేసి చూస్తే.....  పొలమంతా  దట్టం గా  కమ్ముకున్న పొగమంచుతో
 బలే అందంగా    ఉంది.  

ఇంకా  సీతాకాలం  మొదలవ లేదు   కదా !  ఇలా మంచుకురుస్తుందేమిటి ? అనుకుని ,పొయ్యి  కూడా  అంటించకుండా   టక టకా   ఫోటోలు  తీసేసా !  

 మా పనిపిల్ల పొద్దు పొద్దున్నే  ఈవిడ  ఫోటోల  గోలేంటో   అన్నట్టు  చూసింది కానీ  ,చుస్తే చూసిందిలే   అనుకుని  నా పని  కానిచ్చేసా ..
  
  




























                                                   
                                           నా ఫోటోకి  చక్కని   ఫోజ్  ఇచ్చి  వెళ్ళిపోయింది .









15, అక్టోబర్ 2012, సోమవారం

కాకులు,కొంగలు ట్రాక్టర్ వెనుక...ఎందుకు?




మా  ఇంటి పక్కనే పొలముంటుంది .ఏమి  తోచనప్పుడల్లా  ఆ పొలంలో కూలీల పని పాటలు    చూస్తుంటా.


చాలా సార్లు  ఆ పొలంలో  ట్రాక్టర్  దున్నుతుంటే,  కాకులు,కొంగలే కాకుండా  ,గోరింకలు ,పిచుకలు వంటి చిన్న
చిన్న పక్షులు కూడా ట్రాక్టర్ వెనకాలే ఎగురుతూ  వెళ్ళడం  చూస్తుండే దానిని .అవి అలా ఎగురుతూ  కిందవాలి
,మళ్ళా  ఎగురుతూ ఉంటాయి .ఇవేమిటి ? ట్రాక్టర్ వెనకాల  ఇలా ఎగుతున్నాయి ?అనుకునేదానిని .



మాకు ఇప్పుడు పుగతోటలు వేసే  రోజులు.అందరూ  దుక్కులు దున్ని తోటలు వేసే పనిలో ఉన్నారు.పక్క పొలం
 రైతు కూడా  ట్రాక్టర్  తో   దున్నిస్తున్నాడు .నిన్న   దున్నుతుంటే గమనిస్తున్నాను  ....మళ్ళీ అలాగే పక్షులు ఎగురుతూ ట్రాక్టర్ తో పాటు  వెళుతున్నాయి...

అలా దున్నడాన్ని బాగా  గమనిస్తే  నాకు  అసలు విషయం తెలిసిపోయింది.    ట్రాక్టర్ దున్నేటప్పుడు  భూమి లోపలి  చిన్న చిన్న పురుగులు     పైకి వస్తాయి  కదా! వాటిని తినడానికే    అవి అలా  ట్రాక్టర్  వెనకాలే  ఎగురుతూ   వస్తున్నాయని.


  








ఈ ఫొటోలు తీస్తున్నపుడే  సన్నగా వర్షం తుంపర   మొదలైంది .























9, అక్టోబర్ 2012, మంగళవారం

పెసల మొలకలతో ఇలా కూడా చేసుకోవచ్చు.




పెసలమొలకలలో ఎన్నో పోషకాలు ఉంటాయని, ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసినా సరే!పెసలు

నానబెట్టి,మొలకలు రావడానికి వాటిని  బట్టలో వేసి మూట కట్టడం  ఇదంతా చాలా పెద్ద పనిలా అనిపించి

బద్దకించే  దానిని..






మొలకలకి స్పెషల్ గా చిల్లుల బాక్స్లు ఉన్నాయని తెలిసినా కొనడం  కుదరలేదు. ఎలా ఉంటుందో చూద్దామని  

బత్తాయి జ్యూసర్  లో నానబెట్టిన పెసలు వేసాను .సాయంత్రానికి చక్కగా మొలకలొచ్చాయి. 

ఇది వాడటం తేలికగా అనిపించి   దీనినే మొలకలకి  వాడుతున్నా.
   


 రోజూ    పెసల మొలకలని అన్ని వంటకాలలోను  వాడేస్తుంటా. కూర ల్లో ,ఉప్మా ,మజ్జిగట్లు   ,దోశలు ,చాట్   

ఇలాచెప్పుకుంటూ పొతే  చాలా ఉంటాయి.



                                         మా పిల్లలకి ఇలా చాట్ లా చేస్తే  చాలా  ఇష్టం.  వెంటనే ప్లేట్  ఖాళీ   చేసేస్తారు.

 మొలకలు తింటే  హెల్త్ కి మంచిదిరా .... అని  పిల్లలని తినమంటే  ,ఆవాసన నాకిష్టముండదని    ,టేస్ట్  నచ్చదని  

ఇలా ఏవేవో  ఒకలు పెట్టి  ఇద్దరూ తినేవారు కాదు. ఇప్పుడు  ఇలా  చేస్తుంటే  కిక్కురు మనకుండా తింటున్నారు . 


                                        
   కుడుములు  ఎప్పుడూ  ఒకేలాగా చేయాలా?అని    పెసల మొలకలతో చేశా ...ఎలా ఉన్నాయి ?