=''/>

20, నవంబర్ 2012, మంగళవారం

ఆర్. టి .సి బస్సు డ్రైవర్


ఈ మధ్య కొన్ని ఆర్. టి .సి బస్సుల్లో   కండక్టర్  ఉండటం లేదు.  టికెట్లు  కూడా డ్రైవర్  ఇస్తున్నాడు..

అస్సలు ఇలా డ్రైవర్ ని రెండు పనులకీ  వాడుకోవాలనే చెత్త ఆలోచన  (నాకైతే  ఇది చెత్త ఆలోచన అనిపించింది) ఆర్.టి.సి  పెద్దలకి ఎవరికొచ్చిందో మరి!

 డ్రైవింగ్  చేస్తూ ...టికెట్  ఇవ్వాలంటే  వాళ్ళు  దేనిపైనా  మనస్సు సరిగ్గా  పెట్టలేరు కదా! టికెట్లు    సరిగ్గా తీసుకోక పోయినా  నష్టమే! డ్రైవింగ్  జాగ్రత్తగా  చేయలేకపోయినా  కష్టమే!మళ్ళీ అనుకున్న టైం కి బస్సు గమ్యానికి  చేరుకోవాలి .ఇన్ని ఆలోచనలతో  వాళ్ళు  డ్రైవింగ్ పై    ఎలా మనసు లగ్నం చేయగలుగుతారు?


దీపావళి  పండక్కి  మా పాపని హాస్టల్ నుండి తీసుకురావడానికి  ,విజయవాడ వెళ్ళడానికి టెక్కలి విజయవాడ   బస్సు  ఎక్కాను. ఈ బస్సులో   అలానే  డ్రైవరే  టికెట్  ఇచ్చాడు.   డ్రైవర్  వెనకాల  సీటు లోకూర్చున్నాను.మా ఊరు(పక్కూరు)నుండి  విజయవాడ  రెండున్నర గంటల ప్రయాణం .

ఈ బస్సు డ్రైవర్ కం కండక్టర్  ఒకవైపు డ్రైవింగ్  చేస్తూ.....మధ్యలో  బస్సాగినప్పుడల్లా  ఎక్కిన ప్రయాణికులకి  టికెట్లు ఇస్తూ  ...నోటికి నిమిషం రెస్ట్  లేకుండా   ఏదోకటి  మాట్లాడుతూనే ఉన్నాడు.

డ్రైవర్  వెనక  సీటే  కావడంతో  బస్సు దిగేవరకూ  అతని  మాటలు   వింటూ ఉన్నా ...

అయ్యా ! బస్సులో అందరూ  టిక్కెట్    తీసుకున్నారా?

ఎవరి టిక్కెట్టు   వాళ్ళే  తీసుకోండి ?  టిక్కెట్  మారితే    మళ్ళీ చెక్కింగ్ వాళ్ళు  వస్తే  మీకే కష్టం!మధ్యలో  నాకొస్తాయి చిక్కులు!

నిజంగా  నిద్రపోయే వాడినైతే లేపొచ్చు...నిద్ర నటించే  వాళ్ళను లేపలేమండి. మీరు టికెట్  తీసుకోకపోతే టికెట్ మిషన్లో  తెలిసిపోతుంది.

 కుర్రోళ్ళు !మీకు కూడా పది సార్లు చెప్పలయ్యా  టికెట్   తీసుకోమని?మీరే  అందరికీ  చెప్పాలి కానీ!(ఒకతను  బస్సెక్కేక    చాలాసేపటికి టికట్ తీసుకుంటే)  

అందరూ  టికెట్  తీసుకుని  లోనికి వెళ్ళండయ్యా!

డోర్  దగ్గర  నుండి  వెళ్ళండి! బ్రేకేస్తే  బయట పడతారు. అప్పుడు అందరికీ  మొదలవుయి  కష్టాలు!

ఈ బస్సు మీదేనయ్యా!మీరు  టికెట్   తీసుకుంటేనే  మాకు  జీతాలొస్తాయి.మా బొజ్జలు నిండితేనే  కదయ్యా  మేము   పని చేసేది.మేమున్నదే  మీకోసం !

ఏజన్మలో ఏపాపం  చేసుకున్నానో ..ఇలా  ఈ బస్సు డ్రైవర్  ఉద్యోగం  చేస్తున్నా!

టికెట్   తీసుకుని  హాయిగా కూర్చుని  టీవీ చూడండి !  రాముడి  సినిమా వస్తుంది.మీ కోసమే ఆ టీవీ ! ఎంత సౌండ్ కావాలో (ఎవరో  సౌండ్ పెట్టమంటే ) అంత  పెట్టుకోండి.

బస్సు ఇంత  రద్దీగా  ఉన్నప్పుడు  నువ్వు  ఎక్కకూడదు.నీకు సీటిచ్చేంత   దయగలవాళ్ళు  ఎవరూ  ఉండరు.వచ్చే స్టాప్ లో దిగి  ఇంకో బస్సెక్కు . అని అక్కడికే టికెట్  ఇచ్చాడు. (ఒక స్టాప్ లో సరిగ్గా  నిలబడలేని  ముసలతను ఎక్కేడు.అతను  విజయవాడ  వెళ్ళాలి )

ఒకామె  గన్నవరంలో  ఈ బస్సు  ఆగదంటే  విజయవాడకి    టికెట్  ఇమ్మంది. విజయవాడ  వరకూ  ఎందుకండీ ? డబ్బులెక్కువవుతాయి   .హనుమాన్ జంక్షన్  లోదిగితే  గన్నవరం అస్తమాను బస్సులుంటాయని ఆమెకి  సలహా తో  పాటు   ఎలా వెళ్తే  తొందరగా వెళ్ళొచ్చో వివరించి చెప్పేడు .

ఇలా ... విజయవాడ  వెళ్ళే వరకూ  ప్రయాణికులకు జాగర్తలు ,సలహాలు చెప్తూ ....  కండక్టర్  లేకుండా  రెండు పనులు  తనే చేయడం  ఎంత కష్టంగా ఉంటుందో   ఎక్కిన  వాళ్ళు  దిగేవరకు  చెబుతూనే ఉన్నాడు.

బస్సులో డ్రైవర్లు కానీ  కండక్టర్లు కానీ  ఇలా ఉండటం అరుదుగా  చూస్తుంటాం .సర్వీసుని  బట్టి ,వయస్సు ను బట్టి ఇలా చెబుతన్నాడనుకోవడానికి  అతనికి  పెద్ద వయస్సున్నట్టు అనిపించలేదు. ముప్పై  నలబై  మధ్య ఉంటుందేమో !

ప్రయాణికులతో ఇంత  బాధ్యతగా  ,మర్యాదగా  మెలిగే  వాళ్ళు  కనీసం పది శాతం ఉద్యోగులు  ఆర్ .టి .సి లో ఉన్నా  జనాలందరూ ఆర్ .టి.సి  లోనే  ప్రయాణిస్తారు  అనిపించింది.



.



  

23 కామెంట్‌లు:

  1. ఆ డ్రైవర్ ఎవరో చాలా మంచతను లాగా ఉన్నాడండీ... అంత కష్టపడుతూ ప్రయాణీకులతీ ఫ్రెండ్లీగా ఉంటున్నారంటే అభినందించాల్సిన విషయమే. సాధారణంగా సింగిల్ స్టాప్ సర్వీసులకి ఇలాంటి పద్దతి ఉంటుంది. ఇపుడు మాములు సర్వీసులకి కూడా పెట్టేశారేమో. సిబ్బంది కొరత అయిఉండచ్చు.

    రిప్లయితొలగించండి
  2. ఏ.జీ.గార్డ్నర్ `ఆన్ సేయింగ్ ప్లీజ్` అనే వ్యాసంలో మర్యాదస్తుడయిన బస్సు కండక్టర్ గురించి రాసిన సంగతి జ్ఞాపకం వచ్చిందండి, మీ టపా చదువుతుంటే. బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. సిబ్బంది కొరత వలనే అలా మార్చారని నాకూ అనిపించింది వేణు గారు.ధన్యవాదాలండి

    థాంక్స్ Dantuluri Kishore Varma గారు

    రిప్లయితొలగించండి
  4. ఇంత సహనంగా ఉండే డ్రైవర్లు చాలా అరుదు.

    రిప్లయితొలగించండి
  5. పాపం వాళ్ళకెంత కష్టమో కదా . ఆ డ్రైవర్ మంచివాడిలా వున్నాడు .

    రిప్లయితొలగించండి
  6. మంచి అనుభవం చెప్పేరు. అటువంటి వారిని వెంటనే అక్కడే అభినందించి, ఒక ఉత్తరం కూడా యాజమాన్యానికి రాయాలండి, నేనలాటి పిచ్చి పనులే చేస్తుంటా :)

    రిప్లయితొలగించండి
  7. మంచి అనుభవం చెప్పేరు. అటువంటి వారిని వెంటనే అక్కడే అభినందించి, ఒక ఉత్తరం కూడా యాజమాన్యానికి రాయాలండి, నేనలాటి పిచ్చి పనులే చేస్తుంటా :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అది పిచ్చిపని కదండీ మంచిపనే...నాకు ఉత్తరం మాటెలా ఉన్నా అభినందించాలని అనిపించిందండి .కానీ అంతమందిలో అలా చెప్పాలంటే నాకు కాస్త ఇబ్బందిగా అనిపించి ఊరుకున్నాను.చాలా సార్లు అలానే జరుగుతుంది.

      ధన్యవాదాలండి

      తొలగించండి
  8. ఓ మంచి వ్యక్తి గురించి చక్కగా చెప్పారు. సంతోషం.

    రిప్లయితొలగించండి
  9. ఇలాంతో బస్సు ద్డ్రైవర్స్ ఉంటారనుకోలేదు ,మీరు చెప్పేదాకా ను ,అతని పేరేమిటో కనుక్కోలేకపోయార ?
    తమిళనాడు డ్రైవర్స్ కి ఇలాంటివాల్లని చూపించాలి,ఎందుకంటే వాళ్ళు అసలు రరెస్పెక్ట్ ఇవ్వరు ,
    ఏమైనా మంచి మనిషి గురించి తెలియజేసారు ధన్యవాదాలు !!

    రిప్లయితొలగించండి
  10. నేను ఎబస్సులోను చూడలేదు ఇంతిలా ఉండే డ్రైవర్ని కానీ కండక్టర్నికాని.పేరు అడుగుదమనుకున్నను కానీ ,అతను అసలే బిజీగా ఉంటాడు డిస్ట్రబ్ ఎందుకు చేయడం అని ఊరుకున్నాను.థాంక్స్ హర్ష

    రిప్లయితొలగించండి
  11. Radhika,

    telugu lo rayalekapotunnanduku kshaminchandi. mee blog chalaa kalam nunchi chuustuu mimmalni abhinandistuu unnanu..manasulo! ee post maatram, aa vishayaanni meeku cheppamani cheppindi.

    hrudayabhinandanalu
    sridevi

    రిప్లయితొలగించండి
  12. Radhika,

    telugu lo rayalekapotunnanduku kshaminchandi. mee blog chalaa kalam nunchi chuustuu mimmalni abhinandistuu unnanu..manasulo! ee post maatram, aa vishayaanni meeku cheppamani cheppindi.

    hrudayabhinandanalu
    sridevi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అభినందనలు హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను ...ధన్యవాదాలు శ్రీదేవి గారు.

      తొలగించండి
  13. హ్మ్! నేను చాలాసార్లు చూసానండి. ముఖ్యంగా విజయవాడ- గుంటురు బస్సుల్లో ఇల్లాగే డ్రైవర్ కం కండక్టర్ ఉంటారు. కాని ఇలా మంచిగా ఐతే చూడలేదు! హ్మ్! స్వతహాగా మంచతనేమో! కాని, ఇలా వాళ్ళని కష్టపెట్టటం ఆర్టీసికి ఏం బాలేదండి. నేను చూసా! చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలా రెండు పనులూ ఒక్కళ్ళే చేయాలంటే! హ్మ్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హాయ్ ఇందు! ఈ మధ్య మీ దర్సనమే లేదు .బిజీగా ఉన్నట్టున్నారు.ధన్యవాదాలు ...

      గంట రెండు గంటలు, ఎక్కువ స్తాప్లు లేకపోయినా పరవలేదండి .కానీ ఇలాంటి బస్సుల్లో ఐతే ఇబ్బందే కదండీ

      తొలగించండి
  14. ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరికన్నా ఎక్కువ కష్టపడేది ఆర్.టి.సి వాళ్ళే. మిగిలిన రాష్ట్రాల్లో తికెట్లు కండక్టర్ దగ్గరకి వెళ్ళి తీసుకోవాలి. మన బస్సుల్లో ఎంత జనం ఉన్నా మన దగ్గరకే వస్తాడు. పాపం అయినా ఆర్.టి.సి ఎందుకు నష్టాల్లో ఉంటుందో అర్ధం కాదు!

    రిప్లయితొలగించండి
  15. మీ పోస్టులన్నీ బాగున్నాయి రాధిక గారూ, అన్నీ ఒకేసారి చదివేసా ఈ రోజు.
    ఇక్కడ అన్ని బస్సుల్లోనూ డ్రయివరు గారు మాత్రమే ఉంటారు. కానీ, బస్సు ముందు నుంచి మాత్రమే ఎక్కాలి. ఆటొమాటిక్ తలుపులు వల్ల, దిగేవాళ్ళు ఉంటే మాత్రమే వెనక తలుపు తెరుస్తారు డ్రయివరు గారు. అందరూ వరుసలో ఎక్కుతూనే ఒక డబ్బాలో చిల్లర వెయ్యాలి. లేదంటే బస్ స్టేషన్ కెళ్ళి టికెట్లు కొని తెచ్చుకోవచ్చు. వాటిని డబ్బాలో వెయ్యచ్చు. చిల్లర కానీ టికెట్ కానీ వెయ్యగానే ట్రాన్స్ఫర్ టికెట్ వస్తుంది. చిల్లర సరిగ్గా సరిపోకపోతే డబ్బాలోంచి ట్రాన్స్ఫరు బయటికి రాదు. అందరికీ తెలుసు కాబట్టి చిల్లర తీసుకెళతాము. ఇది బస్సు ఎక్కిన రెండు గంటల వరకూ చెల్లుతుంది. దీన్ని ఇంకా ఎన్ని బస్సులెక్కినా రెండు గంటల వరకూ వాడుకోవచ్చు. దాని మీద టయిం ప్రింట్ అయి ఉంటుంది. ట్రాన్స్ఫర్ చూపిస్తే చాలు మిగతా బస్సుల్లో. చాలా సార్లు చిన్న పనులు ఒక టికెట్ మీద పూర్తి చేసుకుని రావచ్చు. కానీ ఒక్కో టికెట్ ఖరీదు 3 డాలర్లు. ఒకో సారి పరమ వేస్ట్ అనిపిస్తుంది. పనులున్నప్పుడు మాత్రం ప్రతీ బస్ లోను చిల్లర అక్కరలేకుండా వీలుగా ఉంటుంది..
    ఎప్పుడూ కండక్టర్ ని మిస్స్ అవ్వము. కానీ మన దగ్గర అంత వత్తిడిలో ప్రాక్టికల్ కాదు అనిపిస్తుంది. నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతుందని కోరుకుందాము.

    రిప్లయితొలగించండి