=''/>

28, జనవరి 2010, గురువారం

నేను తీసిన సుర్యాస్తమయ చిత్రాలు

నాకు సూర్యోదయమన్నా ,సూర్యాస్తమయమన్నా చాలా ఇష్టం .అందరికీ ఇష్టమే అనుకోండి .

. .మా ఇంటికి సూర్యోదయము సరిగ్గా కనిపించదు ,కానీ అస్తమయము బాగా కనిపిస్తుంది . ఆ టైం లో కాలీ గా ఉంటే ,సూర్యాస్తమయాన్ని చూసి ఆనందిస్తూ ఉంటా . ఆ సంధ్యా సమయములో గూళ్ళకు చేరే పక్షులతో ,ఆకాశము ఎంతో సందడి గా ఉంటుంది .నేను తీసిన ఈ చిత్రాలను చూసి ఎలా ఉన్నాయో చెప్పండి .




మీరు కూడా ఈ అందమైన సుర్యాస్తమయ దృశ్యాలను చూడండి.





26, జనవరి 2010, మంగళవారం

చిన్న సాయమైనా చేద్దాం .




మనలో కొంతమంది ఎవరిజోలికీ పోకుండా ,ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా ,తమపని తాము చూసుకుంటూ ,తామూ తమ కుటంబం మాత్రమే అన్నట్లు ఉంటారు .


ఇతరులగురించి కూడా ఆలోచిచాలి కదా .మనకు చేతనైనంతవరకూ ఇతరులకు సాయ పడాలి కదా .

చాలామందికి పెద్దపెద్ద విషయాలలొ ఎవరి సహాయము అక్కర్లేదు.కానీ చిన్న చిన్న విషయాలకే ఏమి చేయాలో తెలియక ,తోచక డీలాపడిపోతారు .అలాంటి సమయాలలో వారికి మనం సాయం చేస్తే వారు అవి చిన్న విషయాలైనా పెద్ద కష్టం నుండి బయటపడినట్లు భావిస్తారు .


ఉదాహరణకు మనమే ఎప్పుడైనా ,ఏదైనా కొత్త ప్రదేశానికి కానీ ఊరికి కానీ వెళతాము .అప్పుడు మనకు అక్కడ రోడ్లు, బజార్లు తెలియక తికమక పడతాము .అటువంటప్పుడు మనకు కావలసిన సమాచారాన్ని
అడిగినట్లయితే ,వారు ఆవివరాలన్నీ ఓపిగ్గా చెప్పి ,దారిచూపినట్లైతే మన మనసంతా వారిపట్ల కృతజ్ఞతతో నిండిపోతుంది.


బస్ స్టేషన్లలో ,రల్వే స్టేషన్లలో ,ఆలయాలలో దర్శనాలదగ్గర బోలుడంత రద్ది ఉంటుంది.క్యూలలో గంటలతరబడి నిలబడి ఉండాలి . వృద్ధులు ,వికలాంగులుమొదలైనవాళ్లు ఎక్కువసేపు నిలబడలేరు. అటువంటప్పుడు వాళ్లు అమ్మా ,నా స్థలం కాస్త చూస్తూ ఉండు ,నేనలా కూర్చుంటాను.కౌంటర్ వద్దకు నువ్వు చేరగానే నేను వచ్చి నిలబడతాను అంటారు .దానికి కొందరు ఒప్పుకోరు .నిజానికి అది చాలా చిన్న సాయం .కానీ సాయం కోరేవారికి అది చాలా పెద్ద ఉపకారం .

ఈ రోజులలొ ట్రాఫిక్క్ చూస్తుంటే రోడ్ దాటాలంటే ఒక్కోసారి మనమే కంగారు పడుతూంటాము .అటువంటుది ,వికలాంగులు ,అంధులు రోడ్ దాటాలంటే ఎంత కష్టపడాలో చెప్పక్కర్లేదు . అటువంటి వారికి సాయం చేయడం ఈ సమాజం లో పౌరులుగా మనందరి బాధ్యత .


ఈ ఉరుకులు పరుగుల జీవితాలలో పక్కవారికి సాయపడటము వలన మనకేమిటి లాభం అనుకుంటారు కొందరు .కానీ మన వలన సాయం పొదిన వారు దానిని అంత సులభంగా మర్చిపోరు .తాము కూడా ఆవిదముగా చేయడానికి ఆలోచిస్తారు .


మనం చేసింది ఎంత చిన్న సాయం ఐనా ,సాయం పొందినప్పుడు వారు చూపే కృతజ్ఞతకి మనము ఎంతో సంత్రుప్తి పడతాము .ఆత్మ సంతృప్తిని మించిన ఆస్తి ఏముంటుంది చెప్పండి . అందుకే ప్రతీ ఒక్కరమూ మనకు చేతనైనంత ,చేయగలిగిన సాయం చేద్దాం .


అసలు ఇదంతా రాయడానికి కారణమైన రెండు సంఘటనలు ఏమిటంటే .....ఈమధ్య ఒక రోజు కాకినాడ మాచెల్లి వాళ్ళింటికి వెళ్ళాను. నాకేమో ఇంటి ఎడ్రస్ సరిగ్గా తెలవదు ,సెల్ల్ మర్చిపోయి వెళ్ళాను .తను బస్ స్టాండ్లో దిగు కారు పంపుతాను అంటే వినకుండా వేరే చోట దిగేసాను. ఏమి చేయాలో తెలియక ఆటో ఎక్కాను .ఎక్కాను గానీ ఆటో అతను ఎక్కడకు తీసుకెళ్తాడో అని బయం . ఆటో వాళ్ళ గురించి పేపర్ల లో వచ్చిన వార్తలన్నీ రింగులు తిరుగుతూ ఉంటే ,జడుస్తూ ఎడ్రస్ సగం సగం చెప్పాను .కానీ అతను చాలా మంచివాడు .నాకు ఎడ్రస్ సరిగ్గా తెలవదని తెలిసి తన సెల్ఫోన్ ఇచ్చి మా చెల్లికి ఫోన్ చేయించి ఎడ్రస్ కనుక్కొని మరీ ఇంటి వద్ద దింపాడు . ఆటో వాళ్ళలో కూడా ఇంత మంచివాళ్ళుంటారా అనిపించింది . ఇది నేను పొందిన పెద్ద సాయం .కానీ అది ఆటో డ్రైవర్ కి చిన్న సాయమే అవుతుంది .

ఇంక నేను చేసిన చిన్న సాయం ఏమిటంటే ...మాపాపను హాస్టల్ లో దింపడానికి విజయవాడ వెళ్ళి వచ్చేటప్పుడు ,బస్సు ఎక్కాను .బస్సు లో నాకు సీటు దొరికింది .కూర్చున్నాను. ఏలూరు వచ్చాక ఒక వృద్ద జంట బస్సు ఎక్కింది . వాళ్ళు రాజమండ్రికి టిక్కట్ తీసుకున్నారు .ఏలూరునుండి రాజమండ్రి కి ఎంత స్పీడుగా వెళ్ళినా రెండుగంటలకు పైనే టైం పడుతుంది .వాళ్ళకు సీట్లు దొరకలేదు .ఆ రోజు బస్సు చాలా రష్ గా ఉంది . నిలబడి ఉన్నారు . నేను దిగే స్టాప్ రావాలంటే ఇంకా గంటన్నర టైం పడుతుంది .కానీ వాళ్ళను చూసి జాలేసి నాసీటు లో కూర్చోమంటే ,ఒక్కసీటేకదా ఉంది నువ్వు కూర్చో అంటే నువ్వు కూర్చో అని ఇద్దరూ అనుకుంటున్నారు .అదిచూసి నాపక్కనున్న అమ్మాయి కూడా తన సీట్లో ఒకరిని కూర్చోమంది .ఇద్దరూ చాలా సంతోషంగా కూర్చొన్నారు .వాళ్ళు మేము బస్సు దిగేవరకూ మాతో కబుర్లు చెబుతూ మాకు నుంచున్నామని విసుగు లేకుండా టైం పాస్ చేసేసారు .
ఆ రోజు నేను చేసింది చిన్న సాయమైనా వాళ్లకదే పెద్దసాయం .ఆ వయస్సులో వాళ్ళు రెండు గంటలకుపైగా నుంచుని ఉండాలంటే వాళ్ళకు ఎంత కష్టంగా ఉండేది .

ఈ రెండు విషయాలు వెంట వెంటనే జరగడముతో నేను ఇలా స్పంధించ వలసి వచ్చింది .

23, జనవరి 2010, శనివారం

మన జాతీయగీతం జనగణమన కు అరవైయేళ్ళు



జనగణమన అధినాయక జయహే ...భారత భాగ్య విధాత ...అంటూ యావత్ దేశం లో జాతీయతా భావాన్ని రగిలించే "జనగణమన"గీతాన్ని మన జాతీయగీతం గా ఏర్పాటు చేసుకొని రేపటికి సరిగ్గా అరవైఏళ్ళు.

విశ్వకవి " రవీంద్రనాథ్ ఠాగూర్ "కలం నుండి జాలు వారిన ఈగీతాన్ని 1950 జనవరి 24న రాజాంగసభ జాతీయగీతంగా అధికారికంగా ఆమోదించింది .

వాస్తవానికి ఈగీతాన్ని రవీంద్రుడు 1911డిసెంబర్ 27నే రాసారు. 1919లో ఈగీతాన్ని చివరిసారి స్వరపరిచారు .మనం అదే స్వరం లో ఇప్పటికీ పాడుకుంటున్నాము. ఈ గీతాలాపనకు సాధారణంగా 55సెకండ్లు పడుతుంది .


22, జనవరి 2010, శుక్రవారం

రథసప్తమి .

ఈ రోజు రథసప్తమి.

లోకసాక్షి ఐన ఆసూర్యభగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘ సుద్ధ సప్తమి .అదే ఆయన జన్మతిధి ..రధసప్తమి .

సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసం లో రథసప్తమినాడు సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఏదో ఓ ఆదివారం నాడు పూజించినా సత్ఫలితం ఉంటుందని పెద్దలంటారు .

రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు చేసి , సూర్యోదయానంతరం దానాలు చేయాలి . ఈరోజు సూర్య భగవానుని యెదుట ముగ్గు వేసి ,ఆవుపిడకలపై ఆవుపాలతో పరవాన్నం చేసి ,చిక్కుడు ఆకులపై ఆ పరవాన్నముంచి ఆయనకు నివేదన ఇవ్వాలి .

నాచిన్నప్పుడు మా జేజమ్మ రథసప్తమినాడు ,తను తెల్లవారుజామున లేచి తలస్నానం చెసి మమ్మల్ని కూడా లేపి స్నానాలు చేయమని, కూర్చో బెట్టి పూజ చేయించి మాతో చిక్కుడాకులు అవీ కోయించి ,ఆవుపిడకల పై పొంగలి వండి అందరికీ ప్రసాదాలు పెట్టేది .ఇప్పటికీ రథసప్తమి అంటే అదే జ్ఞాపకమొస్తుంది .

20, జనవరి 2010, బుధవారం

శ్రీ పంచమి


ఈరోజు శ్రీపంచమి


ప్రకృతిలో జరిగే మార్పులకి సూచనగా మనకి కొన్ని పండుగలు ఏర్పడ్డాయి .అలాంటివాటిలో శ్రీ పంచమి ఒకటి . మాఘ శుద్ధ పంచమి నాడు ఈపండుగను జరుపుకొంటారు .

దీనిని సరస్వతీ జయంతి,మదన పంచమి,వసంత పంచమి అనికూడా అంటారు . ఇది రుతు సంబంధమైన పర్వం.వసంత రుతువుకి స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది .

శ్రీ పంచమిని విద్యారంభదినం గా భావిస్తారు .మన రాష్ట్రములోని బాసర క్షేత్రం లోనూ ,మరియూ ఇతర సరస్వతీ దేవాలయాలలోనూ శ్రీ పంచమి నాడు పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయిస్తారు .

19, జనవరి 2010, మంగళవారం

సంక్రాంతిపండుగ -అరిసెలు

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలా పల్లెటూర్లలో రకరకాల పిండివంటలు చేస్తారనీ , అరిసెలు వండని ఇల్లు ఉండదనీ అందరికీ తెలిసిన విషయమే .
మా ఊళ్ళోనూ అంతే .సంక్రాంతి పండుగకు వారం ముందుగానే ప్రతీ ఇంటిలోనూ అరిసెలు వండే హడావిడి మొదలవుతుంది . రోజూ ఎవరో ఒకరి ఇంటినుండి రోకళ్ళతో పిండి దంచుతున్న చప్పుళ్ళు వినపడుతూ ఉంటాయి .పిండి ఆడే మిల్లు ఉన్నా కానీ రోట్లో దంచిన పిండి తోనే అరిసె లు బాగా వస్తాయని, చాలా మంది ఇలానే చేస్తారు .మేముకూడా అలాగే చేసాము . ఉదయము ఐదింటికి పిండికొట్టించడముతో మొదలైన మా అరిసెల వండే పని సాయంత్రం నాలుగింటికి అయ్యింది .కొన్ని నేతి తోను, కొన్ని నూని తోనూ వేసాము .అత్తయ్య వేస్తే నేను తీసేను. మద్యలో ఫోన్ వస్తే మాత్రం చాలా విసుగొచ్చేది .ఈ ఫోన్ కనిపెట్టిన వాడిమీద చాలా కోపమొచ్చింది .పండుగ నాలుగురోజులూ ఇంటికి ఎవరు వచ్చినా అరిసెలే పెట్టడము.

14, జనవరి 2010, గురువారం

సంక్రాంతి శుభాకాంక్షలు


అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు .

13, జనవరి 2010, బుధవారం

భోగి ప్రాముఖ్యత

సంక్రాంతి పండుగ మొదటిరోజుని "భోగి" అని పిలుస్తారు .ఈ రోజున పెద్ద చలి మంటలను వేస్తారు .సాయంకాలం పూట పిల్లలకి భోగి పళ్ళను పోస్తారు .ఓ చక్కని పేరంటాన్ని ప్రతీ ఇంటా చేస్తారు .



చలిమంట మనకో రహస్యాన్ని చెపుతుంది .మనకు ప్రతీరోజూ కనిపించే నిప్పుముద్దైన సూర్యుడు రేపటినుండీ తన వేడిని పెంచుకొంటూపోతూ మరింత మంటని మనకు కల్పిస్తాడు అనేది.



ఆవు పేడతో పిడకలు చేసి వాటిని ఈమంట లో వేస్తే, ఇక హేమంతఋతువులో ఉండే మంచుకి ,చలికి ఉండే మన శరీరానికి హానికరమైన క్రిములు ఎలా పుట్టయో అవన్నీ ఈరోజు వేసే చలిమంటకి ఆకర్షించపడి తమంత తాముగా ఆ మంటల్లో పడి చనిపోయి మన ఆరోగ్యాన్ని పాడు చెయ్యనివ్వకుండా చేస్తాయి .



ఇంతే కాకుండా మన ఇంటి లోని అనవసరమైన వస్తువులను ఈమంటల్లోకి మనం వేస్తున్నందున ఇల్లు పాత వస్తువులు లేకుండా శుభ్రము గా కనిపిస్తుంది .

సాయంకాలం పిల్లలకి భోగిపళ్లు పోస్తున్న వంకతో రేగిపళ్ళను ఆశ్వీర్వచనాలతో ముత్తైదవలందరూ చిన్నపిల్లలకు తలమీదుగా నేలకు పడేలా పోస్తారు . . సంస్కృతం లో రేగిపండుని అర్కఫలం అంటారు .అర్క అంటే సూర్యుడు అని అర్ధం . ఈ రేగి పండు సూర్యుడిని తన పేరుతోను ,రూపంలోను కూడా పోలి ఉంటుంది .ఈ రేగిపళ్ళను తల మీదగా పిల్లలకు పోయడమంటే ఆ సూర్య శక్తి సంపూర్ణం గా మీ శరిరాలమీద ఉండుగాక !అని ఆశీర్వదించడమూ అని దీని భావమన మాట .


11, జనవరి 2010, సోమవారం

ముగ్గుల పోటీ


మా బాబు వాళ్ళ స్కూల్ లో ఈ రోజు ముగ్గుల పోటీ జరిగింది .

మా బాబు పోటీ లో పాల్గొనడానకి పేరు ఇచ్చేసేను ,నువ్వు రావాలి అని గొడవ చేస్తే వెళ్లాను . నాకు పని ఉంది రావడం కుదరదు అంటే వినలేదు .
వాడి గొడవ పడలేక వెళ్ళాను కాని ,నేను పెద్ద్డగా ఉత్సాహం చూపలేదు . అయినా దీనికి కాన్స్ లేషన్ బహుమతి వచ్చింది . మా బాబు ఆనందానికి అంతు లేదు . ఇంకా బాగా వేస్తె బాగుండేది ,మొదటిది కాని ,రెండో బహుమతి కాని వచ్చును అనుకున్నాడు .


9, జనవరి 2010, శనివారం

ముగ్గు



సంక్రాంతి పండుగ రాబోతుందంగానే క్రిందట నెలనుండే అంటే డిసెంబర్ 15నుండి నెల పట్టడము జరుగుతుంది .నెలపట్టడమంటే ఈ నెల రోజులూ ఏ విధమైన శుభకార్యములూ లేకుండా కేవలము పండుగ మిదే దృష్టి పెట్టడము అని అర్ధం . అందుకే ఇంటిముందు ముగ్గుల్ని డిసెంబర్ 16 నుంచి ప్రారంభించి పెడతారు .

ముగ్గులు అనగానే ఏవేవో తోచినట్లు పెట్టేయడముకాదు.మన ఇంటిముందు ఉన్న నేలనే ఆకాశముగా చేసుకొని చిత్రాన్ని గీయడమనమాట .

మన ఇంటిముందున్న నేల ఆకాశానికి సంకేత మనమాట .దాని మీద మనం పెట్టే చుక్కలు నక్షత్రాలకు సంకేతం. ఆ నక్షత్రాలని ఒక క్రమ పద్దతిలో కలిపి ఓ అందమైన రీతిలో కళ్ళకు మనోహరము గా ఉండేలా కలపడము,ఏ గ్రహాలు ఏ తీరులో పరిభ్రమిస్తున్నాయో తెలపడానికి సంకేతం.
ఇంతటి ఖగోళశాస్త్ర రహస్యాన్ని ఎనిమిదేండ్ల ఆడపిల్లకి కూడా అర్ధమయ్యేలా,ఆముగ్గులుచూసిన అందరికీ కూడా తెలిసేలా ప్రాచీనులు రంగవల్లి విధానాన్ని ప్రవేశపెట్టారు .
దీనిలో రెండు విశేషాలు తెలుస్తాయి .ముగ్గుపెట్టే బాలిక ,ముగ్గు పెట్టే సందర్భములో సహనశీలిని అవునా ?కాదా..ముగ్గుని సన్నగా పెడుతుందా?లావుగా పెడుతుందా?లేదా అమ్మపోరు పడలేక పనికానిచ్చేద్దాము అనుకొంటుందా?ముగ్గు పెట్టడములో తప్పు వచ్చినప్పుడు ముగ్గు గిన్ని పడేసి చిరాగ్గా వెళిపోతుందా?లేక మళ్ళీ ఓమారు దాన్ని దిద్దే ప్రయత్నము చేస్తుందా?..వంటితీరు తెన్నుల ప్రకారం ఆ ఆడపిల్ల మనస్తత్వం ,ఆమెని ఓదార్చే తీరులో తల్లి మనస్తత్వం ..ఇలా ఎన్నో రహస్యాలు బహిర్గతమవుతాయి .
హేమంత ఋతువులో మంచి చలీ ,మంచు వర్షించే వేళలో ..నడుము వంచి తెలతెలవారుతుండగా ,అటూ ఇటూ తిరుగుతూ పైకి లేస్తూ ,క్రింద కూర్చుంటూ ముగ్గు పెట్టడం అంటే ఒక విధం గా వ్యాయామం చేస్తున్నట్టే .తన వల్ల ఇంటికి ఏ ప్రయోజనమూ లేకుండా ఉదయాన్నే లేచి ఒట్టిగా కాలక్షేపం చేయడము కంటే ఇలా ముగ్గులు పెడుతూ వ్యాయామం చేస్తూ, ముంగిలిని అలంకరించు కోవడం ఎంత చక్కని పని .
**************