=''/>

27, ఫిబ్రవరి 2010, శనివారం

హోలీ పూర్ణిమ అంటే ....



సంవత్సరం చివరి మాసం ఫాల్గునం .పూర్వఫల్గుని లేదా ఉత్తరఫల్గుని అనే నక్షత్రాలలో ఏదొ ఒకదానిని చందృడుకలసిన వేళ ఏర్పడే మాసం ఫల్గున మాసం . ఈ ఫాల్గున మాసంలో వచ్చే పూర్ణిమను "హోలీపూర్ణిమ"గా అంతా అంటారు .

ఈ పూర్ణిమకు ఈపేరు రావడానికి రకరకాల కారణాలు చెబుతూ ఉంటారు .హోలీ అనే రాక్షసిని సం హరంచినందుకు ఈ పేరు వచ్చిందని అంటారు . అలాగే ఇంకోటి కూడా ఉంది .

ఈపూర్ణిమ అసలుపేరు హోలీ పూర్ణిమ కాదు హేలీ పూర్ణిమ అనేది నిజమైన పేరు .హేల అంటే విలాసం ,వినోదం ,సంతోషము అని అర్ధాలు. ఏ పూర్ణిమనాడు వినోదాలు ,సంతోషాలు సాగుతాయో అలా సాగే పూర్ణిమే హేలీ పూర్ణిమ అనేది యదార్ధం .

అసలు ఈపూర్ణిమ నాడే ఈవిలాసాలు ,సంతోషాలు ఎందుకు జరుగుతాయి ?

ఇది సంవత్సరము లో చివరి పూర్ణిమ .దీని తరువాతది చైత్ర పూర్ణిమ .చైత్ర పూర్ణిమ వసంతఋతువులో వస్తుంది .వసంతఋతువంటే మనకు ,చక్కని చిగుళ్ళు,రంగురంగుల పువ్వులతో,కాయలతోనూ నిండినవృక్షాలు ,కోయిల కూతలు..... ఇలా కన్నుల పండుగగా కనిపిస్తుంది .

కానీ ఆదృష్టితో ఈ పూర్ణిమను..అంటే హోలీ పూర్ణిమను చూస్తే ,ఇది శిశిర ఋతువైన కారణంగా ఆకులు ,పువ్వులు రాలి బోసిపోయిన చెట్లు, వృక్షాలు..వీటితో అందాన్నికోల్పోయి కాలం ఉంటుంది .
మరి మోడువారిన చెట్లు ,మౌనంగా విలపిస్తుంటే ,అంతా వినోదాలు,విలాసాలు,సంతాషాలతో ఓ ఉత్సవాన్ని చేసుకోవడమేమిటి?దానికి హేలీ పూర్ణిమ అనిపేరు పెట్టుకోవడమేమిటి? అనిపిస్తుంది మనకు.
ఇక్కదే ఉంది రహస్యమంతా .. కష్టమనేది కలకాలముండదనీ,కష్టములో ఉన్న ప్రతీ వ్యక్తీ రాబోయే సుఖాన్ని గూర్చీ ,సంతోషాన్ని గూర్చీ ఎదురు చూస్తూ.. ఉత్సవాన్ని చేసుకోవాలనే అద్బుతమైన ఒక ధైర్యాన్ని ఇచ్చే పూర్ణిమ ఈ "హేలీ పూర్ణిమ ."

అందుకే ఈ పూర్ణిమ రోజు అందరూ రంగు రంగుల పొడులను నీళ్ళలో కలిపి అలా చల్లు కుంటూ ఉంటారు .ఈచల్లబడే రంగురంగుల నీళ్ళు ..రాబోయే రంగు రంగుల చిగుళ్ళకు,పువ్వులకు సంకేతం . వ్యక్తుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం రాబోయే ప్రకృతినిముందునాటికి మనం అనుభ వించబొయే నిత్య సంతొషానికి సంకేతం .


ఉత్సాహముతో జనమంతా కేరింతలు కొడుతూ ..ఎక్కడ తన మీద నీళ్ళు పడతాయో నని పరిగెత్తుతూండడమనేది
-ఇప్పుడు వెళ్లిపోతున్న సంవత్సరానికి వీడ్కోలు , రాబోయే నూతన సంవత్సరానికి సంతోషముగా స్వాగతం పలకడమే .

జీవితంలొ ఎన్నెన్నో సంఘటనలలో గతాన్ని వదిలి ,భవిష్యత్తులోకి అడుగుని,వర్తమానంలో వేస్తున్నవేళ ఏమాత్ర దిగులూ వద్దని, రాబోయే మార్పు సంతోషము తో స్వాగతించాలని చెప్పే పండుగే ఈ హేలీ పూర్ణిమ ..

ఇక్కడ మరో విషయము కూడా అనుకోవాలి .ఆనం దించ దగిన దృష్టి ,ఆలోచనా ఉండాలే గానీ ప్రకృతిలో కనిపించే ప్రతీ దృశ్యమూ సంతోషకరం గానే ఉంటుంది .చక్కగా విరగబూచిన చెట్టు ఎంతందంగా ఉంటుందో ,ఒక్క ఆకూ పిందే కానీ లేకుండా ఒంటరిగా ఉన్న చెట్టు కూడా అంతే అందంగా కనిపిస్తుంది .ఇలా ప్రతీ వస్తువు లోనూ సౌందర్యాన్ని పరిశీలించి అనందించడాన్ని ,రాబోయే సుఖానికి ఎదురుచూడడాన్ని చూపించే పండుగే హోలీ పండుగ .

దీనిలొ విషయాలు చాలావరకు ఒక ఆధ్యాత్మక పత్రికలోనివి . అవి నచ్చి,అందరికీ తెలిపినట్లుంటుందని రాయడంజరిగింది .

హోలీ పండుగ టైంకి గోగులు పూస్తాయి .ఒకప్పుడు ఈపువ్వులు ,ప్రకృతిసిద్దంగా దొరికే వాటితోనే రంగులు చేసుకొని జల్లుకొనేవారు .ఇప్పుడు ఎక్కడ చూసినా కృత్రిమరంగులే . మళ్ళా అవి కళ్లలో పడితే కళ్ళకే ప్రమాదం .అందుకే సాద్యమైంతవరకూ ఆరంగులు కళ్ళలో పడకుండా జాగర్త పడితే మంచిది .


అందరికీ హోలీ శుభాకాంక్షలు .

1 కామెంట్‌: