=''/>

9, అక్టోబర్ 2012, మంగళవారం

పెసల మొలకలతో ఇలా కూడా చేసుకోవచ్చు.




పెసలమొలకలలో ఎన్నో పోషకాలు ఉంటాయని, ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసినా సరే!పెసలు

నానబెట్టి,మొలకలు రావడానికి వాటిని  బట్టలో వేసి మూట కట్టడం  ఇదంతా చాలా పెద్ద పనిలా అనిపించి

బద్దకించే  దానిని..






మొలకలకి స్పెషల్ గా చిల్లుల బాక్స్లు ఉన్నాయని తెలిసినా కొనడం  కుదరలేదు. ఎలా ఉంటుందో చూద్దామని  

బత్తాయి జ్యూసర్  లో నానబెట్టిన పెసలు వేసాను .సాయంత్రానికి చక్కగా మొలకలొచ్చాయి. 

ఇది వాడటం తేలికగా అనిపించి   దీనినే మొలకలకి  వాడుతున్నా.
   


 రోజూ    పెసల మొలకలని అన్ని వంటకాలలోను  వాడేస్తుంటా. కూర ల్లో ,ఉప్మా ,మజ్జిగట్లు   ,దోశలు ,చాట్   

ఇలాచెప్పుకుంటూ పొతే  చాలా ఉంటాయి.



                                         మా పిల్లలకి ఇలా చాట్ లా చేస్తే  చాలా  ఇష్టం.  వెంటనే ప్లేట్  ఖాళీ   చేసేస్తారు.

 మొలకలు తింటే  హెల్త్ కి మంచిదిరా .... అని  పిల్లలని తినమంటే  ,ఆవాసన నాకిష్టముండదని    ,టేస్ట్  నచ్చదని  

ఇలా ఏవేవో  ఒకలు పెట్టి  ఇద్దరూ తినేవారు కాదు. ఇప్పుడు  ఇలా  చేస్తుంటే  కిక్కురు మనకుండా తింటున్నారు . 


                                        
   కుడుములు  ఎప్పుడూ  ఒకేలాగా చేయాలా?అని    పెసల మొలకలతో చేశా ...ఎలా ఉన్నాయి ?

5, అక్టోబర్ 2012, శుక్రవారం

నా చిత్తరువు ఫొటోల బ్లాగ్ లోని పొస్ట్లు కొన్ని మిసయ్యాయి.వాటిని తిరిగి పొందే మార్గమేదైనా ఉంటే తెలిసిన వాళ్ళు చెప్పరా... ప్లీజ్ ..


నాకు చాలా ఇష్టమైన నా చిత్తరువు బ్లాగ్ లోని 2011,2012 పోస్ట్లన్నీ  పోయాయి.నిన్నే  చూసుకున్నాను:(((((((

పోయిన  టపాలు  వస్తాయా?కానీ , నాకెక్కడో  ఆశ  !


ఇలా బ్లాగ్ రాయడం అదీ కనిపెట్టినవాళ్ళు,  పోయిన టపాలు అనుకోకుండా మిస్సైతే  వాటిని  తిరిగి పొందే మార్గం   కనిపెట్టకపోతారా?అని!

ప్లీజ్  ..ప్లీజ్ ..ఎవరికైనా  తెలిస్తే   కాస్త చెపరా ...





నా పోస్ట్లు తిరిగొచ్చే సలహాల   కోసం  ఎదురుచూస్తుంటా...



  

3, అక్టోబర్ 2012, బుధవారం

మా ఇంట్లో జీవ వైవిధ్యం



మన సంప్రదాయంలో ముగ్గులు వేయడం వెనక జీవ కారుణ్య సూత్రం దాగి ఉంది.

ఒకప్పుడు వాకిలంతా పెద్ద పెద్ద ముగ్గులు బియ్యం పిండితో వెసేవారు. ముగ్గు వేయడానికి బియ్యం  పిండి నే  వాడేవారు.అది  ఇంటి ముంగిలికి అందాన్నే కాదు,చీమ లకు ,పిచుకలకు ఆహారంగా  కూడా  ఉండేది.

చీమలు ఆహారం కోసం  ఇంట్లోకి  బారలు తీరకుండా ఒకే చొట వాటికి ఆహారం అందించే యుక్తి ఇదన్నమాట. అంత ఆహారం దొరికితే ఇంట్లోకి ఎందుకు దాడి చేస్తాయి?


 అన్నిట్ట్లోనూ మార్పు వచ్చినట్లే దీనిలోనూ మార్పొచ్చింది. పల్లెల్లో కూడా   ఇప్పుడు వాకిళ్లన్ని చాలా వరకూ సిమెంట్ గచ్చులే ముగ్గు సున్నం పిండి,రాతి పిండి తోనే..  అప్పుడప్పుడు  బియ్యం పిండితో పెడున్నాము.






  రోజూ  ఇలా బియ్యం పిండి తో ముగ్గు పెడితే  ....







ధాన్యపు గదిలో వడ్లు ఉన్నన్ని రోజులూ గది  వద్దకు  పిచుకలు సందడిగా వస్తూనే ఉంటాయి..



ఎండిన మొక్కజొన్నలు   ఉడుతల   కోసం  దాచి పెడుతుంటా...పిల్లలు  సరదాగా నేనంటే నేనని
పెడుతుంటారు.కాకులు  రాకుండా కాపలాకాసి  ఉడుతలకే పెడతారు.





అమ్మో! ఉడుతలను ఫోటో  తీయాలంటే చాలా కష్టం.  ఏ కాస్త సడై నా  వెళ్ళిపోతాయి.ఈ ఫొటోలు   తీయడానికి అరగంట కదలకుండా కూర్చున్నాను.ప్చ్ .. అంత కష్టపడినా   ఫోటోలు  బాగా రాలేదు  .





దాన్యపు  గదికి ఉండే  తలుపు సందుల్లో నుండి బయటకి వచ్చే  వడ్లు చాలు వాటి బుల్లి బొజ్జలకి .



  మా ఇంటి చుట్టూ ఉండే  కాకులు,పిచుకలు,ఉడుతలు,గోరింకలు   మంచినీళ్ళ  కి ఇలా వస్తుంటాయి.కానీ  కెమెరాకి  ఇదే చిక్కింది.

 మన హైదరాబాదు లో  జీవ వైవిధ్య సదస్సు జరుగుతుంది కదా .. రోజూ  పేపర్,టీవీల్లో   చదువుతూ ,చూస్తూ  మా ఇంట్లో ని జీవ వైవిధ్యం గురించి  చెప్పాలనుకన్నాఅంతే  ...







27, సెప్టెంబర్ 2012, గురువారం

మా ఊరి గణపతి నిమజ్జన ద్రుశ్యాలు.


మా ఊరిలో" వినాయక చవితి" సంభరాలు  బాగా జరుగుతాయి.ప్రతీ సంవత్సరమూ లైబ్రెరీలోపెట్టి అక్కడే పూజ చేస్తారు.(లైబ్రెరీ లో వినాయకుడేంటి అనుకుంటున్నారా? మా ఊరి లైబ్రెరీ {ఆల్ ఇన్ పోస్ట్ చదివితే తెలుస్తుంది)ఈ సారి మా గ్రామ కూడలి లో గణేశుని విగ్రహం నిలబెట్టారు. 



ఈ సంవత్సరం మా ఊరి కుర్రాళ్ళు మంచి జోరుగా గణపతి ఉత్సవాలు జరిపించేస్తున్నారు.ఇక ఈ నాలుగు రోజులూ  మైక్ ఫుల్ సౌండ్ లో పెట్టి మా చెవుల్లో తుప్పు వదిలించేస్తారు .చందాలు బాగా వసూలవడంతో ఆఖరి రోజు ఊరేగింపుకే ఏభై ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు .ఇంకా మ్యూజికల్ ఆర్కెష్ట్రా ,ఇలా  ఏవో ప్రోగ్రామ్స్ పెట్టారు .



ఆరు కేజీల లడ్డు .వేలం లో 5500 రూపాయలకి  పాడారు.

మా ఊళ్ళో ప్రోగ్రామ్స్ చేయడానికి ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకోసారి రావడానికి ఇష్టపడరెమో అనిపిస్తుంది .ఎందుకంటే ఊరు చిన్నది కావడంతో ఏ ప్రోగ్రాం జరిగినా చూడడానికి వచ్చేవాళ్ళు గట్టిగా లెక్కేస్తే వంద మందికి మించరు.మ్యూజికల్ ఆర్కెష్ట్రా లాంటివైతే మా పక్కఊళ్ళ నుండికూడా చూడడానికి వస్తారు .ఐనా ఎంతకంతే...జనం లేకుంటే పాడే వాళ్ళ కు హుషారు ఎక్కడుంటుందండీ....

  మా వినాయకుడి నిమజ్జనానికి ఉరేగింపు చాలా బాగా జరుగుతుంది.ఉళ్ళో ఇంచుమించు అందరి ట్రాక్టర్లు ఊరేగింపులో పాల్గొన్నాయి .ఉన్నవి నాలుగు వీధులైనా ఉదయం మొదలుపెట్టిన ఉరేగింపు  ,నిమజ్జన కార్యక్రమమం అయ్యేటప్పటికి  రాత్రి  పదకొండు అయ్యింది.







                                              ఈ సంవత్సరం స్పెషల్ కోయ డాన్సు



18, సెప్టెంబర్ 2012, మంగళవారం

రాజమండ్రి -పుష్కరఘాట్-గోదావరి




మా ఊరి నుండి రాజమండ్రి గంట ప్రయాణం.ఏచిన్న పనొచ్చినా   వెళుతూంటాము.

మొన్న అలా   పని మీద  రాజమండ్రి  వెళ్ళినప్పుడు  ,గోదావరికి కొత్త నీరొచ్చినిండుగా  కళకళలాడుతుంటే చూద్దామని   పుష్కరఘాట్ కి వెళ్ళాము.రాజమండ్రి లో  ఐదేళ్ళు  చదువుకున్నా ,నా చిన్నప్పటినుండి  రాజమండ్రి  వెళుతున్నాకానీ   ఇప్పటివరకూ  అలా వెళ్లి  గోదావరిని  చూడలేదు.

  మెట్లుమీద కూర్చుని  గలగలా పారుతున్న గోదారినీ ,ఆ పరిసరాలని  చూస్తూ చాలా సేపు ఉన్నాము.    రాజమండ్రి వస్తూ  వెళ్తూ  అస్తమాను చూసే గోదావరే  కానీ అలా  చూస్తుంటే  చాలా అందంగా కనిపించింది. మళ్లీ  వస్తే పిల్లలని కూడా  తీసుకురావాలని ,వాళ్లకి  కూడా   నచ్చుతుందని  అనుకున్నాము.  సమయానికి చేతిలో (అదేనండి  బాగ్ లో )కెమేరా ఉండటంతో చకచకా నా కంటికి కనపడిన అందాలన్నింటినీ  క్లిక్ మనిపించాను.







































ముందున్న పాతరైల్ బ్రిడ్జిని  హావలాక్ బ్రిడ్జి అంటారు.112 సంవత్సరాల క్రింద దానిని కట్టారు. ప్రస్తుతం ఇది వాడకంలో లేదు. 

హావలాక్ బ్రిడ్జి   ప్రారంభించి నప్పటి శిలాఫలకమే  కింద  ఫోటో 







27, ఆగస్టు 2012, సోమవారం

ఫొటోషాప్ తో నా ప్రయోగాలు




ఏమీ  తోచక ఈ మధ్య ఫొటొషాప్  మీద పడ్డాను.

అస్తమాను ఏంకెలుకుతాలే....  యూట్యూబ్ లో వీడియో చూసి   ఏమనా నేర్చుకోవచ్చేమో అనుకుంటే...  నెట్ కనెక్ట్ ఐతే కరెంట్ పోవడం ,కరెంట్ ఉంటే నెట్ కనెక్ట్ కాకపోవడం .మాకు ఈమధ్య  నెట్  సరిగ్గా కనక్ట్ అవ్వడం లేదు.  ఒకవేళ కనక్టైనా     చాలా స్లో ....ఎన్ని కంప్లైంట్లిచ్చినా అంతే.. ఏమన్నా అంటే మీకు కనెక్షన్ ఇవ్వక ముందే చెప్పాము మీ ఊరికి వచ్చే కేబుల్స్ సరిగా లేవని  అంటారు.  

  ఎప్పుడన్నా మామీద  కరెంటూ ,నెట్టూ రెండూ కలిపి  దయ  చూపితే  మాకు పండగన్నమాట.

అలా క్రితం వారం  రెండూ కరుణించినప్పుడు  యూట్యూబ్ లో  ఫొటోబాగ్రౌండ్ మార్చడం గురించి  వీడియో  దొరికింది. దానిని ఒక   వంద సార్లు చూసి చూసీ అరగ్గొట్టి    ఫొటోబాగ్రౌండ్ మార్చడం నేర్చేసుకున్నా!!



                  






నేను మిక్స్ చేసిన ఫొటోలు ...





  
 కొద్ది కొద్దిగా    తేడాలున్నాయికానీ  ,పరవాలేదనుకుంటున్నాను. ఇంకా బాగారావడానికి ట్రై చేస్తున్నాను.        

8, ఆగస్టు 2012, బుధవారం

పెరుగుపచ్చళ్ళు


తేలికగా  ,తొందరగా చేసేయొచ్చు  అనిపించేవి ఈ   పెరుగుపచ్చళ్ళు.



 తోటకూర,పాలకూర,బచ్చలికూర  పెరుగుపచ్చడికి  బాగుంటాయి. కూరగాయల్లో  పొట్లకాయ పెరుగుపచ్చడికి చాలా  బాగుంటుంది.ఆనపకాయ తో కూడా చేస్తారు కానీ, మావైపు  ఎక్కువగా  పొట్లకాయ తో  చేస్తాము.

 ఆకుకూరైనా ,కూరగాయలైనా   ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఉడకబెట్టుకుని, వాటిలో నీరు  పిండుకోవాలి.పచ్చిమిరపకాయలు వేయించుకుని  ఉప్పు ,పచ్చిమిర్చి,అల్లం  కలిపి నూరి పెరుగులోవేసి పిండుకున్న ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి.నూరుకునేంత టైం లేకపోతే ,   మిరపకాయలు,అల్లం చిన్నముక్కలుగా కట్చేసి తాలింపు లో కలిపి వేయించుకున్నా  పరవాలేదు.కానీ,వేయించిన  మిరపకాయలు నూరి  కలిపితే ఉప్పు ,కారం  బాగా కలుస్తుంది .     వేయించిన అల్లం ముక్కల రుచి  బాగుంటుంది. . అలా ఇష్టమైనవారు  అల్లం ముక్కలు కలుపుకోవచ్చు.

 ఇక తాలింపు  సంగతికొస్తే  ... తాలింపు మినప్పప్పు ,  జీలకర్ర ,ఆవాలు,ఎండుమిరపకాయలు,కరివేపాకు ,తో పాటు మెంతులు కూడా వేసుకుని పెట్టుకోవాలి. మెంతులా...  అని మొహం     చేదుగా  పెట్టకండి. వేగిన మెంతుల రుచి చాలా బాగుంటుంది. మాకైతే మజ్జిగచారు,పెరుగుపచ్చడి కి తాలింపు లో  మెంతులు తప్పనిసరిగా ఉండాల్సిందే.  తాలింపు పెట్టుకున్నాక ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసి  కలుపుకోవాలి.  వీటిని వేయించుకోవక్కర్లేదు.పచ్చి ముక్కలే బాగుంటాయి.

కొబ్బరి తో కూడా చేసుకోవచ్చు.కొబ్బరికోరు,మిరపకాయ తొక్కు,పెరుగులోకలుపుకుని తాలింపు పెట్టుకుకొవడమే.కానీ ,దీనిలో ఉల్లిపాయ ముక్కలేయరు.ఇది  ఇడ్లీల్లోకి  ,దోశల్లోకి  చట్నీలా కూడా బాగుంటుంది. .  

1, ఆగస్టు 2012, బుధవారం

రంగు మార్చిన రేక మందార


రోజూ  ఒకే  రంగు లో  పూసి  బోర్ కొట్టిందో  ....లేకపోతే   దానికి కూడా  కొత్తదనం  కావాలనిపించిందో .....

   మా ఇంట్లో  మందార ఇలా పూసింది. 

 ఎరుపు మందార,  ఇదీ  పక్క పక్క కలిసి పోయి  ఉంటాయి.   అప్పుడప్పుడూ  ఇలా పూస్తూ  ఉంటుంది .  

ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంటారు.  ఈ మందార మొక్కలు రెండూ  పక్కపక్కన ఆరేళ్ల పైనుండీ ఉంటున్నాయి మరి! పూర్తిగా కాకపోయినా  ఆ మాత్రం రంగన్నా  అంటించుకోదా? 














29, జూన్ 2012, శుక్రవారం

మా ఇంటికొచ్చిన కొత్త చుట్టాలు


ఇవి  కొంగలకి  (బహుశా  పక్షులన్నింటికీనేమో....... )  గూళ్ళు  కట్టుకునే   రోజులనుకుంట !

మా పునాస  మామిడిచెట్టు  మీద ఎప్పుడు  చేరాయో ? పచ్చని  చెట్టుమీద   తెల్ల తెల్లగా మెరిసిపోతూ  బలే  అందంగా ఉంటున్నాయి.

ఈ సెలవల్లో రోజూ కరెంటు  పోతుంటే ...  మా పిల్లలకి  మంచి  కాలక్షేపం దొరికింది.మా  ప్రియ(మా అమ్మాయి )  రోజూ  అవి వెళ్ళడం  ,రావడం   బాగా  గమనించేది. కొంగలు గూళ్ళు  కట్టుకోవడానికి  ముక్కుతో  పుల్లలు ,అప్పుడప్పుడు చిన్న చిన్న వైరుముక్కలు కూడా తెస్తుంటే  ....అమ్మా !గూళ్ళకి  డెకరేషన్  చేసుకుంటున్నట్టున్నాయి  అంటూ ,నన్ను పిలిచి  చూపించేది .  హస్బెండ్  ఫుడ్  తెస్తుంటే ...వైఫ్   గూడు   కట్టుకుంటుందా?వర్షమొస్తే  ఎలాగమ్మా  పాపం  తడిసిపోతాయి  కదా!అంటూ   సాయి కూడా   వాటి గురించి  రకరకాల కామెంట్స్  చేసేవాడు.

హాయ్! కొంగలూ  , మంచి మంచి పోజులు  పెట్టండి!  అమ్మ   మిమ్మల్ని ఫోటోలు తీసి  బ్లాగ్ లో పెడుతుంది .మిమ్మల్ని బోల్డు మంది చూస్తారు .మీరు  కదల కుండా  గుడ్  బర్డ్స్  లా  ...ఉంటే   ఫోటోలు బాగుంటాయి  అంటూ,  కొంగల్ని  ఎంకరేజ్   చేస్తూ  మరీ   పిల్లలు నాతో  ఈ ఫొటోలు   తీయించారు .      





                                         
                                                          మా జంట బాగుందా?



చిటారు కొమ్మ పై  ఉన్నానోచ్ ...  


                                                     











ఎవరి కోసం  ఈ ఎదురుచూపులు ?? 



చూడటానికి బాగుంది .ఫోటోలు  బాగున్నాయి. కానీ ,  వర్షాలు  పడుతుంటే  తెలుస్తుంది  కొంగలు  ఇళ్ళ వద్ద  చెట్లు పై  ఉంటే  ఎలా ఉంటుందో ?

 మాకేమి తెలిసిందో?  మీకు తెలుసా?


23, అక్టోబర్ 2011, ఆదివారం

ఆరునెలలవిరామం తరువాత

హాయ్!ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు?

చాలా రోజుల తరువాత నా బ్లాగ్ మిత్రులందరినీ కలుస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది :)))).

మీ అందరి బ్లాగ్లూ చదువుతూ ....నేనూ బ్లాగ్ రాయడం ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టాను .నెలకి కనీసం ఆరేడు టపాలైనా రాస్తూ.... మీ కామెంట్ల ప్రొత్సాహంతో ,ఇంకా బాగా రాయాలనుకుంటూ ఉండేదాన్ని.

ఈ అక్టోబర్ కి నా బ్లాగ్ మొదలపెట్టి రెండేళ్ళైంది.

ఈలోపే నా బ్లాగ్ పోస్ట్లుకి మరీ ఇంత పెద్ద విరామం వస్తుందని అస్సలు అనుకోలేదు.ఏప్రియల్ నెలలో పిల్లల పరిక్షలు, మే నెలలో పెళ్ళిళ్ళు, సెలవల హడావిడి .... పిల్లల బళ్ళు తెరిచారు ఇక బద్దకించకుండా రాయాలి అనుకొన్నాను ... ఓ అనుకోని సంఘటన! ఇన్ని రోజులూ బ్లాగ్ ప్రపంచానికి దూరంగా ఉండేలా చెసింది.

నా బ్లాగ్ ప్రపంచంతో,మీ అందరితో... మరిన్ని రోజుల విరామం తప్పదు:(((( ...

బై బై ఫ్రెండ్స్ .