ఇవి కొత్త పప్పులు వచ్చేరోజులు. మాకు(మా ఊళ్ళో చాలా మందికి)అపరాలు పండక పోయినా మినుములు,కందులు,పెసలు,బొబ్బర్లు కొనుక్కుని వాటిని తిరగలితో ఇసురుకుని ,బాగుచేసుకుని జాగర్త చేసుకోవడం అలవాటు.
ఇప్పుడు చాలామంది కొట్ల మీద కొనుక్కోవడమే... మీ ఊళ్ళోనే మరీ చాదస్తంగా చేయిస్తారని మా అమ్మమ్మాళ్ళు అంటారు కానీ ,మేమెప్పుడూ ఇలానే చేసుకుంటాము. నలుగురైదుగురం కలిపి తెప్పించుకుంటాము.
తెప్పించుకోవడంతోనే సరా!వాటిని బాగుచేయించుకున్నాక , మిగిలినవి పరవాలేదుకానీ మినుములిసురుకునే తిరగలికోసం వేట మొదలెట్టాలి.వేటెందుకంటే?మినుములు చిన్నగా ఉంటాయి కదా!సరైన తిరగలితో ఇసరక పోతే పప్పు సరిగ్గా రాదు నూక ఎక్కువగా వస్తుంది. అందుకని ఈరోజుల్లో మాఊళ్ళో మినుములిసురుకునే తిరగలికి మహా గిరాకీ అన్నమాట!
ఈతిరగళ్ళు రెండే ఉంటాయి. ఒకటి పై వీధిలో యెద్దనపూడోళ్ళది,ఇంకోటి మా ఆచంటోళ్ళ నలుగురికీ ఉమ్మడిది.అంటే ఎప్పుడో మా తాతమ్మ వాడింది .వాళ్ళ పిల్లలైన మా తాతలది.ఇప్పుడు వాళ్ళ పిల్లలది .
మా సాయికి ఇసరడమంటే చాలా ఇష్టం .తిరగలేసేటప్పటికి తయారైపొతాడు నేను నేనంటూ...
తిరగలేసుకుని కూర్చుంటే బస్తాడు ఇసిరే వరకూ అక్కడి నుండి కదిలే వాళ్లము కాదని నానమ్మ అస్తమానూ అనేది. మేమా ...పనోళ్ళు ఇసురుతుంటే సరదాగా ఇసరడానికి కూర్చున్నా గట్టిగా అరగంట కూర్చుంటే గొప్పే !అయినా మన నానమ్మలు,అమ్మమ్మల్లా ..మనం చేయగలమా?ఆ రోజుల్లో వాళ్ళు తిన్న ఆరోగ్యవంతమైన ఆహారాన్ని బట్టే అలా పనులు చేసే వాళ్ళేమో !
ఇలా ఇసరడం ,చాటతో చెరగడం వంటి పనులు పనులు చేయడం ఇప్పుడు మాకే కాదు ,పనోళ్ళ క్కూడా రావడంలేదు.
ఏదో చేసే వాళ్ళున్నారని కానీ ,ఇలా చేసే వాళ్ళెవరూ దొరకనప్పుడు మేమూ పప్పులన్నీ కొనుక్కోవడానికి అలవాటు పడక తప్పదుకదా!