అటూ ఇటూ ఎత్తైన కొండలు ........ఎక్కడో దూరంగా అక్కడక్కడా కనిపిస్తున్న చిన్న చిన్న పల్లెలు ,అప్పుడప్పుడూ ఎదురవుతున్న జాలర్ల పడవల మధ్య గోదావరిలో పురుషోత్తపట్నం నుండి పేరంటపల్లి వరకూ తొమ్మిది గంటల లాంచీ ప్రయాణం ..... మరచిపోలేని మధుర అనుభవం!
నాలుగేళ్ళ క్రితం ఒకసారి పాపికొండలు వెళ్లేము .అప్పుడు మా అమ్మాయి రాలేదు .తను అస్తమాను పాపికొండలు వెళ్దాం అంటుంటే తన కోసమని ఈ మండే ఎండల్లో ప్రయాణం చేసేము.అసలు పాపికొండలు వెళ్ళాలంటే నవంబర్ నుండి మార్చి లోపైతే ప్రయాణం హాయి హాయిగా చల్ల చల్లగా సాగిపోతుంది .
మా ప.గో.జిల్లా నుండి పట్టిసీమ ,పోలవరం ,సింగనాపల్లి నుండి లాంచీలు ఉంటాయి.మాకు పట్టిసీమ దగ్గరే కానీ మార్చి వరకే పట్టిసీమ నుండి లాంచీలు తిరుగుతాయంటే రాజమండ్రి వెళ్లి వెళ్లేము.రాజమండ్రి నుండి లాంచీలు వెళ్ళవని మాకు అక్కడకి వెళ్ళేవరకు తెలిలేదు.రాజమండ్రి నుండి పురుషోత్త పట్నం గంట కారులో తీసుకెళ్ళి అక్కడ లాంచీ ఎక్కించేరు.
అది ఏసీ లాంచీ ఐనా వెళ్ళింది ఏసీ లో కూర్చోవడానికి కాదుకదా! అని లాంచీ పైనే ఉక్కపోతని,మండే ఎండని భరిస్తూ గోదావరి అందాలను అస్వాదించాము .
ఉదయం పది గంటలకు బయలుదేరిన లాంచీని మధ్యలో గండి పోసమ్మ గుడి దగ్గర ఇరవై నిముషాలపాటు ఆపారు .తిరిగి బయలుదేరిన మేము మధ్యాహ్నం రెండు గంటలకు పేరంటపల్లి వెళ్లేము .
పేరంటపల్లి అనుభవం మాత్రం ఎప్పటికీ మర్చి పోలేము .
అప్పటి వరకూ ఎండని భరించలేని మేము ఆ వేడి ,ఉక్కపోత భరించలేక తిట్టుకుంటూ కూర్చున్నాము .అక్కడ దిగగానే హోరున వాన కురవడం మొదలైంది. పేరంటపల్లిలో ఒడ్డున పెద్ద చింత చెట్టు వయస్సు చాలా ఉంటుంది .అక్కడ చాలా సినిమాల్లో పాటలు తీస్తారు.అవన్నీ పిల్లలకు చూపించొచ్చు అనుకుంటే పాడు వానవలన ఏమీ కుదరలేదు.ఎక్కడా పెద్దగా మబ్బుల్లేవు అదే తగ్గిపోతుందనుకుంటే ఇరవై నిమషాలు ఆగకుండా కురిసింది.అలా ఆవర్షం లోనే తడుస్తూ అక్కుడున్న శివాలయం చూసి ,తిరిగి లాంచీ ఎక్కుదామని మళ్ళీ వర్షం లోనే తడుస్తూ తిరిగి వచ్చేము.
ఎలాగో వర్షంలో తడుస్తూ పరుగులు పెడుతూ వస్తే ఇక్కడి సీను ఇంకా గొప్పగా ఉంది !
ఎత్తెన గోదారి గట్టు మీద నుండి ఒడ్డున ఉన్న లాంచీ ఎక్కడానికి అరగంట పట్టింది.అడుగు తీసి అడుగు వేయాలంటే భయం.ఎక్కడ కాలుజారి గోదారిలోకి జారతమో అని! ఒకరికొకరం సాయం చేసుకుంటూ ఆ బురదలో పడుతూ ..లేస్తూ ,జారుతూ,దేకుతూ ... వళ్ళంతా ,బట్టల్నిండా బురద అంటుకున్నా లెక్కచేయకుండా ...పిల్లలకు ధైర్యం చెపుతూ ఎలాగో అందరం క్షేమంగా లాంచీ ఎక్కేసేము.
దానిని భయంకరమైన అనుభవం అనాలో సరదా అనుభవం అనుకోవాలో .....ఆ రోజు జరిగిన సంఘటన ని తలుచుకుంటే ఎంత గండం గడిచింది అనిపిస్తుంది.అంతలోనే అంత బురదలో జారుకుంటూ అలా వెళ్ళడం తమషాగా ఉందనిపిస్తుంది.ఇంటికొచ్చాక కూడా ఆ సంఘటన ను తలుచుకుని ,మా తిప్పల్ని గుర్తు తెచ్చుకుని తెగ నవ్వుకున్నాము.ముందు లాంచీ ఎక్కినోళ్ళెవరైనా మనల్ని విడియోకానీ ఫోటో కానీ తీయల్సిందే! అని మా పిల్లలు ...
లాంచీ ఎక్కేక కూడా కాసేపు వర్షం పడింది.అందరం అలా తడిసిన బట్టలతోనే కూర్చున్నాము . ఎవ్వరిలోనూ వచ్చినప్పటి ఉత్సాహం లేదు.అప్పటి వరకూ ఎండ భరించలేక తిట్టుకున్న మేము ఎండ కోసం ఎదురుచుసాం.దేవుడి దయవలన ఎలాగో కాసేపటికి మబ్బులు తొలిగి ఎండొచ్చింది.తడిసి ఉన్న మేము ఈ సారి ఆనందంగా ఎండలో కూర్చున్నాము.కాసేపటికి ఎండ తగ్గి చలిగాలి మొదలైంది .ఆ చలిలోనే కాసేపుండి ఒక్కరోజులోనే ఎండా,వానా,చలీ మూడూ చూసేసేం.
తిరిగి లాంచీ పురుషోత్తపట్నం వచ్చేటప్పటికి రాత్రి ఎనమిది ...రాజమండ్రి వెళ్ళేటప్పటికి తొమ్మిది ...మా ఊరు చేరేటప్పటికి పదిన్నర .
అలా మా పాపికొండల ప్రయాణం సరదా సరదా గా ,భయం భయం గా తమాషాగా జరిగింది.
ఇదే మా జలశ్రీ లాంచి
జానికిరముడు,శ్రీరామదాసు ఇంకా చాలా సినిమాలు ఈ గుడిలో తీసారట
ఇక్కడకూడా ఎదో తవ్వేస్తున్నారు .ఏ కొండలూ ఉంచరేమో!
పాపికొండల మధ్య గోదావరి!!
అక్కడ ఉన్న చిన్న గిరిజన పల్లె పిల్లల ఆట పాటలు
చిన్న చిన్న గుడిసెలు వాటి ముందు వాళ్ళ పడవలు .మన ఇళ్ళ ముందు కార్లు,బైక్ లు ఉన్నట్టు!
మనిషి ఆకారం లో ఉన్న ఈ కొండ పాపి అనే రాక్షసుని పేరుమీద ఏర్పడిందని అక్కడివారు అంటారట .
తిరిగి వచ్చేటప్పుడు సూర్యాస్తమయ చిత్రాలు తీయాలని ఎంతగానో అనుకున్నా...కేమెరా చార్జింగ్ అవ్వకుండా ఉండాలని పిల్లల్ని ముట్టుకోనివ్వలేదు . బాగా మబ్బులు ఉండటంతో తీయలేకపోయా :(( వీటితోనే సరిపెట్టుకున్నా.