=''/>

22, డిసెంబర్ 2014, సోమవారం

పనసపొట్టు కూర


  ఈ రోజుల్లో  మా వైపు కార్తీక మాసం రావడం తోనే పనసకాయలకోసం వేట మొదలు పెట్టేస్తారు .ద్వాదశి  బోజనాలు ,వన బోజనాలు ,అయ్యప్పల బోజనాలకనీ,ఈలోపు ఏవన్నా  ఫంక్షన్స్ వస్తే   వాటికి " పనస పొట్టు "  కూర మెనూ లో తప్పని సరన్నమాట .   
ఎవరన్నా  పనసకాయల కోసం వస్తే వాళ్లకిస్తూ ఎప్పుడన్నా ఇంటికి తెస్తే ఆ కాయను  పొట్టు    కొట్టాలంటే  బిందిలింగం ( ఊరుమ్మడి వడ్రంగి ) రావాల్సిందే .. 


మొన్నోరోజు అలాగే తెస్తే  పోట్టు కొట్టించి మొదటిసారి నేనే స్వయం గా కూర చేసా .అంటే ఎప్పుడూ చెయ్యడం కష్టం ,పెద్దవాళ్ళు చేసినట్టు చెయ్యగలనో  లేదో  ,ఆ రుచి నాకు వస్తుందా ఇలా అనుకుంటూ  ఎవరో ఒకరి తో  వండించడమే అన్నమాట  .   
పనస పొట్టు కూర  వండటం  ఎంతో  తేలికని    మొదటి  సారి తెలిసింది .. 
ఎంత తేలిక గా చేయ్యోచ్చంటే  .. 
 పనస పొట్టుకి సరిపడా చింతపండు గుజ్జు తీసుకుని,  కుక్కర్లో  పొట్టు తో పాటు చింతపండు గుజ్జు  ,  రెండో ,మూడో ఎన్ని  పడతాయంటే అనుకుంటే అన్నిపచ్చి మిరపకాయలు మధ్య కు కోసుకుని అవీ,సరిపడా ఉప్పు వేసి, కొంచెం పసుపు, నీళ్ళు చాలా కొద్దిగా చూసుకుని పోసుకోవాలి. పొట్టు కాస్త ఆవిరి  కి  ఉడికి పోతుంది .  కుక్కర్ మూత పెట్టి మూడు కూతలు వేసేక స్టౌ కట్టేసుకోవాలి .  
కుక్కర్ మూత తీసుకుని నీరు   ఉంటే   పోయే వరకూ ఉడకబెట్టుకుని   ,
జీడిపప్పు,వేరుసెనగ గుళ్ళు ,సెనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర ,ఎండుమిర్చి ,కరివేపాకు తో తాలింపు పెట్టుకుని కూర   వేడి తగ్గాక  కాస్త  ఆవపిండి కలుపుకుంటే పనస పొట్టు  కూర తయార్  :) ఇప్పుడిప్పుడే వస్తున్న  లేలేత  గింజ పట్టని చిన్న చిన్న పనసకాయల పై   తొక్క తీసేసి కడిగి ,కాస్త పసుపు నూనె రాసి ఇలా పొట్టు  కొడతారు .


18, డిసెంబర్ 2014, గురువారం

ఇవన్నీ మా ఊరి పక్షులే :)

రకరకాలా పక్షులు అదీ మా ఊళ్ళో !
వాటిని చూస్తుంటే  నాకెంత ఆశ్చర్యమంటే  ఇవన్నీ ఈ మధ్య నుండే వస్తున్నాయా  మా ఊరు ?లేకపోతే  నేను ఇప్పుడు వాటిని కొత్తగా చూస్తున్నానా ? అనిపిస్తుంది .
 వాకింగ్ కి వెళ్ళడం మొదలు పెట్టినప్పటినుండీ నాకు పక్షులపిచ్చి బాగా పట్టుకుంది .పక్షుల కూతలు వింటూ ఏ   పిట్ట  ఎలా కూస్తుందో తెలుసుకుంటూ బాగా గమనించడం అలవాటు చేసుకున్నా.
ఇక మేం వాకింగ్ కి వెళ్ళే దారిలో చిలకల సందడి గురించి చెప్పక్కర్లేదు .
సాదారణంగా కొన్ని పక్షులు గూళ్ళు కట్టుకుని గుడ్లు పెట్టే రోజుల్లో వలస వస్తాయంటారు కానీ ఇవలా అనిపించడం లేదు .
కొన్నయితే ఉదయాన్నే ఇంట్లో   చెట్ల మీదకి వచ్చేస్తుంటాయి.వాటి కూత వినగానే అలవాటుగా చేసే పని కాస్త పక్కన పెట్టి వాటిని విసిగించకుండా అప్పుడప్పుడూ కుదిరితే ఓ ఫొటో తీస్తుంటానన్నమాట :)ఇదేదో   Golden fronted leafbird  అట 


కింగ్ ఫిషర్ ! రోజూ  ఉదయాన్నే వస్తుంటుంది .  దాని విజిల్ (దాని కూత అచ్చు విజిల్ వేసినట్టు ఉంటుంది ) విని  వెళ్లి  ఫోటో  తీసే లోపు  నన్ను చూసి ఎగిరిపోతూ  ఇలా చిక్కింది .
 ఏమి చిలుకలో ..విటినీ ,వీటి అల్లరి ఎంతిష్టమంటే  ఊరికే  అరుస్తూ  ,గోల గోలగా అటు ఇటు ఎగురుతూ అల్లరి  చేస్తూ తిరుగుతూ ఉంటే  ఇంకాసేపు   అక్కడ  వుంటే బావుండుననిపిస్తుంది .కానీ వాకింగ్ మేట్స్  ముందుకు వెళ్లి పోతుంటే  నేను    వెనక్కి  వెనక్కి  మెడ నొప్పెట్టేలా  చిలుకల్ని వదల్లేక  వీలయితే కొన్ని  ఫోటో లు తీసుకుని వెళ్తుంటా .


వడ్రంగి పిట్ట ఉదయాన్నే టక టకా  చెట్టు ని పొడుస్తూ


ఈ బుల్లి పిట్టలను  ఏమంటారో  మరి ?


ఉయ్యాలూగుతూ బుజ్జి  పిచుకమ్మ ..
చిన్నప్పటినుండి ఉన్న ఊరే అయినా నేనింత వరకు వాటిని అంతగా గమనించలేదేటబ్బా  అనుకుంటా అప్పుడప్పుడూ .. వీటిలో కొన్ని అందరికీ తెలిసినవే అయ్యుండొచ్చు కానీ నేను తీసిన మాఊరు పక్షులు ,పిట్టలు చూపిస్తున్నా అనుకోండి మరి :)

13, డిసెంబర్ 2014, శనివారం

అయ్యో నా బ్లాగ్ !

బ్లాగ్  లో పొస్ట్ రాసి సుమారు రెండు నెలలు అయింది .పోనీ అలా అని ఈ రెండు నెలల్లోనూ బిజీ బిజీ గా చేసిన ఘనకార్యమేమన్నా ఉందా అంటే అదీ లేదు .
మరెందుకబ్బా  రెండు నెలలనుండి  బ్లాగ్ లో ఏమీ రాయలేదు అంటే..  ఏమో నాకే తెలియట్లేదు .
 అయ్యో నా బ్లాగ్ !పాపం దాని ఆలనా పాలనా పట్టించుకోకుండా  అనాధ లా వదిలేసానే అని అప్పుడప్పుడూ  కాసేపు చింతిస్తూ వుంటాను కూడా .  అయ్యో ఓ పోస్ట్ అన్నా రాయాలి ! అని ఎప్పటికప్పుడు   అనుకోవడంతోనే  అలా అలా  రోజులు జరిగిపోయి నెలలూ గడిచిపోయాయి .
బ్లాగ్ మొదలు పెట్టిన కొత్తలో  ఏం చేసినా ?ఏం చూసినా బ్లాగ్ లో  టపాకి పనికొస్తుందా అన్నట్టు చూస్తుండేదాన్ని :)
ఇది కూడా రాసేస్తావా నీ బ్లాగ్ లో   అంటూ   మా పిల్లలు  అడుగుతుండే వాళ్ళు .
 అలాంటిది ఇప్పుడేమో  ఈ  బ్లాగ్ ప్రపంచం లో నాకంటూ చిన్ని గుర్తింపు నిచ్చిన  నా బ్లాగ్ నే మర్చి పోయానేమో అనిపిస్తుంది  .
 ఇంతసేపూ  ఈ డబ్బా ఎందుకంటే ఇకనుండి  నెలకి కనీసమంటే కనీసంగా  ఓ రెండు మూడు పోస్ట్ లన్నా రాయాలని కంకణం కట్టుకున్నా..
   మరి  కట్టుకున్న కంకణాన్ని  విప్పేస్తానో  ?ఇంకా బిగించి కట్టుకుంటానో ? 
18, సెప్టెంబర్ 2014, గురువారం

పిచుకమ్మ స్నానం ఎలా చేసిందంటే .. ఫొటోలు చూడండి మరి !

మా ఇంట్లో బుజ్జి పిచుకమ్మలు తిరుగుతూ ఉంటాయన్నా కదా ! వాటిలో ఒకటి కార్కు నుండి లీకయ్యే  నీటి  దార కిందకు చేరి ఇదుగో ఇలా చేసిందండీ స్నానం :) 
 11, సెప్టెంబర్ 2014, గురువారం

కొన్ని సూర్యోదయాల ...సూర్యాస్తమయాల ఫోటోలు

  బాపూ గారి  ముత్యాల ముగ్గు సినిమా లో డైలాగ్ గుర్తుందిగా  ... "సెగెట్రీ  ,ఆకాశం లో ఎవరో మర్డర్ చేసినట్టు  లేదూ  .. మనిసన్నా క కాతంత కళా పోషణ ఉండాలోయ్ "   
అలా   ఆకాశం ఎర్రబడ్డట్టు కనిపిస్తే చాలు  నా చెయ్యి నా ప్రమేయం లేకుండానే కెమెరా మీదకు పోతుంది . ఎంత పనిలో  ఉన్నా సరే  ఆ కాసేపు అంటే ఓ ఐదు ,పది నిముషాలు ఆ పని  పక్క కి జరిపి ఈ పనిలో పడతా నన్నమాట!   
అది ఉదయమైనా   సాయంత్రమైనా సరే .. 

ఇలా  ఉదయాలూ,సూర్యాస్తమయాలూ చూస్తున్నా ,తీస్తున్నా చాలా సార్లు బాపూ గారూ,ముత్యాల ముగ్గు డైలాగ్ గుర్తొస్తుంటుంది .  ఇప్పుడాయన   అక్కడికెళ్ళిపోయారుగా అందుకే ఆయన్ని నా ఫొటో ద్వారా అక్కడున్నట్టు  ఏదో చిన్ని ప్రయత్నం !


ఎలా వున్నాయి మరి మా ఊరి సూర్యో దయాలు ,అస్తమయాలు .. 
మరి  మీరు కాస్త చెప్తే నేను బోల్డు సంతోషిస్తాన్నమాట  :)

9, సెప్టెంబర్ 2014, మంగళవారం

ఈ మధ్య తీసిన కొన్ని ఫొటో లు !6, సెప్టెంబర్ 2014, శనివారం

మా ఊరి గణేషుడి ఉత్సవం


     మా ఊళ్ళో విఘ్నేశ్వర స్వామి  వారి ఉత్సవాలు ఎటువంటి విఘ్నాలూ లేకుండా  జయప్రదంగా  జరిగాయి.  
ఆరవ రోజున నిమజ్జన కార్యక్రమం జరిగింది.

ఉదయం పదింటికి .. ఉల్లాసంగా ఉత్సాహంగా మొదలైన స్వామి వారి ఊరేగింపు ,నిమజ్జన కార్యక్రమం రాత్రి పది గంటలకు  జయప్రదంగా ముగిసింది   . 


అబ్బో మా గణేషుడు లడ్డూ ఈ సంవత్సరం వేలం లో ఇరవై  వేల  రూపాయలు పలికి రికార్డు సృష్టించింది.నా చేతిలో తయారైన గణేషులవారు  .. మరి మీరేమంటారో  కానీ ఈయన ఆయనే అని నా అభిప్రాయం :)