=''/>

30, జులై 2013, మంగళవారం

ఇద్దరి "పుట్టినరోజు"లూ ఈ రోజే !! మా బాబు సాయిది  ,మా వారి ది  ఇద్దరిదీ ఈ రోజే  పుట్టినరోజు!! 

పాప ఎప్పటినుండో హాస్టల్లో ఉంటుంది కానీ బాబుని నిరుడే  హాస్టల్లో  వేసాము .ఇక ఇంట్లో  పిల్లల పుట్టినరోజులు జరుపుకునే అవకాశమేది?  వాళ్ళకిష్ట మైనవన్నీ వండుకుని మేమే  వాళ్ళ దగ్గరకెళ్ళి ,సాయంత్రం వరకూ గడిపి వస్తాము.

సాయి ఎప్పట్లానే ఈ పుట్టిన రోజు కోసం కూడా  జులై ౩౦ ఎప్పుడొస్తుందా ?అని ఎంతో ఆత్రుతగా  చూస్తున్నాడు.రెండు నెల్ల క్రితమే డ్రెస్ కొనిపించి,రోజూ ఫోన్లో  చాక్లెట్లు ఏమేం రకాలు కావాలో,కేక్ ఎలా ఉండాలో చేప్పి చెప్పి  కొనిపించాదు ..

ఎప్పుడెప్పుడా? అని తను  ఎదురు చూసిన జులై ౩౦ వచ్చేసింది .తను చెప్పినవన్నీ సర్దుకుని ,వండుకుని తొందరగా బయలుదేరి  అబ్బాయి గారి దగ్గరకెళ్ళాలి.
         అబ్బాయి  కి వాళ్ళ  నాన్నారు కి పుట్టినరోజు                                     శుభాకాంక్షలు


9, జులై 2013, మంగళవారం

చిట పట చినుకుల సోయగాలు నా చిత్రాల్లో

చిటపట చినుకులు పడుతూ ఉంటే .. కెమేరా  చేతపట్టి ,అడ్డూ అదుపూ లేకుండా ...
టక టకా చిత్రాలే తీస్తూ ...వెనుకా ముందూ చూడక ...
చకచకా   పరుగులు పెడుతూ ...జర్రున జారినా  లెక్క జేయక  ....

   లారిపడిన  చినుకల  సోయగాలను  ఇలా పట్టి బంధించేసా!!
3, జులై 2013, బుధవారం

చేదు బీరకాయలు :((( అయ్యాయే!!!


నిరుడు  ఇంట్లో ఉన్న బీర విత్తనాలు పెడితే పాదంతా రోట్టలా పెరగడమే కానీ   సరిగా కాయలేదని ఈ ఏడు పనిగట్టుకుని విత్తనాల కొట్టులో కొని మరీ పెట్టా.కొట్టు వాడిని బాగా కాస్తాయా?అనడుగుతే    ఆ కవరు మీద ఫోటోలో ఉన్నట్టే కాస్తాయన్నాడు.

 ఏ  మొక్కలేసినా ,విత్తనాలు పెట్టినా రోజూ  వాటికి నీళ్ళు పడుతూ వాటి చుట్టూ తిరుగుతూ ,  వాటి  పెరుగదల ,పూత ,పిందెలు  అన్నీ చూస్తూ ఉంటా...ఈసారి  బీర విత్తనాలు కొని  మరీ పెట్టానేమో,   పెట్టింది మొదలు రోజూ దానినే గమనిస్తూ ఉండేదాన్ని.

ఎలాగో  మే నెలలో ఎండల్ని తట్టుకుని ,ఇప్పుడు పడుతున్న వర్షాలకు  చక చకా  కొత్త తీగలు వేసుకుంటూ  పూత  పిందెలతో కళకళలాడుతూ ఉందిప్పుడు .వేసవికాలంలో రోజూ నీళ్ళు పోసి ఎంత శ్రద్ద గా చూసినా పెరగనిది ఎండలు కాస్త తగ్గి వర్షాలు పడేటప్పటికి  ఒక్కసారే మార్పొచ్చేసింది .
ఉదయమే పాదు  దగ్గరకెళ్ళి పెరిగిన  కాయలను కోసి ఆహా! ఎన్ని రోజులకు ఫ్రెష్ గా ఇంట్లో పండిన బీరకాయలతో కూరవండుతున్నా అనుకుంటూ  ...పాలు పోసి ఇగురు  కూర వండాలా?పెసరపప్పులో వేయాలా?అని కాసేపు అలోచించి ఫ్రెష్ గా ఉన్నవి ఇగురుకి బాగుంటాయి కదా!అని ముక్కలు కోస్తూ లేతగా బాగుందని ముక్క నోట్లో పెట్టుకున్నా!! యాక్ చేదు విషం :(( కాకరకాయలు  కూడా అంత చేదుఉండవేమో! అంత భయంకరంగా  ఉంది.
అయ్యో!ఇదేమిటి ఇంత చేదుగా ఉన్నాయని అన్నీ   కోసి చూసినా   అలానే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు కాస్తాయా?అని ఎదురు చూసినంత  లేదు .ఎప్పుడూ అవ్వలేదు ఇలా ...

వేరుకింద కుండపెంకు ఉంటే అలా  చేదుగా  కాస్తాయి అంటున్నారు.విత్తనాల్లో ఉందో ?తేడా మా పాదుకే ఉందో??   పికేద్దామంటే   తరువాత కాపు బాగుంటాయేమో   చూడు అన్నారని ఉంచేసా. .తరువాత కాపు ఎలా కాస్తాయోలే  అని   ఉళ్లో వాళ్ళని ,వీళ్ళని అడిగి  మళ్ళీ విత్తనాలు పెట్టా . 

మా పాదు కాయలు అంత చేదుగా ఉంటే  ,ఒకరోజు అక్కతో అన్న మాటలు గుర్తొచ్చాయి .బీరకాయముక్కలు  కోస్తుంటే  ముక్కలు  తిని, ఎలా ఉన్నాయో చూసి  కొయ్యి.   చేదుగా ఉన్నాయేమో!అని  మా  రెండో అక్కంటే ...   చేదుగా ఉండవక్కా  బాగానే ఉంటాయి అంటూ ముక్కలు  కోసేసే.మేం కొన్నా ,ఇంటివద్ద కాసినా   అలానే కోస్తాం చాలా కాయలు చేదుగా ఉంటాయి   అందుకే చెపుతున్నా అని  అక్కంటే  మీ ఊరి వైపు అలా ఉంటాయేమో మా ఉళ్లో బాగానే ఉంటాయని గొప్పలు పోయా....