=''/>

27, ఫిబ్రవరి 2010, శనివారం

హోలీ పూర్ణిమ అంటే ....



సంవత్సరం చివరి మాసం ఫాల్గునం .పూర్వఫల్గుని లేదా ఉత్తరఫల్గుని అనే నక్షత్రాలలో ఏదొ ఒకదానిని చందృడుకలసిన వేళ ఏర్పడే మాసం ఫల్గున మాసం . ఈ ఫాల్గున మాసంలో వచ్చే పూర్ణిమను "హోలీపూర్ణిమ"గా అంతా అంటారు .

ఈ పూర్ణిమకు ఈపేరు రావడానికి రకరకాల కారణాలు చెబుతూ ఉంటారు .హోలీ అనే రాక్షసిని సం హరంచినందుకు ఈ పేరు వచ్చిందని అంటారు . అలాగే ఇంకోటి కూడా ఉంది .

ఈపూర్ణిమ అసలుపేరు హోలీ పూర్ణిమ కాదు హేలీ పూర్ణిమ అనేది నిజమైన పేరు .హేల అంటే విలాసం ,వినోదం ,సంతోషము అని అర్ధాలు. ఏ పూర్ణిమనాడు వినోదాలు ,సంతోషాలు సాగుతాయో అలా సాగే పూర్ణిమే హేలీ పూర్ణిమ అనేది యదార్ధం .

అసలు ఈపూర్ణిమ నాడే ఈవిలాసాలు ,సంతోషాలు ఎందుకు జరుగుతాయి ?

ఇది సంవత్సరము లో చివరి పూర్ణిమ .దీని తరువాతది చైత్ర పూర్ణిమ .చైత్ర పూర్ణిమ వసంతఋతువులో వస్తుంది .వసంతఋతువంటే మనకు ,చక్కని చిగుళ్ళు,రంగురంగుల పువ్వులతో,కాయలతోనూ నిండినవృక్షాలు ,కోయిల కూతలు..... ఇలా కన్నుల పండుగగా కనిపిస్తుంది .

కానీ ఆదృష్టితో ఈ పూర్ణిమను..అంటే హోలీ పూర్ణిమను చూస్తే ,ఇది శిశిర ఋతువైన కారణంగా ఆకులు ,పువ్వులు రాలి బోసిపోయిన చెట్లు, వృక్షాలు..వీటితో అందాన్నికోల్పోయి కాలం ఉంటుంది .
మరి మోడువారిన చెట్లు ,మౌనంగా విలపిస్తుంటే ,అంతా వినోదాలు,విలాసాలు,సంతాషాలతో ఓ ఉత్సవాన్ని చేసుకోవడమేమిటి?దానికి హేలీ పూర్ణిమ అనిపేరు పెట్టుకోవడమేమిటి? అనిపిస్తుంది మనకు.
ఇక్కదే ఉంది రహస్యమంతా .. కష్టమనేది కలకాలముండదనీ,కష్టములో ఉన్న ప్రతీ వ్యక్తీ రాబోయే సుఖాన్ని గూర్చీ ,సంతోషాన్ని గూర్చీ ఎదురు చూస్తూ.. ఉత్సవాన్ని చేసుకోవాలనే అద్బుతమైన ఒక ధైర్యాన్ని ఇచ్చే పూర్ణిమ ఈ "హేలీ పూర్ణిమ ."

అందుకే ఈ పూర్ణిమ రోజు అందరూ రంగు రంగుల పొడులను నీళ్ళలో కలిపి అలా చల్లు కుంటూ ఉంటారు .ఈచల్లబడే రంగురంగుల నీళ్ళు ..రాబోయే రంగు రంగుల చిగుళ్ళకు,పువ్వులకు సంకేతం . వ్యక్తుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం రాబోయే ప్రకృతినిముందునాటికి మనం అనుభ వించబొయే నిత్య సంతొషానికి సంకేతం .


ఉత్సాహముతో జనమంతా కేరింతలు కొడుతూ ..ఎక్కడ తన మీద నీళ్ళు పడతాయో నని పరిగెత్తుతూండడమనేది
-ఇప్పుడు వెళ్లిపోతున్న సంవత్సరానికి వీడ్కోలు , రాబోయే నూతన సంవత్సరానికి సంతోషముగా స్వాగతం పలకడమే .

జీవితంలొ ఎన్నెన్నో సంఘటనలలో గతాన్ని వదిలి ,భవిష్యత్తులోకి అడుగుని,వర్తమానంలో వేస్తున్నవేళ ఏమాత్ర దిగులూ వద్దని, రాబోయే మార్పు సంతోషము తో స్వాగతించాలని చెప్పే పండుగే ఈ హేలీ పూర్ణిమ ..

ఇక్కడ మరో విషయము కూడా అనుకోవాలి .ఆనం దించ దగిన దృష్టి ,ఆలోచనా ఉండాలే గానీ ప్రకృతిలో కనిపించే ప్రతీ దృశ్యమూ సంతోషకరం గానే ఉంటుంది .చక్కగా విరగబూచిన చెట్టు ఎంతందంగా ఉంటుందో ,ఒక్క ఆకూ పిందే కానీ లేకుండా ఒంటరిగా ఉన్న చెట్టు కూడా అంతే అందంగా కనిపిస్తుంది .ఇలా ప్రతీ వస్తువు లోనూ సౌందర్యాన్ని పరిశీలించి అనందించడాన్ని ,రాబోయే సుఖానికి ఎదురుచూడడాన్ని చూపించే పండుగే హోలీ పండుగ .

దీనిలొ విషయాలు చాలావరకు ఒక ఆధ్యాత్మక పత్రికలోనివి . అవి నచ్చి,అందరికీ తెలిపినట్లుంటుందని రాయడంజరిగింది .

హోలీ పండుగ టైంకి గోగులు పూస్తాయి .ఒకప్పుడు ఈపువ్వులు ,ప్రకృతిసిద్దంగా దొరికే వాటితోనే రంగులు చేసుకొని జల్లుకొనేవారు .ఇప్పుడు ఎక్కడ చూసినా కృత్రిమరంగులే . మళ్ళా అవి కళ్లలో పడితే కళ్ళకే ప్రమాదం .అందుకే సాద్యమైంతవరకూ ఆరంగులు కళ్ళలో పడకుండా జాగర్త పడితే మంచిది .


అందరికీ హోలీ శుభాకాంక్షలు .

26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

మహేంద్రాడ్యూరో బైక్ తో ..


నేను చదువుకునే రోజులనుండి స్కూటీ నేర్చుకుని ,నడపాలనే నాకోరిక ఇదిగో ఈ "మహేంద్రా డ్యూరో "ద్వారా ఈరోజు తీరింది .

మేము ఈమధ్యనే మా మావయ్యగారకని మహేంద్రా డ్యూరో తీసుకున్నాము . మావయ్యగారు ఎల్.ఎం.ఎల్ వెస్పా వాడేవారు కానీ అవి ఇప్పుడు రావటం లేదని ఇదితీసుకున్నాము. (మా ఊరిలో 55సంవత్సరాలు దాటినవారులో చాలా మంది ఇదే తీసుకుంటున్నారు .)

అసలు ఇదికొన్నప్పుడు నేనే ఎక్కువ సంతోషించాను ఎప్పుడెప్పుడు నేర్చేసుకుందామా అని .నేర్చుకోవడానికి పెద్దగా కష్టపడలేదులే . మావారు వెనకాల కూర్చుని చెబుతుంటే నడిపేసేను . అలా రెండు మూడు రోజులు చేస్తే వచ్చేసింది .కానీ ఒక్కదాన్ని ఎప్పుడూ నడపలేదు .

ఈరోజు మాబాబు, వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది రమ్మన్నారు అనిచెప్పాడు . స్కూలకి వెళ్ళాలని మావారితో అంటే నాకు అర్జంట్ పని వుంది రావడం కుదరదు ,డ్యూరో నేర్చున్నావు కదా వెళ్ళు అన్నారు.

నేర్చుకున్నాను కానీ ఒక్కదాన్ని ఇప్పటివరకూ వెళ్లలేదు,రోడ్ మీద గేదెలుకానీ ,లారీగానీ వస్తేవెళ్ళాలంటే బయం . . తప్పదింక వెళ్ళలికదా ఎలాగో నెమ్మిదిగా వెళ్లొచ్హాద్దామని బయలుదేరాను .

ఒకవైపునుండి డ్రైవింగ్ చేయాలనే నాకోరిక తీరుతుందని ఆనందం ,మరోవైపు నుండి రోడ్ మీద గేదెలు అవి రాకుండా వుంటే బాగుండును అనుకుంటూ ఎలాగో నెమ్మిదిగా స్కూల్ కి వెళ్లాను . (స్కూల్ మా పక్క ఊరిలో ఉంటుంది .2కిలోమీటర్ల దూరం ఉంటుంది .) మీటింగ్ అయిపోయాక అలాగే నెమ్మిదిగా వచ్చేసాను . మొత్తని కి ఎలాగైతే క్షేమంగా వెళ్లి క్షేమంగా వచ్చేసాను .

ఇదండి మా మహేంద్రా డ్యూరో తో నా మొదటిరోజు ప్రయాణం . రాగానే మీతో పంచేసుకున్నాను .

23, ఫిబ్రవరి 2010, మంగళవారం

కన్నీళ్ళు



మానవ ఉద్వేగాలలో "కన్నీరు "ఒకటి.బాగోద్వేగాల కలబోత లో ఎప్పుడో ఒకసారి మనందరమూ కన్నీరు పెట్టుకొన్నవారిమే.


దుఖం ,దిగులు, బాధ,దిగులు,వేదన వంటి సందర్భాలలోనే కాదు ,పట్టలేని సంతోషమొచ్చినా కూడా మన కళ్ళ వెంట నీళ్ళొస్తాయి .(వాటిని మనము ఆనందబాష్పాలంటామని అందరికీ తెలిసిందే.. )


కన్నిళ్ళతో తడిసిన కళ్ళే స్పష్టం గా చూస్తాయంటారు . ఎందుకంటే కన్నీళ్లు స్వచ్చమైనవి.


మా బందువు ఒకాయన ఉన్నారు . ఆయన తల స్నానం చేసేటప్పుడు కళ్ళలో కావాలనే కుంకుడు కాయ రసం పోసుకుంటారు .ఆరసం కళ్ళలో పడితే చాలా మంట పుడుతుంది .కళ్ళు ఎర్రబడి నీళ్ళు కారతాయి.ఆకన్నీళ్ళు కళ్ళకి మంచిదని ఆయనకి చిన్నప్పుడు ఎవరో చెప్పేరంట. ఆయన ఇప్పటికీ అలాగే చేస్తారు.



మాపిల్లలికి తలస్నానం చేయిస్తున్నప్పుడు పొరపాటున కళ్ళలో పడితే, ఏడుస్తున్న వాళ్ళకి ఆయన ని పెద్ద ఉదాహరణగా చెపుతూ ఉంటాము .ఆ తాతగారు చూడండి కళ్ళలో కావలని పోసుకుంటారు కళ్ళకి మంచిదని అంటూ . .పాపం ఏమి చేస్తారు మంటపుట్టినా అలాగే భరిస్తారు ( అసలు విషయము ఒదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయానా )


ఆడవారిలో బావోద్వేగాలు ఎక్కువ .దుఖమొచ్చినా పట్టలేరు , సంతోష మొచ్చినా పట్టలేరు అంటారు .చాలా వరకు ఇది నిజమే కదండి. ఏదైనా తీరని బాధ కలిగినా ,తెలియని దిగులు ఆవరించినా కళ్ళు తొందరగా చెమ్మగిల్లుతాయి .అటువంటప్పుడు మనసారా ఏడవడమే మంచిదని నా ఉద్దేశము .


ఆడవారైనా ,మగవాళ్లైనా తీరని విషాదం కలిగినప్పుడు కన్నీటి తో ఆ భాదను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తే , మనసులో బారం కొద్దిగా ఐనా తగ్గించుకో వచ్చంటారు .


కన్నీళ్ళు పెట్టుకోవడమూ ఒక గొప్ప వరమే .మన లోపల ఆర్ద్రత, ప్రేమ ,దయ ,ఉన్నాయని చెప్పడానికి కన్నీళ్ళే ఉదాహరణ. ఏందుకంటే కన్నీళ్ళు ఆరోగ్యకరమైన ఉద్వేగము .

16, ఫిబ్రవరి 2010, మంగళవారం

లయ అయిపోయింది .




మాటీవీ లో వచ్చే లయ సీరియల్ ఐపోయింది .

నేను పెద్దగా టీవీ సీరియళ్ళు చూడను.కానీ మటీవీలో వచ్చే "లయ" మాత్రం మిస్సవకుండా చూసేదానిని .
గుణ్ణం గంగరాజు నిర్మించిన ఈ సీరియల్ నిజ జీవితాలను ప్రతిభింబించేదిగా ఉండేది . .ఒక దిగువ మధ్య తరగతి వ్యక్తి డాక్టర్ కావడానికి ఎంత కష్టపడ్డాడు ,డాక్టర్ అయ్యాక అతని ప్రవర్తన ఎలా మారింది , మరలా అతను మంచి డాక్టర్ గా మారిన విదానము బాగా తీశారు . పెద్దగా సాగ దీయకుండా తొందరాగానే ముగించేశారు .


దీనిలో ప్రధాన పాత్రలు పోషించిన వాళ్లు ,ఇదివరకు( గుణ్ణం గంగరాజుదే) రాద -మదులో నటించిన కళ్యాణ్ ,మోనిక లు .దానిలోకన్నా లయాలో బాగాచేశారు . ఈసీరియల్ టైటిల్ సాంగ్ కూడా బాగుంటుంది .అసలు సీరియల్ మొదలైన కొత్తలో సాంగ్ చూసేదానిని .తరువాత తరువాత సీరియల్ కూడా చూడడం మొదలుపెట్టాను. పిచ్చి ఏడుపు సీరియల్స్ ,ఆడవిలనిజాల సీరియల్స్ మధ్యలో లయ ఒక్కటే స్పెషల్ గా ఉండేది .


ఆయన తీసిన రాదా-మదు ,అమృతం, అమ్మమ్మ డాట్ కాం ,అన్నీ కూడా ఒక్కోటీ ఒక్కో రకం గా తీశారు .అన్నీ కూడా బాగుండేవి .ముఖ్యం గా అమృతం చాలా హస్యం గా ఉండి బాగుండేది . . అందరూ కాక పోయినా కొందరైనా ఇటువంటివి తీస్తే బాగుండును .


గుణ్ణం గంగరాజు గారు నాలాంటి వారికోసమైనా ఇటువంటి మంచి సీరియళ్ళు మరిన్ని తీయాలనుకొంటున్నాను .

14, ఫిబ్రవరి 2010, ఆదివారం

శివరాత్రి రోజు మా ఊరి గుడి లో జరిగిన సహస్ర జ్యోతిర్లింగార్చన


ఇదే మా శివాలయం .
మాఊరు ఏర్పడిన 50 ఏళ్ళ తరువాత, ఊళ్ళో శివాలయం ఉంటే మంచిదని అనుకొని రెండువేల సంవత్సరములో , ఊరి చివర చెరువు దగ్గర ప్రశాంత మైన వాతావరణం లోకట్టడం ప్రారంభించారు . ఒక సంవత్సరంలో పూర్తైపోయింది .అప్పటినుండి మాహాశివరాత్రి ఉత్సవాలు మా ఊరి శివాలయం లో చాలా బాగా జరుపుకుంటున్నాము.

ఈ శివరాత్రికి సహస్రలింగార్చన పూజా కార్యక్రమము బాగా జరిగింది. రెండుమూడు సంవత్సరాలకు అన్నసంతర్పణ కూడా చేస్తారు.ఈ సంవత్సరం సుమారు 2000 మందికి అన్నసంతర్పణ జరిగింది.