కన్నెపిల్లలు ఎంతగానో ఎదురుచూసే పండుగ ఇది. . కాబోయే భర్త గురించి వారి ఊహలు, ఆశలు నెరవేరాలని కోరుకుంటూ.... నోచుకునే నోము కావడం ఈ పండగలో ప్రత్యేకత." ఆశ్వీయుజ బహుళ తదియ" నాడు అట్లతద్ది పండుగ వస్తుంది. తెలుగింటి ఆడపిల్లలంతా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. చల్లని రాత్రి చేతులకు గోరింతాకు పెట్టుకుని ... దుప్పటి ముసుగుతన్ని నిదురోయిన ఆడపిల్లలు తెల్లవారు జామునే నిదుర లేచి, పండిన గోరింటాకును చూసుకుని మురిసిపోవడం, తక్కువగా పండితే ముసలి మొగుడొస్తాడని వేళాకోళాలాడుకోవడం, పొద్దు పొడిచే లోపలే చద్ది తినడం,ఆడపిల్లలంతా ఒక్కచోటచేరి ఆటలాడటం, ఉయ్యాలలూగడం అన్నీ సరదాలే.
ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తాబవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ, పాటలు పాడుతూ, నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటారు. ఊరిలో వుండే పెద్ద పెద్ద వేప ,మామిడి చెట్లకు ఉయ్యాలలు కట్టి ఉగుతూ... అమ్మాయిలంతా అక్కడచేరి ఆడిపాడతారు.
అన్ని వ్రతాలకి ఉపవాసముండి తరువాత పూజ చేస్తారు .అట్లతద్దికి అలా కాదు ,సూర్యోదయానికి ముందే బోజనం చేసి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి ,పూజ చేసుకుని వాయినాలిస్తారు.నోము చేసుకునే స్త్రీలు ముతైదులకు తలంటు స్నానానికి కుంకుడుకాయలు పంపిస్తారు . పసుపు, కుంకుమలు, రవికలగుడ్డ, తాంబూలంతోపాటుగా పదకొండు అట్లను వాయనంలో ఇస్తారు. పది సంవత్సరాలు ఈ నోమును నోచుకుంటారు. సంవత్సరానికి ఒక ముతైదుకు వాయినం ఇచ్చేవారు కొందరైతే, పదిమందికీ ఒకేసారి ఇచ్చేవారు కొందరు. వాయినం పుచ్చుకున్న అట్లను వారుతప్ప వేరొకరు తినకూడదనే నియమం వుంటుంది.
ఇప్పుడు అట్లతద్ది అంటే అట్లు వేసుకుని తినడమే... . మా చిన్నప్పుడు అమ్మావాళ్ళు పూజలు చేసుకుని వాయినాలు ఇచ్చుకోవడం తెలుసు . కానీ మేమూ .. అట్లతద్ది రోజు ప్రతేకంగా ఏమీ పూజకూడా చేయట్లేదు.మా గోదావరి జిల్లాల వైపు పెళ్ళైన వారం లోపులో తద్ది పూజ చేయిచేయించి , ముత్తైదులకు వాయినాలు ఇప్పిస్తారు. తరువాత నాలుగైదేళ్ళు తద్ది ఉపవాసం ఉండి .... అట్లతద్ది జరుపుకుంటాము .తరువాత అదీ ఉండదు.కాకపొతే అట్లతద్ది రోజు అట్లేసి , బెల్లంచారు కాసి పాలేళ్ళకి,కూలీలకి,చాకలి,మంగలి ఇలా అందరికీ పెడతాము. అదేమాకు అట్లతద్ది పండుగ. ఓపిక గా చేయాలి అనుకునే వాళ్ళు ఇలా అన్నా చేస్తున్నారు . .
ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర వంటి వాటిని తినడం ద్వారా కంటిసమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గోర్లకు ఆరోగ్యం కూడా. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత అని ఇట్టే అర్థం అవుతుంది
పట్నాల సంగతెలా ఉన్నా ,పల్లెల్లో కుడా ఇటువంటి కొన్ని పండుగలు అలా ..అలా ... నెమ్మిదిగా మరుగున పడిపోతాయేమో!.