=''/>
హాబీలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హాబీలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, అక్టోబర్ 2013, బుధవారం

ఈ ఏడు వేసిన కొత్త మొక్కలు

ఈ సంవత్సరం ఎండలు బాగా ఉండి రోజు నీళ్ళు పెడుతూ ఎంత  జాగ్రత్తగా చూసినా చాలా మొక్కలు చని పోయాయి.ప్రతీ ఏడూ  కొత్త మొక్కలేస్తూనే  ఉన్నా ఈ ఏడు ఎక్కువ మొక్కలేసాం. అందులోను మందార మొక్కలు  ఇంకాను .  

వర్షాకాలంలో కడియం నర్సరీ నుండి మొక్కలు తెచ్చి అమ్ముతారు .వాళ్ళ వద్ద కొన్ని కొన్నాం .తెల్ల గన్నేరు ,ఎల్లోబెల్స్,ఇంకా కొన్ని  మొక్కలు కొమ్మలే బ్రతికాయి .అందులో అంజూర్ మొక్క కూడా ఉంది .మందారాలు కూడా రెండు మొక్కలు కొమ్మలే బ్రతికాయి. అలా కొమ్మలు బ్రతికితే  భలే ఆనందగా ఉంటుంది. ఏదైనా కొత్త మొక్క కనిపిస్తే  ,కొమ్మేస్తే  బ్రతుకుద్దేమో అడిగి మొహమాటం లేకుండా తెచ్చేస్తా .

 మారేడు,కదంబం మొక్కలు నర్సరీలో కొన్నవి.



                                                                         తెల్ల గన్నేరు


                                                                       
                                                                        ఎల్లోబెల్స్


















అక్క కొమ్మ పంపితే వేసా .ఈ వర్షాలకి బాగా పెరిగింది .


                                                                 
ఈ మొక్క పేరు తెలీదు.   మా చెల్లి అత్తగారు కాశ్మీరు వెళ్ళినప్పుడు తెచ్చారట.వాళ్ళింటి వద్దనుండి నేతెచ్చా .ఈ  కాశ్మీరు మొక్కని :)  మన వాతావరణాన్ని తట్టుకుని బా పెరిగింది .



                                                          

ఎన్నో ఔషద  గుణాలున్న మారేడు గాలి మంచిది .  పొలంలో చాలా పెద్ద మారేడు మొక్కుంది . దాని మొదలున్న మొక్కలు ఎన్ని సార్లేసినా బ్రతకలేదు .సరే అని ఈ సారి కొని  వేసాం.పెద్దదవుతుందని బయట వేసాం .చుట్టూ కలుపు ఎక్కువుంది  .మొక్కని  బూతద్దంతో చూస్తేనే కానీ కనిపించదు :)







కదంబం మొక్క    చాలా పెద్దగా పెరుగుతుంది . అందుకే  దానికి ఇంట్లో చోటులేదు .పశువులు ,మేకలు స్వాహా చేయకుండా కాస్త బందోబస్తు చేసి పాపం బయట గోడ ప్రక్కన వేయించాం .





  బుల్లిబుల్లి  నేతి బీర కాయలు ! చూడటం ఇదే  మొదటిసారి.మా చెల్లి గుంటూరు జిల్లా నుండి విత్తనాలు  తెచ్చింది .గుత్తి బీర వండటం మొదటిసారి వీటితో ట్రైలేసా  .


                                                                     


ఎప్పటి నుండో ఉసిరి చెట్టు ఇంటివద్ద వేయాలని .ఇప్పటికి కుదిరింది .తొందరగా పెద్దదైపోయి కాయలు కాసేయాలని చూస్తున్నా :)

29, ఏప్రిల్ 2013, సోమవారం

పాపికొండల్లో మా ప్రయాణం (ఫోటోలు)

అటూ ఇటూ ఎత్తైన కొండలు ........ఎక్కడో దూరంగా అక్కడక్కడా కనిపిస్తున్న చిన్న చిన్న పల్లెలు ,అప్పుడప్పుడూ ఎదురవుతున్న జాలర్ల పడవల మధ్య గోదావరిలో  పురుషోత్తపట్నం నుండి పేరంటపల్లి వరకూ  తొమ్మిది గంటల లాంచీ  ప్రయాణం ..... మరచిపోలేని మధుర అనుభవం!

నాలుగేళ్ళ క్రితం ఒకసారి పాపికొండలు  వెళ్లేము .అప్పుడు మా  అమ్మాయి రాలేదు .తను అస్తమాను పాపికొండలు వెళ్దాం అంటుంటే  తన కోసమని  ఈ   మండే ఎండల్లో   ప్రయాణం చేసేము.అసలు పాపికొండలు వెళ్ళాలంటే నవంబర్ నుండి   మార్చి లోపైతే   ప్రయాణం హాయి హాయిగా చల్ల చల్లగా సాగిపోతుంది .

మా ప.గో.జిల్లా నుండి పట్టిసీమ ,పోలవరం ,సింగనాపల్లి నుండి లాంచీలు ఉంటాయి.మాకు పట్టిసీమ దగ్గరే కానీ మార్చి వరకే  పట్టిసీమ నుండి లాంచీలు తిరుగుతాయంటే  రాజమండ్రి వెళ్లి వెళ్లేము.రాజమండ్రి  నుండి  లాంచీలు వెళ్ళవని మాకు అక్కడకి వెళ్ళేవరకు తెలిలేదు.రాజమండ్రి నుండి పురుషోత్త పట్నం గంట కారులో తీసుకెళ్ళి అక్కడ లాంచీ ఎక్కించేరు.

 అది  ఏసీ లాంచీ  ఐనా వెళ్ళింది  ఏసీ లో కూర్చోవడానికి కాదుకదా! అని లాంచీ పైనే  ఉక్కపోతని,మండే ఎండని భరిస్తూ  గోదావరి అందాలను అస్వాదించాము .

ఉదయం పది గంటలకు బయలుదేరిన లాంచీని  మధ్యలో గండి పోసమ్మ గుడి  దగ్గర ఇరవై నిముషాలపాటు  ఆపారు .తిరిగి బయలుదేరిన మేము మధ్యాహ్నం రెండు గంటలకు పేరంటపల్లి వెళ్లేము .

పేరంటపల్లి  అనుభవం మాత్రం ఎప్పటికీ మర్చి పోలేము .

అప్పటి వరకూ  ఎండని భరించలేని మేము ఆ వేడి ,ఉక్కపోత భరించలేక తిట్టుకుంటూ కూర్చున్నాము .అక్కడ  దిగగానే  హోరున వాన కురవడం మొదలైంది. పేరంటపల్లిలో ఒడ్డున పెద్ద చింత చెట్టు వయస్సు చాలా ఉంటుంది .అక్కడ చాలా సినిమాల్లో పాటలు తీస్తారు.అవన్నీ పిల్లలకు  చూపించొచ్చు అనుకుంటే పాడు వానవలన ఏమీ కుదరలేదు.ఎక్కడా పెద్దగా మబ్బుల్లేవు అదే తగ్గిపోతుందనుకుంటే ఇరవై నిమషాలు ఆగకుండా కురిసింది.అలా ఆవర్షం లోనే తడుస్తూ  అక్కుడున్న శివాలయం చూసి ,తిరిగి లాంచీ  ఎక్కుదామని   మళ్ళీ వర్షం లోనే తడుస్తూ తిరిగి వచ్చేము. 

ఎలాగో వర్షంలో తడుస్తూ పరుగులు పెడుతూ వస్తే  ఇక్కడి సీను ఇంకా గొప్పగా ఉంది !

ఎత్తెన గోదారి గట్టు మీద నుండి ఒడ్డున ఉన్న లాంచీ ఎక్కడానికి   అరగంట పట్టింది.అడుగు తీసి అడుగు వేయాలంటే భయం.ఎక్కడ కాలుజారి  గోదారిలోకి జారతమో అని! ఒకరికొకరం సాయం చేసుకుంటూ ఆ బురదలో   పడుతూ ..లేస్తూ ,జారుతూ,దేకుతూ ... వళ్ళంతా ,బట్టల్నిండా  బురద  అంటుకున్నా లెక్కచేయకుండా  ...పిల్లలకు ధైర్యం చెపుతూ ఎలాగో అందరం క్షేమంగా లాంచీ ఎక్కేసేము.

దానిని భయంకరమైన అనుభవం అనాలో  సరదా  అనుభవం అనుకోవాలో .....ఆ  రోజు జరిగిన సంఘటన ని తలుచుకుంటే  ఎంత గండం గడిచింది అనిపిస్తుంది.అంతలోనే  అంత బురదలో జారుకుంటూ  అలా వెళ్ళడం  తమషాగా  ఉందనిపిస్తుంది.ఇంటికొచ్చాక కూడా ఆ సంఘటన ను తలుచుకుని  ,మా తిప్పల్ని గుర్తు తెచ్చుకుని తెగ నవ్వుకున్నాము.ముందు లాంచీ ఎక్కినోళ్ళెవరైనా మనల్ని విడియోకానీ ఫోటో కానీ  తీయల్సిందే! అని మా  పిల్లలు ...


లాంచీ ఎక్కేక కూడా కాసేపు వర్షం పడింది.అందరం  అలా తడిసిన బట్టలతోనే  కూర్చున్నాము . ఎవ్వరిలోనూ వచ్చినప్పటి  ఉత్సాహం  లేదు.అప్పటి వరకూ ఎండ భరించలేక తిట్టుకున్న మేము ఎండ కోసం ఎదురుచుసాం.దేవుడి దయవలన ఎలాగో కాసేపటికి మబ్బులు తొలిగి ఎండొచ్చింది.తడిసి ఉన్న మేము ఈ సారి ఆనందంగా  ఎండలో  కూర్చున్నాము.కాసేపటికి  ఎండ  తగ్గి చలిగాలి మొదలైంది .ఆ చలిలోనే కాసేపుండి  ఒక్కరోజులోనే  ఎండా,వానా,చలీ  మూడూ  చూసేసేం. 

తిరిగి లాంచీ  పురుషోత్తపట్నం వచ్చేటప్పటికి  రాత్రి ఎనమిది ...రాజమండ్రి  వెళ్ళేటప్పటికి  తొమ్మిది ...మా ఊరు చేరేటప్పటికి పదిన్నర .

అలా మా పాపికొండల ప్రయాణం  సరదా సరదా గా ,భయం భయం గా తమాషాగా  జరిగింది.




ఇదే  మా జలశ్రీ లాంచి 



జానికిరముడు,శ్రీరామదాసు  ఇంకా చాలా సినిమాలు  ఈ గుడిలో  తీసారట  















                                        ఇక్కడకూడా ఎదో తవ్వేస్తున్నారు .ఏ కొండలూ ఉంచరేమో!



                                             





























       పాపికొండల మధ్య గోదావరి!!











                    అక్కడ ఉన్న చిన్న గిరిజన పల్లె  పిల్లల ఆట పాటలు













చిన్న చిన్న గుడిసెలు వాటి ముందు వాళ్ళ పడవలు .మన ఇళ్ళ ముందు కార్లు,బైక్ లు  ఉన్నట్టు!





మనిషి ఆకారం లో ఉన్న ఈ కొండ పాపి అనే రాక్షసుని పేరుమీద  ఏర్పడిందని అక్కడివారు అంటారట .


తిరిగి వచ్చేటప్పుడు సూర్యాస్తమయ చిత్రాలు తీయాలని ఎంతగానో అనుకున్నా...కేమెరా చార్జింగ్ అవ్వకుండా ఉండాలని పిల్లల్ని ముట్టుకోనివ్వలేదు . బాగా మబ్బులు ఉండటంతో  తీయలేకపోయా :((   వీటితోనే సరిపెట్టుకున్నా.

3, ఏప్రిల్ 2013, బుధవారం

అంచులే ఇప్పుడు చీరలకి ఫాషన్! (నేను కుట్టిన చీరలు)


సిల్కు చీర కొన్నా ,పట్టు చీరైనా,ఆఖరికి కాటన్ చీరైనా మధ్యలో ఖాళీగా ఉందనో ..అందంగా ఉంటుందనో వాటి మీద జరీ వర్క్,పానీ వర్క్ ,కాంతా వర్క్ ,జర్దోసి వర్క్ ఇలా ఏదోక వర్కు చేయించడమో ,కుట్టడం వచ్చిన వాళ్ళు  కుట్టుకోవడమో చేసేవారు. ఇప్పుడు అలా చీరలకి  వర్కు చేయించడము,చేయడము తగ్గింది .

 ఏ చీరకు చూసినా కుట్టిన బోర్డర్ లే   ఉంటున్నాయి. ఉప్పాడ చీరలు ,నెట్ చీరలకి  అంచులు,పాటర్న్  బ్లౌజ్ లు ఇప్పటి ట్రెండ్ .

రెండేళ్ళ నుండీ చెయ్యట్లేదు కానీ , నేను వర్కులు చాలా బాగా చేసేదానిని .ఏది కొత్తగా వస్తే అది వదల కుండా కుట్టే దాన్ని .కుట్లు కుట్టక పోయినా టైలరింగ్ మానలేదు.ఆ ఇంటరెస్ట్ తోనే  ఈ మధ్య చీరలకి బోర్డర్ లు కుట్టుకోవడం మొదలు పెట్టా .ఇప్పుడు అందరూ బోర్డర్ కుట్టిన చీరలు  బాగా వాడటం వలన  మాకు రాజమండ్రి లోకూడా   అన్ని రకాల బోర్డర్లు  బాగానే దొరుకుతున్నాయి .

అంచులు కొత్తచీరలకే  కాదు  , పాత చీరలు (పాతవంటే  మరీ  ఎప్పటివో కాదు .బోర్డర్ వేస్తే  బాగుండేవి) కొత్త లుక్ రావడానికి  వాటికి కూడా కుట్టొచ్చు.పాత వాటికి కుట్టే టప్పుడు పల్లు లేనివి ,బుటా లున్నవి ఐతే బాగుంటాయి.ఈ ఫోటోలలో ఉన్నవన్నీ పాతచీరలపై చేసినవే .






                                        పెద్ద అంచుకి పైనా ,క్రిందా గోటులా ఉన్న లేసు అతికి కుట్టా





                                 ఇదికూడాఅంతే  పచ్చ అంచులు  బోర్డర్ కి  కలిపి కుట్టినవి


కాస్త ఓపిక ,సమయం ఉంటే ఈ బోర్డర్లుతో మనమే  చీరలు డిజైన్ చేసుకోవచ్చు.హైదరాబాదు లో ఉండేవాళ్లకి  అమీర్ పేట  నర్సింగ్ షాప్లో చీరలకి మంచి క్లాత్ దొరుకుతుందని , బోర్డర్లు,లేసులు, చీర అంచులకి వాడే మెటిరియల్  అంతా  చార్మినార్ లోహోల్ సేల్ షాప్ లలో కొంచెం తక్కువకే వస్తాయని  మా కజిన్ అంది . ఒక్కో బోర్డర్ కుట్టడానికి  రెండొందలు నుండి నాల్గొందలు  వరకూ  మనం ఇచ్చే బోర్డర్ను బట్టి ఉంటుందట.


ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి .బొటిక్స్, షాప్స్ లో ,అలాగే పేస్ బుక్ లో డిజైనర్ల ఇలా అంచులు వేసిన చీరలు పరిశీలనగా చూస్తే మనకే బోల్డ్ ఐడియాలు వచ్చేస్తాయి. మనం  కుట్టించుకుంటే  కాస్త తక్కువకే వస్తాయి.కాక పొతే మంచి టైలర్ని వెతుక్కోవాలి,కాస్త కష్టపడాలి . మొదటి సారి కాస్త  కొత్తగా ఉంటుంది .అలవాటైతే మన చీరలకి మనమే డిజైనర్ల మవొచ్చు.



27, ఆగస్టు 2012, సోమవారం

ఫొటోషాప్ తో నా ప్రయోగాలు




ఏమీ  తోచక ఈ మధ్య ఫొటొషాప్  మీద పడ్డాను.

అస్తమాను ఏంకెలుకుతాలే....  యూట్యూబ్ లో వీడియో చూసి   ఏమనా నేర్చుకోవచ్చేమో అనుకుంటే...  నెట్ కనెక్ట్ ఐతే కరెంట్ పోవడం ,కరెంట్ ఉంటే నెట్ కనెక్ట్ కాకపోవడం .మాకు ఈమధ్య  నెట్  సరిగ్గా కనక్ట్ అవ్వడం లేదు.  ఒకవేళ కనక్టైనా     చాలా స్లో ....ఎన్ని కంప్లైంట్లిచ్చినా అంతే.. ఏమన్నా అంటే మీకు కనెక్షన్ ఇవ్వక ముందే చెప్పాము మీ ఊరికి వచ్చే కేబుల్స్ సరిగా లేవని  అంటారు.  

  ఎప్పుడన్నా మామీద  కరెంటూ ,నెట్టూ రెండూ కలిపి  దయ  చూపితే  మాకు పండగన్నమాట.

అలా క్రితం వారం  రెండూ కరుణించినప్పుడు  యూట్యూబ్ లో  ఫొటోబాగ్రౌండ్ మార్చడం గురించి  వీడియో  దొరికింది. దానిని ఒక   వంద సార్లు చూసి చూసీ అరగ్గొట్టి    ఫొటోబాగ్రౌండ్ మార్చడం నేర్చేసుకున్నా!!



                  






నేను మిక్స్ చేసిన ఫొటోలు ...





  
 కొద్ది కొద్దిగా    తేడాలున్నాయికానీ  ,పరవాలేదనుకుంటున్నాను. ఇంకా బాగారావడానికి ట్రై చేస్తున్నాను.        

8, అక్టోబర్ 2010, శుక్రవారం

హమ్మయ్య బ్లౌజ్ మీద వర్కు చేయడం ఎలాగో పూర్తిచేసేసా ..



రెండు నెలల నుండి ఈ జాకిట్టుకి వర్కు చేస్తున్నాను.ఈ మధ్య కొంచెం బద్ధకం ఎక్కువైంది లెండి .ఎవరికైనా చీరల మీద వర్క్ చేయడానికి రెండుమూడు నెలలు టైం తీసుకుంటారు .మరి నాకు బ్లౌజ్ మీద వర్కు చేయడానికి ఇంత టైంపట్టింది.



ఇది మెడ డిజైన్.మెడ అంచుకి అవుట్ లైన్, జరీ దారంతో గొలుసు కుట్టు కుట్టి .... డైమండ్స్ కూడా జరీ దారం తో గొలుసు కుట్టు కుట్టాను.మధ్య లో పచ్చ దారంతో ముడులు వేసాను. అలాగే పువ్వులుకుడా జరీ దారంతో కుట్టి మధ్యలో గోల్డ్ పూసలు కుట్టాను .

ఇక మధ్యలో ఖాలీ అంతా గొలుసు కుట్టుతో దగ్గరగా కుట్టి మొత్తం నింపేసా ...అలా గొలుసు కుట్టుతో నింప డాన్ని పానీ వర్క్ అంటారు.



చేతులకి ఇలా అంచు కుట్టి పైన పువ్వులు, బుటా వేసాను.


హమ్మయ్య ఎలాగో పిల్లలకి సెలవలు వచ్చేటప్పటికి పూర్తిచేసేను.వాళ్ళు ఇంటివద్ద ఉంటే అసలు కుట్టడం అవ్వదు.

మొత్తం డిజైన్, కుట్టు ఐడియా అంతా నాదే . ముందు మెడకే కుడదామని మొదలు పెట్టాను కానీ మెడ వర్కు అయ్యాక ,నా చేతుల దురద ఇంకా తీరక అలా ... అలా .. ఇలా కుట్టేసాను. చాలా తొందరగా రెండు నెలలలోనే పూర్తి చేసేసేను కదా .... -:)

ఎలాఉందంటారు?వర్కు ,డిజైను ...