=''/>

24, మార్చి 2010, బుధవారం

అమ్మకు శుభాకాంక్షలు.


"బగవంతుడు అందరి కీ ఇచ్చిన గొప్పవరం "అమ్మ "
"అమ్మ" ఎంత తియ్యనైన పదం .
మన పూర్వీకులు "మాతృదేవోభవ " అని తొలి నమస్కారం "అమ్మ"కే కేటాయించారు .తొలి స్థానం "అమ్మ"కే ఇచ్చారు .

ప్రకృతి లో మూగజీవాలు కూడా "అమ్మ"ని గుర్తిస్తాయి. ఆప్రేమని అందుకుంటాయి .

"అమ్మ "మాట వినగానే ప్రేమతో, కృతజ్ఞతతో,తన్మయంతో ,ఆనందంతో ,అప్యాయతతో మన హృదయం రాగ రంగితమౌతుంది .


ఆరోజులలో తిధుల ప్రకారం పుట్టినరోజు గుర్తు పెట్టుకునేవారు . మా "అమ్మ "శ్రీ రామ నవమి నాడు పుట్టింది .
"శ్రీ రామనవమి "రోజున పుట్టిందని తనకి " సీతారాం "అని వాళ్ళ అమ్మమ్మ పేరు పెట్టిందంట.
ఈ రోజు మా' అమ్మ 'పుట్టినరోజు .
ఈ సందర్భం గా నా బ్లాగ్ ద్వారా " అమ్మ "కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను .
అన్దరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

22, మార్చి 2010, సోమవారం

ఒకే ఒక్క గంట విద్యుత్ ఆదా

మార్చ్ 27 న రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకూ ప్రపంచములో అందరూ విద్యుత్ వినియోగించ కుండా ఉండి ,పర్యావరణాన్ని కాపాడాలని "వరల్డ్ ఎర్త్ అవర్ "వాళ్లు విజ్ఞప్తి చేస్తున్నారు. వారి ప్రచారకర్త గా స్మాల్ బి "అభిషేక్ బచ్చన్ " దీనిని ప్రచారం చేస్తున్నారు.


27 వ తేదీన ఆఒక్క గంటా ఏ విధం గానూ విద్యుత్ వినియోగం జరగకుండా అమలయ్యేలా ప్రతీఒక్కరూ ఎస్.ఎం.ఎస్ లు, ఈ మెయిళ్ళు, ఇంకా ఇతర సందేశాల ద్వారా విజ్ఞాపనలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా , చాలా విద్యుత్ అదా అవడమే కాకుండా ,పర్యావరణాన్ని పరిరక్షించిన వారవుతారు .


మార్చ్ 27 వ తేదిన ఒకే ఒక్క గంట విద్యుత్ వాడకుండా ఉండి మీరుకూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారుకదా.

19, మార్చి 2010, శుక్రవారం

కోకిలమ్మ కుహూ కుహూ రాగాలు

వసంతకాలం వచ్చింది కదా ,రొజూ మా ఇంట్లో చెట్ల మీదకి కోయిలలు చేరి చక్కగా మాకు వాటి రాగాలను వినిపిస్తున్నాయి .వాటికి జతగా మా బాబుకూడా తన గొంతు కలుపుతూ ఉంటాడు .

ఆ కుహు కుహు రాగాలను రొజూ వింటుంటే ..... నేను కూడా కవితలు రాయగలిగితే బాగుండును అనిపిస్తూ ఉంటుంది .నేనా ..కవితలా అని ఒకనిమిషం అనిపించింది కానీ , కవిత కాకపోయినా కనీసం ఓ తవికైనా రాయలేనా అని కవితో ..తవికో రాసేసి నేను కూడా ఓ కవయిత్రిననిపించుకుందామనిఒక "శుబోదయం"లో గట్టి నిర్ణయం తీసేసుకున్నాను . ఎలాగో ఒకపూటంతా అలోచించీ... చించీ రాసేసాను .

మరీ మరువం ,నిషిగంద బ్లాగు లలో కవితలలా కాకపోయినా ఒక మోస్తరు " తవికలా" అయినా రాయగాలిగేనని తుత్తిపడ్డాను . మరి చదివి మీరే చెప్పండి ఎలాగుందో .


వసంతఋతువాగమనంతో

ఆకులు రాల్చి బోసిపోయిన

చెట్లన్నీ చిగురించగా ..

తూరుపున పసిడివెలుగుల

లేతభానుని నులివెచ్చని

కిరిణాలు మాఊరిపై ప్రసరించగా ...

ఆనందంతో వినిపించెను

కుహు..కుహూ..రాగాలను

మాపెరటి గున్నమావి చెట్టుపై నున్న కోకిలమ్మ .

దాని తియ్యని రాగాలే...

మాకు ప్రతీదినమూ .. ..

సుప్రభాతపు మేలుకొలుపులు .
మా కోయిలమ్మ రాగాలు కూడా వినండి .చివరలో కాకి కూడా
Record003
Record003.amr
Hosted by eSnips

నాకు ప్లేయర్ లో ఎలా పెట్టాలో తెలియలేదు .కాస్తచెప్పండి.

17, మార్చి 2010, బుధవారం

వసంతరాగం .

నాకు కవితలు చదివి ఆనందించడమేకానీ రాసే అంత పాండిత్యంలేదు .ఈకవిత ముప్పై సంవత్సరాల
క్రిందటిది.రాసినామె పేరు దుర్గ . మా అత్తయ్య అప్పటి వీక్లీలలో వచ్చే చాలా సీరియళ్ళను బైండింగ్
చేయించింది. ఒకదానిలో ఈకవిత చదివి బాగుందని దాచాను. మీఅందరికోసం ఈకవితలో కొద్దిగా
మార్పులు చేసి అందిస్తున్నాను .
గడచినవత్సరపు ప్రౌడ...

లేత వన్నెల చీర

గోరంచుల రాపిడితో ....

గతపులోగిలి గడపదాటి

మల్లె సుగంధాలతో అడుగిడింది...

నవ యౌవ్వన జవ్వని

జిలుగు వెలుగుల సోయగాల


"నవయుగాది"

"నేనులేని సందడి ఎక్కడిదని" ని

గారాలు పోతుంది కోయిలమ్మ .

"ఈ సంబరాలెందుకా" అని...

కొండదారి మలుపులో

క్షణమాగి చూస్తుంది చిట్టేరు.

భవితవ్యంలోకి ....

సందేహంగా చూస్తున్న కనులకు

సమాదానమిస్తున్నాయి...

లేలేత చిగురుల కొమ్మలు .

ఈ వసంతాగమన శుభవేళ ...

నిశ్శబ్ద స్వాగతగీతిని ఆలపించడానికి

ప్రకృతి శృతులు సరిచూసుకుంటున్నది .

************************************

15, మార్చి 2010, సోమవారం

ఉగాది శుభాకాంక్షలు .యుగాది సంస్కృత రూపానికి తెలుగు రూపమే "ఉగాది".అంటే యుగానికి ఆరంభం అని అర్ధం .
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున శ్రీకృష్ణ నిర్వాణం తో ద్వాపర యుగం అంతమైంది,కలియుగం ఆరంభమైంది.


ఎప్పుడైతే యుగారంభం అయిందో అప్పుడే సంవత్సరానికి ఆది కాబట్టి "సంవత్సరాది" గా పరిగణించారు. వేద కాలం నుంచీ యుగాది పండుగ జరుపుకునే అచారమున్నట్టు శాస్త్రాలను బట్టి తెలుస్తుంది.


ఉగాది రోజున ఉదయమే లేచి,తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి,ఉగాది పచ్చడి తిన్న తరువాతే మిగిలినపనులు చేయాలి .

తీపి,పులుపు,చేదు, ఉప్పు కలగలిపిన ఈ ఉగాదిపచ్చడికి ఎంతో ఔషధ విలువ ఉన్న విషయం అందరికీ తెలిసిందే .

ఈ నూతన సంవత్సరం లో అందరూ సుఖ సంతోషాలతో ఆనందం గా ఉండాలని కోరుకుంటూ

వికృతి నామ సంవత్సరాది శుభాకాంక్షలు.

11, మార్చి 2010, గురువారం

ఏ దివిలో విరిసిన పారిజాతమో...

ఏ దివిలో విరిసిన పారిజాతమో...
1973లో వచ్చిన కన్నెవయిస్సు సినిమాలోది ఈపాట. చిన్నప్పుడు రేడియోలో ఈ పాట వస్తుంటే అలా వింటూ ఉండిపోయేదాన్ని.ఇప్పుడైనా టీ.వీ లోవస్తే పాట అయ్యేవరకూ(అస్తమానూ వినే పాటైనాసరే) ఎవరినీ చానల్ మార్చనివ్వను అంతిష్టమీపాటంటే.

బాలూ పాడిన ఈపాటకి ,
దాశరధిగారు సాహిత్యం సమకూర్చారు .
సంగీతం సత్యం.

ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో
నామదిలో నీవై నిండిపోయెనే ..

ఏదివిలో విరిసిన పారిజాతమో.. ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో ...

నీరూపమె దివ్య దీప మై నీనవ్వులె నవ్య తారలై నాకన్నుల వెన్నెల కాంతి నింపెనే ...
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో..

పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే ..
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...

పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే ..

నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...

కాలి అందియలు గల్లుగల్లుమన
కాలి అందియలు గల్లుగల్లుమన రాజహంసలారావే..

ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...నామదిలో నీవై నిండిపోయెనే..
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...

నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపినదినీవే..
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే..

నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపిందినదీవే..
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే..

పదముపదములో మధువులూరగా ... పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే...

ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో... నామదిలో నీవై నిండిపోయెనే ..
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...


***********

6, మార్చి 2010, శనివారం

ఒక మాయ చూద్దామని వెళ్లి ఇంకో మాయ చూసాము .

అన్ని పల్లెటూర్ల లాగానే మాఊర్లో కూడా సినిమహాలు లేదు.ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలంటే, (ఎక్కువగా మాపాప హస్టల్ నండి వచ్చినపుడు వెల్తూవుంటాము .) మాకు దగ్గరలో దేవరపల్లి అనే చిన్న టౌనుకాని టౌన్ కి వెలుతూవుంటాము. మా చుట్టుప్రక్కల చాలా ఊళ్లకు సినిమా చూడాలంటే అదే దిక్కు . అక్కడ ఉన్నవి మూడు దియేటర్లే కానీ ,అప్పుడప్పుడూ కొత్త సినిమాలు రిలీజ్ చేస్తూంటారు .

నిన్న సాయంత్రం మాకజిన్ వచ్చి "ఎమాయ చేసావె"కి వెళ్తున్నాము వస్తారా అంది .అబ్బా ఈసినిమాఇక్కడకూడా రిలీజైందేమిటి అనుకుని కొత్త సినిమా కదా ,అదీ అందరూబాగుందంటున్నారని వస్తామని చెప్పేసేను. మాబాబు తో హొంవర్క్ చేయించేసి ,సినిమాకి బయలుదేరిపోయాము(సెకండ్ షోకి ) .

కారులో వెళ్తూ ఆసినిమా గురించి,టీ.వీ లోవచ్చిన ప్రొమోస్,హీరోఇన్ ,పాటలూ ఇలా అన్నింటి గురించీ చెప్పుకున్నామేమో మంచి ఎక్సైటింగ్ గా దియెటర్ కి వెళ్లేము .

చూస్తే అక్కడ కలర్ మాయా బజార్ సినిమాఅడుతుంది . ఒకవేళ మేము వేరే హాలుకి వచ్చామేమో అని మిగిలిన రెండు దియేటర్లకి వెళ్లేముకానీ అక్కడా లేదు .అవేమో ఇంకా పాతవి ,ప్లాప్ సినిమాలు .ఇక చూడాలి మా ఫేసులు . సెకండ్ షో ఐనా పరవాలేదు ,కొత్త సినిమా కాదా అనివస్తే ఇలా ఐందేమిటి అనుకున్నాము. ఎలాగూ వచ్చాముకదా ఏదో ఒక మాయ , ఈమాయా బజారైనా చూసి వెల్దామని దానికెళ్ళాము .హాల్లో మాతో కలిపి ఓ ఇరవై మంది
ఉంటారేమో అంతే .అసలే సెకండ్ షో ,ఇలాంటి సెంటర్ లలో ఇటువంటి సినిమాలు పెద్దగా ఆడవు .అందుకే ఆ రోజే ఆసినిమా వచ్చినా ప్రేక్షకులు అలా వచ్చారు .

మాయా బజార్ చాలాసార్లు చూసిందే కదా అని పెద్ద ఇంట్రెస్ట్ లేదు.ఏదో అలా చూస్తూ ఉన్నాము . కలర్ లో సావిత్రిని చూసేటప్పటికి మాకు చాలా ఉత్సాహమొచ్చింది .ఎన్.టి.ఆర్ ,అక్కినేని వీళ్ళిద్దరూ మాములుగా కలర్ సినిమాలలో చుసిందానికన్నా కూడా ఈసినిమాలో చాలా బాగున్నారు . సినిమా చూసిందైనా ఆ సెట్టింగులూ ,నగలూ ,డ్రస్లూ అలా కలర్ లో చూస్తూంటే టైమే తెలియలేదు . చూపులుకలసిన శుభవేళ పాట లో ప్రింట్ సరిగ్గా లేదు అనిపించిందికానీ ,సినిమా మాత్రం కలర్లో బ్రహ్మాండంగా ఉంది . ఇక మాబాబైతే చాలాసేపు నిద్రపొయాడు కానీ ఘటోత్కజుడు వచ్చేక లేపితే మిగిలిన సినిమా అంతా నిద్రపోకుండా చూసేసాడు. వాడికి కూడా నచ్చేసింది .

ఇంతకీ మా కజిన్, వాళ్ళ కూలీలు సినిమా వచ్చిందని చెబితే వినడమే కానీ వేరే ఎవరినీ అడగలేదంట.అడగకుండా ,
కొత్త సినిమాకి మా అందరినీ తెసుకెల్దామని ప్లాన్ చేసేసింది .అదేమో ఇలా బెడిసికొట్టిందని ఫీలైన తనకి కూడా మాయా బజార్ బాగానే నచ్చేసింది .

ఈ సినిమా రిలీజైనప్పుడు టీ.వీ లో వచ్చిన యాడ్స్ ,ఇంటర్యూ లూ చూసి డీవీడీ వచ్చేక చుద్దాములే అనుకున్నాను కానీ ఇలా దియేటర్ లో చూస్తేనే చాలా బాగుంది .

అనుకున్నదొకటి ఐందొక్కటి కానీ మాయా బజార్ కేమిటండి "మాంచి బంగారం లాంటి సినిమా".