=''/>

28, ఆగస్టు 2013, బుధవారం

మా సేంద్రీయ వ్యవసాయం ....ముడిబియ్యం (బ్రౌన్ రైస్)

ఇప్పుడిప్పుడే (నాలుగేళ్ల నుండి )మా వాళ్ళు సేంద్రీయ పద్దతిలో గోమయం తో , ఎటువంటి ఎరువులూ ,పురుగుమందులూ వాడకుండా వరి వ్యవసాయం చేయడం  అలవాటు చేసుకుంటున్నారు.

మొదట్లో వర్మికంపోస్ట్  ట్రై చేసారు అది కుదరలేదు .సుభాష్ పాలేకర్  ఉపన్యాసాలు,పుస్తకాలు చూసి ఎలాగూ ఆవులు ఉన్నాయి  కదా గోమయంతో చేద్దామనుకుని మొదలు పెట్టారు .  ఆవు మూత్రం ,పేడ ,కొద్దిగా బెల్లం ,ఇసుక అన్నీ ఒక డ్రం లో కలిపి వారం రోజులు మురగ బెట్టి చేలో నీటితో పాటు వదిలేస్తున్నారట. కొత్తలో ఇలా చేయడం కాస్త కష్టంగా అనిపించింది కానీ ఇప్పుడు పరవాలేదు .

అలాగని మొత్తం వరి చేనంతా  కాదు.మాకు తినడానికి సరిపడా చేస్తున్నారు.మిగిలింది  మాములుగానే .అంతా అలానే చేయొచ్చుగా అంటే , ఈ పద్దతికి బాగా అలవాటుపడ్డాక మొత్తం సంగతి చూద్దాం అంటారు.

 సేంద్రియ పద్దితిలో పండించినా ,ఎన్నో ఏళ్ల నుండి ఎరువులు వాడటం వలన వాటితాలుకు ప్రభావం మెదటి రెండేళ్ళు  వచ్చిన ధాన్యంపై ఉంటుంది . తరువాతనుండి ఎటువంటి రసాయనాలు  తగలకుండా  స్వచ్చంగా పొందుతున్నాం ..                        
                                                 పై పొట్టు మాత్రమే ఒలిపించిన  ముడిబియ్యం 

ఇప్పుడు  చాలా మంది ఆరోగ్యానికి మంచిదని ముడిబియ్యాన్ని వాడుతున్నారు.

అసలు మా అందరికీ ముడిబియ్యాన్ని అలవాటు చేసింది మా మావయ్య (అమ్మ తమ్ముడు ) .తను ముందు మొదలు పెట్టాడు.బియ్యం మిల్లుకు వెళ్లి  ఎలా ఆడాలో దగ్గరుండి వాళ్లకు వివరంగా చెప్పి  చేయించుకున్నాడు.మిల్లులో మొదట వడ్లు వేయగానే పైపొర మాత్రమే పోతుందట .అప్పుడే  ఆపేస్తే  ఇలా అచ్చంగా ముడి బియ్యం వస్తుంది.

మామూలు  బియ్యాన్ని చూసిన  కళ్ళతో ముడిబియ్యాన్ని చూస్తే ముతక బియ్యం లా అనిపిస్తుంది.   ఈ బియ్యంతో అన్నం వండటానికి (తినటానికి)తలక్రిందులు పడేవాళ్ళము కొత్తల్లో .. .  తెల్ల బియ్యం కన్నా ఎక్కువ నీళ్ళు పడతాయి .ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది.మామూలు కుక్కర్ల  కన్నా  కరెంట్ రైస్ కుక్కర్లు బాగుంటాయి ముడిబియ్యం వండటానికి. 

ఈ అన్నం తినడానికి పెద్దవాళ్ళం తొందరగానే అలవాటు పడ్డాము కానీ మా సాయి మాత్రం మంచి కూరలు వండినప్పుడు కూడా ఈ అన్నమేనా అని సణుక్కుంటూ తింటాడు .(మంచి కూరలంటే  తెలుసుగా :) )వాడు హాస్టల్ నుండి వచ్చినప్పుడు వాడికి మాత్రమే ఎప్పుడన్నా   తెల్లన్నం వండుతాము .ఎప్పుడూ  ముడిబియ్యమే వాడతాము.దీనికి అలవాటు పడ్డాక తెల్లన్నం  రుచీ పచీ  లేనట్టు అనిపిస్తుంది.20, ఆగస్టు 2013, మంగళవారం

మా ఊరి శ్రావణ పౌర్ణమి చంద్రుడు తో సహా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

గమనిక ...ఇదివరకు రాసిన పోస్టే ఇది . 
నా శుభాకాంక్షలు చెప్పడానికి మళ్ళి ఇదే పోస్ట్ చేసా ..
ఈ రోజు శ్రావణ పౌర్ణమి .ఈ రోజు అన్నా,చెల్లుళ్ళు ఎంతో ఆనందం గా రాఖీ పండుగను జరుపుకుంటారు .

కానీ ,నాకు చిన్నప్పుడు రాఖీ పండుగ వస్తే కాస్త విచారం గా ఉండేది .ఎందుకంటే మేము నలుగురుమూ అమ్మాయిలమే . అందరూ చక్కగా వాళ్ళన్నలకు ,తమ్మూలకూ ఎలా రాఖీ కట్టేము, అన్నయ్య ఏమి గిఫ్ట్ ఇచ్చాడు ,ఇలా అన్నీ చెబుతూ ఉంటే ,నాకూ ఒక "అన్న "కానీ "తమ్ము" కానీ ఉంటే చక్కగా నేనూ రాఖీ కట్టేదాన్నికదా అనుకునేదాన్ని.అందులోనూ నాకు తమ్ముడంటే ఇంకా ఇష్టం . చక్కగా అక్కా ,అక్కా అంటూ తిరుగుతారు అని ,ఇంకా ఏవో చాలా అనుకునేదానిని . ఇప్పుడూ కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది .ఆ ఫీలింగ్ గుర్తు చేస్తూ రాఖీ పండుగ వచ్చేసింది .

అన్నలున్న చెల్లాయిలకు, తమ్ముళ్ళు న్న అక్కయ్యలకు .........

                   "రాఖీ శుభాకాంక్షలు "13, ఆగస్టు 2013, మంగళవారం

తాటి కాయలు - తాటి రొట్టె

ఈ రోజుల్లో తాటి  చెట్ల క్రింద  ఎక్కడ చూసినా తాటి పళ్ళు రాలి పడుంటాయి.  


మా పొలాల్లో  ఐతే అవలా రాలి పోయి పోవాలి లేదా పాలేళ్ళన్నా పట్టుకుపోవాలి  కానీ ఎప్పుడూ పెద్ద శ్రద్ద  ఇంటికి తీసుకురారు . మేం చెప్పగా చెప్పగా తెస్తారు. 

మొన్న మా  సాయి , చరణ్ (చెల్లి కొడుకు) పొలం వెళ్ళినప్పుడు తాటి చెట్ల క్రింద అలా రాలి పడిన తాటి పళ్ళను చూసి వాసన బాగుంది  ,కాయలు కూడా బాగున్నాయి ,ఏమి చేస్తారు వీటితో అని మా నాన్నగారిని  యక్ష ప్రశ్నలన్నీ వేసారట.  పిల్లలు ఇంటికి వస్తూ వాటిని కూడా ఇంటికి తెచ్చారు .

మా చిన్నప్పుడు  జేజమ్మ  తాటి పళ్ళను   కుంపట్లో   కాల్చి ఇచ్చేది.కాయంతా కుంపట్లో పెట్టి ,గుండ్రంగా కాలేవరకు తిప్పుతూ కాల్చేది.బాగా కాలిపోయాక  పైతొక్క తీసేసి  లోన టెంకకున్న గుంజు కోసం  పీచును పళ్ళతో పీకుతూ తింటుంటే భలే తమాషాగా ఉండేది . రుచైతే  ఇక చెప్పక్కర్లేదు.అమ్మ  తాటి రొట్టె ఎక్కువగా చేసేది. 
పిల్లలు  తెచ్చినందుకైనా  వాటితో  ఏదోకటి చెయ్యాలని కుంపట్లో కాల్చడమైతే కుదురుతుందో లేదో అని  నేనూ ,చెల్లీ  తాటి రొట్టె  చేయాలని డిసైడయ్యాం .
కానీ ఆ కాయలనుండి  గుజ్జు తియ్యడం పెద్ద పని.గుజ్జు తీసాక దానిలో సరిపడా వరి నూక ,కాస్త వరి పిండి ,కొద్దిగా బెల్లం కలిపి నాలుగైదు గంటలు నాన బెట్టుకుని ,చిన్న మంటపై  మూకుడులో  రొట్టెల్లా  వేసేం   .


ఇదే మొదటిసారి నేను (మేం)  తాటి రొట్టె చేయడం .ఎవరి సలహాలు,సూచనలు లేకుండా అమ్మ ఎలా చేసేదో గుర్తుతెచ్చుకుని చేసేం . .అమ్మ చేసినట్టే వుంది రుచి అని నాన్నగారి మెచ్చుకోలుతో చాలా సంతోషం.మొదటి సారైనా  బాగా వచ్చిందని రుచి చూడమని   అందరికి తలోముక్క పంపేసేం .. 


ఇంతకీ ఇంటికి తాటి పళ్ళు మోసుకొచ్చిన పిల్లలకి మాత్రం  పెద్ద నచ్చలేదట .పైగా వాసన చాలా బాగుంది కానీ తినడానికి అంత బాగోలేదని కామెంట్లు!మరి చూడటానికి ఎలా ఉంది ??

1, ఆగస్టు 2013, గురువారం

ఎలాగైతే ఈ పిల్లల్ని పట్టేసా!!


 అసలు సెలవలు ఎందుకో కూడా తెలవదు ఈ పిల్లలకి .మొన్నటి వరకూ ఎలక్షన్ సెలవలు .ఇప్పుడు బంద్ వల్ల సెలవలు .

వీళ్ళు  హాయిగా  రోడ్లమీద సైకిల్ పందాలు ,  టైర్లతో పరుగు పందాలు పెట్టుకుంటూ , అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారు.

 పిల్లలు అలా టైర్ల తో పరుగులు పెడుతూ ఆడుకుంటుంటే   చూడడం చాలా ఇష్టం నాకు.వాళ్ళని ఫోటో తీయడానికి చాలా సార్లు ట్రై చేశా కానీ  ,వాళ్ళని చూసి లోనికెళ్ళి  కెమేరా తెచ్చేటప్పటికి   వెళ్లిపోయేవాళ్ళు.

 ఈ రోజు వాళ్ళు మా ఇంటి దగ్గరలో  ఆడుకోవడం చూసి  ఎలాగైతే వాళ్ళని నా కెమేరాతో పట్టేసా ...మీ ముందు పెట్టేసా..