వ్యవసాయ పనులకు వచ్చే కూలీల రేట్లు పెరిగాయి. ఎరువులు ,పురుగుమందుల రేట్లు పెరిగిపోయాయి. ఇవన్నీ చాలవన్నట్టు అడపా దడపా ప్రకృతి వైపరిత్యాలు పలకరిస్తుంటాయి. ఐనా ఎంతో శ్రమ పడి అన్నింటినీ తట్టుకుని పంట పండిస్తే గిట్టుబాటు ధర రాదు. కష్టమైనా నష్టమైనా రైతు వ్యవసాయం చేయక మానడు..
మా వైపు ఇప్పుడిప్పుడే యంత్రాల సహాయంతోవ్యవసాయం చేయడానికి అలవాటుపడుతున్నారు.
నాలుగేళ్ల నుండి వరిచేను కోతలకు చాలామంది కోత మిషన్ ను ఉపయోగిస్తున్నారు.
మాకు ఇప్పుడు దాళ్వా పంటకి వరి నాటే యంత్రం ఉపయోగించి వరిచేలు ఊడుస్తున్నారు(వరి నాటడాన్ని ఉడ్పుఅంటారు ).
పన్నెండు మంది కూలీలు రోజుకి ఒక ఎకరం ఊడుస్తారు.వాళ్ళు సరిగ్గా టైం కి వచ్చి బాగా చేస్తే ఇంకో అరెకరం ఎక్కువ అవుతుంది అంతే .పైగా వాళ్ళని ట్రాక్టర్ పై తీసుకెళ్ళడం ,తీసుకురావడం ఓ పని .
వరి నాటే యంత్రమైతే రోజుకి నాలుగెకరాలు ఊడుస్తుంది.ఎప్పుడూ కట్టేలాగా నారుమళ్ళు కట్టక్కర్లేదు .వాళ్ళే ట్రే లలో మట్టి నింపి విత్తనాలు వేసి కొంచెం మొలకలోచ్చేక మనకి అందజేస్తారు.. అవి పెరిగేక వాళ్ళే మిషన్తో వచ్చి ఉడ్చేస్తారు..వాళ్ళ మనుషులు ముగ్గురుంటారు .అంతా వాళ్ళే చూసుకుంటారు.మాములుగా కూలీలతో ఐతే కూలీలతో పాటు ,రైతు,పాలేళ్ళు అందరూ అక్కడే ఉండి హడావిడి పడాలి.
పుగాకు తోటలు వేయడానికి కూడా ఇలా మిషన్లు వస్తే బాగుంటుంది.పుగాకైతే అన్ని పనులకీమిషన్లు ఉంటే మా వాళ్లకు చాలా శ్రమ తగ్గుతుంది.
ట్రే లలో సిద్దంగా ఉన్న నారు.
పై చిత్రాలకి ,ఈ చిత్రానికి తేడా చూసారా??చేనంతా ఎలా హడావిడిగా ఉందొ!
ఇలా వ్యవసాయ పనులకు యంత్రాలు వాడటం వలన కొంతవరకూ ఖర్చు కలిసొస్తుంది .అలానే శారీరక శ్రమా తగ్గుతుంది.