=''/>

23, ఫిబ్రవరి 2011, బుధవారం

అప్పుడే...పవర్ కట్ కట్!

మాకు సంవత్సరం లో ఆరు నెలలే రోజంతా కరెంట్ ఉంటుంది.మిగిలిన ఆరునెలలూ పగలు ఒంటి పూట కరెంటే.

ఈ ఏడు వర్షాలు బాగా పడ్డాయి కదా! ఇంచుమించు జులై నుండి ఫుల్ కరెంటు ఉంది.


ఎండలు బాగా పెరిగేక ఏప్రియల్ నుండి పవర్ కట్ ఉంటుంది అనుకున్నాము కానీ, అప్పుడే కరెంట్ తీయడం మెదలేట్టేసారు.


రోజంతా కరెంట్ కి బాగా అలవాటు పడిపోయామేమో ఇంకా ఒంటిపూట కరెంట్ కి అలవాటుపడలేదు.


ఉదయం నాలుగు గంటల నుండి పదకొండు వరకూ ఒక షిఫ్ట్ .పదకొండు నుండి సాయంత్రం ఆరు వరకూ ఒక షిఫ్ట్ .ఒక వారం ఉదయం షిఫ్ట్ ,ఒకవారం మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటుంది.ఉదయం కరెంటు ,మద్యాహ్నం కరెంట్ అంటాము.


ఉదయం షిఫ్ట్ వస్తే ,కరెంట్ సహాయంతో చేసే ఏపనైనా ఆ టైం లోనే చేసేయాలి. లేకపోతె అంతే! సాయంత్రం వరకూ కరెంట్ కోసం ఎదురు చూడాల్సిందే. టివికి,సిస్టం కి సాయంత్రం వరకూ రెస్టే.. పిల్లలు సెలవల్లో ఇంటి వద్దఉంటే(ముఖ్యంగా ప్రియ)ఆరు ఎప్పుడవుతుందా అనుకుంటూ ....మధ్యలో కరెంట్ కట్ చేస్తున్న వాడిని తిట్టుకుంటూ ఉంటారు.


మద్యాహ్నం షిఫ్ట్ ఐతే ఒక రకంగా ఉంటుంది .ఉదయం టిఫిన్ కి చెట్నీ ముందు రోజు సాయంత్రమే చేసేసుకోవాలి. పచ్చళ్ళు ఏవి చేయాలన్నా పదకొండింటికి కరెంట్ వచ్చేక చేయాల్సిందే . ఒక్కోసారి పొలంలో పనులు ఎక్కువగా ఉంటే కారియర్ తీసుకెళతారు.అటువంటప్పుడు మద్యాహ్నం కరెంట్ ఐతే ఆ వారం లో పచ్చళ్ళు ఏవీ చేయడం కుదరదు.పండగలొస్తే పిండి వంటలు చేయడానికి ఇంకా ఇబ్బంది. గ్రైండర్ లో పప్పు ముందు రోజన్నాలేకపోతే ఉదయం ఆరు లోపు అన్నా రుబ్బుకోవాలి.మా ప్రియ హాస్టల్ నుండి ఇంటికొచ్చినప్పుడు మధ్యాహ్న కరెంట్ ఐతే తనకి పండగే ! టివీ,సిస్టం రెండింటికీ రెస్టుండదు....


అసలే వరల్డ్ కప్ క్రికెట్ మన దేశంలో జరుగుతుంది. నాకూ క్రికెట్ అంటే కాసింత ఇష్టమే.వరల్డ్ కప్ క్రికెట్ లో మన వాళ్ళు ఆడే మాచ్లన్నీ మాకు మద్యాహ్న కరెంట్ ఉండగా జరిగితే బాగుండును.....


మా కరెంట్ కట కట కట్టాల వలన ఇటువంటివి చాలా మిస్సవుతూ ఉంటాము:((...

16, ఫిబ్రవరి 2011, బుధవారం

లాలేలో లిల్లే లేలో .....

రమ్య కృష్ణ అంటే పెద్దగా ఇష్టముండదు కానీ , విశ్వనాథ్ గారి సూత్రదారులు సినిమాలో మాత్రం పల్లెటూరి అమ్మాయిగా బాగుంటుంది.ముక్కుకి నత్తుతో బలే అందంగా ఉంటుంది.

కే.వి.మహాదేవన్ గారు సంగీతంసారధ్యం వహించిన ఈ సినిమాలోని రెండు పాటలు ....
10, ఫిబ్రవరి 2011, గురువారం

రధసప్తమి

ఈ రోజు రథసప్తమి.

లోకసాక్షి ఐన ఆసూర్యభగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘ సుద్ధ సప్తమి .అదే ఆయన జన్మతిధి ..రధసప్తమి .

సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసం లో రథసప్తమినాడు సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఏదో ఓ ఆదివారం నాడు పూజించినా సత్ఫలితం ఉంటుందని పెద్దలంటారు .

రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు చేసి , సూర్యోదయానంతరం దానాలు చేయాలి . ఈరోజు తులసికోట వద్ద
సూర్యునికి ఎదురుగా ముగ్గు వేసి ,ఆవుపిడకలపై ఆవుపాలతో పరవాన్నం చేసి ,చిక్కుడు ఆకులపై ఆ పరవాన్నముంచి ఆయనకు నివేదన ఇవ్వాలి .

నాచిన్నప్పుడు మా జేజమ్మ రథసప్తమినాడు ,తను తెల్లవారుజామున లేచి తలస్నానం చెసి మమ్మల్ని కూడా లేపి స్నానాలు చేయమని, కూర్చో బెట్టి పూజ చేయించి మాతో చిక్కుడాకులు అవీ కోయించి ,ఆవుపిడకల పై పొంగలి వండి అందరికీ ప్రసాదాలు పెట్టేది .ఇప్పటికీ రథసప్తమి అంటే అదే జ్ఞాపకమొస్తుంది .

4 వ్యాఖ్యలు:

Sree V చెప్పారు...

రాధిక గారు..రథసప్తమి పొ౦గలి రుచే వేరు కదా..ఇత్తడి గిన్నెలో గరిటెకి బదులు చెరకు తో కలియతిప్పుతూ చేస్తారు..

మేమైతే జల్లెడలో జిల్లేడు ఆకు, రేగుప౦డు పెట్టి పైను౦డి నీళ్ళు పోస్తూ..తలస్నాన౦ ముగి౦చేవార౦...
టపా బావు౦ది..జ్ఞాపక౦ ఇ౦కా బావు౦ది..
ఆ సూర్యభగవానుడు ఆయురారోగ్యాలను ప్రసాది౦చాలని కోరుకు౦టూ...
శ్రీ.వి.

మానస సంచర చెప్పారు...

అది పొంగలి కాదు క్షీరాన్నమని (పరవాన్నం) గుర్తు కాకపోతే అవుపాలతోనే చేస్తారు.

రాధిక చెప్పారు...

శ్రీ.వి గారు,దన్యవాదాలండి.
మానససంచర గారు,మా జేజమ్మపొంగలి వండేక పరవన్నముకూడా చేసేదండి. ఆవుపాలతోనే చేస్తారు.

మాలా కుమార్ చెప్పారు...

మాఘమాసం అంటే తులసి కోట , పిడకలమీద పొంగించిన పాల పాయసము చిక్కుడాకులలో తినటము అన్నీ జ్ఞాపకాలే . ఇప్పుడు పిడకలు దొరకక , దొరికినా పొంగిచే స్తలము లేక , అంతా గాస్ స్టవ్ మీదే .

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

పున్నమి చంద్రుని అందాలు

పౌర్ణమిరోజు చందమామని చూస్తుంటే .... ఎంత సేపైనా అలా చూస్తూనే ఉండి పోవాలనిపిస్తుంది.

ఓ " పౌర్ణమి "రోజు వెండి వెలుగుల్ని విరజిమ్ముతూ మన "అందాలమామ! చందమామ",మా దొడ్లో ద్రాక్ష పాదు ఆకుల్లోనుండి నుండి తొంగి తొంగి చూస్తూ నన్ను పలకరిస్తుంటే....

చిన్నప్పుడు వెన్నెల్లో చంటి (చెల్లి),నేనూ ,కజిన్స్ మేమంతా కలసి , అమ్మ వచ్చి నిద్రపోండి అని పిలిచే వరకు ఎన్నెన్నో ఆటలు ఆడుతూనే ఉండేవాళ్ళము. అవన్నీకాసేపు రింగులు తిరిగాయి . వెన్నెల్లో కూర్చుని కాసేపు సరదాగా ఐనా గడపట్లేదని నిట్టూర్చి మా దొడ్లో కొచ్చిన చందమామని ఇలా బందీచేసేసే. ...
.తొంగి తొంగి చుడమాకు చందమామా....


2, ఫిబ్రవరి 2011, బుధవారం

ఈ నాలుగు నెలలూ....

అప్పుడే మాకు వడియాలు పెట్టుకోవడం ఐపోయింది.ఎప్పుడూ" స్లో అండ్ స్టడీ "టైప్ లో ఉళ్ళో అందరూ పెట్టుకోవడం ఐపోతుండగా అప్పుడు పెడదామనే అత్తయ్యకు, ఈ సారి వడియాలు తొందరగా పెట్టేసుకోవాలనే మూడ్ వచ్చేసింది.


వడియాలు పెట్టుకోవడమేనా?ఇంకా చాలా చాలా పనులతో ...ఈ నాలుగు నెలలూ మేము(మా ఉళ్ళో వాళ్ళు కూడా) బిజీ బిజీ గా ఉంటాము.

డిసెంబర్ నుండి సంక్రాంతి పండుగ అయ్యేవరకు పండుగ పనులతో సరిపోతుంది.

ఇక అక్కడి నుండి ఇంకా బిజీ ఐపోతామంతా...

సాదారణంగా పల్లెల్లో సంవత్సరానికి సరిపోయేలా పప్పులూ అవీ జాగర్త చేసుకుంటారు కదా! దానికి ఇదే సంమయం.

మా వైపు పెద్దగా అపరాలు పండించరు . ఇంటిఅవసరాలకు సరిపడా వేద్దా మన్నా, కొన్న వాటికన్నా పండిస్తే ఎక్కువ ఖర్చని చాలా మంది వాటిని పండించడానికి ఇష్ట పడరు.మినుములూ,పెసలు,బొబ్బర్లు,కందులు కొని కూలి మనిషితో బాగు చేయించి , ఇసిరించి (తిరగలి లో పోసి తిప్పడం) వాటిని శుబ్రం చేసి నిల్వ చేసుకుంటాము..


మా చెల్లి కూతురు రాజి,మా సాయి .అమ్మ మినుములు ఇసురుతుంటే ..వాళ్ళ చిట్టిచేతులతో అమ్మకి పెద్ద సాయం ...


పిబ్రవరి నెల వచ్చేటప్పటికి కాస్త ఎండ పెరుగుతుంది కదా! వడియాల హడావిడి మొదలవుతుంది . పిండి వడియాలు ,పెసరొడియాలు ,గుమ్మడి వడియాలు పెడతాము

.
వడియాలు ఎండలో ఉండి పెట్టాలి కదా ,మార్చొస్తే ఎండలు పెరుగుతాయని పిబ్రవరి నెల అయ్యేటప్పటికి వడియాల పెట్టడం పుర్తైపోతుంది.

సంవత్సరానికి సరిపడా చింతపండు ఈ రోజుల్లోనే జాగర్త చేసుకుంటాం . చింతకాయలుంటే కోయించి వాటి పెంకు,గింజ తీయడం పెద్దపని .ఒకవేళ కాయలు లేకపోతె ఉళ్ళోకి అమ్మొచ్చే చింతపండు కొని బాగుచేసుకోవడమే.

ఇక అక్కడి నుండి పచ్చళ్ళకు అవసరమైన సరుకుల సేకరింపు పనిలో పడతాము. కారం కోసం మిరప కాయలకు గాలింపు మొదలుపెడతాము. ఎక్కడ బాగున్నాయో కనుక్కుని ,వాటిని కొని కారం దంచడం పెద్దపని .మా అత్తయ్య లాంటి కొందరు ఇంకా చాదస్తంగా రోట్లోనే కొట్టిస్తున్నారు కాని, ఇప్పుడు చాలా మంది రోట్లో కొట్టించలేక కారం ఆడే మరకు పంపేస్తున్నారు .

మర్చిపోయా!నువ్వులు కొని వాటిని కడిగి నూనె ఆడించే పనొకటి ఉంది.అమ్మో! ఇదింకా పెద్ద పని .రోజంతా ఇద్దరి కి పని సరిపోతుంది.పచ్చళ్ళకు సరుకులు రెడీగా ఉన్నాయి కదా!పైగా ఏప్రిల్ నెల వచ్చింది ...మామిడికాయలు వచ్చే రోజులు .ఇక పచ్చడి మామిడి కాయలకు ఉరుకులు పరుగులు...కాయలు తెప్పించి, పచ్చళ్ళు పెట్టి వాటిని జాడీ ల్లో బద్రపర్చడంతో ఈ పనుల హడావిడి కి బ్రేక పడుతుంది..ఇలా ....డిసెంబర్ నెలాఖరు నుండి ఏప్రిల్ నెలాఖరు వరకూ ఇంచుమించుమేమే కాకుండా ,చాలాపల్లెల్లోనూ అంతా పనులతో బిజీ బిజీ గా ఉంటారేమో..