=''/>
చిట్కాలూ..ఆరోగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చిట్కాలూ..ఆరోగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, అక్టోబర్ 2012, మంగళవారం

పెసల మొలకలతో ఇలా కూడా చేసుకోవచ్చు.




పెసలమొలకలలో ఎన్నో పోషకాలు ఉంటాయని, ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసినా సరే!పెసలు

నానబెట్టి,మొలకలు రావడానికి వాటిని  బట్టలో వేసి మూట కట్టడం  ఇదంతా చాలా పెద్ద పనిలా అనిపించి

బద్దకించే  దానిని..






మొలకలకి స్పెషల్ గా చిల్లుల బాక్స్లు ఉన్నాయని తెలిసినా కొనడం  కుదరలేదు. ఎలా ఉంటుందో చూద్దామని  

బత్తాయి జ్యూసర్  లో నానబెట్టిన పెసలు వేసాను .సాయంత్రానికి చక్కగా మొలకలొచ్చాయి. 

ఇది వాడటం తేలికగా అనిపించి   దీనినే మొలకలకి  వాడుతున్నా.
   


 రోజూ    పెసల మొలకలని అన్ని వంటకాలలోను  వాడేస్తుంటా. కూర ల్లో ,ఉప్మా ,మజ్జిగట్లు   ,దోశలు ,చాట్   

ఇలాచెప్పుకుంటూ పొతే  చాలా ఉంటాయి.



                                         మా పిల్లలకి ఇలా చాట్ లా చేస్తే  చాలా  ఇష్టం.  వెంటనే ప్లేట్  ఖాళీ   చేసేస్తారు.

 మొలకలు తింటే  హెల్త్ కి మంచిదిరా .... అని  పిల్లలని తినమంటే  ,ఆవాసన నాకిష్టముండదని    ,టేస్ట్  నచ్చదని  

ఇలా ఏవేవో  ఒకలు పెట్టి  ఇద్దరూ తినేవారు కాదు. ఇప్పుడు  ఇలా  చేస్తుంటే  కిక్కురు మనకుండా తింటున్నారు . 


                                        
   కుడుములు  ఎప్పుడూ  ఒకేలాగా చేయాలా?అని    పెసల మొలకలతో చేశా ...ఎలా ఉన్నాయి ?

14, మార్చి 2011, సోమవారం

టమాటా,మిరపమొక్కలు.


టమాటాలను మనం ఇంచుమించు అన్నికూరలలోనూ వాడతాము.ఒక్కో సీజన్లో వాటి రేట్లుకూడా మండిపోతుంటాయి...కొద్దిగా శ్రద్ద పెడితే విత్తనాలు ,నారు కొనకుండానే పెరట్లోనో ,పూల కుండీలలోనో టమాటా మొక్కలును అన్ని సీజన్ల లోను పెంచుకోవచ్చు,టమాటాలు పండించవచ్చు..

ఈ కాయలు ఇలా గింజలు తీసి జల్లితే లేచిన మొక్కవే !


టమటాలను ముక్కలు కోసేటప్పుడు...వాటిలో గింజలను ,ఒకనీళ్ళగిన్నె లోకి తీసుకోవాలి.ఆనీళ్ళను పూల కుండీలో పోస్తే మూడునాలుగు రోజులలో చిన్నచిన్న మొలకలు వస్తాయి .వాటిని జానెడు పొడవు అయ్యే వరకూ ఆకుండీలోనే వుంచి తరువాత వేరే దానిలో వేసుకొంటే రెండునెలలో కాయలు కాస్తాయి .మనము సొంతముగా పండిచిన కూరగాయలతో వండుకొంటే ఎంత తుత్తి గా ఉంటుందండి

అలాగే మిరపమొక్కలు కూడాపెంచవచ్చు. ఎండుమిరపకాయలు ఐపోయాక డబ్బాలో అడుగున గింజలు ఉంటాయి కదా!వాటిని పాడేయకుండా పూలకుండీలో జల్లితే ,ఒక వారానికి మిరప నారు రెడీ .వాటిని కొద్దిగా పెరిగాక వేరే కుండీలోవేస్తే అవికూడా రెండు ,మూడునెలలోనే కాపుకొస్తాయి.

దోస ,గుమ్మడి కూడా అలానే వేసుకోవచ్చు.మంచి కాయలైతే గింజలు పాడేయకుండా నీళ్ళలోకి తీసుకుని జల్లుకుంటే మొక్కలు చక్కగా లేస్తాయి.

చేసి చూస్తారుగా! కాస్త శ్రద్ద పెడితే చాలు ... టమాటా,మిరప కైతే పూలకుండీలుంటే చాలు.

15, డిసెంబర్ 2010, బుధవారం

పచ్చి చింతకాయలొచ్చాయి

తాజా తాజా చింతకాయలు

చూడగానే చటుక్కున కొరకాలనిపించే .... ఆ పులుపుకి మనతోటి ఆబ్బా అనిపించే "పచ్చి చింతకాయలు "వచ్చేసాయి.

చింతకాయలు అక్టోబర్ నుండి ఉంటాయి.(ఇప్పటి వరకూ ఫోటో తీయటం కుదరక నా టపా లేటైంది:)) కార్తీక మాసంలోవచ్చే వనభోజనాల కి, పెళ్ళిళ్ళ లొ భోజనాలకి ఈ" పచ్చిచింత కాయలకి "మాంచి డిమాండ్ .

పచ్చి చింతకాయ-కొత్తిమీరపచ్చడి,చింతకాయ-గోంగూర పచ్చడి పచ్చిచింతకాయ తో వేరుసెనగ, కొబ్బరి కలిపి పచ్చడి ,ఇలా రకరకాల పచ్చళ్ళు చేస్తారు..ఎవరి పొలంలో ఉన్నా దులిపేస్తుంటారు.

పచ్చి చింతకాయలుతో పప్పుచారు చాలా బాగుంటుంది. చింతకాయలు నీటిలో ఉడకబెట్టి పిసికి పిప్పితిసేసి ,ఆ రసం పప్పులో కలపడమే.చేయడం కొద్దిగా సాంబార్ లాగానే ఉంటుంది కానీ ముక్కలు ఎక్కువ వేయరు.సాంబార్ పొడి కుడా వేయకుండా ,మామూలు పప్పుచారు లాగానే చేస్తారు.

చింతకాయ-కందపులుసు,ఆనపకాయపులుసు ఇలా అన్నిపులుసు కూరలు ,చేపల పులుసు కూడా ఈ చింతకాయల తోటే చేసుకోవచ్చు.అలాగే పచ్చళ్ళు చింత పండు బదులు పచ్చి చింతకాయల తో చేస్తే మాంచి రుచిగా ఉంటాయి.కూరలకు ,పప్పు,పప్పుచారుకి ఐతే ఉడకబెట్టు కోవాలి. కానీ ,పచ్చళ్ళ లో కి చింతకాయలను మధ్య కు కొస్తే ,గింజ గట్టిబడదు కాబట్టి పప్పులా ఉంటుంది అది తీసేసి వేసుకోవాలి. ముక్కలతో పాటు కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది.


చింతకాయలు దొరికి నన్ని రోజులు చింతపండు వాడకుండా చింతకాయలతోటే కూరలు వండుకోవచ్చ.చింతపండు నిల్వ ఉండి ఈ రోజుల్లో అంత ఫ్రెష్ గా ఉండదు .కాబట్టి దొరికితే వాటితో చేసి చూడండి. చింతకాయలు ఎక్కువగా ఉంటె ప్రిజ్ లో పెట్టినా వారం కంటే నిల్వ ఉండవు.అటువంటప్పుడు వాటిని మధ్యకి కోసి దానిలో పప్పు తీసి ,ఉప్పు తో కలిపి రుబ్బుకుని ప్రిజ్ లో పెట్టు కుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది . కావలిసినప్పుడు కాస్త కాస్త వేసుకోవచ్చు.

అన్నట్టు ఈ రోజు నేను దోసకాయ పచ్చడి పచ్చి చింతకాయలోతోనే చేశానండోయ్ ... :)


5, అక్టోబర్ 2010, మంగళవారం

వంటింటి దివ్యౌషదం - మిరియాలు


మనకు అందుబాటు లో ఉండే వంటింటి దివ్యౌషదం" మిరియాలు ".

ఈ మిరియాలలో ఎన్నో ఔషద గుణాలున్నాయి.ముఖ్యంగా జలుబు ,దగ్గు తగ్గించడానికికి మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి.

వర్షాకాలంలో అస్తమానూ జలుబూ,దగ్గు వస్తూఉంటాయి .ఇటువంటి చిన్న చిన్న వాటికి కూడా మాత్రలూ అవీ వాడకుండా మిరియాల కషాయం తాగి చూడండి. ..మీకే తేడా తెలుస్తుంది.

అమ్మో కషాయమా! అనుకుంటున్నారా? కషాయం అంటే సినిమాలలో అదీ చూపించినట్టు కష్టపడి తాగాలా అనుకోకండి. చేయడమూ కష్టం కాదు, తాగడము కష్టం కాదు .

మిరియాల కషాయం ఎలా చేయాలంటే...

ఒక స్పూన్ మిరియాల పొడి ,కొద్ది గా అల్లం ముద్దా ,గుప్పెడు తులసాకులు ఒక కప్పు నీళ్ళలో వేసి ఐదు నిమషాలు సేపు తక్కువ మంటపై మరగనివ్వాలి. దానిని ఒక గిన్నె లోకి తీసికుని , దానిలో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయమూ ,సాయంత్రమూ తాగితే జలుబు తొందరగా తగ్గిపోతుంది .ఇది ఏరోజుకారోజే చేసుకోవాలి.


ఎవరికి జలుబు చేసినా మాఇంట్లో ఇదే మందు. . మా అబ్బయి మోదట్లో ఈ కషాయం తాగడానికి కొంచెం పేచీ పెట్టాడు కానీ ఇప్పుడు కాస్త తుమ్ములెక్కువగా వస్తే చాలు మిరియాల మందు కావాలి అని అడిగి మరీ చేయించుకుంటాడు.


మా ఇంట్లో మాములుగానే మిరియాలు ఎక్కువగా వాడుతుంటాము.అన్నిట్లోనూ వేస్తూ ఉంటాము. కొద్దిగా మిరియాలపొడి ,కొద్దిగా బెల్లమూ వేసి కలిపిన పాలు చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడైనా ఇలా తాగారా ? తాగి చూడండి .అలాగే ,ఆమ్లెట్ లోనూ కారం బదులుగా మిరియాల పొడి వేస్తే బాగుంటుంది. టి లో కూడా కొద్ది గా మిరియాలపొడి వేస్తే కొంచెం ఘాటుగా ఉండి గొంతుక్కి బాగుంటుంది .మిరియాల పొడి లేకుండా జున్ను అసలు వండరు .ఇలా అన్నిట్లోనూ మిరియాల పొడి ఉండాల్సిందే.

మిరియాలు , అల్లం రసం అజీర్ణ సమస్య ఉన్న వారు తీసుకుంటే బాగా పనిచేస్తుంది.అలాగే ఆకలి తక్కువగా ఉన్నవారు మిరియాల పొడిని ఒక స్పూన్ తేనే తో కలిపి తీసుకుంటే ఆకలి పుడుతుంది.మిరియాలు వేసి మరిగించిన నీరు పుక్కిలించి ఉమ్మితే పంటి నొప్పి తగ్గుతుంది.గొంతు నొప్పి ఉంటే కొన్ని మిరియాలు నోట్లో వేసుకుని చప్పరిస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.ఇలా రక రాకాలుగా మిరియాలను ఉపయోగించొచ్చు.


ఇవన్నీ చిట్కాలే ఐనా వీటిని ఆచరించడం వలన ఒక్కోసారి తొందరగానే ఫలితం కనిపిస్తుంది .ఆచరించడం వలన నష్టమేమి ఉండదు కదా .ఇవన్నీ చేసినా ఎమీ లాభం లేక పొతేఇంక డాక్టర్ వద్దకు పరిగెత్తాల్సిందే.. .. .