గోరుమిఠీ అసలు పేరు గోరుమిఠాయి అయిఉంటుంది.వాడుక బాష లో ఇలా గోరుమిఠీ అయిపోయిందన్నమాట! మా గోదావరి జిల్లాల్లో సారె లో పెట్టే స్వీట్ల లో ఇదీ ఒకటి.(ఇతర చోట్ల కూడా చేస్తారేమో )
ఇవి చేయడం అందరికీ కుదరదు .మా ఉళ్ళో ముగ్గురో ,నలుగురో ఉన్నారు .ఎప్పుడన్నా చెయ్యాలంటే వాళ్లకి కబురంపి వాళ్ళొస్తామంటేనే చేసుకోవాలి .మా అమ్మమ్మ బాగా చేస్తుంది .తను చేసినప్పుడు నేర్చుకుందామని చేస్తుంటా కానీ తనకి వచ్చినంత పలచగానూ,చక్కగా వెళ్ళు పడేలానూ రాదు . నాకు సరిగ్గా రావడం లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు కాస్త పిండి కలుపుకుని ప్రాక్టిస్ చెయ్యి వచ్చేస్తుంది నేనలాగే చేసేదాన్ని అంటుంది.
ఇప్పుడు గవ్వలు చేసుకోవడానికి ఉన్నట్టే ఇవి చేయడానికీ అచ్చులు వచ్చేసాయి .ఎవరూ చేసేవాళ్ళు దొరకనప్పుడు దానిమీదే చేస్తాం .
చూపుడువేలు ,బొటనవేలు మధ్యలో పిండి పెట్టి ఇలా నొక్కుతారు .ఎంత పెద్ద సైజైనా అంతే .
ఇలా చేయడం చూసి వేళ్ళతో చేస్తారు కాబట్టి వేలుమిఠీ అనాలి కానీ గోరుమిఠీ అంటారేంటి? అనడిగేడోసారి మా సాయి.వేలు మిఠీ అంటే బాగోలేదని గోరుమిఠీ అంటున్నారేమో అన్నా :)
నూనెలో వేసేటప్పుడు ఇలా వేళ్ళతో తీసి వేయాలి .అప్పుడే చక్కగా అర్ధచంద్రాకారంలో వస్తాయి .
పంచదార పాకం పడితే గోరుమిఠీ తయార్ :)