=''/>

10, మే 2014, శనివారం

గిజిగాళ్ళు -గూళ్ళు

మా ఇంటి పక్కనున్న కొబ్బరి తోటలో ..  ఈ మధ్య  ఉదయమే  బోల్డన్ని పిచ్చుకలు   సందడి సందడి గా  ,కిచ కచలాడుకుంటూ  అటూ ఇటూ ఎగురుతూ కనిపిస్తున్నాయి. ఇదివరకు ఇంతిలా  కనపడలే.. వినపడలే .. ఏమిటా అని ఓ రోజు కాస్త నిశితంగా గమనించి  .. పరికించి చూస్తే  ...   

ఇవిగో ఈ గిజిగాళ్ళ దన్నమాట  ఆ సందడి ! కొబ్బరాకుల్ని  సన్నని  ఈనెల్లా చీల్చుకుని ఈ గూళ్ళు కట్టుకుంటున్నాయి .. ఓ రోజు వట్టినే ఎలా గూళ్ళు కట్టుకుంటున్నాయో  చూద్దామని వెళ్ళా . నేనున్నా ఐదు  నిముషాల్లోనే  సగం  గూడు  కట్టేసిందో గిజిగాడు !

 ఈ రోజు  మబ్బు  మబ్బుగా  ఉంది  . మళ్లీ వర్షం పడితే అవుంటాయో వేరే చోటకి వెళ్ళిపోతాయో  అనుకుని   బద్దకించకుండా వెళ్లి  వాటిని  అట్టే విసిగించకుండా   ఐదు నిముషాల్లో ఓ పది స్నాప్స్  తీసుకుని వచ్చేసా .. 
అమ్మో ఐదు నిముషాలు మెడ పైకెత్తి వాటిని ఫోటోలు తీసేప్పటికి  నా మెడ పట్టేసింది .. కాసేపట్లో సర్దుకుంది లెండి. 

    భలే చిత్రం కదా వాటి నైపుణ్యం !  6, మే 2014, మంగళవారం

నువ్వులు - నూనె - చిమ్మిలి !!ఇప్పుడు నువ్వులు పంట వచ్చేరోజులు  కదా ! 

మా ఊళ్లో గిట్టుబాటవ్వడం  లేదని చాలా మంది నువ్వులు పండించక పోయినా ..   ఊరగాయ  పచ్చళ్ళ  లో నూ ,కూరల్లో వాడకానికి నూనె కి ,,పప్పు  కోసం ఇలా సంవత్సరమంతా వాడకానికి సరిపడా బస్తానో ,రెండు బస్తా లో ఎవరి వాడకాన్ని బట్టి వాళ్ళు   పండిన చోటనుండి తెప్పించు కోవడమే . 

ఈ సంవత్సరం బస్తా నువ్వులు ఏడు వేల రూపాయలు .నిరుటి మీద రెండు వేలు పెరిగింది . రేటు పెరిగినా సంవత్సరానికి  సరిపడా నిల్వ  చేసుకోవడానికి తప్పదు కదా !

నువ్వులు తెప్పించుకోవడం తేలికే కానీ అవి కడగడం అంటే  బాబోయ్ ! చాలా పెద్ద పని .నాకైతే  అపన్నయ్యే వరకూ  నిద్రే పట్టదు . 

 ఇక మాకేమో   ఈ రోజుల్లో కరంటు  ఒక  పూటే  ఉంటుంది .   నీళ్ళ కరెంట్ అంటే త్రీ ఫేస్ కరెంట్ ఇస్తాడు. ఓ వారం పుద్దన్న , ఓ వారం   మధ్యాహ్నం  అన్నమాట .. 
నువ్వులు కడగడానికి  బోల్డన్ని నీళ్ళు  పడతాయని ఉదయం కరెంట్ ఉన్నప్పుడే  కడగడానికి ముహూర్తం పెట్టుకుంటారంతా .. 

నువ్వులు కడగాలంటే ... నీళ్ళు పట్టుకోవడాలు, కడగడానికి మనుషుల్ని పోగేసుకోవడాలు !

రెండు మూడు రోజుల ముందే ఇద్దరి పాలేళ్ళకి  ,ఇద్దరు  నువ్వులు తెల్లగా కడగి ,చెరిగి బాగు చేసే   ఆస్థాన కూలి అమ్మాయిలకీ  పలానా రోజు నువ్వులు కడుక్కోవాలి మానకుండా రండి  బాబూ,అమ్మా  అని బుక్ చేసుకోవాలన్నమాట !

నువ్వులు రాత్రి  నీళ్ళ లో పోసి  నానబెట్టుకుని  తెల్లార  గట్ల  నుండి గడగటం మొదలెట్టేస్తారు . నువ్వుల నునె కోసమైతే ,నానిన నువ్వులు కొద్ది కొద్ది గా తీసుకుని  ఇనప బకెట్ లో  కానీ ,రోట్లో కానీ  వేసి  రోకళ్ళతో  రెండు మూడు నిముషాలు తొక్కి తీసేసి వాటిని నువ్వులు కడుక్కునే చిల్లుల డబ్బా ఉంటుంది .దాన్లో  వేసి రెండు మూడు సార్లు కడిగితే సరిపోతుంది . వాటిని ఎండలో పోసి ఆరబెట్టి ,ఆరాక శుబ్రం  గా చెరిగించి  జాగర్త చేసుకుని నునె కోసం మిల్లుకి  పంపించడమే !

 నువ్వు పప్పుకోసం  ఐతే  నానిన నువ్వుల్ని కాస్త ఎక్కువ సేపు పోటెయ్యాలి . వీటిని నువ్వులు కడుక్కునే డబ్బాలో వేసి ,   తెల్లగా కడగడానికి టాంక్ లో నీళ్ళ న్నీ  అయిపోవాల్సిందే .  ఒక్కోసారి కరెంట్ పొరపాటున ఆగిపోతే పక్కన పొలాల్లో టాంక్ వద్ద కెళ్ళి ఎలాగో పని పూర్తి చేసుకొస్తారు  పాపం .పొ ట్టు మొత్తం నీళ్ళలో పోవడంతో  కడిగిన నువ్వు పప్పు  ఎండలో ఆరబెట్టుకుని  నూపప్పు జల్లిడి తో  జల్లించుకుంటే సరిపోతుంది 

అప్పుడే కడిగిన నానుంటుందేమో నువ్వు పప్పు తినడానికి భలే రుచిగా ఉంటుంది :)

నువ్వు పప్పు  చేసుకున్న రోజే " చిమ్మిలి "  తోక్కుకోవడం అలవాటు మా వైపు .. 

చిమ్మిలి !   మన రాష్ట్రం లో అందరికీ  తెలుసా ? కోస్తా ప్రాంతం వాళ్ళ కే  తెలుసా ? అని నాకు ఎప్పటి నుండో డౌట్  ! 
తెలిస్తే ఎవరైనా చెప్పండే :)

                                            

చిమ్మిలి కి కేజీ నువ్వు పప్పుకి ,అరకేజీ బెల్లం కొలత ! 

నువ్వు పప్పు రోట్లో వేసి పొడయ్యాక ,బెల్లం కుడా వేసి ,బాగా కలిసి ముద్దయ్యే వరకూ తొక్కి ఉండలు చుట్టు కోవడమే.   మిక్సీ లో  వేసి కూడా అప్పుడప్పుడూ మధ్యల్లో చేస్తుంటాం కానీ   నువ్వు పప్పు ఫ్రెష్ గా ఉన్నప్పుడు చేసుకున్నదే రుచి బావుంటుంది . చిమ్మిలి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది . 

                                                   
                                                  


వెనకటికి  అత్తోరింటికి  వచ్చిన ఓ  కొత్తల్లుడు కి  చిమ్మిలి పెడతానంటే  ... మొహమాటానికి పోయి వద్దన్నాడట .  రాత్రి అందరూ  నిద్రోయాక మొహమాటపు  అల్లుడి కి చిమ్మిలి రుచి చూడాలనిపించి రోలు నాకడానికి   రోట్లో తలెడితే  .... తల  రోట్లో ఇరుక్కుపోయి లబో దిబో మన్నాడట !  అని చిమ్మిలి తొక్కినప్పుడల్లా నానమ్మ చెబుతుండేది :)