=''/>

27, డిసెంబర్ 2010, సోమవారం

తేగల సీజన్ ఐపోతుంది.

తేగలు ఇంక లేవు ,ఈరోజు అన్నీ తీసి కాల్పించి తెచ్చేసేము అంటే ... మా సాయి ని హోంవర్క్ చేసుకోనివ్వకుండా, తేగలో చందమామ ని అలా పట్టుకో ,ఇలా పట్టుకో అని కాసేపు వాడిని విసిగించి తేగల ఫోటో పెట్టమని అడిగిన ఫ్రెండ్ కోసం (అందరికోసం )ఇలా...





20, డిసెంబర్ 2010, సోమవారం

నా వందో టపా

సచినే కాదండోయ్ నేనూ కోట్టా" సెంచరీ" ఈ రోజు ... నా "వందో టపా" రాసి :))

పల్లెటూరు లో ఉండే" నేను " బ్లాగ్లోకం లోకి అడుగుపెట్టాను.నేనూ ఓ" బ్లాగ్" రాస్తున్నాను!! అదే నాకుపెద్ద తుత్తి.

కాకపొతే రాసి కన్నా వాసి ముఖ్యం కదా!కొందరు బలే రాస్తుంటారు .అవి చదువుతుంటే నేనూ అలా రాయలేనా ?అనిపిస్తుంటుంది. కానీ, ఏమన్నా కొత్తగా రాయడానికి ప్రయత్నిద్దామన్నాఏవిటో ఏమీ తోచి చావదు . " పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు"వాళ్లవి , వీళ్ళవి చూసి అలా రాయాలని అనుకోవడమెందుకు? అని ఏదో నాకెలా తోస్తే అలా ... నా బుర్రను ఎక్కువ కష్టపెట్టకుండా ఇలా వంద టపాలు పూర్తి చేసేసా :)).

నేన ఏమి రాసినా ఓపికగా చదివి ,కామెంట్స్ రాస్తూ నన్ను ప్రోత్సాహిస్తూ .. ఇంకా బాగా రాయాలనే ఆశక్తిని కలిగిస్తున్న నా బ్లాగ్ మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు :).

15, డిసెంబర్ 2010, బుధవారం

పచ్చి చింతకాయలొచ్చాయి

తాజా తాజా చింతకాయలు

చూడగానే చటుక్కున కొరకాలనిపించే .... ఆ పులుపుకి మనతోటి ఆబ్బా అనిపించే "పచ్చి చింతకాయలు "వచ్చేసాయి.

చింతకాయలు అక్టోబర్ నుండి ఉంటాయి.(ఇప్పటి వరకూ ఫోటో తీయటం కుదరక నా టపా లేటైంది:)) కార్తీక మాసంలోవచ్చే వనభోజనాల కి, పెళ్ళిళ్ళ లొ భోజనాలకి ఈ" పచ్చిచింత కాయలకి "మాంచి డిమాండ్ .

పచ్చి చింతకాయ-కొత్తిమీరపచ్చడి,చింతకాయ-గోంగూర పచ్చడి పచ్చిచింతకాయ తో వేరుసెనగ, కొబ్బరి కలిపి పచ్చడి ,ఇలా రకరకాల పచ్చళ్ళు చేస్తారు..ఎవరి పొలంలో ఉన్నా దులిపేస్తుంటారు.

పచ్చి చింతకాయలుతో పప్పుచారు చాలా బాగుంటుంది. చింతకాయలు నీటిలో ఉడకబెట్టి పిసికి పిప్పితిసేసి ,ఆ రసం పప్పులో కలపడమే.చేయడం కొద్దిగా సాంబార్ లాగానే ఉంటుంది కానీ ముక్కలు ఎక్కువ వేయరు.సాంబార్ పొడి కుడా వేయకుండా ,మామూలు పప్పుచారు లాగానే చేస్తారు.

చింతకాయ-కందపులుసు,ఆనపకాయపులుసు ఇలా అన్నిపులుసు కూరలు ,చేపల పులుసు కూడా ఈ చింతకాయల తోటే చేసుకోవచ్చు.అలాగే పచ్చళ్ళు చింత పండు బదులు పచ్చి చింతకాయల తో చేస్తే మాంచి రుచిగా ఉంటాయి.కూరలకు ,పప్పు,పప్పుచారుకి ఐతే ఉడకబెట్టు కోవాలి. కానీ ,పచ్చళ్ళ లో కి చింతకాయలను మధ్య కు కొస్తే ,గింజ గట్టిబడదు కాబట్టి పప్పులా ఉంటుంది అది తీసేసి వేసుకోవాలి. ముక్కలతో పాటు కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది.


చింతకాయలు దొరికి నన్ని రోజులు చింతపండు వాడకుండా చింతకాయలతోటే కూరలు వండుకోవచ్చ.చింతపండు నిల్వ ఉండి ఈ రోజుల్లో అంత ఫ్రెష్ గా ఉండదు .కాబట్టి దొరికితే వాటితో చేసి చూడండి. చింతకాయలు ఎక్కువగా ఉంటె ప్రిజ్ లో పెట్టినా వారం కంటే నిల్వ ఉండవు.అటువంటప్పుడు వాటిని మధ్యకి కోసి దానిలో పప్పు తీసి ,ఉప్పు తో కలిపి రుబ్బుకుని ప్రిజ్ లో పెట్టు కుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది . కావలిసినప్పుడు కాస్త కాస్త వేసుకోవచ్చు.

అన్నట్టు ఈ రోజు నేను దోసకాయ పచ్చడి పచ్చి చింతకాయలోతోనే చేశానండోయ్ ... :)


11, డిసెంబర్ 2010, శనివారం

సుబ్రహ్మణ్య స్వామి షష్టి ఈ రోజే !

.

సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. ముఖ్యముగాతమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు మరియి కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు.

తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి,సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాల సుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతోంది

.సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలు తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు.

మా జిల్లాలో అత్తిలోను,తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు లోనూ షష్టి ఉత్సవాలు బాగా జరుగుతాయి.

చిన్నప్పుడు మాఊరు లో సుబ్రహ్మణ్య స్వామి గుడి లేక మేమంతా మాకు దగ్గరలో" యాదవోలు" అనే ఊరు వెళ్ళే వాళ్లము. అక్కడ బాగా జరుగుతుంది. మేము,తెలిసినవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు అందరమూ కలిసి ప్రొద్దుటే ట్రాక్టర్ వేయించుకొని వెళ్లి స్వామిని దర్శించుకొని ,దుకాణాలు అవి తిరిగి మద్యాహ్నానికి వచ్చేవాళ్లము .అప్పుడు షష్టి కి స్కూల్ కి సెలవుండేది.(ఇప్పుడు చాలా మంది పిల్లలకి సుబ్రహ్మణ్య స్వామి షష్టి అనే ఓ పండుగ ఉంటుందనే తెలీదేమో ) .


ఇప్పుడైతే మా ఉళ్ళో శివాలయం లోనే సుబ్రహ్మణ్య స్వామి ని ప్రతిష్టించారు. ఇక్కడికే వెళ్తున్నామంతా..మా సాయి , నేను రాను బడుంది అన్నా బలవంతంగా వాడిని తీసుకునే ఉదయం గుడికి వెళ్లొచ్చాను..

10, డిసెంబర్ 2010, శుక్రవారం

ఇవేమి వర్షాలు ?మాకొద్దు బాబోయ్ :(

ఈ మూడు రోజు ల నుండి కురిసిన వర్షాల వలన ఎక్కువగా నష్ట పోయింది ఎవరంటారు??ఇంకెవరూ మేమే ( రైతులే) :(( .

గడిచిన నాలుగు నెలలుగా వానలు ఏదో రూపంలో రైతులను దెబ్బ తీస్తూనే ఉన్నాయి.

ఈ సంవత్సరం సకాలంలో పడిన వర్షాల వలన వరిచేల ఊడ్పులు సరైన సమయం లో ఐపోయాయి . కానీ తరువాత విపరీతంగా కురిసిన వర్షాలకు మా వరిచేలు మునిగి రెండు రోజులున్నాయి .ఎలాగో నీళ్ళలో నుండి బయటపడి తేరుకు న్నాయనగానే , మళ్ళి నెలకు కురిసిన భారీ వర్షాలకు మా పొలం పక్కనున్న కాలవకు గండి పడి మూడు రోజులుమునిగి ,నానిపోయి చచ్చీచెడి ఎలాగో బయట పడ్డాయి..

మధ్య మధ్యలో జల తుఫానని ,అల్పపీడనాలని ,వాయుగుండాలని అడపా దడపా వానలు పడ్డాయి కానీ ఎలాగో వీటన్నిటి బారీనుండి తప్పించుకుని వరి చేలు కోతలకు వచ్చాయి. మిషన్ తోటేగా కోయడం మూడు రోజులలో అయిపోయాయి. అమ్ముడానికి ఇప్పుడు మంచి రేటులేదని ,బస్తాల్లో ఇంటికితెచ్చి నిలవ చేయడానికి అన్నీ సిద్దం చేసారు.. ఈ వెదవ వర్షాలు ఒక్క రోజాగితే ..కష్టపడి పండించిన పంట ఇంటికి చేరేది. ప్చ్ :( ఏంచేస్తాం??పైన ఎన్ని కప్పి ఉంచినా వర్షాలు బాగా పడటంతో కళ్ళం లో ఉన్న ధాన్యం తడిచి పోయి చేలోనే ఉంది.ఏంచేయడానికి లేదు.. రెండు రోజులనుండి కురిసిన వానలకు మడులన్ని నిండి అవి బయటకు తీయడానికి లేదంట. చాలా మందికి ఇలాగే అయింది.

వరిచేను గొడవ ఇలా ఉంటే ,పుగతోటల పని ఇంకా గొప్పగా ఉంది.

మాకు ఇప్పుడు" పుగాకు" సీజన్ .ఈ పుగతోటల పనులు మొదలైతే అంతా బిజీ బిజీగా ఉంటారు . నారుమళ్ళు కట్టడం దగ్గర నుండి ,పుగాకు గ్రేడింగై .. అమ్మకాలు అయ్యేవరకూ పుగతోటని, పుగాకు ని చాలా జాగర్తగా చూస్తారు.ఒక్క ఆకు కూడా పోకుండా చూడాలి.పెరిగే దశ లో వానలు అసలు పడకూడదు. వాన నీటిలో తడిసిన ఆకులు బరువును ,జిగురు కోల్పోయి ఉడికించేటప్పుడు నల్లగా మాడిపోతాయి.మంచి రంగురాదు .అలా ఐతే ఆ పుగాకు కు ధర సరిగారాదు.పెట్టిన పెట్టుబడి,శ్రమ అంతా వృదా అవుతుంది. అందుకే చాలా జాగర్తగా వాటిని చంటిపిల్లలను చూసినట్టు చూడాలి అంటారు.

పుగ తోట లకి జులై లో నారుమళ్ళు పెంచుతారు సెప్టెంబర్ నెల మధ్య నుండి తోట వేయడం మొదలుపెడతారు. ఇదిగో ఈ వర్షాలకు అలా అలా అక్టోబర్,నవంబర్ వరకూ వేస్తానే ఉన్నారు. అస్తమానూ కురుస్తున్న వానలకు చచ్చిపోయిన మొక్కల స్థానం లో కొత్తమొక్కలు వేస్తూ ఎలాగో ఇప్పటికి ఓ దశ పూర్తైందని ,కాస్త విశ్రాంతిగా ఉన్నారో లేదో మళ్ళి వర్షాలు బాగా పడటంతో నీళ్ళు నిల్వ ఉండి పోయి సగం మొక్కలు కుళ్ళి ,కొన్ని తలలు వాల్చి తోటలన్నీ నానా బీబత్సంగా ఉన్నాయంట.

మన ప్రభుత్వం వారు ఏరియల్ సర్వేలు చేసి ,రకరకాల ప్రకటనలు చేయడమే కానీ అవి రైతులకు ఏమేరకు ఉపయోగపడ్డాయో అని కూడా చూడరు.

ఎన్ని కష్టాలు ఎదురైనా రైతు తను నమ్ముకున్న ఆ భూమాత పైనే ఆధార పడి ముందుకు సాగాలిగా..

8, డిసెంబర్ 2010, బుధవారం

రకరకాల పువ్వులు

గోవర్ధన పువ్వులు



చంద్రకాంత దేవకాంతలు.




తెల్ల దేవకాంతలు





మే ఫ్లవర్స్



కోడిగుడ్డు సెంపెంగ





6, డిసెంబర్ 2010, సోమవారం

ఓ ప్రియతమా..


పేపర్లో చదివిన చిన్న కవితకు ఓ రోజంతా కష్టపడి,నా మైండ్ కి కాస్త పని కల్పించి ఈ రూపం తెచ్చా... ఆఖరి రెండు లైన్లూ నేను చదివిన కవితలోనివి.

నా ఈ ప్రయత్నం ఎలా ఉందో మొహమాట పడకుండా చెప్పండే .

సందె గాలిలో సన్నజాజి సుగంధంలా
మలి సంధ్య లో మలయ మారుతంలా
మొగలి రేకుల పరిమళాలతో నను తాకిన ఓ ప్రియతమా !

నీ నవ్వుతో కోటి సరాగాల వీణలు వాయించావు
నీ స్పర్శతో వేయి వేణువులు ఉదావు
నీచూపుతో నాలో వందలాది తంబురాలు మోగించావు
నీ సిగ్గులో ఎన్ని సితారలో పలికించావు

నీ కులుకుల నడకల హోయలతో నన్ను గిలిగింతలు పెట్టావు
నీ తియ్యని పలుకులతో నా మది దోచావు
నీవు మిగిల్చిన జ్ఞాపకాలతో
నా జీవితం ఓ సరికొత్త రాగంలో పాటలా ఇలా సాగిపోతుంటే

ఈ మైమరుపు వెన్నెలలో ఆ మైమరపించే జాబిలీ కంటే
నీ మదుర స్మృతులే ఇక నా జీవన పయనానికి ఆలంబన

1, డిసెంబర్ 2010, బుధవారం

మా పొలంలో వన బోజనాలు













"పాపికొండలు"వెళ్ళాలనిఅనుకుంటున్నాము... అన్నాను కదా! కానీ ,ఎక్కడో నాకు అనుమానం గానే ఉంది.. అది జరిగేలా లేదని :((( .నేననుకున్నట్లే అయింది.

ఇరవై నాలుగున మా ఆడబడుచు వాళ్ళమ్మాయికీ " ఓణిఫంక్షన్ " అయింది.ఆ మరునాడు పాపి కొండలు వెళదాము....అందరూ ఉంటారు! అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వలన వెళ్ళ లేకపోయాము.

పాపికొండలు వెల్లట్లేదని చెప్పగానే మా" పిల్లలు" ఏడుపులు మొదలెట్టేశారు. మా అమ్మాయైతే చెప్పక్కర్లేదు....హాస్టల్ లో అందరికీ చెప్పేసేను వెళ్తున్నామని, మీరెప్పుడు ఇంతే...ఎక్కడికి తీసుకెళ్ళారూ..... అంటూ నిష్టూరాలు....


పిల్లలు ముగ్గురూకలిసి (మా ఆడబడుచు కూతురు ,మా పిల్లలు)"మనం రేపు ఎక్కడికైనా వెళ్లాల్సిందే" ... అంటూ ఓ ఆర్డర్ పాడేసి మేమంతా ఒప్పుకుంటేనే కానీ ఊరుకోలేదు.










వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి??మా వారు ,వాళ్ళు ఇప్పుడు పుగతోట ( మార్చి నెల వరకూ పుగాకు తోట పనులుంటాయి)పనులతో
చాలా బిజీ గా ఉంటారు..వాళ్ళ వల్ల ఏమీ పని జరగదు... ఎలాగా ?అనుకుంటూ "పొలం "వెళ్దామా?? "కార్తిక మాసం" కదా "వనభోజనాలు" పెట్టుకున్నట్టు ఉంటుంది. సరదాగా పొలంలో తిరిగి ,పుగాకు తోట ,కొబ్బరితోట అన్నీ చూసినట్టు ఉంటుంది...అన్నాను.

పిల్లలు ఏమంటారో?? అని ఎదురుచూస్తూ....

వీళ్ళు ఒప్పుకోక పోతే ఏంచేయాలి???ఏమంటారో ...అనుకున్నాను కానీ ,ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఊపు మీదున్నారేమో...వెంటనే ఒప్పేసుకున్నారు....

మీరు ఉదయమే తొందరగా లేచి మీ పనులన్నీ చేసుకుని మాకు సాయం చేస్తే ,పదింటికల్లా పొలం వెళ్ళగలుగుతాం....అంటే ,పాపం అలాగే కనపడని సాయం చాలా చేసారు...

అనుకున్నట్లే ...అన్నం ,కూరలు,స్నాక్స్ ,మంచినీళ్ళుతో సహా అన్నీ సర్దుకుని ట్రాక్టర్లో ... పదిగంటలకి పొలం వెళ్లేము.

ప్రియ చూసారా? ఎలా ఎక్కిందో ? ఎక్కింది కానీ దిగడం రాలేదు .అందరం కష్టపడి ఎలాగో దింపాం లెండి..

వెళ్ళగానే ఆట ,పాటలు మొదలెట్టేశారు.వాళ్ళతో కలిసి మేమూ ... హౌసి, రాముడు-సీత ,కళ్ళ గంతలు ఇలా రకరకాల ఆటలన్నీ ఆడేము.వంగిపోయిన కొబ్బరిచెట్టు ఎక్కేపోటీ పెట్టేము..అందరూ ఎక్కడానికి ట్రై చేసారు కానీ, , ప్రియ బాగా పైకేక్కింది.దానికి అందరూ కలిసి మూడు కొబ్బరి బొండాల నీళ్ళు పట్టించేసేరు.(ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి ) .

అమృతకి(ఆడబడుచు కూతురు ) హౌసి లో ఫస్ట్ వచ్చిందని.....

ఆటల్లో నెగ్గినవాళ్ళకి గిఫ్ట్లు ఏంటా?? అనుకుంటున్నారా?? రెండు కొబ్బరి బొండా లు తాగడం , నాలుగు జామ కాయలు,బురగుంజు తినడం:)))) ఇలా ....(మా పిల్లలు ఆరోజే మొదటి సారి బురగుంజు చూడటం ,తినటం)
కాసేపుకోతుల్లా...జామ చెట్లు,మామిడి చెట్లు ఎక్కి ,దిగి ,ఉయ్యాలలూగేరు. మాపొలమంతా తిరిగేక,పక్క పొలం లో కోకో తోటలోకి పిల్లల్ని తీసుకెళ్ళి ,కోకో కాయలు, మొక్కలు చుపించేము.


కోకోకాయలు

పిల్లల ఆనందానికి అంతేలేదు.మా ఆడబడుచు కూతురు అత్తా "మేం వచ్చినప్పుడల్లా పొలం ఇలాగే వెళదాం" అంది.దానికి అంత నచ్చేసింది. . మాపిల్లలూ అప్పుడప్పుడూ... పొలం వెళ్తుంటారు కానీ,కాసేపు అలా తిరిగి వచ్చేస్తారు.ఇలా ఎప్పుడూ వెళ్లక కొత్తగా ఉండి వాళ్ళకీ బాగానచ్చేసింది.

అలా ..సాయంత్రం వరకూసరదాగా... ఆనందంగా ...గడిపేసేమంతా...

మా పిల్లల గొడవ వలన "కార్తిక వనబోజనాలు"కూడా చేసినట్లైంది.
.


బుజ్జి కుక్కపిల్లలు బలే ముద్దొస్తున్నాయికదా! పొలంలో ఉన్నాయి .మాపిల్లలు వాటిని తెచ్చి,అవి తినక పోయినా ..బలవంతంగా వాటికి పులిహార పెట్టేసి వాటిని బెదిరించేసేరు.

29, నవంబర్ 2010, సోమవారం

"పెద్దింటి"కష్టాలు .


ముఖేష్ అంబానీ ఇప్పుడు ఇరవై ఏడు అంతస్తుల తన కొత్త ఇల్లు "అంటిలియా"లో ఉంటున్నారు.

మొన్నీమధ్య రోజులాగే 15వ అంతస్తులో ఉన్న పడక గదిలో ఆయన నిద్రలేచి ,17వ అంతస్తులో ... స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసారు. 19వ అంతస్తులో అల్పాహారం తిని ,ఆఫీసు కు వెళ్లేందుకు 14వ అంతస్తులో డ్రెస్సింగ్ చేసుకున్నారు.ఫైలు ,బాగ్ తీసుకునేందుకు 21 వ అంతస్తులో ఉన్న వ్యక్తిగత ఆఫీసుకు వెళ్లారు.13వ అంతస్తులో ఉన్న నీతా అంబానీకి ,పిల్లలకు బై చెప్పి ,3వ అంతస్తులో ఉన్న కార్ పార్కింగ్ కీ చేరుకున్నారు.తన మెర్సిడెస్ బెంజ్ కారును స్వయం గా నడుపుతూ ఆఫీసుకు వెళ్లేందుకు కారు వద్దకు వెళ్లారు.

కానీ, అప్పుడే ఆయనకు తెలిసింది... కారుతాళం చెవులు పై అంతస్తుల్లో ఎక్కడో మరిచిపోయినట్లు.....

కానీ ....అది ఎన్నో అంతస్తు ??? 15, 17, 19, 14, 21 వ అంతస్తా ? ? ? ? లేక 13వ అంతస్తా? ? ?

వెంటనే ముఖేష్ తన పని మనుషులకు ,కార్యదర్శులకు ,అటెండర్ల కు ఇలా అందరికీ ఫోన్లు చేసారు.

అంతే భారీ " ఆపరేషన్ తాళంచెవి " మొదలైంది.అన్నీ అంతస్తుల్లోను ఉరుకులూ,పరుగులూ.....

అయినా తాళంచెవి దొరకలేదు.గంట తరువాత ముఖేష్ భాయ్ ఓ సాధారణ ఐకాన్ కార్లో ఆఫీసుకు వెళ్లి పోయారు .

కట్ చేస్తే ....

మరుసటి రోజు తెల్లవారు జామున పై అంతస్తుల్లో పెద్ద శబ్దం రావడంతో నీతా బాబి బయటకు వచ్చింది.బాల్కని లోంచి లోనికి వస్తున్న ముఖేష్ ని "ఏమైందని "అడిగింది ."అదా ...జర్మనీ నుంచి హెలికాప్టర్ వచ్చింది .మెర్సిడెస్ బెంజ్ వాళ్ళు మన కారు డుప్లికేట్ తాళంచెవి పంపించారు" అని చెప్పారు.


అప్పుడు నీతా "మీ తాళం చెవి నిన్న మధ్యాహ్నమే దొరికింది .నాలుగు రోజుల క్రితం 14వ అంతస్తులో గదిలోని మీ బట్టలు లాండ్రీ కీ వేస్తుంటే ....మీ ప్యాంట్ జేబులో కనిపించింది .నేనే 16 వ అంతస్తులో ని షెల్ఫ్ లో పెట్టాను" అని తీరిగ్గా చెప్పిందట.

ఇవండి మన ముఖేష్ భాయ్ గారి 27 అంతస్తుల కొత్తింటి(పెద్దింటి) కష్టాలు ...


.

21, నవంబర్ 2010, ఆదివారం

మన బ్లాగ్ వనభోజనాలకి నేనూ, ఆకాకరకాయ కూరతో వచ్చేసానోచ్...

జ్యోతి గారి" బ్లాగ్ వనభోజనాల " పిలుపందుకుని ,నేనూ నా వంటతో సిద్దమైపోయానండోయ్...

నిరుడు ఇలాగే జ్యోతిగారు బ్లాగ్ వనభోజనాలు ఏర్పాటు చేసినప్పుడు ,నేనూ నాకూ తెలిసిన,వచ్చిన వంటతో వచ్చేను.అప్పుడు అందరూ చేసిన రకరకాల వంటకాలతో ..."బ్లాగ్ వనభోజనాల విందు" అదిరిపోయింది.


ఈ" బ్లాగ్ వనభోజనాలు"కి నేను వండుకొచ్చిన వంట....

"ఆకాకరకాయ ఇగురు".

మా వైపు వీటిని ఆకాకరకాయలు అంటారు. వీటిని బోడ కాకరకాయలు అని కూడా అంటారని ఈ మధ్యే తెలిసింది.ఈ ఆకాకరకాయలతో వేపుడు చేయవచ్చు.అలాగే ఇగురు కూరా వండుకోవచ్చు .మేము ఎక్కువగా పాలు పోసి ఇగురుకూర వండుతాము.


ఆకాకరకాయ ఇగురు చేయడానికి కావలసిన పదార్ధాలు:

ఆకాకరకాయలు - 1/4
ఉల్లిపాయలు -4
పచ్చిమిర్చి-3
ఉప్పు
కారం-1/2
పసుపు-కొద్దిగా
పాలు-చిన్న గ్లాస్ లో సగం
అల్లం వెల్లుల్లి ముద్ద-అర స్పూన్

పోపు సామాను:
సెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు,జీలకర్ర, కరివేపాకు.

ఆకాకరకాయ లు(వీటిలో చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఇవి ఇష్టం లేనివారు తీసేసుకుని ముక్కలు కోస్తారు, కానీ గింజలు కుడా రుచిగానే ఉంటాయి.)ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ముందుగా గిన్నెలో నూని పోసి తాలింపు పెట్టుకుని (ఎండుమిరప అక్కర్లేదు) ,దానిలో ఆకాకరకాయ ముక్కలు వేసి ఐదు నిముషాలు వేయించుకోవాలి. అప్పుడు దానిలో ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి అన్నింటినీ కాసేపూ వేగనివ్వాలి.అవి వేగేక, ఉప్పు,కారం,పసుపు,అల్లం వెల్లులి ముద్ద వేసికలుపుకుని మూతపెట్టి , చిన్న మంటపై కాసేపు మగ్గనిచ్చి ,తరువాతకొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఐదునిముషాలయ్యాక దానిలో పాలు పోసి ,కూర బాగా నీరు లేకుండా ఇగరనివ్వాలి. ఇలా పాలు పోసి ఆకాకరకాయ కూర వండితే కమ్మగా ..మంచి రుచిగా ఉంటుంది. ఈ కూర చపాతీలో కీ ,అన్నం లో కీ కూడా బాగుంటుంది.

ఇదండిమన" బ్లాగ్ వన భోజనాలకి " నేను కష్టపడి వండుకొచ్చిన వంట . రుచి చూసి ఎలా ఉందో చెబుతారు కదా!


మా ఊరి మహిళలం అందరం కలసి క్రితం సంవత్సరంకొబ్బరి తోటలో కార్తిక వన భోజనాలు పెట్టుకుని చాలా సరదాగా గడిపాము. ఈ సంవత్సరం ఇంకా అనుకోలేదు కానీ, పాపి కొండలు అనుకుంటున్నాము....ఏమవుతుందో?

17, నవంబర్ 2010, బుధవారం

50% కొనుగోలు ఉచితం ..

పండుగ సీజన్ వస్తే చాలు `ఒకటి కొంటె ఒకటి ఉచితం,50%నుండి 70% వరకూ తగ్గింపుధరలు,మీ ఇంట్లో పాత వస్తువులు తెచ్చి ..మేమిచ్చే కొత్తవస్తువుతో వెళ్ళండని', ఇలా... రోజూ రకరకాల ఆడ్స్ తో పేపర్లలోనూ ,టివి ల్లోనూ.... మనల్ని ఊదరకొడుతూ ఉండడం చూస్తుంటాము.

నాకసలు ఇటు వంటిఆఫర్స్ లో బట్టలు అవి కొనడం ఇష్టముండదు. ఏం కొనాలన్నా,మేమెక్కువగా... రాజమండ్రే వెళ్తాము.పెళ్లి బట్టలు ,చిన్న చిన్న ఫంక్షన్స్ కీ విజయవాడ లో తీసుకుంటాము.

క్రితం గురువారం అనుకోకుండా షాపింగ్ కి వెళ్లి ఇటువంటి ఒక పిచ్చి,చెత్త, అతిచెత్త ,చెత్తాతిచెత్త , ....(ప్లిచ్ :( రాద్దామంటే నాకసలు తిట్లే రావడం లేదు!)ఆఫర్ మాయాజాలం వలలో చిక్కుకుని ...లాక్కుని ...పీక్కుని ,అతికష్టం మీద బయటపడి మా ఊరు చేరేటప్పటికి రాత్రి రెండైంది.

మా ఆడబడుచు బెంగుళూరు లో ఉంటుంది . వాళ్ళమ్మాయి "ఓణిల ఫంక్షన్"కి ఈ "ఇరవై నాలుగు"న డేట్ పెంట్టించుకుని గురువారం వచ్చింది. అక్కడినుండి వచ్చీరావడంతోనే , అందరినీ కంగారు పెట్టేసింది. " తలుచుకున్నప్పుడే తాతపెళ్లి " అన్నట్టు..... ఈ రోజు మంచిది !"బట్టలు కొనడానికివిజయవాడ వెల్దాం"అంటే...సరే అని ఒంటిగంటకు బయల్దేరి వెళ్లేము.

అలా ...మేము బయలుదేరి విజయవాడ వెళ్ళేటప్పటికే సాయంత్రం నాలుగైంది.(అంటే అందరూ పనులన్నీ ముగించుకుని వెళ్ళిపోయే సమయమం అన్నమాట). కళానికేతన్ లో బట్టలు బాగుంటాయి అంటారు కదా ...అని ముందు దీంట్లో చూద్దామని వెళ్లేము. అంతే!అక్కడే చిక్కడి పోయాము.

వెళ్ళగానే వాళ్ళ బట్టలమ్మే అమ్మయి వచ్చి,"మా కళానికేతన్ పెట్టి ముప్పైఐదేళ్ళు అయిందని" ....మంచి ఆఫర్ పెట్టాము. "మీరేమి కొన్నా దాంట్లో సగం డబ్బులు పెట్టి మళ్ళి బట్టలు కొనుక్కోవచ్చు"అంది.అది విని మా అత్తయ్య ఇదేదో బాగుంది .బట్టలన్నీ ఇక్కడే కోనేయవచ్చు! అనుకుంది. పరికిణి లు చూద్దామని చూసేము. ఒకటి బాగా నచ్చిందని కొందామని చూసేము.

మళ్ళి అది తీస్తే దాంట్లో సగం డబ్బులతో మళ్ళి బట్టలు కొనాలికదా .... అని అన్నీ చూసేము. ఏమీ పెద్ద నచ్చలేదు. వేరే కోట్టుల్లో చూద్దామని ...ఏడింటి నుండి తొమ్మిదింటి వరకూ అన్నీ తిరిగినా పరికిణీలు నచ్చలేదు .ఒకవేళ ఎమన్నా కొందామన్నా కళానికేతన్ లో లంగా కొంటే....మళ్ళి వాడి చెత్త ఆఫర్కి బట్టలు తీసుకోవాలి కదా అని," ఒక్క లంగా కోసం ఏమీ కొనకుండా", కాళ్ళు నెప్పి పుట్టేలా ... తిరిగి తిరిగి మళ్ళి ఆ కళానికేతన్ కే వెళ్లేము.

అప్పటికే తిండీ ..తిప్పలూ లేకుండా , అన్నీ తిరిగి తిరిగి ఉన్నాము .... ఇంటిదగ్గరనుండి పోన్లు మీద ఫోన్లు .ఇంకా బయల్దేరలేదా? అంటూ...ఇంకా ఏమైనా చూడలన్న ఉత్సాహం కుడా లేదు. వేరే ఏమీ చూడలేదు. మేము చూసి వెళ్ళిన లంగా ఎవరూ తీసుకోలేదు అనుకుని....ఆ పరికిణి తీసి పక్కన పెట్టి , తగ్గించిన బేలెన్స్ లో బట్టలు కొందామంటే.... రేటు నచ్చితే ,రంగు నచ్చదు.రంగు నచ్చితే ....క్వాలిటి నచ్చదు.ఎలాగో కిందా మీదా పడి ... ఆ ఉన్న వాటిల్లోనే ,నచ్చినా నచ్చక పోయినా ఒక్క పరికిణి కోసం నానా తిప్పలూ పడి .... వాడు కొట్టు కట్టేసి పొమ్మనే వరకూ అక్కడే ఉండి , వాడిని తిట్టుకుంటూ అన్నీ తీసుకుని వాడి" 50% కొనుగోలు ఉచితం" ఆఫర్కి ఒక దణ్ణం పెట్టి బయల్దేరి ఇంటికొచ్చేటప్పటికి అర్ధరాత్రి రెండైంది.

5, నవంబర్ 2010, శుక్రవారం

వెలుగుల దీపావళి

దీపావళి అంటే .... గుర్తొచ్చేది , కాంతులు వెదజల్లుతూ వెలిగే ప్రమిదలు,పేల్చే టపాసులు.దీపావళి రోజు సాయంత్రం ప్రమిదలు వెలిగించి ....గోడలమీద ,మెడపైన ,వీదిలో అరుగులు మీద ఎక్కడా ఖాలీ లేకుండా ఇల్లంతా పెట్టడం.. చాలా సరదాగా ఉంటుంది.పెళ్ళికి ముందు అమ్మగారింటి వద్ద మా చెల్లి, నేను పోటీలు పడి మరీ ప్రమిదలు వెలిగించే వాళ్లము .

దీపావళి ముందు రోజే ప్రమిదలన్నీ శుభ్రం చేసి ,ఎండలో ఆరబెట్టి ఉంచే వాళ్లము .ఈ ప్రమిదలలోకి నానమ్మ గుడ్డతో చేసిన వత్తులు పంపించేది(ఇప్పుడూ పంపిస్తుంది). .అవి గానుగ నూనెలో నానబెట్టి ఉంచి , సాయంత్రం ఐదు గంటలకి దీపాలు వెలిగించడం మొదలుపెట్టేవాళ్లము. మేడమీద ,రెండంతస్తులూ ప్రమిదలు పెట్టి....అవన్నీ వెలిగించే టప్పటికి చీకటి పడిపోయేది.ఈ లోపు గాలి వీస్తే వెలిగించినవి అరిపోయేవి. మళ్ళి పైకి వెళ్లి వాటిని వెలిగించి వచ్చేవాళ్లము.అసలు అవి పూర్తిగా అంటుకుని వెలిగితే చాలా సేపుఅలా వెలుగుతూనే ఉంటాయి(అందుకే ప్రమిదలలోకి గుడ్డ వత్తులు వాడతాము).

ఇప్పుడు మా పిల్లలూ ప్రమిదలు వెలిగించడానికి అలానే తిరుగుతారు . అవి పూర్తిగా వెలిగాకే టపాసుల వద్దకు వెళ్తారు.

ఇల్లంతా ఇలా దీపాలు వెలిగించి ఆనందించేది .... ఈ దీపావళి పండుగ రోజే కదా!


దీపాల శోభ తో మెరిసేను ముంగిళ్ళు...సిరిసంపదలతో వర్ధిల్లును మీ నట్టిల్లు.

బ్లాగ్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

2, నవంబర్ 2010, మంగళవారం

ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి ...

ఆడపిల్ల్లలు ఎన్ని రకాలు డ్రస్లు వేసుకున్నా...పరికిణి - జాకిట్టు లోఉన్న అందం దేనిలో వస్తుంది!అసలు పరికిణి లో ఎంత ముద్దుగా ఉంటారు.వాళ్లనే చూడాలనిపిస్తుంది. ఇప్పటి ఆడపిల్లలు పరికిణి లు వేసుకోవడానికే ఇష్ట పడటలేదు..ఫంక్షన్ లలో వేసుకున్నా ఆ కాసేపు వేసుకుంటారు అంతే. .

నాకు వర్కులు చేయడం ఇష్టం కదా .చీరలమీదే కాకుండా మా ప్రియాకి కూడా రెండు పరికిణి ల మీద వర్కు చేసాను.
నాలుగేళ్ల క్రితం అది హాస్టల్కి వెళ్లక ముందు వరుసగా రెండు పుట్టినరోజులకీ రెండు పరికిణి లమీద కుట్టాను .


ఫోటో తీస్తానురా .. అనగానే చప్పున అటుతిరిగింది.

అప్పుడు ఇంటివద్ద ఉండడంతో ఇష్టంగా వేసుకునేది.హాస్టల్ కి వెళ్ళాక అక్కడ ఎవరూ వేసుకోరు అని, వేసుకోమని పెట్టిన వాటిని వెనక్కి తెచ్చేసేది. ఈ నాలుగేళ్ల లో వాటిని రెండు మూడు సార్లు వేసిందేమో అంతే .

చాలా రోజుల తరువాత ఎలాగో ఈ రోజు పరికిణి వేసుకుంది .అదీ ...వారం రోజుల నుండి నాతో బ్రతిమాలించుకుని , రకరకాల గొంతెమ్మ కోర్కెలన్నీ కోరి. నాతో గులాబ్ జాం,పాలకోవ చేయించుకుని తిని,దానికి ఇష్టమైన ఈత పాయల జడ వేయించుకుని , తప్పదురా అను కుంటూ వేసుకుందామని తీస్తే అది కాస్తా కురసైపోయింది .మళ్లి దాని ఫిల్టు విప్పి సరిచేసి దానితో ఆడ్రస్ వేయించే టప్పటికి నాతల ప్రాణం తోకకి వచ్చినంత పనైంది . .
ఈత పాయల జడ .రెండు పాయలు తీసి ,మళ్ళి చిన్న పాయలు తీసి జడ లా అల్లుతారు.

29, అక్టోబర్ 2010, శుక్రవారం

కొండగాలి తిరిగింది

"కొండగాలి తిరిగింది ..కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది "ఎంత చక్కని పాట!ఎన్ని సార్లు విన్నా విసుగురాదు.చిన్నప్పుడు రేడియో లో వినటమే కానీ ఈ మధ్య వినలేదు .ఒకరోజు ఎఫ్ ఎం రేడియోలో విని , డౌన్ లోడ్ చేద్దామని చూస్తుంటే ఇదిగో ఇలా మిక్స్ చేసిన వీడియో దొరికింది .

ఘంటసాల గారు ఆలపించిన ఈ అద్భుతమైన పాట ఈ మధ్య నే చనిపోయిన కె.బి.తిలక్ గారి దర్శకత్వంలో 1965 లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాలోది. పెండ్యాల నాగేశ్వరరావ్ గారు స్వరపరిచారు .వ్రాసింది ఆరుద్ర గారు.
ఘంటసాల గారు పాడిన ఇటువంటి మెలోడి పాటలను , ఈ లోకాన్ని మరిచి పోయి ఆనందంగా ఎంతసేపైనా వినేయవచ్చు.







కొండగాలి తిరిగిందీ ..కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...


పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...ఆ ఆ
పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికింది....గట్టు మీద కన్నె లేడి గంతులేసి ఆడిందిఆ ..ఆ..


పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది ఆ ఆ ఓ ఓ ఆ ఆ ...
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది పట్టరాని లేతవలపు పరవశించి పాడింది

కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ... .. ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...

మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయిందదీ ....
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయింది నాగమల్లి పూలతో నల్లని జడ నవ్విందిఆ ఆ ఆ ... ఆ..ఆ..ఆ..

పడుచుదనం అందానికి తాంబులమిచ్చిందదీ ...ఆ ఆ ఆ ... ఆ..ఆ..ఆ...
పడుచుదనం అందానికి తాంబులమిచ్చింది ప్రాప్తమున్న తీరానికి పడవ సాగి పోయింది ఆ ఆ ఆ... ...

కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...

25, అక్టోబర్ 2010, సోమవారం

ఆటపాటల అట్లతద్ది ఈ రోజే నండోయ్


కన్నెపిల్లలు ఎంతగానో ఎదురుచూసే పండుగ ఇది. . కాబోయే భర్త గురించి వారి ఊహలు, ఆశలు నెరవేరాలని కోరుకుంటూ.... నోచుకునే నోము కావడం ఈ పండగలో ప్రత్యేకత." ఆశ్వీయుజ బహుళ తదియ" నాడు అట్లతద్ది పండుగ వస్తుంది. తెలుగింటి ఆడపిల్లలంతా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. చల్లని రాత్రి చేతులకు గోరింతాకు పెట్టుకుని ... దుప్పటి ముసుగుతన్ని నిదురోయిన ఆడపిల్లలు తెల్లవారు జామునే నిదుర లేచి, పండిన గోరింటాకును చూసుకుని మురిసిపోవడం, తక్కువగా పండితే ముసలి మొగుడొస్తాడని వేళాకోళాలాడుకోవడం, పొద్దు పొడిచే లోపలే చద్ది తినడం,ఆడపిల్లలంతా ఒక్కచోటచేరి ఆటలాడటం, ఉయ్యాలలూగడం అన్నీ సరదాలే.

ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తాబవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ, పాటలు పాడుతూ, నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటారు. ఊరిలో వుండే పెద్ద పెద్ద వేప ,మామిడి చెట్లకు ఉయ్యాలలు కట్టి ఉగుతూ... అమ్మాయిలంతా అక్కడచేరి ఆడిపాడతారు.


అన్ని వ్రతాలకి ఉపవాసముండి తరువాత పూజ చేస్తారు .అట్లతద్దికి అలా కాదు ,సూర్యోదయానికి ముందే బోజనం చేసి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి ,పూజ చేసుకుని వాయినాలిస్తారు.నోము చేసుకునే స్త్రీలు ముతైదులకు తలంటు స్నానానికి కుంకుడుకాయలు పంపిస్తారు . పసుపు, కుంకుమలు, రవికలగుడ్డ, తాంబూలంతోపాటుగా పదకొండు అట్లను వాయనంలో ఇస్తారు. పది సంవత్సరాలు ఈ నోమును నోచుకుంటారు. సంవత్సరానికి ఒక ముతైదుకు వాయినం ఇచ్చేవారు కొందరైతే, పదిమందికీ ఒకేసారి ఇచ్చేవారు కొందరు. వాయినం పుచ్చుకున్న అట్లను వారుతప్ప వేరొకరు తినకూడదనే నియమం వుంటుంది.

ఇప్పుడు అట్లతద్ది అంటే అట్లు వేసుకుని తినడమే... . మా చిన్నప్పుడు అమ్మావాళ్ళు పూజలు చేసుకుని వాయినాలు ఇచ్చుకోవడం తెలుసు . కానీ మేమూ .. అట్లతద్ది రోజు ప్రతేకంగా ఏమీ పూజకూడా చేయట్లేదు.మా గోదావరి జిల్లాల వైపు పెళ్ళైన వారం లోపులో తద్ది పూజ చేయిచేయించి , ముత్తైదులకు వాయినాలు ఇప్పిస్తారు. తరువాత నాలుగైదేళ్ళు తద్ది ఉపవాసం ఉండి .... అట్లతద్ది జరుపుకుంటాము .తరువాత అదీ ఉండదు.కాకపొతే అట్లతద్ది రోజు అట్లేసి , బెల్లంచారు కాసి పాలేళ్ళకి,కూలీలకి,చాకలి,మంగలి ఇలా అందరికీ పెడతాము. అదేమాకు అట్లతద్ది పండుగ. ఓపిక గా చేయాలి అనుకునే వాళ్ళు ఇలా అన్నా చేస్తున్నారు . .

ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర వంటి వాటిని తినడం ద్వారా కంటిసమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గోర్లకు ఆరోగ్యం కూడా. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత అని ఇట్టే అర్థం అవుతుంది


పట్నాల సంగతెలా ఉన్నా ,పల్లెల్లో కుడా ఇటువంటి కొన్ని పండుగలు అలా ..అలా ... నెమ్మిదిగా మరుగున పడిపోతాయేమో!.

21, అక్టోబర్ 2010, గురువారం

మా పెరట్లో తిరిగే సీతాకోకచిలుకల చిత్రాలు

మా ఇంట్లో రకరకాల పూల మొక్కలు ఉండడం తో సీతాకోకచిలుకలు బాగా వస్తుంటాయి. రంగురంగుల రెక్కలను అల్లల్లాడిస్తూ అవి పువ్వుల్లో మకరందం కోసం ......ఒకపువ్వు పై నుండి ఇంకో పువ్వు పై వాలుతూ ...అటూ,ఇటూ ఎగురుతుంటే చూడడానికి బలేఉంటుంది. ఫోటో తీయాలంటే మాత్రం చాలా కష్టం సుమండీ....


ఈ సీతాకోకచిలుకల ను ఫోటోల్లో బందించడానికి అష్ట కష్టాలు పడుతుంటాను.అవి అసలు ఒక పువ్వు మీద నుండి ఇంకో పువ్వు మీదకి అలా తిరుగుతూనే ఉంటాయి .ఒక్కో పువ్వు మీదా అరనిముషం ఉంటాయేమో ,ఫోటో తీయడానికి రెడీ అయ్యేలోపు వెళ్లి పోతుంటాయి .వాటి వెనకాల పరిగెడుతూ ఎలాగో తీస్తాను. ఒక్కోసారి గులాబీ ముళ్ళు గుచ్చుకుంటాయి .కానీ ఫోటోలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది.




ఇదేంటో ఇలా మడ్డి రంగులో ఉంటుంది .ఇది మిగిలిన వాటిలా ఓ ఎగిరిపోదు దేనిమీద వాలితే దానిమీదే ఉంటుంది బద్దకంగా .ఇది సీతాకోకచిలుక ల్లో ఒక జాతంట.

















ఇది పెద్దగా ఉండి లైట్ నీలం రంగు రెక్కలతో చాలా బాగుంటుంది.

8, అక్టోబర్ 2010, శుక్రవారం

హమ్మయ్య బ్లౌజ్ మీద వర్కు చేయడం ఎలాగో పూర్తిచేసేసా ..



రెండు నెలల నుండి ఈ జాకిట్టుకి వర్కు చేస్తున్నాను.ఈ మధ్య కొంచెం బద్ధకం ఎక్కువైంది లెండి .ఎవరికైనా చీరల మీద వర్క్ చేయడానికి రెండుమూడు నెలలు టైం తీసుకుంటారు .మరి నాకు బ్లౌజ్ మీద వర్కు చేయడానికి ఇంత టైంపట్టింది.



ఇది మెడ డిజైన్.మెడ అంచుకి అవుట్ లైన్, జరీ దారంతో గొలుసు కుట్టు కుట్టి .... డైమండ్స్ కూడా జరీ దారం తో గొలుసు కుట్టు కుట్టాను.మధ్య లో పచ్చ దారంతో ముడులు వేసాను. అలాగే పువ్వులుకుడా జరీ దారంతో కుట్టి మధ్యలో గోల్డ్ పూసలు కుట్టాను .

ఇక మధ్యలో ఖాలీ అంతా గొలుసు కుట్టుతో దగ్గరగా కుట్టి మొత్తం నింపేసా ...అలా గొలుసు కుట్టుతో నింప డాన్ని పానీ వర్క్ అంటారు.



చేతులకి ఇలా అంచు కుట్టి పైన పువ్వులు, బుటా వేసాను.


హమ్మయ్య ఎలాగో పిల్లలకి సెలవలు వచ్చేటప్పటికి పూర్తిచేసేను.వాళ్ళు ఇంటివద్ద ఉంటే అసలు కుట్టడం అవ్వదు.

మొత్తం డిజైన్, కుట్టు ఐడియా అంతా నాదే . ముందు మెడకే కుడదామని మొదలు పెట్టాను కానీ మెడ వర్కు అయ్యాక ,నా చేతుల దురద ఇంకా తీరక అలా ... అలా .. ఇలా కుట్టేసాను. చాలా తొందరగా రెండు నెలలలోనే పూర్తి చేసేసేను కదా .... -:)

ఎలాఉందంటారు?వర్కు ,డిజైను ...

5, అక్టోబర్ 2010, మంగళవారం

వంటింటి దివ్యౌషదం - మిరియాలు


మనకు అందుబాటు లో ఉండే వంటింటి దివ్యౌషదం" మిరియాలు ".

ఈ మిరియాలలో ఎన్నో ఔషద గుణాలున్నాయి.ముఖ్యంగా జలుబు ,దగ్గు తగ్గించడానికికి మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి.

వర్షాకాలంలో అస్తమానూ జలుబూ,దగ్గు వస్తూఉంటాయి .ఇటువంటి చిన్న చిన్న వాటికి కూడా మాత్రలూ అవీ వాడకుండా మిరియాల కషాయం తాగి చూడండి. ..మీకే తేడా తెలుస్తుంది.

అమ్మో కషాయమా! అనుకుంటున్నారా? కషాయం అంటే సినిమాలలో అదీ చూపించినట్టు కష్టపడి తాగాలా అనుకోకండి. చేయడమూ కష్టం కాదు, తాగడము కష్టం కాదు .

మిరియాల కషాయం ఎలా చేయాలంటే...

ఒక స్పూన్ మిరియాల పొడి ,కొద్ది గా అల్లం ముద్దా ,గుప్పెడు తులసాకులు ఒక కప్పు నీళ్ళలో వేసి ఐదు నిమషాలు సేపు తక్కువ మంటపై మరగనివ్వాలి. దానిని ఒక గిన్నె లోకి తీసికుని , దానిలో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయమూ ,సాయంత్రమూ తాగితే జలుబు తొందరగా తగ్గిపోతుంది .ఇది ఏరోజుకారోజే చేసుకోవాలి.


ఎవరికి జలుబు చేసినా మాఇంట్లో ఇదే మందు. . మా అబ్బయి మోదట్లో ఈ కషాయం తాగడానికి కొంచెం పేచీ పెట్టాడు కానీ ఇప్పుడు కాస్త తుమ్ములెక్కువగా వస్తే చాలు మిరియాల మందు కావాలి అని అడిగి మరీ చేయించుకుంటాడు.


మా ఇంట్లో మాములుగానే మిరియాలు ఎక్కువగా వాడుతుంటాము.అన్నిట్లోనూ వేస్తూ ఉంటాము. కొద్దిగా మిరియాలపొడి ,కొద్దిగా బెల్లమూ వేసి కలిపిన పాలు చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడైనా ఇలా తాగారా ? తాగి చూడండి .అలాగే ,ఆమ్లెట్ లోనూ కారం బదులుగా మిరియాల పొడి వేస్తే బాగుంటుంది. టి లో కూడా కొద్ది గా మిరియాలపొడి వేస్తే కొంచెం ఘాటుగా ఉండి గొంతుక్కి బాగుంటుంది .మిరియాల పొడి లేకుండా జున్ను అసలు వండరు .ఇలా అన్నిట్లోనూ మిరియాల పొడి ఉండాల్సిందే.

మిరియాలు , అల్లం రసం అజీర్ణ సమస్య ఉన్న వారు తీసుకుంటే బాగా పనిచేస్తుంది.అలాగే ఆకలి తక్కువగా ఉన్నవారు మిరియాల పొడిని ఒక స్పూన్ తేనే తో కలిపి తీసుకుంటే ఆకలి పుడుతుంది.మిరియాలు వేసి మరిగించిన నీరు పుక్కిలించి ఉమ్మితే పంటి నొప్పి తగ్గుతుంది.గొంతు నొప్పి ఉంటే కొన్ని మిరియాలు నోట్లో వేసుకుని చప్పరిస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.ఇలా రక రాకాలుగా మిరియాలను ఉపయోగించొచ్చు.


ఇవన్నీ చిట్కాలే ఐనా వీటిని ఆచరించడం వలన ఒక్కోసారి తొందరగానే ఫలితం కనిపిస్తుంది .ఆచరించడం వలన నష్టమేమి ఉండదు కదా .ఇవన్నీ చేసినా ఎమీ లాభం లేక పొతేఇంక డాక్టర్ వద్దకు పరిగెత్తాల్సిందే.. .. .




30, సెప్టెంబర్ 2010, గురువారం

సరదాగా కాసేపు :):):)

ఏమిటండీ ....సరదాగా కాసేపు సినిమా గురించి అనుకున్నారా? నాకు సినిమాల రివ్యూలు రాసేంత టాలెంట్ లేదులేకానీ .....
మన "హాస్య బ్రహ్మ జంధ్యాల" గారి సినిమాలు చక్కగా కుటుంబ సభ్యులందరూ కుర్చుని హాయిగా చుసేలాగా ఉంటాయి.ఆయన సినిమాలలో ఆరోగ్యకరమైన హాస్యం ఉంటుంది . కొన్ని సన్నివేశాలు గుర్తొస్తే మనం అప్రయత్నంగా నవ్వుకుంటాము.అటువంటి హాస్య సన్నివేశాలను ఈ వీడియో ల్లో చూసి సరదాగా కాసేపు మనసారా .... హాయిగా నవ్వుకొండే.........:):) .





25, సెప్టెంబర్ 2010, శనివారం

ఓ వాలుజడా........

చాలా మంది తెలుగమ్మయిలు లానే నాకు వాలుజడ,పొడవు జడ అంటేచాలా ఇష్టం..

కానీ వాలుజడ కాకపోయినా దానిలో సగమైనా ఉందిలే(పదిసంవత్సరాల క్రితం వరకూ) పరవాలేదు అనుకునేదానిని. .ఇప్పుడు ఆ సగములో సగం కుడా లేకుండా పిలకైపోయింది :( .


రోడ్ మీద ఎవరైనా పొడవు జడమ్మాయి వెళుతుంటే ఆ అమ్మాయి వెళ్ళే వరకూ కళ్ళార్పకుండా ఆ జడ నే .......అలా చుస్తూ ఉండి పోతాను.(ఆ జడకు నా దిష్టి తగిలి పాపం తరువాత ఎలా అయిపోయేదో?) .. .పక్కన ఎవరైనా ఉండి పిలిస్తే సరే లేకపోతె ఆ అమ్మాయి వెళ్ళేవరకూ అంతే.... అంత పిచ్చనమాట జడంటే......


పొనీ మా పాప జడైనా........... పెద్ద జడ అవుతుందేమో అనుకున్నాను కానీ ,ఏదో ఓ మోస్తరు గా ఉంటుందంతే.... ఆ జడని కాస్తా హాస్టల్ లో జాయిన్ చేసినప్పుడు కత్తిరించేసాను.(ఆ కత్తిరించిన జుట్టుతో సవరం కట్టించేననుకోండి.తరువాత ఎలాగూ అవసరమవుతుందని .నాక్కాదండోయ్ తనకే ...... పెళ్ళిళ్ళకి ,ఫంక్షన్స్ కి లంగా ఓణి వేసుకుంటే ,పొడవుజడ...జడకుప్పెలూ ఉండాలికదా.. ). అసలే హాస్టల్లో ఉంటుంది నాలుగైదేళ్ళు పొతే ఇప్పుడున్న జడ కుడా ఉండదేమో .

సర్లే మా జడల గోడవెందుక్కానీ.........


మన దేశం లోనే(అదీ దక్షిణ భారత దేశం) పొడవు జడలు వేసుకునే అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు అనుకుంటాం కదా........

ఇక్కడ చూడండి విదేశాలలో కుడా చక్కగా పొడవు జడ తో అమ్మాయిలు బలే ఉన్నారు .... అంతంత జడ లని వాళ్ళెలా మైంటైన్ చేస్తున్నారో.......


22, సెప్టెంబర్ 2010, బుధవారం

మా ఊరి గణేష్ నిమ్మజ్జన ఊరేగింపుకి ఈ సంవత్సరం స్పెషల్ ఎట్రాక్షన్

మా ఊరిలో ఈ సంవత్సరం గణపతి నిమజ్జనం ప్రతీ సంవత్సరం కంటే ఘనం గా చేయాలని శక్తి డాన్స్, మంటలతో విన్యాసాలు చేసేవారిని తీసుకొచ్చారు. మా ఊరికి వీళ్ళను తీసుకు రావడం ఇదే మొదటిసారి కావటంతో , మంటలతో వీళ్ళు చేసే సాహసాలను అందరూ ఉత్సాహగా చూసారు.

మీరుకూడా మా ఉళ్ళో జరిగిన ఈ దృశ్యాలను చూసి ఆనందిస్తారనుకుంటున్నాను.










20, సెప్టెంబర్ 2010, సోమవారం

మా ఊళ్ళో గణపతి నిమజ్జనాని కై కన్నుల పండుగగా జరిగిన ఉరేగింపు దృశ్యాలు .

నిన్న మా ఊళ్ళో గణపతి నిమజ్జనోత్సవం చాలా బాగా జరిగింది.ఆదివారం కావడంతో .పిల్లలంతా కూడాఎంతో ఉత్సాహంతో ఈ సంబరంలో పాల్గొన్నారు .మేళ తాళాలతో ,విచిత్ర వేషదారుల విన్యాసాలతో వినాయకుని విగ్రహం ఉంచిన ట్రాక్టర్ వెళుతుంటే,.వినాయకుడు, సీతా రాములు,శివపార్వతులు,భాలరామ కృష్ణులు, దుర్యోధనుడు,బీముడు,షిరిడి సాయి,లవకుశులు,,నారదుడు,అల్లూరిసీతారామరాజు(,ఇంకా రెండో ,మూడో వేషాలున్నాయనుకుంటున్నాను......గుర్తులేదు.)వేషాలేసిన వారు ఉన్న ట్రాక్టర్లు కుడా అనుసరించాయి.


ఇంకో విషయమండోయ్ ..........వేషాలేసిన వారంతా మా ఊరే నండి. పైగా నేనంటే నేనని అందరూ పోటీ పడి మరీ వేసారండి. మా బాబు లవకుశుల లో ఒకటి వేస్తానని అన్నాడు కానీ జత సరిగ్గా కుదరక వద్దన్నారు. కొంచెం నిరుత్సాహ పడ్డాడనుకోండి .ఐనా నిన్న ఆదివారం కావడంతో తను అందరితోను ఏంతో ఉత్సాహంగా తిరిగేడు.ఉదయం పదకొండింటికి మొదలుపెడితే రాత్రి పది గంటలకు కానీ ఈ నిమజ్జనోత్సవం పూర్తవలేదు. ఎటువంటి ఆటంకం కలుగకుండా జయప్రదంగా నిమజ్జనోత్సవ ఉరేగింపు జరిగింది..







ట్రాక్టర్లు తో నిండిన వీది .


సీతా రామ లక్ష్మణులు .

అల్లూరి సీతారామరాజు .

శక్తి వేషం