=''/>

29, నవంబర్ 2010, సోమవారం

"పెద్దింటి"కష్టాలు .


ముఖేష్ అంబానీ ఇప్పుడు ఇరవై ఏడు అంతస్తుల తన కొత్త ఇల్లు "అంటిలియా"లో ఉంటున్నారు.

మొన్నీమధ్య రోజులాగే 15వ అంతస్తులో ఉన్న పడక గదిలో ఆయన నిద్రలేచి ,17వ అంతస్తులో ... స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసారు. 19వ అంతస్తులో అల్పాహారం తిని ,ఆఫీసు కు వెళ్లేందుకు 14వ అంతస్తులో డ్రెస్సింగ్ చేసుకున్నారు.ఫైలు ,బాగ్ తీసుకునేందుకు 21 వ అంతస్తులో ఉన్న వ్యక్తిగత ఆఫీసుకు వెళ్లారు.13వ అంతస్తులో ఉన్న నీతా అంబానీకి ,పిల్లలకు బై చెప్పి ,3వ అంతస్తులో ఉన్న కార్ పార్కింగ్ కీ చేరుకున్నారు.తన మెర్సిడెస్ బెంజ్ కారును స్వయం గా నడుపుతూ ఆఫీసుకు వెళ్లేందుకు కారు వద్దకు వెళ్లారు.

కానీ, అప్పుడే ఆయనకు తెలిసింది... కారుతాళం చెవులు పై అంతస్తుల్లో ఎక్కడో మరిచిపోయినట్లు.....

కానీ ....అది ఎన్నో అంతస్తు ??? 15, 17, 19, 14, 21 వ అంతస్తా ? ? ? ? లేక 13వ అంతస్తా? ? ?

వెంటనే ముఖేష్ తన పని మనుషులకు ,కార్యదర్శులకు ,అటెండర్ల కు ఇలా అందరికీ ఫోన్లు చేసారు.

అంతే భారీ " ఆపరేషన్ తాళంచెవి " మొదలైంది.అన్నీ అంతస్తుల్లోను ఉరుకులూ,పరుగులూ.....

అయినా తాళంచెవి దొరకలేదు.గంట తరువాత ముఖేష్ భాయ్ ఓ సాధారణ ఐకాన్ కార్లో ఆఫీసుకు వెళ్లి పోయారు .

కట్ చేస్తే ....

మరుసటి రోజు తెల్లవారు జామున పై అంతస్తుల్లో పెద్ద శబ్దం రావడంతో నీతా బాబి బయటకు వచ్చింది.బాల్కని లోంచి లోనికి వస్తున్న ముఖేష్ ని "ఏమైందని "అడిగింది ."అదా ...జర్మనీ నుంచి హెలికాప్టర్ వచ్చింది .మెర్సిడెస్ బెంజ్ వాళ్ళు మన కారు డుప్లికేట్ తాళంచెవి పంపించారు" అని చెప్పారు.


అప్పుడు నీతా "మీ తాళం చెవి నిన్న మధ్యాహ్నమే దొరికింది .నాలుగు రోజుల క్రితం 14వ అంతస్తులో గదిలోని మీ బట్టలు లాండ్రీ కీ వేస్తుంటే ....మీ ప్యాంట్ జేబులో కనిపించింది .నేనే 16 వ అంతస్తులో ని షెల్ఫ్ లో పెట్టాను" అని తీరిగ్గా చెప్పిందట.

ఇవండి మన ముఖేష్ భాయ్ గారి 27 అంతస్తుల కొత్తింటి(పెద్దింటి) కష్టాలు ...


.

21, నవంబర్ 2010, ఆదివారం

మన బ్లాగ్ వనభోజనాలకి నేనూ, ఆకాకరకాయ కూరతో వచ్చేసానోచ్...

జ్యోతి గారి" బ్లాగ్ వనభోజనాల " పిలుపందుకుని ,నేనూ నా వంటతో సిద్దమైపోయానండోయ్...

నిరుడు ఇలాగే జ్యోతిగారు బ్లాగ్ వనభోజనాలు ఏర్పాటు చేసినప్పుడు ,నేనూ నాకూ తెలిసిన,వచ్చిన వంటతో వచ్చేను.అప్పుడు అందరూ చేసిన రకరకాల వంటకాలతో ..."బ్లాగ్ వనభోజనాల విందు" అదిరిపోయింది.


ఈ" బ్లాగ్ వనభోజనాలు"కి నేను వండుకొచ్చిన వంట....

"ఆకాకరకాయ ఇగురు".

మా వైపు వీటిని ఆకాకరకాయలు అంటారు. వీటిని బోడ కాకరకాయలు అని కూడా అంటారని ఈ మధ్యే తెలిసింది.ఈ ఆకాకరకాయలతో వేపుడు చేయవచ్చు.అలాగే ఇగురు కూరా వండుకోవచ్చు .మేము ఎక్కువగా పాలు పోసి ఇగురుకూర వండుతాము.


ఆకాకరకాయ ఇగురు చేయడానికి కావలసిన పదార్ధాలు:

ఆకాకరకాయలు - 1/4
ఉల్లిపాయలు -4
పచ్చిమిర్చి-3
ఉప్పు
కారం-1/2
పసుపు-కొద్దిగా
పాలు-చిన్న గ్లాస్ లో సగం
అల్లం వెల్లుల్లి ముద్ద-అర స్పూన్

పోపు సామాను:
సెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు,జీలకర్ర, కరివేపాకు.

ఆకాకరకాయ లు(వీటిలో చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఇవి ఇష్టం లేనివారు తీసేసుకుని ముక్కలు కోస్తారు, కానీ గింజలు కుడా రుచిగానే ఉంటాయి.)ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ముందుగా గిన్నెలో నూని పోసి తాలింపు పెట్టుకుని (ఎండుమిరప అక్కర్లేదు) ,దానిలో ఆకాకరకాయ ముక్కలు వేసి ఐదు నిముషాలు వేయించుకోవాలి. అప్పుడు దానిలో ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి అన్నింటినీ కాసేపూ వేగనివ్వాలి.అవి వేగేక, ఉప్పు,కారం,పసుపు,అల్లం వెల్లులి ముద్ద వేసికలుపుకుని మూతపెట్టి , చిన్న మంటపై కాసేపు మగ్గనిచ్చి ,తరువాతకొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఐదునిముషాలయ్యాక దానిలో పాలు పోసి ,కూర బాగా నీరు లేకుండా ఇగరనివ్వాలి. ఇలా పాలు పోసి ఆకాకరకాయ కూర వండితే కమ్మగా ..మంచి రుచిగా ఉంటుంది. ఈ కూర చపాతీలో కీ ,అన్నం లో కీ కూడా బాగుంటుంది.

ఇదండిమన" బ్లాగ్ వన భోజనాలకి " నేను కష్టపడి వండుకొచ్చిన వంట . రుచి చూసి ఎలా ఉందో చెబుతారు కదా!


మా ఊరి మహిళలం అందరం కలసి క్రితం సంవత్సరంకొబ్బరి తోటలో కార్తిక వన భోజనాలు పెట్టుకుని చాలా సరదాగా గడిపాము. ఈ సంవత్సరం ఇంకా అనుకోలేదు కానీ, పాపి కొండలు అనుకుంటున్నాము....ఏమవుతుందో?

17, నవంబర్ 2010, బుధవారం

50% కొనుగోలు ఉచితం ..

పండుగ సీజన్ వస్తే చాలు `ఒకటి కొంటె ఒకటి ఉచితం,50%నుండి 70% వరకూ తగ్గింపుధరలు,మీ ఇంట్లో పాత వస్తువులు తెచ్చి ..మేమిచ్చే కొత్తవస్తువుతో వెళ్ళండని', ఇలా... రోజూ రకరకాల ఆడ్స్ తో పేపర్లలోనూ ,టివి ల్లోనూ.... మనల్ని ఊదరకొడుతూ ఉండడం చూస్తుంటాము.

నాకసలు ఇటు వంటిఆఫర్స్ లో బట్టలు అవి కొనడం ఇష్టముండదు. ఏం కొనాలన్నా,మేమెక్కువగా... రాజమండ్రే వెళ్తాము.పెళ్లి బట్టలు ,చిన్న చిన్న ఫంక్షన్స్ కీ విజయవాడ లో తీసుకుంటాము.

క్రితం గురువారం అనుకోకుండా షాపింగ్ కి వెళ్లి ఇటువంటి ఒక పిచ్చి,చెత్త, అతిచెత్త ,చెత్తాతిచెత్త , ....(ప్లిచ్ :( రాద్దామంటే నాకసలు తిట్లే రావడం లేదు!)ఆఫర్ మాయాజాలం వలలో చిక్కుకుని ...లాక్కుని ...పీక్కుని ,అతికష్టం మీద బయటపడి మా ఊరు చేరేటప్పటికి రాత్రి రెండైంది.

మా ఆడబడుచు బెంగుళూరు లో ఉంటుంది . వాళ్ళమ్మాయి "ఓణిల ఫంక్షన్"కి ఈ "ఇరవై నాలుగు"న డేట్ పెంట్టించుకుని గురువారం వచ్చింది. అక్కడినుండి వచ్చీరావడంతోనే , అందరినీ కంగారు పెట్టేసింది. " తలుచుకున్నప్పుడే తాతపెళ్లి " అన్నట్టు..... ఈ రోజు మంచిది !"బట్టలు కొనడానికివిజయవాడ వెల్దాం"అంటే...సరే అని ఒంటిగంటకు బయల్దేరి వెళ్లేము.

అలా ...మేము బయలుదేరి విజయవాడ వెళ్ళేటప్పటికే సాయంత్రం నాలుగైంది.(అంటే అందరూ పనులన్నీ ముగించుకుని వెళ్ళిపోయే సమయమం అన్నమాట). కళానికేతన్ లో బట్టలు బాగుంటాయి అంటారు కదా ...అని ముందు దీంట్లో చూద్దామని వెళ్లేము. అంతే!అక్కడే చిక్కడి పోయాము.

వెళ్ళగానే వాళ్ళ బట్టలమ్మే అమ్మయి వచ్చి,"మా కళానికేతన్ పెట్టి ముప్పైఐదేళ్ళు అయిందని" ....మంచి ఆఫర్ పెట్టాము. "మీరేమి కొన్నా దాంట్లో సగం డబ్బులు పెట్టి మళ్ళి బట్టలు కొనుక్కోవచ్చు"అంది.అది విని మా అత్తయ్య ఇదేదో బాగుంది .బట్టలన్నీ ఇక్కడే కోనేయవచ్చు! అనుకుంది. పరికిణి లు చూద్దామని చూసేము. ఒకటి బాగా నచ్చిందని కొందామని చూసేము.

మళ్ళి అది తీస్తే దాంట్లో సగం డబ్బులతో మళ్ళి బట్టలు కొనాలికదా .... అని అన్నీ చూసేము. ఏమీ పెద్ద నచ్చలేదు. వేరే కోట్టుల్లో చూద్దామని ...ఏడింటి నుండి తొమ్మిదింటి వరకూ అన్నీ తిరిగినా పరికిణీలు నచ్చలేదు .ఒకవేళ ఎమన్నా కొందామన్నా కళానికేతన్ లో లంగా కొంటే....మళ్ళి వాడి చెత్త ఆఫర్‌కి బట్టలు తీసుకోవాలి కదా అని," ఒక్క లంగా కోసం ఏమీ కొనకుండా", కాళ్ళు నెప్పి పుట్టేలా ... తిరిగి తిరిగి మళ్ళి ఆ కళానికేతన్ కే వెళ్లేము.

అప్పటికే తిండీ ..తిప్పలూ లేకుండా , అన్నీ తిరిగి తిరిగి ఉన్నాము .... ఇంటిదగ్గరనుండి పోన్లు మీద ఫోన్లు .ఇంకా బయల్దేరలేదా? అంటూ...ఇంకా ఏమైనా చూడలన్న ఉత్సాహం కుడా లేదు. వేరే ఏమీ చూడలేదు. మేము చూసి వెళ్ళిన లంగా ఎవరూ తీసుకోలేదు అనుకుని....ఆ పరికిణి తీసి పక్కన పెట్టి , తగ్గించిన బేలెన్స్ లో బట్టలు కొందామంటే.... రేటు నచ్చితే ,రంగు నచ్చదు.రంగు నచ్చితే ....క్వాలిటి నచ్చదు.ఎలాగో కిందా మీదా పడి ... ఆ ఉన్న వాటిల్లోనే ,నచ్చినా నచ్చక పోయినా ఒక్క పరికిణి కోసం నానా తిప్పలూ పడి .... వాడు కొట్టు కట్టేసి పొమ్మనే వరకూ అక్కడే ఉండి , వాడిని తిట్టుకుంటూ అన్నీ తీసుకుని వాడి" 50% కొనుగోలు ఉచితం" ఆఫర్‌కి ఒక దణ్ణం పెట్టి బయల్దేరి ఇంటికొచ్చేటప్పటికి అర్ధరాత్రి రెండైంది.

5, నవంబర్ 2010, శుక్రవారం

వెలుగుల దీపావళి

దీపావళి అంటే .... గుర్తొచ్చేది , కాంతులు వెదజల్లుతూ వెలిగే ప్రమిదలు,పేల్చే టపాసులు.దీపావళి రోజు సాయంత్రం ప్రమిదలు వెలిగించి ....గోడలమీద ,మెడపైన ,వీదిలో అరుగులు మీద ఎక్కడా ఖాలీ లేకుండా ఇల్లంతా పెట్టడం.. చాలా సరదాగా ఉంటుంది.పెళ్ళికి ముందు అమ్మగారింటి వద్ద మా చెల్లి, నేను పోటీలు పడి మరీ ప్రమిదలు వెలిగించే వాళ్లము .

దీపావళి ముందు రోజే ప్రమిదలన్నీ శుభ్రం చేసి ,ఎండలో ఆరబెట్టి ఉంచే వాళ్లము .ఈ ప్రమిదలలోకి నానమ్మ గుడ్డతో చేసిన వత్తులు పంపించేది(ఇప్పుడూ పంపిస్తుంది). .అవి గానుగ నూనెలో నానబెట్టి ఉంచి , సాయంత్రం ఐదు గంటలకి దీపాలు వెలిగించడం మొదలుపెట్టేవాళ్లము. మేడమీద ,రెండంతస్తులూ ప్రమిదలు పెట్టి....అవన్నీ వెలిగించే టప్పటికి చీకటి పడిపోయేది.ఈ లోపు గాలి వీస్తే వెలిగించినవి అరిపోయేవి. మళ్ళి పైకి వెళ్లి వాటిని వెలిగించి వచ్చేవాళ్లము.అసలు అవి పూర్తిగా అంటుకుని వెలిగితే చాలా సేపుఅలా వెలుగుతూనే ఉంటాయి(అందుకే ప్రమిదలలోకి గుడ్డ వత్తులు వాడతాము).

ఇప్పుడు మా పిల్లలూ ప్రమిదలు వెలిగించడానికి అలానే తిరుగుతారు . అవి పూర్తిగా వెలిగాకే టపాసుల వద్దకు వెళ్తారు.

ఇల్లంతా ఇలా దీపాలు వెలిగించి ఆనందించేది .... ఈ దీపావళి పండుగ రోజే కదా!


దీపాల శోభ తో మెరిసేను ముంగిళ్ళు...సిరిసంపదలతో వర్ధిల్లును మీ నట్టిల్లు.

బ్లాగ్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

2, నవంబర్ 2010, మంగళవారం

ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి ...

ఆడపిల్ల్లలు ఎన్ని రకాలు డ్రస్‌లు వేసుకున్నా...పరికిణి - జాకిట్టు లోఉన్న అందం దేనిలో వస్తుంది!అసలు పరికిణి లో ఎంత ముద్దుగా ఉంటారు.వాళ్లనే చూడాలనిపిస్తుంది. ఇప్పటి ఆడపిల్లలు పరికిణి లు వేసుకోవడానికే ఇష్ట పడటలేదు..ఫంక్షన్ లలో వేసుకున్నా ఆ కాసేపు వేసుకుంటారు అంతే. .

నాకు వర్కులు చేయడం ఇష్టం కదా .చీరలమీదే కాకుండా మా ప్రియాకి కూడా రెండు పరికిణి ల మీద వర్కు చేసాను.
నాలుగేళ్ల క్రితం అది హాస్టల్‌కి వెళ్లక ముందు వరుసగా రెండు పుట్టినరోజులకీ రెండు పరికిణి లమీద కుట్టాను .


ఫోటో తీస్తానురా .. అనగానే చప్పున అటుతిరిగింది.

అప్పుడు ఇంటివద్ద ఉండడంతో ఇష్టంగా వేసుకునేది.హాస్టల్ కి వెళ్ళాక అక్కడ ఎవరూ వేసుకోరు అని, వేసుకోమని పెట్టిన వాటిని వెనక్కి తెచ్చేసేది. ఈ నాలుగేళ్ల లో వాటిని రెండు మూడు సార్లు వేసిందేమో అంతే .

చాలా రోజుల తరువాత ఎలాగో ఈ రోజు పరికిణి వేసుకుంది .అదీ ...వారం రోజుల నుండి నాతో బ్రతిమాలించుకుని , రకరకాల గొంతెమ్మ కోర్కెలన్నీ కోరి. నాతో గులాబ్ జాం,పాలకోవ చేయించుకుని తిని,దానికి ఇష్టమైన ఈత పాయల జడ వేయించుకుని , తప్పదురా అను కుంటూ వేసుకుందామని తీస్తే అది కాస్తా కురసైపోయింది .మళ్లి దాని ఫిల్టు విప్పి సరిచేసి దానితో ఆడ్రస్ వేయించే టప్పటికి నాతల ప్రాణం తోకకి వచ్చినంత పనైంది . .
ఈత పాయల జడ .రెండు పాయలు తీసి ,మళ్ళి చిన్న పాయలు తీసి జడ లా అల్లుతారు.