=''/>

22, డిసెంబర్ 2014, సోమవారం

పనసపొట్టు కూర


  ఈ రోజుల్లో  మా వైపు కార్తీక మాసం రావడం తోనే పనసకాయలకోసం వేట మొదలు పెట్టేస్తారు .ద్వాదశి  బోజనాలు ,వన బోజనాలు ,అయ్యప్పల బోజనాలకనీ,ఈలోపు ఏవన్నా  ఫంక్షన్స్ వస్తే   వాటికి " పనస పొట్టు "  కూర మెనూ లో తప్పని సరన్నమాట .   
ఎవరన్నా  పనసకాయల కోసం వస్తే వాళ్లకిస్తూ ఎప్పుడన్నా ఇంటికి తెస్తే ఆ కాయను  పొట్టు    కొట్టాలంటే  బిందిలింగం ( ఊరుమ్మడి వడ్రంగి ) రావాల్సిందే .. 


మొన్నోరోజు అలాగే తెస్తే  పోట్టు కొట్టించి మొదటిసారి నేనే స్వయం గా కూర చేసా .అంటే ఎప్పుడూ చెయ్యడం కష్టం ,పెద్దవాళ్ళు చేసినట్టు చెయ్యగలనో  లేదో  ,ఆ రుచి నాకు వస్తుందా ఇలా అనుకుంటూ  ఎవరో ఒకరి తో  వండించడమే అన్నమాట  .   
పనస పొట్టు కూర  వండటం  ఎంతో  తేలికని    మొదటి  సారి తెలిసింది .. 
ఎంత తేలిక గా చేయ్యోచ్చంటే  .. 
 పనస పొట్టుకి సరిపడా చింతపండు గుజ్జు తీసుకుని,  కుక్కర్లో  పొట్టు తో పాటు చింతపండు గుజ్జు  ,  రెండో ,మూడో ఎన్ని  పడతాయంటే అనుకుంటే అన్నిపచ్చి మిరపకాయలు మధ్య కు కోసుకుని అవీ,సరిపడా ఉప్పు వేసి, కొంచెం పసుపు, నీళ్ళు చాలా కొద్దిగా చూసుకుని పోసుకోవాలి. పొట్టు కాస్త ఆవిరి  కి  ఉడికి పోతుంది .  కుక్కర్ మూత పెట్టి మూడు కూతలు వేసేక స్టౌ కట్టేసుకోవాలి .  
కుక్కర్ మూత తీసుకుని నీరు   ఉంటే   పోయే వరకూ ఉడకబెట్టుకుని   ,
జీడిపప్పు,వేరుసెనగ గుళ్ళు ,సెనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర ,ఎండుమిర్చి ,కరివేపాకు తో తాలింపు పెట్టుకుని కూర   వేడి తగ్గాక  కాస్త  ఆవపిండి కలుపుకుంటే పనస పొట్టు  కూర తయార్  :) ఇప్పుడిప్పుడే వస్తున్న  లేలేత  గింజ పట్టని చిన్న చిన్న పనసకాయల పై   తొక్క తీసేసి కడిగి ,కాస్త పసుపు నూనె రాసి ఇలా పొట్టు  కొడతారు .


5 కామెంట్‌లు:

 1. చూస్తుంటేనే నోరూరుతుంది, తింటే ఇంకెంత బాగుంటుందో, thanks for the recipe, Radhika garu!

  రిప్లయితొలగించండి
 2. ఎచ్చట పనసపొట్టు కూర ఉండునో అక్కడ నేను ప్రత్యక్షమవుతాను....దహా.

  రిప్లయితొలగించండి

 3. ఎవరుబాబూ ముందు. బులుసు సుబ్రహ్మణ్యంగారా! మీ వెనకే ఉన్నానండీ! పనసపొట్టు కూర బహు భేషుగ్గా ఉండేలా ఉందే, అందులోనూ ఆవ పెట్టి. కొద్దిహా ఇంగువ ముక్క తగిలిస్తే అబ్బా ఇహ చెప్పేరూ! ఏమండీ మనలో మాటా లోపలనుంచి కమ్మటి ఆవునెయ్యి వాసన రావటంలా! ఇంతకీ భోజనాల ఏర్పాటెక్కడా?.....

  రిప్లయితొలగించండి
 4. నేను కూడా లైనులో వున్నానండోయ్.
  అన్నట్లు కూరలో వడియాలు కూడా వేశారా?

  రిప్లయితొలగించండి
 5. మీరు చెప్పినవిధంగానే చేశాము. చాలబాగుంది. దీంతో ఇంగువ మిరపకాయలు నంజుకుంటే బాగుంటుంది .

  రిప్లయితొలగించండి