=''/>

10, డిసెంబర్ 2013, మంగళవారం

ఉడుతలు బంతి పువ్వులు కూడా తింటాయా ??

 మా ఇంట్లో చాలా ఉడుతలు   తిరుగుతాయి .అవేప్పుడూ ఏదోకటి తింటూనే ఉంటాయి.వాటి  చిన్నిబొజ్జకి ఎంత ఫుడ్ కావాలో మరి ?అస్తమానూ ఒకదాని వెనుకాల ఒకటి తిరుగుతూ ,చెట్లెక్కి దిగుతూ ..పరుగులు పెడుతూనే ఉంటాయి .అందుకేనేమో  అలా తింటుంటాయి . 

చివరాకరికి బంతి పువ్వుల్ని కూడా అవి వదల్లేదు. 

రోజూ బంతి మొక్కల కొమ్మలు విరిగి పోయి,మొక్కల కింద పువ్వులు  చించేసి ఉంటున్నాయి.  ఎవరబ్బా ..అలా దొంగ చాటుగా పువ్వులు కోసి చించేసేది? అనుకున్నాం .

అసలు విషయం నాలుగైదు రోజులకి  తెలిసిందనమాట. ఆ దొంగలు ఈ ఉడుతులుం గార్లే అని ! 
 దొంగెవరో తెలిసిందిగా ...ఓ రోజు మాటేసి వాటినిలా పట్టేసా ! 

 చూడండి ! ఎంతందంగా ,ముద్దుగా తింటున్నాయో ..

























2, డిసెంబర్ 2013, సోమవారం

మా కార్తిక వనభోజనాలు !!


కార్తిక మాసం మోదలైనప్పుడనుకున్నాం  వనభోజనాలకెళ్లాలని ! ఈ రోజుతో కార్తిక మాసం అయిపోతుందని  నిన్న వెళ్లాం !

మావి ఓన్లీ లేడిస్ వనభోజనాలు అన్నమాట :))

ఇప్పుడసలే పొగాకు సీజన్ మొదలైంది .అందరూ బిజీ బిజీ గా ఉంటారు .దగ్గరలో ఉన్న  పొలమైతే ఎవరినీ   తీసుకెళ్ళమని అడగక్కర్లేదు ,సుబ్బరంగా నడిచి  వెళ్లిపోవచ్చనుకున్నాం.

ఓ నలభై మందిమయ్యాం .ఎవరు ఏమేం  తేవాలో  ముందే   చెప్పుకున్నాం .అన్నీ సిద్దం చేసుకుని  తొమ్మిది గంటలకల్లా వెళ్ళాలనుకున్నాం కానీ  అందరం కలిసి పొలం వెళ్ళేటప్పటికే పది దాటి పోయింది ..

ఉసిరి చెట్టుకి  (కొమ్మ )పూజా కార్యక్రమాలు  అయ్యాక , పాలు పొంగించి పరమాన్నం చేసారు .

అందరూ తలా కాస్త ప్రసాదం తీసుకున్నాక ,మోదలెట్టేసాం మా ఆటలు ,పాటలు :))

మొదట అందరం హౌసీ   ఆడాం.అందులో సగం మందికి  (పెద్దవాళ్ళు )నేర్పి మరీ ఆడాం .ఫుల్  హౌసీ కి ఫ్రైజ్ కూడా ఇచ్చామండోయ్ :)


తారువాత అంత్యాక్షరి ! ఆపాట , ఈ పాట అని లేదు గీత శ్లోకాలు,బజన పాటలు ఎవరికొచ్చినవి వాళ్ళు పాడేయటమే :)..అంత్యాక్షరికి అంతం ఉంటుందా ?ఎంతసేపైనా అలా సాగుతూనే ఉంటుంది గా ..

అసలే నడిచి  వెళ్ళామేమో ,ఆపై ఆటలు !  భోజనాలకు  లేటైందని పిల్లల్ని   చూస్తే  గానీ గుర్తురాలే! అలా  లీనమయ్యారంతా.

ఇంతకీ మా వనభోజనాల మెనూ చెప్పలేదు కదా !

నా వంతుగా పులిహోర ,దొండ కొబ్బరి ఫ్రై,ఇంకా పాలతాలికలు , కొబ్బరన్నం ,గుమ్మడి కాయ కూర , నాటు చిక్కుడు టమాట ఇగురు ,పచ్చి చింతకాయ పప్పుచారు.

ముందు వాళ్లకి కానిచ్చి  మా భోజనాలు కూడా అయ్యేటప్పటికి టైం రెండు గంటలు!

 ఇక మిగిలిన ముడుగంటల్లో ..

 మ్యూజికల్ చైర్ ఆడాం (ఆడించాం).వయసులు వారీగా మూడు బ్యాచ్ లనమాట ! అంటే  ఒకటి యూత్   మా  కోడళ్ళ ,కూతుళ్ళ బ్యాచ్ .రెండో బ్యాచ్  పిల్లలు . మూడో బ్యాచ్ ఎవరో తెలిసిందిగా   :))

అదయ్యేటప్పటికి స్నాక్స్, టీ టైం అన్నమాట ! మిరపకాయ బజ్జీతో అక్కడే టీ పెట్టుకుని తాగాం .

తరువాత చాకిరేవు బల్ల ,పరుగుపందాలు ,కోకో  ,ఇలా ఏవేవో ,ఎప్పటివో స్కూల్లో ఆడినవన్నీ గుర్తు చేసుకుని మరీ ఆడేసాం :))

హ్మ్ !  అసలే సీతాకాలం పొద్దు ! ఐదు గంటలకే  పొద్దువాలిపోద్ది . సర్దుళ్ళు మొదలు పెట్టి అన్నీ సర్దుకుని , వచ్చే ఏడుకి సరిపడా జ్ఞాపకాల్ని మోసుకుంటూ , ఈ ఏడు  వనభోజనాల్లో వచ్చిన లోటు పాట్లను వచ్చే  ఏడాదికి ఎలా సర్దుబాటు చేసుకోవాలో చర్చించుకుంటూ ఇళ్ళకి బయలుదేరాం :))















పొలాల పక్కన కంచెల్లో పువ్వులు ! ఫొటో తీయమని నన్నెప్పుడూ ఊరిస్తుంటాయి :)) నిన్నటికి కుదిరింది .



పుగాకు తోటలో పైపాటు ! అంటే కలుపు రాకుండా దున్నడం .



ఈ పువ్వుల పేరూ తెలీదు .కంచెలపై తీగలు అల్లుకుపోయి ఉంటాయి.