=''/>

16, జూన్ 2014, సోమవారం

కొబ్బరచ్చు (కోకోనట్ బర్ఫీ)

పిల్లలకి బాగా నచ్చే ,తేలికగా చేసుకునే స్వీట్ ఈ" కొబ్బరచ్చు " ! దీనిని కోకోనట్ బర్ఫీ అంటారు  . మేమైతే కొబ్బరి పాలకోవా  అనికూడా అంటాం . 

నేను పిండివంటలూ,స్వీట్సూ అస్తమానూ చేస్తూనే ఉంటా కానీ , చాలా వాటికి  కోలతలు మర్చిపోతుంటా .చెయ్యడానికి అన్నీ దగ్గర పెట్టుకుని అత్తయ్య కో ,అమ్మమ్మ కో ఫోన్ చేసి కొలతలన్నీ వివరంగా తెలుసుకుని  మొదలుపెడతానన్నమాట . ఎప్పటికప్పుడు ఈసారి పుస్తకం లో రాసుకోవాలి అనుకుంటా కానీ ఆ పనయ్యాక బద్దకం వచ్చేస్తుంది. 

ఇంతకీ ఈ స్వీట్ గురించి చెప్పకుండా నాబద్దకం  గురించి ఎందుకు చెబుతున్నానంటే ..

ఈ కొబ్బరచ్చు  చెయ్యాడానికి తీసుకునే సరుకుల పాళ్ళన్నీ సమానంగా తీసుకుంటే చాలు.అందుకని   ఇది చేసినప్పుడు మాత్రం   ఎవరికీ ఫోన్ కొట్టే పనుండదు .ఈజీగా పనై పోయినట్టుంటుంది    . 

 కొబ్బరచ్చు  చెయ్యడానికి  కావలిసినవి  - కొబ్బరి కోరు,పంచదార ,పాలు  . 

 ముందు చెప్పినట్టే  అన్నీ సమానంగా తీసుకోవాలి . తీపి తక్కువగా  తినేవాళ్ళు  పంచదార కాస్త తగ్గించుకుని వేసుకోవచ్చు . 



 

అడుగు మందమున్న  గిన్నెలోకి కానీ,మూకుట్లోకి కానీ కొబ్బరి కోరు,పంచదార ,పాలు సమానంగా తీసుకుని ,పొయ్యి మీద పెట్టి  పాలు మొత్తం ఇగిరి పోయి ముద్దైపోయేలా తిప్పుకోవాలి . 




 ఆఖరి కొచ్చేట్టప్పటికి మంట తగ్గించుకుని సన్న మంట పై తిప్పుకుంటే  అడుగంటుకుని రంగు మారకుండా ఉంటుంది . 



 ఇంత  దగ్గరగా మూకుడు కి అంటుకోకుండా ఉండాలా,ముద్దలా  అయిపోతుంటే దింపేసుకోవచ్చు . లేకపోతే  ప్లేట్లో  కాస్త వేసి , ఉండ చేసి చూసుకుంటే  తెలుస్తుంది .


ప్లేటుకి  నెయ్యి రాసి దానిపై  ఉడికిన ముద్దవేసి , పలచగా  అద్ది (అద్దే టప్పుడు  చేతులక్కూడా నెయ్యి రాసుకుంటే  చెయ్యి కాలకుండా ఉంటుంది . అద్దేటప్పుడు  చేతికి అంటుకోదు ) కాస్త వేడిగా ఉన్నప్పుడు ముక్కలుగా  కోసుకుంటే విరిగి పోకుండా వస్తాయి.


అదండీ మరి ! నేను కొలతలు మరిచిపోకుండా ,తేలికగా చేసే కొబ్బరచ్చు సంగతి !

చాలా ఈజీగా  చెప్పేసేరు కానీ  చెప్పినంత తేలిక కాదు చెయ్యడం అనుకుంటున్నారేమో ! ఒక్కసారి చేసి  చూడండి  . అప్పుడు మీరే  చెప్తారు కొబ్బరచ్చు చెయ్యడం చాలా ఈజీ .. ఇట్టే  చేసుకోవచ్చు అని :)

తేలికగా చేసేరో ?కష్టంగా చేసేరో ?చేసేక   చెప్పాలి మరి !  

3 కామెంట్‌లు: