=''/>

30, జులై 2010, శుక్రవారం

మా ఇంట్లో ఈ రోజు ఇద్దరి పుట్టినరోజు .


ఈ రోజు మా" సాయి" (మా అబ్బాయి )తొమ్మిది సంవత్సరాలు పూర్తిచేసుకుని"పదో సంవత్సర ము "లోకి అడుగుపెడుతున్నాడు .

పిల్లలు ఎంత తొందరగా ఎదిగి పోతారో .అప్పుడే వాడికి పదేళ్లు వచ్చేసాయా అన్పిస్తుంది.

వాడి అల్లరి చేష్టలు,చిలిపి పనులు ,చిన్నప్పటి సంఘటనలు ముద్దు ముద్దు కబుర్లు ,అక్క తో వాడి పోట్లాటలు చాలా గుర్తున్నాయి కానీ ,

ఇంకా చాలా తీపి జ్ఞాపకాలను కాలగమనం లో మర్చిపోయి ఉంటాను . పిల్లల చిన్నప్పటి విషయాలు ఎప్పటికప్పుడు డైరి లోరాసి వుండవలిసింది అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ..

సాయి చిన్నప్పుడు (ఎల్.కే. జీ.లో ఉండగా )అందరమూ డాక్టర్లు గురించి మాట్లాడుకుంటుంటే వాడు నేను డాక్టర్ నై మన ఉళ్ళో హాస్పటల్
కట్టి తాతగారు వాళ్లందరినీ బాగా చూస్తాను అన్నాడు. మా నాన్న గారు,మావయ్యగారు వాళ్ళు సంబరపడిపోయారు వాడి మాటలకి.
ఎందుకంటే మాది పల్లెటురుకదా డాక్టర్లు అందుబాటులో ఉండరు ,వచ్చిన రోగం ఎంతచిన్నదైనా పట్నానికి పోవలసిందే . .

అలాగే తనకి పాటలంటే బాగా ఇష్టం .బాగా వింటాడు .ఇప్పటి పాటలే కాదు ,ఇళయరాజా వి ,ఇంకాపాతవి కుడా ఇష్టం. అప్పుడప్పుడూనేను పెద్దైయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అంటుంటాడు.అలా అంటే మేము సరదాగా "డాక్టర్ సాయి మ్యూజిక్ డైరెక్టర్ "అని పిలుస్తుంటాము.

తను ఈ పుట్టినరోజు కోసం ఇంచు మించు కొత్త కేలండర్ కొన్నప్పటి నుండి అంటే జనవరి నుండి ఎదురు చూస్తున్నాడు (ప్రతీ సంవత్సరమూ అంతే అనుకోండి)
.ప్రతీ నెలా ౩౦ తారీకు వస్తే వచ్చేస్తుంది జూలై నెల అనేవాడు. ,జులై నెల వచ్చేక కౌంట్ డౌన్ మొదలు పెట్టాడు.

ఇదిగో తను ఇంతో ఎదురు చూసిన "జులై ౩౦ " వచ్చేసిందిగా .

"సాయి"నువ్వెంత గానో ఎదురుచూసిన నీ పుట్టినరోజు వచ్చేసింది నాన్న . ఇటువంటి "పుట్టినరోజు "లు జీవితాంతం ఆనందంగా జరుపుకోవాలని
మేమంతా మనసారా ఆశీర్వదిస్తున్నాము .


ఇంతకీ రెండో పుట్టినరోజు ఎవరిదో చెప్పలేదు కదా. ఏ విషయములో నైనా నన్ను ఎంతగానో ప్రోత్సాహించే ది మావారు తనది కుడా ఈ రోజే పుట్టిన రోజు .


సాయి నీకు ,నాన్న కి ఇద్దరికీ
######### ##పుట్టినరోజు శుభాకాంక్షలు"#############

14, జులై 2010, బుధవారం

తొలకరి


మేఘాలను గాలి
జల్లెడ పడుతుంది!
చినుకులు చినుకులుగా...

పల్లెతోట లో మట్టి పుష్పం
పరిమళాలు పంచుతుంది!
తొలకరి జల్లులకు తడిసి.

కొమ్మలు వంచి చెట్టు
ఉగుతుంది!
పక్షిపాటలో లీనమైనట్టు.

ఈ చిరుకవిత ఒక పుస్తకం లో చదివినది .మీ అందరి కోసం .

10, జులై 2010, శనివారం

నా హాస్టల్ జీవితం


నేను ఇంటర్ ,డిగ్రి మొత్తం ఐదేళ్ళు రాజమండ్రిలో ఎస్ .కే .ఆర్ ఉమెన్స్ కాలేజీ లో చదివాను. ఆ ఐదేళ్లు హాస్టల్ లో నే ఉన్నాను. మా అక్కలిద్దరూ అక్కడే చదువుతుండడంతో నన్నూ అక్కడే జేర్చారు.


హాస్టల్ అంటే చక్కగా బోల్డు మందిని ఫ్రెండ్స్ చేసుకొవచ్చు ,హాయిగా మనిష్టమొచ్చినట్టుండొచ్చు..అక్కలుంటారు అనీ రకరకాలుగా ఊహించుకొని మాంచి ఆనందంగా వెళ్ళిపోయాను.వెళ్ళి రెండురోజులుండేటప్పటికి తెలిసింది .హాస్టల్ ఉంటే ఎలాగుంటుందో .......


"హాస్టల్ జీవితం "ఎలాఉంటుందో..అన్దరికీ తెలిసిందే .బోజనానికి క్యు లో వెళ్లడం ,బాత్రూమ్ కోసం వైట్ చేయడం...చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి కానీ, అవన్నీ ఎందుకులెండి .


పిచ్చి పిచ్చి రూల్స్ ఉండేవి. సంధ్య అని ఒక మాట్రిన్ ఉండేది. ఆవిడ తన అరుపులతో ,బెదిరింపులతోనూ అందరికీ ఇరిటేషన్ తెప్పించేసేది.పాపం తన అరుపులకు అందరూ జడుస్తారనుకునేది .వార్డెన్ గా కాలేజీ లెక్చరర్ ఒకావిడ ఉండేది .ఆవిడ విజిట్ కి రాగానే ఈవిడరిపోర్ట్లు ఇచ్చేసేది . కాసేపు అవిడ క్లాసులుపీకేది .అవిడ అలా వెళ్ళగానే అందరమూ దులుపుకుని వెళ్ళిపొయేవాళ్ళము.


నేను ఎక్కువగా అక్కలతోనూ, వాళ్ళ ఫ్రెండ్స్ తోనూ ఉండడం తో మనమూ తొందరగానే "రూల్ అన్ని ఎలా బ్రేక్ చేయాలో నేర్చేసుకున్నాము" . (ఐనా ఇటువంటివి తొందరగా నేర్చేసుకుంటాము కదా) వాళ్ళెప్పుడైనా ఏదోవంక పెట్టి బయటకెళ్ళినా, సినిమాకెళ్ళినా నేనుకూడా వాళ్ళను
హచ్ కుక్క పిల్లలా ఫాలో అయిపొయేదాన్ని . అలా అలా.. వాళ్ళే నాక్కూడా ఫ్రెండ్స్ ఐపొయారు. .త్రోబాల్ ఆడినా ,షటిల్ అడినా వాళ్ళతోనే అడేదాన్ని. నాకు త్రొబాల్లో ఒక సర్టిఫికెట్ కూడా వచ్చింది .దానిని ఇప్పటికీ బద్రంగా దాచుకున్నాను .


మా హాస్టల్ కి ఆదివారాలు జామకాయలబ్బాయి వచ్చేవాడు అమ్ముకోవడానికి.వాడి వద్దకు"
ఒక రూపాయి" తీసుకుని అందరమూ వెళ్ళేవారము. వాడి చుట్టూ చేరి .. మాటల్లో పెట్టి ,రెండుకొని నాలుగు కొట్టేసేవాళ్ళము. కొట్టేసిన జామ కాయలు తింటే అప్పట్లో అదో తుత్తి.. ఇప్పుడనిపిస్తుంది ..వాడు ఎంత కష్టపడి ఆజామ కాయలు తెచ్చి అమ్మేవాడో ,అలా తన కష్టంతో ఎంతమందిని పొషించేవాడో కదా ....అలా కొట్టేసే వాళ్ళమేంటి అని.


మా హాస్టల్ కి వాచ్ మెన్ గా ఒక తాత ఉండేవాడు .అతనిని మంచి చేసుకుని చాలా మంది బయట లైబ్రేరీనుండి నవలలు తెప్పించేవారు.. అలా తెప్పించిన వాళ్ళదగ్గర తీసుకొని నవలలు చదివేదానిని.ఎక్కువగా ఆర్.సంధ్యాదేవి,యద్దనపూడి నవలలూ తెచ్చే వాడు. అతను ఏవితెస్తే అవి ప్రాప్తమనమాట. ఇలా .. డిగ్రీ ఫైనల్ వరకూ చక్కగా వాళ్ళంతా నాకు జతగా ఉండడంతో ఎంజోయ్ చేస్తూ గడిపే సాననమాట.


నేను డిగ్రీ ఫైనలియర్ కొచ్చే టప్పటికి అక్కలు, వాళ్ళ ఫ్రెండ్స్ (నాకూ వాళ్ళే కదా ఫ్రెండ్స్ ) చదువైపోవడంతో వెళ్ళిపోయారు. నేను వాళ్ళంతా ఉండడం తో మాక్లాస్మేట్స్ తో పెద్దగా ఫ్రెంఢిప్ చేయలేదు. వాళ్ళంతా వెళ్ళిపోవడం తో ఫైనలియర్ డల్ గానే గడిచింది . ఫైనలియర్ కదా,ఫ్రెండ్స్ ఎక్కువగా లేక పోవడంతో కొంచెం ఒళ్ళొంచి చదివి డిగ్రీ పూర్తి చేసేసాను..


మా ఫ్రెండ్స్ లో ఇద్దరు రాజమండ్రిలోనే ఉంటున్నారు.అప్పుడప్పుడూ కలుస్తూంటాము. ఈ మద్యనే ఒక ఫ్రెండ్ వాళ్ళ ఆబ్బాయి పంచి కట్ల ఫంక్షన్ జరిగితే మేము వెళ్ళాము.


ఒకరిద్దరు మిస్సయ్యారుకానీ అంతా వచ్చారు. కాసేపు అలా...అలా...రింగులు తిప్పుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాము. ఎలా టైం గడిచిందో కుడా తెలియలేదు.


ఇంతకీ హాస్టల్ నుండి వచ్చేసాక మళ్ళీ ఇప్పటివరకూ అక్కడికి వెళ్ళలేదు. అస్తమానూ రాజమండ్రి వెళుతూనే వుంటాను.ఈసారి ఎలాగైనా వీలు చూసుకుని వెళ్ళి ,అంతాతిరిగి కాసేపు ఆ మదుర ఆజ్జాపకాలన్నింటినీ తలుచుకొని ఆనందించాలి.

7, జులై 2010, బుధవారం

మా తోటలోని పలురకాలమొక్కలు.

తిరిగి నిన్నటి పోస్టేమిటి అని వెళ్ళిపోకండి. నిన్న నాకొచ్చిన వాఖ్యలన్నీ మాయపోయాయని..ఏమి చేలో తెలియక, కామెంట్స్ మాయం:( :( ఐపోయాయన్న ఆత్రుతతో తొలిగించి ఈరోజు మళ్ళీ పోస్ట్ చేసాను. .అన్యదా బావించకండి .నాకు నిన్న కామెంట్స్ రాసిన వారందరికీ దన్యవాదాలు.మీకిష్టమైతే ఈరోజు కూడా మీవాఖ్య రాయండి ఓపికగా.

పునాస వేసి పది సంవత్సరాలవుతుంది. సంవత్సరానికి రెండు కాపులిస్తుంది.కాయలు కాసినప్పుడల్లా కొద్దిగా ఆవకాయ పెడుతూఉంటాము.పప్పులోకి,పులుసులోకి అన్నింటికీ వాడుతూ ఉంటాము.ఇంటిదగ్గర ఉండటముతో మాఇష్టం అనమాట. అన్ని రకాలుగానూ వాడుతూ ఉంటాము. పులిహార, పప్పుకూరలకి(ఏ పప్పుకూరైనా సరే),పులుసులకి,పచ్చళ్ళలోకి, పులుపు కోసం చింతపండు వేయకుండా ఒక మామిడికాయ వేస్తాము. రుచి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి.


ద్రాక్ష పాదుని కడియం నర్సరీలనుండి మొక్కలు తెచ్చి అమ్ముతూంటారువాళ్లవద్దతీసుకునివేసాము. వేసి మూడేళ్లైంది. బాగా కాస్తుంది కానీ కొంచెం పుల్లగా ఉంటాయి. ఎలాగూ పుల్లగాఉంటున్నాయని,అప్పుడప్పుడూ పప్పుచారు కాస్తూంటాము.

బత్తాయిలు బుట్లో దాగున్నాయి. బత్తాకాయలకు మంచిరంగు వచ్చి,దొమపోటు తగలకుండాఉంటాయని ఇలా బుట్టలు కడతారు.



ఈ జామ మొక్క పెద్ద గా పెరగదు కానీ కాయలు పెద్దగా కాస్తాయి .అందుకే దీన్ని కెజీ జామ అంటారు .గింజలు ఎక్కువగాలేకుండా కాయ తినడానికి రుచిగా ఉంటుంది. .



ఇది అంజూర్ మొక్క. ఈ పళ్ళు రక్తసుద్దకి పని చేస్తాయి .ఈగింజలనే ఎండబెట్టి స్వీట్స్ లో వేస్తారు.చిన్నగా గసగసాలు లా ఉంటాయి.ఐదేళ్లైంది వేసి.పువ్వులు ఉండవు.ఆకుల దగ్గరే కాయలు వచ్చేస్తాయి.



శ్రీ గంధం మొక్క .ఈమొక్కవేసి పదమూడేళ్ళైంది. ఇది పారాసైట్ మొక్క .మొక్కలు గింజపడితే లెగుస్తాయికానీ,అది కొంచెం పెరిగే వరకూ పక్కన ఏదోఒక మొక్క సపోర్టు ఉండాలి .కంది మొక్క కు వేరు బాగుంటుందని కందిగింజలు పక్కనవేస్తారు. . అసలు గంధం వాసనేరాదు. మొక్క ముదిరి పూర్తిగా తయారవుతేనే వస్తుందంటున్నారు.


ఇది దాల్చిన చెక్క మొక్క.దీని ఆకులే పలావాకులు.ఐదేళ్లైంది వేసి.


30, జూన్ 2010, బుధవారం

తొలిసారి మిమ్మలి చూసింది మొదలు

1984 లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం లోది ఈపాట .జంద్యాల గారు ఈసినిమాకి దర్శకత్వం వహించారు.చక్కని హస్యముతో చాలాబాగుంటుంది.రమేష్ నాయుడి గారి సంగీతం తో ..వేటూరిగారి ,సాహిత్యము కలిసి ,బాలు,జానికి గార్లు పాడిన పాటలన్నీ ఎప్పటికీ మరుపు రాని మధుర గీతాలే . ఈపాటను జానికి గారు చాలా అద్భుతంగాపాడారు.

ఇంటెర్ నెట్, ఈమైల్స్ లేని ఆరోజులలో ఈ పాట చాలా మంది ప్రేమికులకు ప్రేమలేఖలు రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఉంటుంది.



శ్రీ మన్ మహారాజ,
మార్తాండ తేజా...ప్రియానంద భొజా..

మీ శ్రీ చరణాం భోజములకు ప్రేమతో నమస్కరించి
మిము వరించి ,మీగురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారూ..
భయముతో ..భక్తితో..అనురక్తి తో చాయంగల విన్నపములూ...

సంధ్యారాగం చంద్ర హారతి పడుతున్న వేళ ...
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ....ఓ శుభముహూర్తాన

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలూ ..ఎన్నెన్నొ కధలూ..

జో అచ్చుతానంద జో జో ముకుందా ..
లాలి పరమానంద రామ గోవిందా...జో..జో ..

నిదురపోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా..హూహు హూహు...ప్రేమలేఖ.

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలూ.. .ఎన్నెన్నొ కధలూ...

ఏతల్లి కుమారుడో తెలియదు గానీ,ఎంతటి సుకుమారులో తెలుసునాకు.
ఎంతటి మగధీరులో తెలియలేదు గానీ,నా మనసుని దోచిన చోరులు మీరు.

వలచి వచ్చిన కన్నెను చులకన చేయక
తప్పులుంటె మన్నించి ఒప్పులుగా భావించి
చప్పున బదులివ్వండి..చప్పున బదులివ్వండి..

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలూ.. .ఎన్నెన్నొ కధలూ...

తలలోన తురుముకున్న తుంటరి మల్లె
తలపులలొ ఎన్నెన్నొ మంటలు రేపె

సూర్యుడు చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే
నీజతనే కోరుకునే లతలాగా అల్లుకునే

నాకు మీరు మనసిస్తె ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండి..ఇప్పుడే ..బదులివ్వండి.


24, జూన్ 2010, గురువారం

ఉడుతా..ఉడుతా ఊచ్

మా దొడ్లో మొక్కలెక్కువగా ఉండడంతో ఉడుతలు బాగా తిరుగుతూ ఉంటాయి .అవి గబగబా చెట్లెక్కి దిగుతూండడం చూస్తూంటే బలే ముద్దుగా ఉంటుందికదా .జామకాయలు తినడంలో చిలకలతోనూ,,ధాన్యపు గదిలో నుండి బయటకు పడిన వడ్లను ఒలుచుకుని పిచుకులతోనూ పోటీగా తింటూ ఉంటాయి .చక్కగా ముందుకాళ్లపై నిలబడి తింటూవున్నప్పుడు,నేనెప్పుడైనా ఫొటో తిద్దామని అటువైపు వెళితే చాలు పారిపోతాయి.మా సాయి (మా బాబు)ఐతే అస్తమానూ వాటిని పట్టుకోవాలని ఉంది అని వాటి వెనకాల తిరుగుతూ ఉంటాడు. మా స్నూపీ (కుక్క)కూడా అవి జామచెట్టుపైనుండి కిందకీ పైకీ తిరుగుతూఉంటే వాటిమీదకు పరిగెట్టి ఆడుతూ ఉండేది . (మా స్నూపీ ఇప్పుడులేదు చనిపోయింది).

ఒకరోజు ఉదయాన్నే మా పనమ్మాయి ప్రణతి(అసలుపేరు పెంటమ్మ.కానీ బాగోలేదని మార్చుకుందంట.మాకూ ఈమద్యనే తెలిసింది.)పాపగారూ అంటూ నా దగ్గరకొచ్చి ఉడుత నీళ్ళకుండీలో పడిపోయిందంది.

అయ్యో అని గబగబా కుండీ దగ్గరకెళ్ళి చూస్తే అది పైకి ఎలా రావాలో తెలియక గుండ్రంగా ఆనీళ్లలో తిరుగుతుంది.పట్టుకుని పైకి తీద్దామంటే అదిచాలాసేపు దొరకలేదు ఎలాగో తీసేసాము.కుండీలో ఎప్పుడుపడిందో ఏమో ఒణికిపోతూ ఉంది.వదిలేద్దమనుకుని ,మళ్ళీ సాయి పట్టుకుంటానంటున్నాడుకదాని దానిని ఎలకల బోను ఉంటే దానిలో పెట్టేము.

రోజూ 7గంటలైనా లేపినా లేవడు . ఆరోజు సాయి.. ఉడుత బోనులో ఉంది లే పట్టుకుంటానంటున్నావు కదా అనగానే టక్కున లేచి కూర్చున్నాడు .అసలే అస్తమానూ ఏవోకటి ప్రశ్నలు వేస్తూ బుర్రతింటూ ఉంటాడు.లేపి ఉడుతిదుగో అనగానే పరిగెట్టుకుని వచ్చి దానిని చూస్తూ మళ్ళి ప్రశ్నలు మొదలు పెట్టాడు.ఇది ఎలావచ్చింది బోనులోకి,అసలు నీళ్ళలో ఎందుకు పడిందని ఇలా రకరకాలుగా అడిగి కాసేపు నా బ్రైన్ తినేసి దానికి ఆకలిగా ఉండేమో అని జామకాయ ముక్కలు ,వడ్లు (వాటిని ఉడుతలు తినడం రోజూ చూస్తూంటాడు)తెచ్చి పెట్టాడు.

అది అసలే స్వేచ్చగా తిరుగుతూంటుందికదా . దానికి ఆబోనులో ఉండడం నచ్చలేదు మేము ఏమి పెట్టినా తినలేదు .అమ్మా ఏంటి ఏమీ తినడం లేదు రోజూ తింటుందికదా అనికాసేపు బాదపడి ఏమీ తినటం లేదుకదా ,దాన్నిక వదిలేద్దాము అన్నాడు. కానీ ఒకసారి పట్టుకుని దానితో ఫొటో తీయించుకుంటానన్నాడు . సరే అని ఆ బోనుకి బయటకు వెళ్ళే దారి కిందకి ఉంటుంది .నేను ఆతలుపు తెరిచి అక్కడ చెయ్యి పెట్టాను పట్టుకుందామని . మామీద ఎంత కోపంగా ఉందో కానీ దానికి,పట్టుకుందామని తలుపుదగ్గర పెట్టిన నాచేతివేలిని చటుక్కుని కొరికేసి చిటుక్కున పారిపొయింది .మేము చుసేలోపే వెళ్ళి పోయింది. ఇక నావేలైతే రక్తం వచ్చి కొద్దిగా వాసింది కూడాను. నొప్పి రెండు రొజులుంది. దానిపళ్ళంత పదునుగా ఉన్నాయి.ఇది చూసి మావాడు మాబుక్ లో ఉంది ఉడుతల పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి అందుకే గట్టివికూడా తింటాయి.అని వాడి పరిజ్ఞానమంతా కాసేపు ఏకరువుపెట్టేడు. ఉడుత నావేలు కొరికిన గొడవలో పడి దానిని పట్టుకుని ఫొటో తీయించుకోలేదన్న విషయం కూడా మర్చిపోయాడు.

అప్పటినుండీ రోజూ వాటిని చూస్తున్నాడుకాని, ఉడుతను పట్టుకోవాలి అని అనడంలేదు

21, జూన్ 2010, సోమవారం

ఒక ప్రతేకత గల తరిణీమాత ఆలయం (ఒరిస్సా)


ఈ"తరిణీమాత" ఆలయం ఉత్తర ఒరిస్సాలోని ఘట్ గావ్ లో ఉంది .ఈఆలయం అంటే అక్కడి ప్రజలకు చాలా భక్తీ, నమ్మకము.

ఈ గుళ్ళో రోజూ ఇరవైవేల నుండి ముప్పైవేల కొబ్బరికాయలు కొడుతూ ఉంటారట .పండగలప్పుడు ,ప్రత్యేఖ పర్వదినాలకీ లక్ష ల కొబ్బరికాయలు కొడతారంట .
చాలా గుళ్లలో ఇలాగే జరుగుతుంది కదా అనుకుంటున్నారా.. అన్ని ఆలయాలలాగా కాదు ఈతరిణీమాత ఆలయం. ఈగుడి ప్రత్యేఖత ఏమీటంటే ఇక్కడి ప్రజలు వారి మొక్కులు తీర్చుకోవడానికివాళ్ళేవెళ్ళక్కర్లేదు.మొక్కుబట్టికొబ్బరికాయలు పంపిస్తారుఒక్కోసారి వాటితోపాటు ముడుపులుకూడా కడతారు .


ఘట్ గావ్ వెళ్ళే దారి పొడువునా ఎర్రగుడ్డ చుట్టిన కొబ్బరికాయలు,ముడుపులుకట్టుకొని నిలబడి అటువైపు వెళ్ళే బస్సులకు అందచేస్తారు .బస్సు డ్రైవర్లు కూడా అడుగడుగునా ఆగి అందరూ అందజెసే వాటిని జాగర్తగా తీసుకెళ్ళి అమ్మవారికి అందజేస్తారు. ఒక్కోసారి ఆకొబ్బరికాయలు పట్టుకుని మనుషులెవరూ నిలబడి ఉండరు ,ఐనా బస్సులు ఆపి ఎన్నికాయలుంటే అన్నింటినీ బస్సులో వేసుకుని సర్దు కుంటారు.ఒకవేళ బస్సు ఏదైనా అమ్మవారి ఆలయం ఉన్న ఘట్ గావ్ వరకూ వెళ్ళేది కాకపోతే ఆ దారిలో వెళ్ళే కూడలి దగ్గర దింపేసి వెళ్ళిపోతారు .అటువైపు ఘట్ గావ్ వెళ్ళే బస్సువాళ్ళు వాటిని ఎక్కించుకుంటారు .బస్సంతా నిండినా సరే డ్రవర్ సీటుకిందైనా ,ప్రక్కనా ఎక్కడైనా పెట్టుకుని తీసికెళతారంట. అలా ఆడ్రైవర్లు అందజేసినవాటిని ఆగుళ్ళో పూజారులు ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వంతులేసుకుని మరీ కొడతారంట .

ఎక్కడా మోసం లేదు ,దగాలేదు .కొబ్బరికాయ అమ్మవారిని చేరకపోయే ప్రశ్నే లేదు .బద్దకించో ,నిర్లక్ష్యం చేసో తీసుకెళ్ళకపోతే ఇంజన్ చెడిపోవడమో ,ఆక్సిడెంట్ అవడమో జరుగుతుందని డ్రవర్ల తో సహా అందరి నమ్మకమూను. అంతటి దృడ నమ్మకాలున్నప్పుడు తప్పులకూ ,పొరపాట్లకూ అవకాశం ఎక్కడుంటుంది.

ముంబైలో డబ్బావాలాలు ప్రతీ క్యారేజీనీ దాని యజమానికి జేర్చినట్లు ఉత్తర ఒరిస్సా లో ప్రతీ తరిణీమాత భక్తుడూ, భక్తురాలూ తలచుకోవాలేకానీ తాము కాలు కదపకుండా తమ నివేదననీ,ముడుపులనూ అమ్మవారికి సమర్పించగలరన్నమాట .

17, జూన్ 2010, గురువారం

మా తోట లో విరిసిన గులాబీల అందాలు

మాఇంటిలో అందరికీ మొక్కలు పెంచడం ఇష్టమే.అందరమూ ఏవోకటి మొక్కలు తెచ్చి వేస్త్తూ ఉంటాము. అలాగని మాదేమీ పెద్ద గార్డెన్ కాదు కానీ చిన్న సైజు అడవిలాగా ఉంటుంది . అంజూరు,బత్తాయి,కెజీ జామ,ద్రాక్ష,శ్రీగంధం,దాల్చినచెక్క మొక్క , తమలపాకు తీగ ఇలా చాలా రకాలున్నాయి. అలాగే పునాస, పంచదారకల్తీ అనే రెండు రకాల మామిడి చెట్లున్నాయి. మిరియంతీగకూడా వేసాముకానీ ఈమద్యే దానికి వాతావరణం కుదరక చనిపోయింది. అలాగే రకరకాల పూల మొక్కలు కుడా ఉంటాయి

ఇవన్నీ మా ఇంటిలో పూసిన గులాబీలే .

















వర్షాకాలంలోనూ సీతాకాలములోనూ మాఇంటివద్ద గులాబీలు బాగా పూస్తాయికానీ, వేసవి కాలంలో ఎంత శ్రెద్ద తీసుకున్న సరిగా పూయవు.పైగా ఎండలు తట్టుకోలేక కొన్ని మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి. మళ్ళీ వర్షాలు పడగానే కడియం నర్సరీల నుండి మొక్కలు సైకిల్ మీద తెచ్చి అమ్ముతూ ఉంటారు.వాళ్ళదగ్గర కొని వేస్తాము. హైబ్రీడ్ గులాబీలు మా వాతవరణంలో తొందరగా తెగుళ్ళు వచ్చి చచ్చిపోతుంటాయి. అందుకని ఎక్కువగా నాటు గులాబీమొక్కలే పెంచుతాము.అవైతే వర్షాకాలంలో కొమ్మలు కత్తిరించి పాతినా పెరుగుతాయి .

ఎలాఉన్నాయి మరి అందాలు చిందే గులాబీలు.

10, జూన్ 2010, గురువారం

ఏరువాక ఆరంభం


ఏరువాక సాగాలోరన్నో రైతన్నా..

నీ కష్టమంతా తీరునురోరన్నో రైతన్న...

అని గ్రీష్మఋతువు తరువాత ప్రారంభించే ఏరువాక పురస్కరించుకుని ఒక సినీకవి రాసినపాట ఇది.

జనరంజకమైన ఈపాట గ్రామీణ వ్యవసాయానికి ఏరువాక ప్రాధాన్యతను తెలుపుతుంది .

మంగళవారం నుంచి ప్రారంభమైన మృగశిర కార్తె వ్యవసాయ పనులకు ప్రారంభసూచిక .నాడు నాగళ్ళతో పనులు ప్రారంభిస్తే నేడు యాంత్రీకరణ ఏరువాక రూపు మార్చివేస్తుంది






మృగశిర కార్తె మంగళవారం నుండి ప్రారంభమైంది .రోళ్లను పగలగొట్టే రోహిణీకార్తె (మే నెల మధ్యనుండి) తరువాత వచ్చే ఈ కార్తె కి వ్యవసాయ రంగం లో ఎంతో ప్రాముఖ్యతుంది.
ఖరీఫ్ పనులు ఈకార్తె లోనే ప్రారంభమవుతాయి. ఈశైన్య ౠతుపవనాలు తొందరగా కరుణిస్తే తొలకరి జల్లులతోడ్పాటుతో రైతులు తమ పనులకు శ్రీకారం చుడతారు .

ఏరువాక పేరుతో నాటి రైతులైతే ,నాగళ్ళు బుజాన వేసుకుని కాడెద్దులతో దుక్కిదున్ని భూమాత ,గంగమ్మతల్లికి,వరుణదేవుడికి పూజలు చేసి పనులు ప్రారంభించేవారని మాతాతగారు అంటారు.

రొజులుమారాయికదా ప్రస్తుతం నాగళ్ళకు బదులు ట్రాక్టర్ లతో ఏరువాక పనులు ప్రారంభమవుతున్నాయి.

డెల్టా ప్రాంతాలలో ఈకార్తెలో నే గోదావరి జలాలను వదులుతారు .పనులుకూడా ఇప్పుడే మొదలుపెడతారు . పదకొండురోజుల పాటు ఈకార్తె ఉంటుంది .


6, జూన్ 2010, ఆదివారం

సెలవలలో మా పిల్లల సరదాలు


ఈ వేసవి సెలవలలో ,మా అమ్మగారింటి వద్ద మా అక్క,చెల్లి,మాపిల్లల సరదా ఆట పాటలు








అష్టా -చెమ్మా



మాచెల్లి కొడుకు చెరణ్,వీడో తోకలేని కోతి .ఏదుంటే అదెక్కి వేలాడుతా ఉంటాడు.

నాలుగు గవ్వలాట