=''/>

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

మా ఊరిలో గణపతి నవరాత్రులు.

హాయ్ !అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారా? బుజ్జి బొజ్జ గణపతికి ఉండ్రాళ్ళు ,కుడుముల నైవేద్యాలన్నీ బోజ్జనిండా పెట్టేరా?

మా ఊరి లోనూ జరుగుతున్న గణేశుని నవరాత్రి ముచ్చట్లూ చదవండి మరి..




మా ఊరిలో" వినాయక చవితి" సంబరాలు ఇంచుమించు పదిహేనేళ్ళ నుండి జరిపిస్తున్నారు..కానీ ఈ ఏడు మొదటి సారి నవరాత్రులు జరుపుతున్నారు. ప్రతీ సంవత్సరమూ లైబ్రెరీలోపెట్టి అక్కడే పూజ చేస్తారు.(లైబ్రెరీ లో వినాయకుడేంటి అనుకుంటున్నారా? మా ఊరి లైబ్రెరీ {ఆల్ ఇన్ } పోస్ట్ చదివితే తెలుస్తుంది)ఈ సారి మా గ్రామ కూడలి లో గణేశుని విగ్రహం నిలబెట్టారు. .ఇంకో విశేషమండి మా ఊరి గణపతికి పూజ మేమే చేసాము అనుకోకుండా ..ఉదయాన్నే ఇంటివద్ద పుజయ్యాక అక్కడ చేసాము.

ఈ సంవత్సరం మా ఊరి కుర్రాళ్ళు మంచి జోరుగా గణపతి ఉత్సవాలు జరిపించేస్తున్నారు.ఇక ఈ తొమ్మిది రోజులూ మైక్ ఫుల్ సౌండ్ లో పెట్టి మా చెవుల్లో తుప్పు వదిలించేస్తారు .చందాలు బాగా వసూలవడంతో ఆఖరి రోజు ఊరేగింపుకే ముప్పైఐదు వేలు ఖర్చు పెడుతున్నారు .(మా వారు కుర్రాళ్ళకు హెడ్ లాంటివారు కావడంతో ఇటువంటి విషయాలు నాకూ తెలుస్తాయనమాట).ఇంకా మ్యూజికల్ ఆర్కెష్ట్రా ,ఇలా ఒకటో రెండో ప్రోగ్రామ్స్ పెట్టారు .మా ఊళ్ళో ప్రోగ్రామ్స్ చేయడానికి ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకోసారి రావడానికి ఇష్టపడరెమో అనిపిస్తుంది .ఎందుకంటే ఊరు చిన్నది కావడంతో ఏ ప్రోగ్రాం జరిగినా చూడడానికి వచ్చేవాళ్ళు గట్టిగా లెక్కేస్తే వంద మందికి మించరు.మ్యూజికల్ ఆర్కెష్ట్రా లాంటివైతే మా పక్కఊళ్ళ నుండికూడా చూడడానికి వస్తారు .ఐనా ఎంతకంతే...జనం లేకుంటే వాళ్ళ కు హుషారు ఎక్కడుంటుందండీ....

తొమ్మిది రోజులూ పూజలందుకున్న మా వినాయకుడి నిమజ్జనానికి ఉరేగింపు చాలా బాగా జరుగుతుంది.ఉళ్ళో ఇంచుమించు అందరి ట్రాక్టర్లు ఊరేగింపులో పాల్గొంటాయి.ఉన్నవి నాలుగు వీధులైనా ఉదయం మొదలుపెట్టిన ఉరేగింపు సాయంత్రం ఐనా అవ్వదు.

మా గణేశుని ఉరేగింపు చిత్రాలు మీకూ చూపించడానికి ట్రై చేస్తానండి...తరువాత టపాలో .
.

6, సెప్టెంబర్ 2010, సోమవారం

నేను బ్లాగ్ రాయడం మొదలుపెట్టి అప్పుడే సంవత్సరం ఐపోయిందా?

మాది వ్యవసాయ ఉమ్మడి కుటుంబం .మా వారు బి.బి.ఎం.చదివారు కానీ , ఎరువుల కొట్టు ,వ్యవసాయం చూ స్తూ ఉంటారు.మా అమ్మగారిదీ ,అత్తయ్య గారిదీ కూడా మాఊరు గాంధీనగరమే (ఒకే వీధి . మేనత్తే ).నేనూ డిగ్రీ చదివాను. తీరిక సమయాలలో కుట్లు ,అల్లికలూ చేసుకునే సామాన్య గృహిణిని.పదేళ్ళ నుండి కంప్యుటర్ ఉన్నా లేని మార్పు నెట్ వలన ఈ సంవత్సరం కలిగింది . బ్లాగ్ ద్వారా మంచి స్నేహితులను అందించింది.

మా ఊరికి సంవత్సరం క్రితమే బ్రాడ్బాండ్ వచ్చింది .బ్రాడ్బాండ్ రాకముందూ నెట్ఉన్నా కానీ పాటలు ,ఫోటోలు డౌన్లోడ్ చేయడం,ఇలాంటి చిన్న చిన్నవి చేసేదానిని.మాకు బ్రాడ్బాండ్ రావటం , ఈ నాడు లొతెలుగు బ్లాగ్ల గురించి రావడం ఒకసారే జరిగింది. ఈ నాడు ఆదివారం పుస్తకంలో కూడలి గురించి తెలుగు బ్లాగ్ల గురించి చదివాక , రోజూ మన తెలుగు బ్లాగ్లు చదివేదానిని..అవన్నీ చదువుతుంటే ...అందరూ బలే రాసేస్తున్నారు అనిపించేది.నేను కుడా రాస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించేదానిని .కానీ ఏదో మామూలు డిగ్రీ చదివి , పల్లెటూరి గృహిణినైన నేను రాస్తే ఎవరైనా చూస్తారా?లేక పొతే ,కంప్యుటర్ నాలెడ్జ్ పెద్దగా లేదు ,అవన్ని నాకెలా తెలుస్తాయి .. ఇలా అనుకునేదానిని.మా వారి తో అంటే ,తను చాలా ప్రోత్సాహించారు .

బ్లాగ్ రాయటం మొదలు పెట్టానుకాని కానీ ...మన బ్లాగ్ ఎవరు చుస్తారులే అనుకునేదానిని .అందుకే చాలా రోజులు హిట్ కౌంటర్,అనుచరులు గాడ్జెట్ ఇటువంటివేవి ఉండేవి కావు.కొత్తలో అలానే ఎవరూ పెద్దగా కామెంట్ లు కుడా రాసేవారు కాదు.చాలా నిరుత్సాహంగా ఉండేది :( .నేననుకున్నట్లే అయ్యిందా, లేకపోతే నేను ఇంకా బాగా రాయాలా అనుకునేదానిని.ఇప్పుడు పరవాలేదనుకుంటున్నాను.(నిజమేనా? మీరే చెప్పాలి.)

నిజమేనా ?నేనే బ్లాగ్ రాస్తున్నానా?అనిపిస్తుంటుంది అప్పుడప్పుడ్డు.. నేను బ్లాగ్ రాస్తున్నట్టు ఎవరికీ చెప్పలేదు కూడా .మా అక్కలకు,చెల్లికే తెలుసు .నా రాఖీ టపా గురించి పేపర్లో వచ్చినప్పుడు పేపర్ చూపించి చెప్పేను.ఆ టపాచూడని వారు http://saisatyapriya.blogspot.com/2010/08/blog-post_25.html ఇక్కడ చూడొచ్చు . .

ఎలాగో పడుతూ ...లేస్తూ ...బ్లాగ్ రాయడం మొదలుపెట్టి ఇప్పటికి సంవతత్సరం పూర్తి చేసాను. ఇంతకీ అసలు విషయమేమిటంటే ...నా బ్లాగ్ మొదలు పెట్టి ఏడాది అయిందని చూసుకోలేదు .పాత టపాలు చూస్తుంటే తెలిసింది.అప్పుడే నేను బ్లాగ్ మొదలపెట్టి సంవత్సరం ఐపోయిందా అనిపించింది..

ఈ మద్యే మా పిల్ల ల పుట్టిన రోజులు చేసుకున్నాము. మరి నా బ్లాగ్ నేస్తా లైన మీ అందరి ఆశిస్సులతో నా కొత్త నేస్తం నా బ్లాగ్ మొదటి పుట్టినరోజు కుడా చేసుకోవాలిగా.

3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

అనావృష్టి ,అతివృష్టి





నీరు పెట్ట లేక ఊడ్చిన వరిచేనుని అలా వదిలేసా రు. .




నిరుడు ఈ రోజులలో వర్షాలు సరిగా లేక వరి చేలకు నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడ్డారు .మాది మెట్ట ప్రాంతం అవటంతో ,మా వైపు ఎక్కువగా బోర్లు నుండి వచ్చే నీళ్ళ తోనే వ్యవసాయంచేస్తారు.వర్షాలు సకాలంలో పడకపోతే బోర్ నీళ్ళ తో ఎంతని వ్యవసాయం చేస్తారు .


ఈ ఏడు వానలు చాలా ఎక్కువగా పడుతున్నాయి .ఈ సంవత్సరం జూన్ మొదటి వారంలోనే ఋతుపవనాల రాకతో మొదలైన ఎడతెరిపిలేని వర్షాలవలన అప్పుడే ఈ ఏడు సాదారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైనదంటున్నారు. సాదారణంగా అక్టోబర్,నవంబర్ నెలల మధ్యలో ఏర్పడే వాయుగుండా ల వలన గానీ,తుఫాన్ల వలన కానీ నదులు ,కాలువలు ,చెరువులు నిండి వరదలు అవీ వస్తూ ఉంటా యి కదా .మాకు ఈ వర్షాల వలన ఎర్రకాలువ(ఈ ఎర్రకాల్వ మా పొలం పక్క నుండి వెళుతుంది . ) నిండి చేలకు నష్టాన్ని కలిగిస్తాయి .రెండు సంవత్సరాల క్రితం ఐతే ఈ వరదలకు, కోతకు వచ్చిన వరిచేను వారం రోజులు నీట మునిగి పోయి పంట చేతికి రాకుండా పోయింది .అప్పుడు కాల్వకు గండి పడిరైతులకు బాగా నష్టం వచ్చింది . ఇది చెరువనుకున్తున్నారా?కాదు మా వరిచేనే .వరదనీటిలో మునిగి ఇలా చెరువు ను తలపిస్తుంది .


ఆ గండి ని పుడ్చక పోవటం వలన క్రిందటి నెలలో కురిసిన వానలకు వచ్చిన వరదకు మా చేను ఒక్క రోజు మునిగి పోయింది .మళ్ళీ పది, పదిహేను రోజులనుండి కురుస్తున్న వర్షాలకు ఎర్రకాల్వ లోకి బాగా వరద నీరు వచ్చి చేను మునిగి పోయి మూడు రోజులుంది.కానీనీళ్ళలో మునిగింది మూడు రోజులే కావడం, ఇంకా కంకులు వేయక పోవడంతో నష్ట మేమీ ఉండదంట.

వరద నీటికి ఎలా పడిపోయిందో చుడండి . ప్రస్తుతం చేలో నుండి వరద పోయింది .ఒక వారం పొతే నెమ్మిదిగా చేనంతా తేరుకుంటా దంట .( మందులు బాగా వేస్తారేమో )

అయినా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగానే పడతాయం టున్నారు .ఇంకా ఎన్ని సార్లు వరదలొస్తాయో ఏమిటో? రైతులకు ఏంటో ఎంత కష్ట పడుతున్నా ఎప్పుడూ అతివృష్టి ,అనావృష్టి ఏదో ఒకరూపంలో నష్టాన్ని కలిగిస్తూనే ఉంటాయి . .

30, ఆగస్టు 2010, సోమవారం

మా సీమ టపాకాయ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఎవరా సీమ టపాకాయ ?అనుకుంటున్నారా .......


ఇంకెవరూ .........మా సిసింద్రీ,చీలి చింతకాయ ,సీమ టపాకాయ అన్నీ మా అమ్మాయి.... " సత్యప్రియ". .

తన" పుట్టినరోజు " ఈ రోజు.

తను  హాస్టల్ లో ఉంటుంది. 

మేముండేది పల్లెటూరు కావడం వలన కొంచెం మంచి స్కూల్ లో చదివించాలంటే హాస్టల్ లో చేర్చక తప్పదు. తనని ఫిఫ్త్ క్లాస్ కొచ్చాక హాస్టల్ లో పెట్టాము.హాస్టల్ లో జేర్చాక చాలా రోజులు తన మీద బెంగగా ఉండేది. రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు ఏడ్చేసే దానిని. కొద్ది రోజులకు అలవాటు పడిపోయాననుకోండి .కొత్తల్లో ఐతే హాస్టల్ కి చూడడానికి వెళితే అదేడుస్తుంటే నాకు కూడా ఏడు పోచ్చేసేది.మా ఇద్దరినీ చూసి అక్కా వాళ్ళు నవ్వేవారు .నన్ను తిట్టేవారు..నువ్వు దానిని చూడడానికి వస్తున్నావా ...ఏడిపించడానికి వస్తున్నావా అని .

దానికి కుడా ఇంటి బెంగ బాగాఎక్కువ . .ఇంటికొచ్చి వెల్లినప్పుడుల్లా కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని వెళ్ళేది. వాళ్ళ హాస్టల్ పక్కన అపార్ట్మెంట్లు ఉంటాయి .అక్కడికి వచ్చేయండి అంటుంది .అక్కడికి వస్తే ఎలా ఉంటుందో ఉహించుకుని ఆనంద పడుతుంటుంది పాపం .మేము అక్కడికి రామని తెలుసు ఐనా అదో తుత్తి దానికి .ఈ మధ్య ఓరోజు నువ్వు ఇంటర్ లో హాస్టల్ కి వెళ్ళావ్ ,మరి నన్ను ఫిఫ్త్ లోనే ఎందుకేసారు .అని అడిగింది . కాసేపు ఏమి చెప్పాలో తెలియలేదు .తరువాత ఏదో సర్ది చెప్పననుకోండి .. ఈ మధ్య పరవాలేదు కొంచెం తెలుసుకుంది .ఏడవకుండా వెళుతుంది ..ఫోన్ చేసినా బాగా మాట్లాడుతుంది .

ఈ రోజు మా " ప్రియ " పుట్టినరోజు కదా  హాస్టల్ కెళ్ళి  కేక్ కట్ చేయించాలి .సాయంత్రం వరకూ దానితో గడిపి రావాలి .


బంగారం నువ్వు ఇటువంటి వంటి పుట్టినరోజులు జీవితాంతం జరుపుకోవాలని ఆశిస్తూ ...................

ఆ బగవంతుడు నీకు ఆయురారోగ్యా లందించాలని మనఃపూర్వకం గా కోరుకుంటూ ...........


ప్రియమ్మలూ పుట్టినరోజు శుభాకాంక్షలు రా.......................

29, ఆగస్టు 2010, ఆదివారం

నేడు మన మాతృభాషా దినోత్సవం

గిడుగు రామ్మూర్తి పంతులు గారి 147 వ జయంతైన ఈ రోజు ని మనం " మాతృ భాషా దినోత్సవం" గా జరుపుకుంటున్నాము.

శిష్ఠ వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన చాలా కృషి చేసారు .

శ్రీకాకుళం జిల్లాలో పర్వతాల పేటలో ఆయన 1863ఆగష్టు 29న వీర్రాజు ,వెంకమ్మ దంపతులకు జన్మించారు .

1896 లో బి.ఎ డిస్టింక్షన్ ఆయన చదువు పూర్తి చేసారు .గజపతి మహారాజా కాలెజీ లో అధ్యాపకుడిగా పనిచేశారు.తెలుగుభాషా బోధనను వ్యావహారికంలో చేయాలని ఆయన ఆలోచనకు జే.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయాదికారి నుండీ మద్దతు లభించింది .అప్పటి ఏవీ ఎన్ కాలెజీ ప్రదాన అధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్ ,గురజాడ అప్పారావు,యేట్స్ , రామప్ప పంతులు గారూ కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి కృషి చేసారు .వీరి కృషి కారణంగా 1912 -13 స్కూల్ ఫైనల్ తెలుగు పరీక్షను గద్యంలో లేదా వ్యావహారిక భాషలో రాయొచ్చని ఆదేశాలు జారీ చేసారు . అప్పటినుండి స్కూల్,కాలేజీ పాఠ్య పుస్తకాలు వ్యావహారిక భాషలో వెలువడటం మొదలుపెట్టాయి .ఆయన సేవలను గుర్తించిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము రావ్ బహుద్దూర్ బిరుదు ప్రదానం చేసింది .వ్యవహారిక భాషకు ఇంత సేవచేసిన ఆయన 1940 ,జనవరి 22వ తెదీ న మరణించారు .

మన తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతిని మనమంతా ఈ రోజు "తెలుగు భాషా దినోత్సవం" గా జరుపుకుంటున్నాము..

.



.

25, ఆగస్టు 2010, బుధవారం

నా రాఖీ టపా ఆంధ్రజ్యోతి నవ్య లో వచ్చిందోచ్ !!


మాకు ఆంధ్రజ్యోతి పేపర్ వస్తుంది . రోజూ ఉదయం పేపర్ రావడంతోనే హెడ్లైన్స్ చూసి ,9 గంటలకి బాబు స్కూల్ కి వెళ్లాక టిఫిన్ చెస్తూ పేపర్ అంతా తీరుబడిగా చదువుతాను.



ఈ రోజు కూడా అలానే పేపర్ చదువుతూ నవ్య పేపర్ లో నా రాఖీ టపా చూసి ఆశ్చర్య పోయాను . చాలా ఆనందపడి పోయాను .వెంటనే అక్కలకి ,చెల్లికి ఫోన్ చేసి చెప్పేసేను.ఇంతకీ వాళ్ళందరికీ ఈనాడు పేపర్ వస్తుంది . ఆంద్రజ్యోతి పేపర్ కొనైనా సరే చదవండి అని వాళ్లకి చెప్పేను.

మరి నా మిత్రు లైన మీతో కుడాచెప్పి ,చూపించి ....... నా ఆనందాన్ని పంచుకోవాలికదా .అందుకే మీ అందరితోనూ ఈ ఆనందాన్ని పంచుకోవడానికే ఈ టపా.

24, ఆగస్టు 2010, మంగళవారం

బ్లాగ్ సొదరీ,సోదరులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు




ఈ రోజు శ్రావణ పౌర్ణమి .ఈ రోజు అన్నా,చెల్లుళ్ళు ఎంతో ఆనందం గా రాఖీ పండుగను జరుపుకుంటారు .

కానీ ,నాకు చిన్నప్పుడు రాఖీ పండుగ వస్తే కొంచెం విచారం గా ఉండేది .ఎందుకంటే మేము నలుగురుమూ అమ్మాయిలమే . అందరూ చక్కగా వాళ్ళన్నయ లకు,తమ్మూలకూ ఎలా రాఖీ కట్టేము, అన్నయ్య ఏమి గిఫ్ట్ ఇచ్చాడు ,ఇలా అన్నీ చెబుతూ ఉంటే ,నాకూ ఒక "అన్న "కానీ "తమ్ము" కానీ ఉంటే చక్కగా నేనూ రాఖీ కట్టేదాన్నికదా అనుకునేదాన్ని.అందులోనూ నాకు తమ్ముడంటే ఇంకా ఇష్టం . చక్కగా అక్కా ,అక్కా అంటూ తిరుగుతారు అని ,ఇంకా ఏవో చాలా అనుకునేదానిని . ఇప్పుడూ కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది .ఆ ఫీలింగ్ గుర్తు చేస్తూ రాఖీ పండుగ వచ్చేసింది .

అన్నలున్న చెల్లాయిలకు, తమ్ముళ్ళు న్న అక్కయ్యలకు .........

"రాఖీ శుభాకాంక్షలు "

బ్లాగ్ లోకపు అన్నలకూ ,తమ్ముళ్లకూ నా "రాఖీ శుభాకాంక్షలు ."

14, ఆగస్టు 2010, శనివారం

స్వాతంత్ర్య శుభాకాంక్షలు



బ్లాగ్ మిత్రులు అందరికీ

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

10, ఆగస్టు 2010, మంగళవారం

నేను వేసిన పైంట్లు ,నేను తయారుచేసినవి .




ఇది శెకుంతల గ్లాస్ పైన్టింగ్ .

ఇది "నిబ్ పైన్టింగ్" .లైన్స్ నిబ్,రౌండ్ నిబ్ అని ఉంటాయి .వాటితో వేస్తారు.ఆయిల్ పైంట్ తోనే వేస్తారు .
ఇవి నా డిగ్రీ అయ్యాక రాజమండ్రిలో నేర్చుకున్న పైన్టింగ్స్.

కింద వన్నీ నేను సొంతం గా తయారు చేసినవి.
ఇది ,సోలార్ వుడ్ అని ఒక మెటీరియల్ ఉంటుంది. దానిని ఇలా వివిధ షేప్ లలో కత్తిరించి ,అంటించి తయారు చేసిన నెమలి ..

ఇది దర్మోకాల్ తో చేసిన జపాను అమ్మాయి.ధర్మో కాల్ పైన డిజైన్ గీసుకుని ,కట్ చేసి పైన ముకమల్ క్లాత్ అంటించి ,చిప్స్ ఇంకా మనకు ఎలా కావాలంటే అలా అంటించుకో వచ్చు.
పాత చాకు ను వేడి చేసి ,కట్ చేస్తే దర్మోకాల్ చాలా తేలికగా కట్ అవుతుంది .


ఇది పాట్ పైంట్ .ఫెవికాల్ లో చాక్ పౌడర్ కలిపి ఇలా తీగలు గా చేసి పాట్ కు అంటించి కలర్స్ వేసేను.


దీనికి చాలా చాలా రకాలు అంటించాను.డైమండ్ షేపులో అంటించినవి చిన్న చిన్న నత్త గుల్లలు .పచ్చ,ఎరుపు రంగు లు ,మెత్తని ఇసుకలో కలిపి ఆరాక అంటించాను .పైన రౌండ్ షేపులకి,బియ్యం రంగులో కలిపి వేసాను. ఇంకా అద్దాలు ,గురువింద గింజలు అంటించాను .అక్కడక్కడా ఊడిపోయాయి.ఇవి చేసి పన్నెండేల్లు అవుతుంది.అందుకే కొంచెం డల్ గా ఉన్నాయి . .
ఇంకా చాలా చేసాను కానీ అవన్నీ పాడైపోయాయని పెట్టలేదు .బియ్యానికి కలర్స్ వేసి స్వాగతం అనిరాసి ఒకటిచేసాను .బాగుండేది కానీ కిందపడి పడి పోయి పోయింది .

4, ఆగస్టు 2010, బుధవారం

ఇది ఏమి పువ్వు?





"కదంబ పుష్పం" అండి ఇది .సరస్వతీ దేవికి ఎంతో ఇష్ట మైన పువ్వు..

నేను ఈ రోజే మొదటిసారి చూసాను. కదంబపువ్వు పేరు విన్నానుకానీ ,ఎప్పుడు చూడలేదు .చాలా బాగుంది .చాలా మంచి సువాసన నిస్తుంది .నాకెంత నచ్చేసిందంటే వెంటనే మొక్క తెచ్చి వేసేయాలనిపించింది.ఎక్కువగా అమ్మవారి గుళ్ళ వద్ద వేస్తారు.

ఈ మద్య మా ఉళ్ళో ఇద్దరిళ్ళ వద్ద వేశారన్నారు.వాళ్ళింటి వద్ద పూసిందంటే చూద్దామని తెప్పించాము.పనిలో పని మీకు కుడా చూపిస్తున్నాను.ఎలా ఉందండి ఈ" కదంబ పుష్పం"
?