=''/>

29, జూన్ 2012, శుక్రవారం

మా ఇంటికొచ్చిన కొత్త చుట్టాలు


ఇవి  కొంగలకి  (బహుశా  పక్షులన్నింటికీనేమో....... )  గూళ్ళు  కట్టుకునే   రోజులనుకుంట !

మా పునాస  మామిడిచెట్టు  మీద ఎప్పుడు  చేరాయో ? పచ్చని  చెట్టుమీద   తెల్ల తెల్లగా మెరిసిపోతూ  బలే  అందంగా ఉంటున్నాయి.

ఈ సెలవల్లో రోజూ కరెంటు  పోతుంటే ...  మా పిల్లలకి  మంచి  కాలక్షేపం దొరికింది.మా  ప్రియ(మా అమ్మాయి )  రోజూ  అవి వెళ్ళడం  ,రావడం   బాగా  గమనించేది. కొంగలు గూళ్ళు  కట్టుకోవడానికి  ముక్కుతో  పుల్లలు ,అప్పుడప్పుడు చిన్న చిన్న వైరుముక్కలు కూడా తెస్తుంటే  ....అమ్మా !గూళ్ళకి  డెకరేషన్  చేసుకుంటున్నట్టున్నాయి  అంటూ ,నన్ను పిలిచి  చూపించేది .  హస్బెండ్  ఫుడ్  తెస్తుంటే ...వైఫ్   గూడు   కట్టుకుంటుందా?వర్షమొస్తే  ఎలాగమ్మా  పాపం  తడిసిపోతాయి  కదా!అంటూ   సాయి కూడా   వాటి గురించి  రకరకాల కామెంట్స్  చేసేవాడు.

హాయ్! కొంగలూ  , మంచి మంచి పోజులు  పెట్టండి!  అమ్మ   మిమ్మల్ని ఫోటోలు తీసి  బ్లాగ్ లో పెడుతుంది .మిమ్మల్ని బోల్డు మంది చూస్తారు .మీరు  కదల కుండా  గుడ్  బర్డ్స్  లా  ...ఉంటే   ఫోటోలు బాగుంటాయి  అంటూ,  కొంగల్ని  ఎంకరేజ్   చేస్తూ  మరీ   పిల్లలు నాతో  ఈ ఫొటోలు   తీయించారు .      





                                         
                                                          మా జంట బాగుందా?



చిటారు కొమ్మ పై  ఉన్నానోచ్ ...  


                                                     











ఎవరి కోసం  ఈ ఎదురుచూపులు ?? 



చూడటానికి బాగుంది .ఫోటోలు  బాగున్నాయి. కానీ ,  వర్షాలు  పడుతుంటే  తెలుస్తుంది  కొంగలు  ఇళ్ళ వద్ద  చెట్లు పై  ఉంటే  ఎలా ఉంటుందో ?

 మాకేమి తెలిసిందో?  మీకు తెలుసా?


23, అక్టోబర్ 2011, ఆదివారం

ఆరునెలలవిరామం తరువాత

హాయ్!ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు?

చాలా రోజుల తరువాత నా బ్లాగ్ మిత్రులందరినీ కలుస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది :)))).

మీ అందరి బ్లాగ్లూ చదువుతూ ....నేనూ బ్లాగ్ రాయడం ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టాను .నెలకి కనీసం ఆరేడు టపాలైనా రాస్తూ.... మీ కామెంట్ల ప్రొత్సాహంతో ,ఇంకా బాగా రాయాలనుకుంటూ ఉండేదాన్ని.

ఈ అక్టోబర్ కి నా బ్లాగ్ మొదలపెట్టి రెండేళ్ళైంది.

ఈలోపే నా బ్లాగ్ పోస్ట్లుకి మరీ ఇంత పెద్ద విరామం వస్తుందని అస్సలు అనుకోలేదు.ఏప్రియల్ నెలలో పిల్లల పరిక్షలు, మే నెలలో పెళ్ళిళ్ళు, సెలవల హడావిడి .... పిల్లల బళ్ళు తెరిచారు ఇక బద్దకించకుండా రాయాలి అనుకొన్నాను ... ఓ అనుకోని సంఘటన! ఇన్ని రోజులూ బ్లాగ్ ప్రపంచానికి దూరంగా ఉండేలా చెసింది.

నా బ్లాగ్ ప్రపంచంతో,మీ అందరితో... మరిన్ని రోజుల విరామం తప్పదు:(((( ...

బై బై ఫ్రెండ్స్ .

29, మార్చి 2011, మంగళవారం

అరచేతిలో సీతాకోకచిలుక

మా పెరట్లోకోచ్చిన సీతాకోకచిలుకను మా మరదలు సాయంతో ఇలా నా చిత్రాల్లో బంధించేశా....











23, మార్చి 2011, బుధవారం

మాక్కూడా ఈ ఫీవర్ అంటుకుంది

"ఫీవర్" అంటే అలాంటి ఇలాంటి ఫీవర్ కాదండోయ్!

ప్రస్తుతం "పిల్లలనుండి పెద్దలవరకూ "వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా , అందరికీ ఇప్పుడు ఒకేరకమైన ఫీవర్ !

పల్లెలు ,పట్నాలు ,నగరాలు ఎక్కడ చూసినా ఈ ఫీవరేకదా! అదేనండి " క్రికెట్ ఫీవర్ "

ఈ" క్రికెట్ ఫీవర్ " ఇప్పుడు మా ఇంట్లో అందరికీ అంటించాడు మాసాయి .




ఇది వరకు పెద్దగా క్రికెట్ చూసేవాడు కాదుకానీ, వరల్డ్ కప్ క్రికెట్ మొదలైయ్యాక కొంచెం ఇంట్రెస్ట్ గా టివీ లో మ్యాచ్ లు చూడటం మొదలు పెట్టాడు." ఇంగ్లాండ్- ఇండియా మ్యాచ్ "అయ్యాక ఇంకా ఎక్కువైపోయింది.


మనదేశం ఆడే మ్యాచ్ లే కాదు,ఎవరాడినా ఆఖరికి "కెన్యా-కెనడా ,జింబాబ్వే-కెన్యా "మ్యాచ్ లు కూడా వదిలిపెట్టలేదు.స్కూల్ నుండి రావడం... మ్యాచ్ లు చూడడం! హోంవర్క్ ,భోజనం అన్నీ ...టివీ వద్దే! అవి చూస్తూ వాళ్ళు అవుటైనా,సిక్సర్ కొట్టినా ,ఫోర్ కొట్టినా , వాళ్ళు ఏం చేసినా ...అమ్మా!తొందరగా రా...అంటూ అరుస్తూ గోల గోల చేస్తుంటాడు. అలా తను చూస్తూ మా అత్తయ్య ,మావయ్య గారితో సహా అందరినీ
క్రికెట్ వ్యామోహం లో పడేసాడు.క్రికెట్ మ్యాచ్లు మొదలయ్యాక రోజూ పేపర్ చూడటం కూడా అలవాటు చేసుకున్నాడు.ఈ మూడు రోజులనుండి మ్యాచ్ లు లేవని రోజూ అన్ని మ్యాచ్ల హైలెట్స్ చూస్తూ ....ఈ రోజు మొదలయ్యే క్వార్టర్ ఫైనల్ "పాక్-వెస్టిండిస్ "మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడు.


పిల్లలందరికీ ఇప్పుడు ఎగ్జామ్స్ టెన్షన్ కానీ, సాయి వాళ్లకి ఏప్రిల్ రెండోవారంలో ఉంటాయి.అందుకే ఏ టెన్షన్ లేకుండా హాయిగా మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.


ఎప్పుడో ......నా చిన్నప్పుడు మనకి వరల్డ్ కప్ వచ్చింది అని చెప్పుకోవడమే కానీ , ఇప్పటి వరకు మనవాళ్ళు మళ్ళి కప్ గెలవలేదు.ప్రతీ వరల్డ్ కప్ కీ ఒకటే హడావిడి మనవాళ్ళు చాలా బాగా అడేస్తున్నారు కప్ ఖచ్చితంగా మనకే అని .కానీ ఎప్పుడూ నిరుత్సాహపరుస్తారు. ప్రతిసారీ మనవాళ్ళు వరల్డ్ కప్ లో ఓడిపోగానే ఇక క్రికెట్ అసలు చూడకూడదు అనుకుంటా కానీ ఒకటి రెండు మ్యాచ్లు గెలిస్తే చాలు "కుక్కతోక వంకర"లా మళ్ళి టివికి అతుక్కు పోతా! ఈ వరల్డ్ కప్ కీ అంతే చూడకూడదు అనుకున్నాను కానీ మా సాయి చూస్తూ నాకూ అటించేసేడు.

ఈ సారి ఎలాగైనా మనకు "వరల్డ్ కప్" వస్తుందని సాయి ,రాదనీ నేను పందెం వేసుకున్నాము.

ఆస్ట్రేలియా తో రేపటి మ్యాచ్ గెలిస్తే మనకి కప్ వచ్చేసినట్టే లేకపొతే అంతే !ఇక సర్డుకోవడమే !

రేపు ఇండియా ఎలాగైనా గెలవాలి ...గెలవాలి ...

ఆల్ ది బెస్ట్ ఇండియా

20, మార్చి 2011, ఆదివారం

మార్చ్20" స్పారో " డే

కిచకిచమంటూ సందడి చేసే బుల్లి పిచ్చుకలకు నేను తీసిన చిత్రాలు

ముగ్గు బియ్యపు పిండి తో పెడితే పిచ్చుకలకు పండగే ....
.


వడ్ల గింజల కోసం వరి కంకి పై ...


ఒంటరిగా కనిపించదు
వడ్లగింజల కవచాలని వొడుపుగా పొడుచుకుతింటూనో

నీళ్ళ గిన్నె అంచుపై కాళ్ళు బిగించి
వంగి ముక్కును తడుపుకుంటూనో

ఒకదాన్నొకటి
రుద్దుకుంటూనో ...ముద్దిడికుంటూనో

మచ్చిక చేసుకుని
మేతపెట్ట డానికి ప్రయత్నించే కొద్దీ
చప్పుడు కాకుండానే
గింజల్ని ముట్టకుండా తుర్రు తుర్రు ఎగిరిపోయేది

పెరటి చెట్టు పైకి గుంపుగా చేరినప్పుడు
విరులకు బదులు పిచ్చుకలు పూచాయా....?
కిచకిచమంటూ...మంద్ర సంగీతం
ఈ చెట్టు ఎప్పుడు నేర్చుకుంది చెప్మా ....?

పిల్లలు లేని ఇల్లు కూడా
పిచ్చుకల సందడి తో పురుడు పోసుకుంటుంది

అంతచిన్ని బుర్రలో
ఎంతగొప్ప ఇంజనీరు తనమో
ఏ చెట్టు కొమ్మ చూసినా
పిచ్చుక గూళ్ళ కాయల గుత్తులే

"పిచ్చుక "

కదిలే కమనీయమప్పుడు
కనపడ్డమే గగనమిప్పుడు

పండిన వరి తొలి ఎన్నుల్ని తెచ్చిజడకుచ్చుల్లా అల్లి
ఇంటి చూరికి వేలాడదీసే ఒపికేది...?
చేతలో బియ్యం చెరిగేటప్పుడు
వడ్లు ఏరి కింద పారేస్తుంటే
పొటుకు పొటుకు పొడుచుకుంటూ
పొట్టుని వేరు చేసి గింజల్ని తినే...

ప్రియాతి ప్రియమైన పిచ్చుక నెచ్చలి ఏది....?
సెల్ టవర్ల రేడియేషన్
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం గా పనిచేస్తుందేమో ....!?

ఈ కవిత ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకం లో ఎస్.ఆర్.భల్లం గారు రాసారు


14, మార్చి 2011, సోమవారం

టమాటా,మిరపమొక్కలు.


టమాటాలను మనం ఇంచుమించు అన్నికూరలలోనూ వాడతాము.ఒక్కో సీజన్లో వాటి రేట్లుకూడా మండిపోతుంటాయి...కొద్దిగా శ్రద్ద పెడితే విత్తనాలు ,నారు కొనకుండానే పెరట్లోనో ,పూల కుండీలలోనో టమాటా మొక్కలును అన్ని సీజన్ల లోను పెంచుకోవచ్చు,టమాటాలు పండించవచ్చు..

ఈ కాయలు ఇలా గింజలు తీసి జల్లితే లేచిన మొక్కవే !


టమటాలను ముక్కలు కోసేటప్పుడు...వాటిలో గింజలను ,ఒకనీళ్ళగిన్నె లోకి తీసుకోవాలి.ఆనీళ్ళను పూల కుండీలో పోస్తే మూడునాలుగు రోజులలో చిన్నచిన్న మొలకలు వస్తాయి .వాటిని జానెడు పొడవు అయ్యే వరకూ ఆకుండీలోనే వుంచి తరువాత వేరే దానిలో వేసుకొంటే రెండునెలలో కాయలు కాస్తాయి .మనము సొంతముగా పండిచిన కూరగాయలతో వండుకొంటే ఎంత తుత్తి గా ఉంటుందండి

అలాగే మిరపమొక్కలు కూడాపెంచవచ్చు. ఎండుమిరపకాయలు ఐపోయాక డబ్బాలో అడుగున గింజలు ఉంటాయి కదా!వాటిని పాడేయకుండా పూలకుండీలో జల్లితే ,ఒక వారానికి మిరప నారు రెడీ .వాటిని కొద్దిగా పెరిగాక వేరే కుండీలోవేస్తే అవికూడా రెండు ,మూడునెలలోనే కాపుకొస్తాయి.

దోస ,గుమ్మడి కూడా అలానే వేసుకోవచ్చు.మంచి కాయలైతే గింజలు పాడేయకుండా నీళ్ళలోకి తీసుకుని జల్లుకుంటే మొక్కలు చక్కగా లేస్తాయి.

చేసి చూస్తారుగా! కాస్త శ్రద్ద పెడితే చాలు ... టమాటా,మిరప కైతే పూలకుండీలుంటే చాలు.

2, మార్చి 2011, బుధవారం

సువాసనా ఉంది ...తెల్లదనంఉంది ( పువ్వులు)

సర్ఫ్ ఎక్సల్ యాడ్ లో అనుకుంట బట్టలకు "సువాసనా ఉంది ..తెల్లదనమూ" ఉంది అని వస్తుంది .

దానిని మా చెల్లి వాళ్ళబ్బాయి నాలుగేళ్ల "చరణ్" అస్తమానూ అన్నింటికీ ఉపయోగించేస్తాడు. ఉతికి ఇస్త్రీ చేసిన డ్రస్ వేసుకుంటూ వాసన చూసి అబ్బ! "సువాసనా ఉంది ..తెల్లదనమూ" ఉంది అని అచ్చు యాడ్ లో అన్నట్టే అంటాడు.మంచం మీద దుప్పటి మార్చినా, ఎవరైనా మంచి డ్రస్లు వేసుకున్నా అలాగే అంటుంటాడు.

అలా తను పువ్వుల్ని కూడా అంటుంటే ... సువసనిచ్చే పువ్వుల్లో ఎక్కువగా తెల్లపువ్వులే ఉంటాయి అనిపించింది!

నేను తీసిన పువ్వుల చిత్రాలలో" సువాసనా తెల్లదనమూ" కలిగిన కొన్ని పువ్వులు.


చెంగల్వ పువ్వులు .ఇవి సాయంత్రం విడిచి తెల్లవారేటప్పటికి ముడుచుకుపోతాయి.రాత్రంతా మంచి వాసనొస్తుంది..
మనం చిన్నప్పుడు చదువుకున్న కృష్ణుడు పద్యం గుర్తుందా??

చేతవెన్న ముద్ద" చెంగల్వ పూదండ"
బంగారుమొలత్రాడు పట్టుదట్టి
సందెతాయెతులు సరిమువ్వగజ్జెలు
చిన్నికృష్ణా ! నిన్ను చేరికొలుతు.


మధు మాలతి

ఇది తీగ జాతికి చెందింది. తీగ మొత్తం ఇల్లంతా పాకేసి దాని సువాసనతో ఇంటిని నింపేస్తుంది.

కోడిగుడ్డుసెంపెంగ పువ్వు .

సెంపెంగ పూలలో ఒకరకం ఈ కోడిగుడ్డు సెంపెంగ .ఈ పువ్వు పూర్తిగా విడవదు .ఆఖరి చిత్రం లో వున్నట్లుగానే విచ్చుకుంటుంది .అందుకే దీన్ని కోడిగుడ్డు సెంపెంగ అంటారేమో .వాసన లో మిగతా సెంపెంగపూలకు ఏమాత్రం తీసిపోదు . ఈ పువ్వు చిత్రాలు ఇంకా ఇక్కడ చూడొచ్చు.



పూతవెలగ పువ్వులు . ఇవి ఏసీజన్లో ఐనా పూస్తాయి.

సువాసనలో మల్లె,జాజులతో పొటీపడతాయి.


గోవర్ధన పువ్వు .


లిల్లీ పువ్వులు


విరజాజులు

< బొండుమల్లి పువ్వు .


మల్లెపువ్వుల వాసన గురించి నేను చెప్పక్కర్లేదు .వేసవిలో జరిగే పెళ్లిళ్ళు,ఫంక్షన్ లలో మల్లె పూలదండలు జడలో పెట్టని అమ్మయిలుండరు.ఎప్పుడూ పువ్వుల దండలు పెట్టకపోయినా మల్లెపూల దండలు మాత్రం పెట్టుకోవడానికి ఇష్ట పడతారు.

ఇప్పుడు పెళ్లి మండపాలు ఎక్కువగా ఏ వాసనలేని ఇంగ్లీష్ పువ్వులుతో (జర్బరా ,ఆర్కిడ్స్) కట్టేస్త్తేస్తున్నారు కానీ,ఇది వరకు పెళ్లి మండపాలన్ని మల్లె,జాజులు,లిల్లీ ,చేమంతి పూలతోనే కట్టేవారు. పువ్వుల వాసనలన్నీకలగలిపి పెళ్లి పందిళ్ళు ఉండేవి.



23, ఫిబ్రవరి 2011, బుధవారం

అప్పుడే...పవర్ కట్ కట్!

మాకు సంవత్సరం లో ఆరు నెలలే రోజంతా కరెంట్ ఉంటుంది.మిగిలిన ఆరునెలలూ పగలు ఒంటి పూట కరెంటే.

ఈ ఏడు వర్షాలు బాగా పడ్డాయి కదా! ఇంచుమించు జులై నుండి ఫుల్ కరెంటు ఉంది.


ఎండలు బాగా పెరిగేక ఏప్రియల్ నుండి పవర్ కట్ ఉంటుంది అనుకున్నాము కానీ, అప్పుడే కరెంట్ తీయడం మెదలేట్టేసారు.


రోజంతా కరెంట్ కి బాగా అలవాటు పడిపోయామేమో ఇంకా ఒంటిపూట కరెంట్ కి అలవాటుపడలేదు.


ఉదయం నాలుగు గంటల నుండి పదకొండు వరకూ ఒక షిఫ్ట్ .పదకొండు నుండి సాయంత్రం ఆరు వరకూ ఒక షిఫ్ట్ .ఒక వారం ఉదయం షిఫ్ట్ ,ఒకవారం మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటుంది.ఉదయం కరెంటు ,మద్యాహ్నం కరెంట్ అంటాము.


ఉదయం షిఫ్ట్ వస్తే ,కరెంట్ సహాయంతో చేసే ఏపనైనా ఆ టైం లోనే చేసేయాలి. లేకపోతె అంతే! సాయంత్రం వరకూ కరెంట్ కోసం ఎదురు చూడాల్సిందే. టివికి,సిస్టం కి సాయంత్రం వరకూ రెస్టే.. పిల్లలు సెలవల్లో ఇంటి వద్దఉంటే(ముఖ్యంగా ప్రియ)ఆరు ఎప్పుడవుతుందా అనుకుంటూ ....మధ్యలో కరెంట్ కట్ చేస్తున్న వాడిని తిట్టుకుంటూ ఉంటారు.


మద్యాహ్నం షిఫ్ట్ ఐతే ఒక రకంగా ఉంటుంది .ఉదయం టిఫిన్ కి చెట్నీ ముందు రోజు సాయంత్రమే చేసేసుకోవాలి. పచ్చళ్ళు ఏవి చేయాలన్నా పదకొండింటికి కరెంట్ వచ్చేక చేయాల్సిందే . ఒక్కోసారి పొలంలో పనులు ఎక్కువగా ఉంటే కారియర్ తీసుకెళతారు.అటువంటప్పుడు మద్యాహ్నం కరెంట్ ఐతే ఆ వారం లో పచ్చళ్ళు ఏవీ చేయడం కుదరదు.పండగలొస్తే పిండి వంటలు చేయడానికి ఇంకా ఇబ్బంది. గ్రైండర్ లో పప్పు ముందు రోజన్నాలేకపోతే ఉదయం ఆరు లోపు అన్నా రుబ్బుకోవాలి.మా ప్రియ హాస్టల్ నుండి ఇంటికొచ్చినప్పుడు మధ్యాహ్న కరెంట్ ఐతే తనకి పండగే ! టివీ,సిస్టం రెండింటికీ రెస్టుండదు....


అసలే వరల్డ్ కప్ క్రికెట్ మన దేశంలో జరుగుతుంది. నాకూ క్రికెట్ అంటే కాసింత ఇష్టమే.వరల్డ్ కప్ క్రికెట్ లో మన వాళ్ళు ఆడే మాచ్లన్నీ మాకు మద్యాహ్న కరెంట్ ఉండగా జరిగితే బాగుండును.....


మా కరెంట్ కట కట కట్టాల వలన ఇటువంటివి చాలా మిస్సవుతూ ఉంటాము:((...

16, ఫిబ్రవరి 2011, బుధవారం

లాలేలో లిల్లే లేలో .....

రమ్య కృష్ణ అంటే పెద్దగా ఇష్టముండదు కానీ , విశ్వనాథ్ గారి సూత్రదారులు సినిమాలో మాత్రం పల్లెటూరి అమ్మాయిగా బాగుంటుంది.ముక్కుకి నత్తుతో బలే అందంగా ఉంటుంది.

కే.వి.మహాదేవన్ గారు సంగీతంసారధ్యం వహించిన ఈ సినిమాలోని రెండు పాటలు ....








10, ఫిబ్రవరి 2011, గురువారం

రధసప్తమి

ఈ రోజు రథసప్తమి.

లోకసాక్షి ఐన ఆసూర్యభగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘ సుద్ధ సప్తమి .అదే ఆయన జన్మతిధి ..రధసప్తమి .

సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసం లో రథసప్తమినాడు సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఏదో ఓ ఆదివారం నాడు పూజించినా సత్ఫలితం ఉంటుందని పెద్దలంటారు .

రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు చేసి , సూర్యోదయానంతరం దానాలు చేయాలి . ఈరోజు తులసికోట వద్ద
సూర్యునికి ఎదురుగా ముగ్గు వేసి ,ఆవుపిడకలపై ఆవుపాలతో పరవాన్నం చేసి ,చిక్కుడు ఆకులపై ఆ పరవాన్నముంచి ఆయనకు నివేదన ఇవ్వాలి .

నాచిన్నప్పుడు మా జేజమ్మ రథసప్తమినాడు ,తను తెల్లవారుజామున లేచి తలస్నానం చెసి మమ్మల్ని కూడా లేపి స్నానాలు చేయమని, కూర్చో బెట్టి పూజ చేయించి మాతో చిక్కుడాకులు అవీ కోయించి ,ఆవుపిడకల పై పొంగలి వండి అందరికీ ప్రసాదాలు పెట్టేది .ఇప్పటికీ రథసప్తమి అంటే అదే జ్ఞాపకమొస్తుంది .

4 వ్యాఖ్యలు:

Sree V చెప్పారు...

రాధిక గారు..రథసప్తమి పొ౦గలి రుచే వేరు కదా..ఇత్తడి గిన్నెలో గరిటెకి బదులు చెరకు తో కలియతిప్పుతూ చేస్తారు..

మేమైతే జల్లెడలో జిల్లేడు ఆకు, రేగుప౦డు పెట్టి పైను౦డి నీళ్ళు పోస్తూ..తలస్నాన౦ ముగి౦చేవార౦...
టపా బావు౦ది..జ్ఞాపక౦ ఇ౦కా బావు౦ది..
ఆ సూర్యభగవానుడు ఆయురారోగ్యాలను ప్రసాది౦చాలని కోరుకు౦టూ...
శ్రీ.వి.

మానస సంచర చెప్పారు...

అది పొంగలి కాదు క్షీరాన్నమని (పరవాన్నం) గుర్తు కాకపోతే అవుపాలతోనే చేస్తారు.

రాధిక చెప్పారు...

శ్రీ.వి గారు,దన్యవాదాలండి.
మానససంచర గారు,మా జేజమ్మపొంగలి వండేక పరవన్నముకూడా చేసేదండి. ఆవుపాలతోనే చేస్తారు.

మాలా కుమార్ చెప్పారు...

మాఘమాసం అంటే తులసి కోట , పిడకలమీద పొంగించిన పాల పాయసము చిక్కుడాకులలో తినటము అన్నీ జ్ఞాపకాలే . ఇప్పుడు పిడకలు దొరకక , దొరికినా పొంగిచే స్తలము లేక , అంతా గాస్ స్టవ్ మీదే .