=''/>

9, జనవరి 2010, శనివారం

ముగ్గు



సంక్రాంతి పండుగ రాబోతుందంగానే క్రిందట నెలనుండే అంటే డిసెంబర్ 15నుండి నెల పట్టడము జరుగుతుంది .నెలపట్టడమంటే ఈ నెల రోజులూ ఏ విధమైన శుభకార్యములూ లేకుండా కేవలము పండుగ మిదే దృష్టి పెట్టడము అని అర్ధం . అందుకే ఇంటిముందు ముగ్గుల్ని డిసెంబర్ 16 నుంచి ప్రారంభించి పెడతారు .

ముగ్గులు అనగానే ఏవేవో తోచినట్లు పెట్టేయడముకాదు.మన ఇంటిముందు ఉన్న నేలనే ఆకాశముగా చేసుకొని చిత్రాన్ని గీయడమనమాట .

మన ఇంటిముందున్న నేల ఆకాశానికి సంకేత మనమాట .దాని మీద మనం పెట్టే చుక్కలు నక్షత్రాలకు సంకేతం. ఆ నక్షత్రాలని ఒక క్రమ పద్దతిలో కలిపి ఓ అందమైన రీతిలో కళ్ళకు మనోహరము గా ఉండేలా కలపడము,ఏ గ్రహాలు ఏ తీరులో పరిభ్రమిస్తున్నాయో తెలపడానికి సంకేతం.
ఇంతటి ఖగోళశాస్త్ర రహస్యాన్ని ఎనిమిదేండ్ల ఆడపిల్లకి కూడా అర్ధమయ్యేలా,ఆముగ్గులుచూసిన అందరికీ కూడా తెలిసేలా ప్రాచీనులు రంగవల్లి విధానాన్ని ప్రవేశపెట్టారు .
దీనిలో రెండు విశేషాలు తెలుస్తాయి .ముగ్గుపెట్టే బాలిక ,ముగ్గు పెట్టే సందర్భములో సహనశీలిని అవునా ?కాదా..ముగ్గుని సన్నగా పెడుతుందా?లావుగా పెడుతుందా?లేదా అమ్మపోరు పడలేక పనికానిచ్చేద్దాము అనుకొంటుందా?ముగ్గు పెట్టడములో తప్పు వచ్చినప్పుడు ముగ్గు గిన్ని పడేసి చిరాగ్గా వెళిపోతుందా?లేక మళ్ళీ ఓమారు దాన్ని దిద్దే ప్రయత్నము చేస్తుందా?..వంటితీరు తెన్నుల ప్రకారం ఆ ఆడపిల్ల మనస్తత్వం ,ఆమెని ఓదార్చే తీరులో తల్లి మనస్తత్వం ..ఇలా ఎన్నో రహస్యాలు బహిర్గతమవుతాయి .
హేమంత ఋతువులో మంచి చలీ ,మంచు వర్షించే వేళలో ..నడుము వంచి తెలతెలవారుతుండగా ,అటూ ఇటూ తిరుగుతూ పైకి లేస్తూ ,క్రింద కూర్చుంటూ ముగ్గు పెట్టడం అంటే ఒక విధం గా వ్యాయామం చేస్తున్నట్టే .తన వల్ల ఇంటికి ఏ ప్రయోజనమూ లేకుండా ఉదయాన్నే లేచి ఒట్టిగా కాలక్షేపం చేయడము కంటే ఇలా ముగ్గులు పెడుతూ వ్యాయామం చేస్తూ, ముంగిలిని అలంకరించు కోవడం ఎంత చక్కని పని .
**************

3 కామెంట్‌లు: