=''/>

6, డిసెంబర్ 2010, సోమవారం

ఓ ప్రియతమా..


పేపర్లో చదివిన చిన్న కవితకు ఓ రోజంతా కష్టపడి,నా మైండ్ కి కాస్త పని కల్పించి ఈ రూపం తెచ్చా... ఆఖరి రెండు లైన్లూ నేను చదివిన కవితలోనివి.

నా ఈ ప్రయత్నం ఎలా ఉందో మొహమాట పడకుండా చెప్పండే .

సందె గాలిలో సన్నజాజి సుగంధంలా
మలి సంధ్య లో మలయ మారుతంలా
మొగలి రేకుల పరిమళాలతో నను తాకిన ఓ ప్రియతమా !

నీ నవ్వుతో కోటి సరాగాల వీణలు వాయించావు
నీ స్పర్శతో వేయి వేణువులు ఉదావు
నీచూపుతో నాలో వందలాది తంబురాలు మోగించావు
నీ సిగ్గులో ఎన్ని సితారలో పలికించావు

నీ కులుకుల నడకల హోయలతో నన్ను గిలిగింతలు పెట్టావు
నీ తియ్యని పలుకులతో నా మది దోచావు
నీవు మిగిల్చిన జ్ఞాపకాలతో
నా జీవితం ఓ సరికొత్త రాగంలో పాటలా ఇలా సాగిపోతుంటే

ఈ మైమరుపు వెన్నెలలో ఆ మైమరపించే జాబిలీ కంటే
నీ మదుర స్మృతులే ఇక నా జీవన పయనానికి ఆలంబన

1, డిసెంబర్ 2010, బుధవారం

మా పొలంలో వన బోజనాలు













"పాపికొండలు"వెళ్ళాలనిఅనుకుంటున్నాము... అన్నాను కదా! కానీ ,ఎక్కడో నాకు అనుమానం గానే ఉంది.. అది జరిగేలా లేదని :((( .నేననుకున్నట్లే అయింది.

ఇరవై నాలుగున మా ఆడబడుచు వాళ్ళమ్మాయికీ " ఓణిఫంక్షన్ " అయింది.ఆ మరునాడు పాపి కొండలు వెళదాము....అందరూ ఉంటారు! అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వలన వెళ్ళ లేకపోయాము.

పాపికొండలు వెల్లట్లేదని చెప్పగానే మా" పిల్లలు" ఏడుపులు మొదలెట్టేశారు. మా అమ్మాయైతే చెప్పక్కర్లేదు....హాస్టల్ లో అందరికీ చెప్పేసేను వెళ్తున్నామని, మీరెప్పుడు ఇంతే...ఎక్కడికి తీసుకెళ్ళారూ..... అంటూ నిష్టూరాలు....


పిల్లలు ముగ్గురూకలిసి (మా ఆడబడుచు కూతురు ,మా పిల్లలు)"మనం రేపు ఎక్కడికైనా వెళ్లాల్సిందే" ... అంటూ ఓ ఆర్డర్ పాడేసి మేమంతా ఒప్పుకుంటేనే కానీ ఊరుకోలేదు.










వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి??మా వారు ,వాళ్ళు ఇప్పుడు పుగతోట ( మార్చి నెల వరకూ పుగాకు తోట పనులుంటాయి)పనులతో
చాలా బిజీ గా ఉంటారు..వాళ్ళ వల్ల ఏమీ పని జరగదు... ఎలాగా ?అనుకుంటూ "పొలం "వెళ్దామా?? "కార్తిక మాసం" కదా "వనభోజనాలు" పెట్టుకున్నట్టు ఉంటుంది. సరదాగా పొలంలో తిరిగి ,పుగాకు తోట ,కొబ్బరితోట అన్నీ చూసినట్టు ఉంటుంది...అన్నాను.

పిల్లలు ఏమంటారో?? అని ఎదురుచూస్తూ....

వీళ్ళు ఒప్పుకోక పోతే ఏంచేయాలి???ఏమంటారో ...అనుకున్నాను కానీ ,ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఊపు మీదున్నారేమో...వెంటనే ఒప్పేసుకున్నారు....

మీరు ఉదయమే తొందరగా లేచి మీ పనులన్నీ చేసుకుని మాకు సాయం చేస్తే ,పదింటికల్లా పొలం వెళ్ళగలుగుతాం....అంటే ,పాపం అలాగే కనపడని సాయం చాలా చేసారు...

అనుకున్నట్లే ...అన్నం ,కూరలు,స్నాక్స్ ,మంచినీళ్ళుతో సహా అన్నీ సర్దుకుని ట్రాక్టర్లో ... పదిగంటలకి పొలం వెళ్లేము.

ప్రియ చూసారా? ఎలా ఎక్కిందో ? ఎక్కింది కానీ దిగడం రాలేదు .అందరం కష్టపడి ఎలాగో దింపాం లెండి..

వెళ్ళగానే ఆట ,పాటలు మొదలెట్టేశారు.వాళ్ళతో కలిసి మేమూ ... హౌసి, రాముడు-సీత ,కళ్ళ గంతలు ఇలా రకరకాల ఆటలన్నీ ఆడేము.వంగిపోయిన కొబ్బరిచెట్టు ఎక్కేపోటీ పెట్టేము..అందరూ ఎక్కడానికి ట్రై చేసారు కానీ, , ప్రియ బాగా పైకేక్కింది.దానికి అందరూ కలిసి మూడు కొబ్బరి బొండాల నీళ్ళు పట్టించేసేరు.(ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి ) .

అమృతకి(ఆడబడుచు కూతురు ) హౌసి లో ఫస్ట్ వచ్చిందని.....

ఆటల్లో నెగ్గినవాళ్ళకి గిఫ్ట్లు ఏంటా?? అనుకుంటున్నారా?? రెండు కొబ్బరి బొండా లు తాగడం , నాలుగు జామ కాయలు,బురగుంజు తినడం:)))) ఇలా ....(మా పిల్లలు ఆరోజే మొదటి సారి బురగుంజు చూడటం ,తినటం)
కాసేపుకోతుల్లా...జామ చెట్లు,మామిడి చెట్లు ఎక్కి ,దిగి ,ఉయ్యాలలూగేరు. మాపొలమంతా తిరిగేక,పక్క పొలం లో కోకో తోటలోకి పిల్లల్ని తీసుకెళ్ళి ,కోకో కాయలు, మొక్కలు చుపించేము.


కోకోకాయలు

పిల్లల ఆనందానికి అంతేలేదు.మా ఆడబడుచు కూతురు అత్తా "మేం వచ్చినప్పుడల్లా పొలం ఇలాగే వెళదాం" అంది.దానికి అంత నచ్చేసింది. . మాపిల్లలూ అప్పుడప్పుడూ... పొలం వెళ్తుంటారు కానీ,కాసేపు అలా తిరిగి వచ్చేస్తారు.ఇలా ఎప్పుడూ వెళ్లక కొత్తగా ఉండి వాళ్ళకీ బాగానచ్చేసింది.

అలా ..సాయంత్రం వరకూసరదాగా... ఆనందంగా ...గడిపేసేమంతా...

మా పిల్లల గొడవ వలన "కార్తిక వనబోజనాలు"కూడా చేసినట్లైంది.
.


బుజ్జి కుక్కపిల్లలు బలే ముద్దొస్తున్నాయికదా! పొలంలో ఉన్నాయి .మాపిల్లలు వాటిని తెచ్చి,అవి తినక పోయినా ..బలవంతంగా వాటికి పులిహార పెట్టేసి వాటిని బెదిరించేసేరు.

29, నవంబర్ 2010, సోమవారం

"పెద్దింటి"కష్టాలు .


ముఖేష్ అంబానీ ఇప్పుడు ఇరవై ఏడు అంతస్తుల తన కొత్త ఇల్లు "అంటిలియా"లో ఉంటున్నారు.

మొన్నీమధ్య రోజులాగే 15వ అంతస్తులో ఉన్న పడక గదిలో ఆయన నిద్రలేచి ,17వ అంతస్తులో ... స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసారు. 19వ అంతస్తులో అల్పాహారం తిని ,ఆఫీసు కు వెళ్లేందుకు 14వ అంతస్తులో డ్రెస్సింగ్ చేసుకున్నారు.ఫైలు ,బాగ్ తీసుకునేందుకు 21 వ అంతస్తులో ఉన్న వ్యక్తిగత ఆఫీసుకు వెళ్లారు.13వ అంతస్తులో ఉన్న నీతా అంబానీకి ,పిల్లలకు బై చెప్పి ,3వ అంతస్తులో ఉన్న కార్ పార్కింగ్ కీ చేరుకున్నారు.తన మెర్సిడెస్ బెంజ్ కారును స్వయం గా నడుపుతూ ఆఫీసుకు వెళ్లేందుకు కారు వద్దకు వెళ్లారు.

కానీ, అప్పుడే ఆయనకు తెలిసింది... కారుతాళం చెవులు పై అంతస్తుల్లో ఎక్కడో మరిచిపోయినట్లు.....

కానీ ....అది ఎన్నో అంతస్తు ??? 15, 17, 19, 14, 21 వ అంతస్తా ? ? ? ? లేక 13వ అంతస్తా? ? ?

వెంటనే ముఖేష్ తన పని మనుషులకు ,కార్యదర్శులకు ,అటెండర్ల కు ఇలా అందరికీ ఫోన్లు చేసారు.

అంతే భారీ " ఆపరేషన్ తాళంచెవి " మొదలైంది.అన్నీ అంతస్తుల్లోను ఉరుకులూ,పరుగులూ.....

అయినా తాళంచెవి దొరకలేదు.గంట తరువాత ముఖేష్ భాయ్ ఓ సాధారణ ఐకాన్ కార్లో ఆఫీసుకు వెళ్లి పోయారు .

కట్ చేస్తే ....

మరుసటి రోజు తెల్లవారు జామున పై అంతస్తుల్లో పెద్ద శబ్దం రావడంతో నీతా బాబి బయటకు వచ్చింది.బాల్కని లోంచి లోనికి వస్తున్న ముఖేష్ ని "ఏమైందని "అడిగింది ."అదా ...జర్మనీ నుంచి హెలికాప్టర్ వచ్చింది .మెర్సిడెస్ బెంజ్ వాళ్ళు మన కారు డుప్లికేట్ తాళంచెవి పంపించారు" అని చెప్పారు.


అప్పుడు నీతా "మీ తాళం చెవి నిన్న మధ్యాహ్నమే దొరికింది .నాలుగు రోజుల క్రితం 14వ అంతస్తులో గదిలోని మీ బట్టలు లాండ్రీ కీ వేస్తుంటే ....మీ ప్యాంట్ జేబులో కనిపించింది .నేనే 16 వ అంతస్తులో ని షెల్ఫ్ లో పెట్టాను" అని తీరిగ్గా చెప్పిందట.

ఇవండి మన ముఖేష్ భాయ్ గారి 27 అంతస్తుల కొత్తింటి(పెద్దింటి) కష్టాలు ...


.

21, నవంబర్ 2010, ఆదివారం

మన బ్లాగ్ వనభోజనాలకి నేనూ, ఆకాకరకాయ కూరతో వచ్చేసానోచ్...

జ్యోతి గారి" బ్లాగ్ వనభోజనాల " పిలుపందుకుని ,నేనూ నా వంటతో సిద్దమైపోయానండోయ్...

నిరుడు ఇలాగే జ్యోతిగారు బ్లాగ్ వనభోజనాలు ఏర్పాటు చేసినప్పుడు ,నేనూ నాకూ తెలిసిన,వచ్చిన వంటతో వచ్చేను.అప్పుడు అందరూ చేసిన రకరకాల వంటకాలతో ..."బ్లాగ్ వనభోజనాల విందు" అదిరిపోయింది.


ఈ" బ్లాగ్ వనభోజనాలు"కి నేను వండుకొచ్చిన వంట....

"ఆకాకరకాయ ఇగురు".

మా వైపు వీటిని ఆకాకరకాయలు అంటారు. వీటిని బోడ కాకరకాయలు అని కూడా అంటారని ఈ మధ్యే తెలిసింది.ఈ ఆకాకరకాయలతో వేపుడు చేయవచ్చు.అలాగే ఇగురు కూరా వండుకోవచ్చు .మేము ఎక్కువగా పాలు పోసి ఇగురుకూర వండుతాము.


ఆకాకరకాయ ఇగురు చేయడానికి కావలసిన పదార్ధాలు:

ఆకాకరకాయలు - 1/4
ఉల్లిపాయలు -4
పచ్చిమిర్చి-3
ఉప్పు
కారం-1/2
పసుపు-కొద్దిగా
పాలు-చిన్న గ్లాస్ లో సగం
అల్లం వెల్లుల్లి ముద్ద-అర స్పూన్

పోపు సామాను:
సెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు,జీలకర్ర, కరివేపాకు.

ఆకాకరకాయ లు(వీటిలో చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఇవి ఇష్టం లేనివారు తీసేసుకుని ముక్కలు కోస్తారు, కానీ గింజలు కుడా రుచిగానే ఉంటాయి.)ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ముందుగా గిన్నెలో నూని పోసి తాలింపు పెట్టుకుని (ఎండుమిరప అక్కర్లేదు) ,దానిలో ఆకాకరకాయ ముక్కలు వేసి ఐదు నిముషాలు వేయించుకోవాలి. అప్పుడు దానిలో ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి అన్నింటినీ కాసేపూ వేగనివ్వాలి.అవి వేగేక, ఉప్పు,కారం,పసుపు,అల్లం వెల్లులి ముద్ద వేసికలుపుకుని మూతపెట్టి , చిన్న మంటపై కాసేపు మగ్గనిచ్చి ,తరువాతకొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఐదునిముషాలయ్యాక దానిలో పాలు పోసి ,కూర బాగా నీరు లేకుండా ఇగరనివ్వాలి. ఇలా పాలు పోసి ఆకాకరకాయ కూర వండితే కమ్మగా ..మంచి రుచిగా ఉంటుంది. ఈ కూర చపాతీలో కీ ,అన్నం లో కీ కూడా బాగుంటుంది.

ఇదండిమన" బ్లాగ్ వన భోజనాలకి " నేను కష్టపడి వండుకొచ్చిన వంట . రుచి చూసి ఎలా ఉందో చెబుతారు కదా!


మా ఊరి మహిళలం అందరం కలసి క్రితం సంవత్సరంకొబ్బరి తోటలో కార్తిక వన భోజనాలు పెట్టుకుని చాలా సరదాగా గడిపాము. ఈ సంవత్సరం ఇంకా అనుకోలేదు కానీ, పాపి కొండలు అనుకుంటున్నాము....ఏమవుతుందో?

17, నవంబర్ 2010, బుధవారం

50% కొనుగోలు ఉచితం ..

పండుగ సీజన్ వస్తే చాలు `ఒకటి కొంటె ఒకటి ఉచితం,50%నుండి 70% వరకూ తగ్గింపుధరలు,మీ ఇంట్లో పాత వస్తువులు తెచ్చి ..మేమిచ్చే కొత్తవస్తువుతో వెళ్ళండని', ఇలా... రోజూ రకరకాల ఆడ్స్ తో పేపర్లలోనూ ,టివి ల్లోనూ.... మనల్ని ఊదరకొడుతూ ఉండడం చూస్తుంటాము.

నాకసలు ఇటు వంటిఆఫర్స్ లో బట్టలు అవి కొనడం ఇష్టముండదు. ఏం కొనాలన్నా,మేమెక్కువగా... రాజమండ్రే వెళ్తాము.పెళ్లి బట్టలు ,చిన్న చిన్న ఫంక్షన్స్ కీ విజయవాడ లో తీసుకుంటాము.

క్రితం గురువారం అనుకోకుండా షాపింగ్ కి వెళ్లి ఇటువంటి ఒక పిచ్చి,చెత్త, అతిచెత్త ,చెత్తాతిచెత్త , ....(ప్లిచ్ :( రాద్దామంటే నాకసలు తిట్లే రావడం లేదు!)ఆఫర్ మాయాజాలం వలలో చిక్కుకుని ...లాక్కుని ...పీక్కుని ,అతికష్టం మీద బయటపడి మా ఊరు చేరేటప్పటికి రాత్రి రెండైంది.

మా ఆడబడుచు బెంగుళూరు లో ఉంటుంది . వాళ్ళమ్మాయి "ఓణిల ఫంక్షన్"కి ఈ "ఇరవై నాలుగు"న డేట్ పెంట్టించుకుని గురువారం వచ్చింది. అక్కడినుండి వచ్చీరావడంతోనే , అందరినీ కంగారు పెట్టేసింది. " తలుచుకున్నప్పుడే తాతపెళ్లి " అన్నట్టు..... ఈ రోజు మంచిది !"బట్టలు కొనడానికివిజయవాడ వెల్దాం"అంటే...సరే అని ఒంటిగంటకు బయల్దేరి వెళ్లేము.

అలా ...మేము బయలుదేరి విజయవాడ వెళ్ళేటప్పటికే సాయంత్రం నాలుగైంది.(అంటే అందరూ పనులన్నీ ముగించుకుని వెళ్ళిపోయే సమయమం అన్నమాట). కళానికేతన్ లో బట్టలు బాగుంటాయి అంటారు కదా ...అని ముందు దీంట్లో చూద్దామని వెళ్లేము. అంతే!అక్కడే చిక్కడి పోయాము.

వెళ్ళగానే వాళ్ళ బట్టలమ్మే అమ్మయి వచ్చి,"మా కళానికేతన్ పెట్టి ముప్పైఐదేళ్ళు అయిందని" ....మంచి ఆఫర్ పెట్టాము. "మీరేమి కొన్నా దాంట్లో సగం డబ్బులు పెట్టి మళ్ళి బట్టలు కొనుక్కోవచ్చు"అంది.అది విని మా అత్తయ్య ఇదేదో బాగుంది .బట్టలన్నీ ఇక్కడే కోనేయవచ్చు! అనుకుంది. పరికిణి లు చూద్దామని చూసేము. ఒకటి బాగా నచ్చిందని కొందామని చూసేము.

మళ్ళి అది తీస్తే దాంట్లో సగం డబ్బులతో మళ్ళి బట్టలు కొనాలికదా .... అని అన్నీ చూసేము. ఏమీ పెద్ద నచ్చలేదు. వేరే కోట్టుల్లో చూద్దామని ...ఏడింటి నుండి తొమ్మిదింటి వరకూ అన్నీ తిరిగినా పరికిణీలు నచ్చలేదు .ఒకవేళ ఎమన్నా కొందామన్నా కళానికేతన్ లో లంగా కొంటే....మళ్ళి వాడి చెత్త ఆఫర్కి బట్టలు తీసుకోవాలి కదా అని," ఒక్క లంగా కోసం ఏమీ కొనకుండా", కాళ్ళు నెప్పి పుట్టేలా ... తిరిగి తిరిగి మళ్ళి ఆ కళానికేతన్ కే వెళ్లేము.

అప్పటికే తిండీ ..తిప్పలూ లేకుండా , అన్నీ తిరిగి తిరిగి ఉన్నాము .... ఇంటిదగ్గరనుండి పోన్లు మీద ఫోన్లు .ఇంకా బయల్దేరలేదా? అంటూ...ఇంకా ఏమైనా చూడలన్న ఉత్సాహం కుడా లేదు. వేరే ఏమీ చూడలేదు. మేము చూసి వెళ్ళిన లంగా ఎవరూ తీసుకోలేదు అనుకుని....ఆ పరికిణి తీసి పక్కన పెట్టి , తగ్గించిన బేలెన్స్ లో బట్టలు కొందామంటే.... రేటు నచ్చితే ,రంగు నచ్చదు.రంగు నచ్చితే ....క్వాలిటి నచ్చదు.ఎలాగో కిందా మీదా పడి ... ఆ ఉన్న వాటిల్లోనే ,నచ్చినా నచ్చక పోయినా ఒక్క పరికిణి కోసం నానా తిప్పలూ పడి .... వాడు కొట్టు కట్టేసి పొమ్మనే వరకూ అక్కడే ఉండి , వాడిని తిట్టుకుంటూ అన్నీ తీసుకుని వాడి" 50% కొనుగోలు ఉచితం" ఆఫర్కి ఒక దణ్ణం పెట్టి బయల్దేరి ఇంటికొచ్చేటప్పటికి అర్ధరాత్రి రెండైంది.

5, నవంబర్ 2010, శుక్రవారం

వెలుగుల దీపావళి

దీపావళి అంటే .... గుర్తొచ్చేది , కాంతులు వెదజల్లుతూ వెలిగే ప్రమిదలు,పేల్చే టపాసులు.దీపావళి రోజు సాయంత్రం ప్రమిదలు వెలిగించి ....గోడలమీద ,మెడపైన ,వీదిలో అరుగులు మీద ఎక్కడా ఖాలీ లేకుండా ఇల్లంతా పెట్టడం.. చాలా సరదాగా ఉంటుంది.పెళ్ళికి ముందు అమ్మగారింటి వద్ద మా చెల్లి, నేను పోటీలు పడి మరీ ప్రమిదలు వెలిగించే వాళ్లము .

దీపావళి ముందు రోజే ప్రమిదలన్నీ శుభ్రం చేసి ,ఎండలో ఆరబెట్టి ఉంచే వాళ్లము .ఈ ప్రమిదలలోకి నానమ్మ గుడ్డతో చేసిన వత్తులు పంపించేది(ఇప్పుడూ పంపిస్తుంది). .అవి గానుగ నూనెలో నానబెట్టి ఉంచి , సాయంత్రం ఐదు గంటలకి దీపాలు వెలిగించడం మొదలుపెట్టేవాళ్లము. మేడమీద ,రెండంతస్తులూ ప్రమిదలు పెట్టి....అవన్నీ వెలిగించే టప్పటికి చీకటి పడిపోయేది.ఈ లోపు గాలి వీస్తే వెలిగించినవి అరిపోయేవి. మళ్ళి పైకి వెళ్లి వాటిని వెలిగించి వచ్చేవాళ్లము.అసలు అవి పూర్తిగా అంటుకుని వెలిగితే చాలా సేపుఅలా వెలుగుతూనే ఉంటాయి(అందుకే ప్రమిదలలోకి గుడ్డ వత్తులు వాడతాము).

ఇప్పుడు మా పిల్లలూ ప్రమిదలు వెలిగించడానికి అలానే తిరుగుతారు . అవి పూర్తిగా వెలిగాకే టపాసుల వద్దకు వెళ్తారు.

ఇల్లంతా ఇలా దీపాలు వెలిగించి ఆనందించేది .... ఈ దీపావళి పండుగ రోజే కదా!


దీపాల శోభ తో మెరిసేను ముంగిళ్ళు...సిరిసంపదలతో వర్ధిల్లును మీ నట్టిల్లు.

బ్లాగ్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

2, నవంబర్ 2010, మంగళవారం

ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి ...

ఆడపిల్ల్లలు ఎన్ని రకాలు డ్రస్లు వేసుకున్నా...పరికిణి - జాకిట్టు లోఉన్న అందం దేనిలో వస్తుంది!అసలు పరికిణి లో ఎంత ముద్దుగా ఉంటారు.వాళ్లనే చూడాలనిపిస్తుంది. ఇప్పటి ఆడపిల్లలు పరికిణి లు వేసుకోవడానికే ఇష్ట పడటలేదు..ఫంక్షన్ లలో వేసుకున్నా ఆ కాసేపు వేసుకుంటారు అంతే. .

నాకు వర్కులు చేయడం ఇష్టం కదా .చీరలమీదే కాకుండా మా ప్రియాకి కూడా రెండు పరికిణి ల మీద వర్కు చేసాను.
నాలుగేళ్ల క్రితం అది హాస్టల్కి వెళ్లక ముందు వరుసగా రెండు పుట్టినరోజులకీ రెండు పరికిణి లమీద కుట్టాను .


ఫోటో తీస్తానురా .. అనగానే చప్పున అటుతిరిగింది.

అప్పుడు ఇంటివద్ద ఉండడంతో ఇష్టంగా వేసుకునేది.హాస్టల్ కి వెళ్ళాక అక్కడ ఎవరూ వేసుకోరు అని, వేసుకోమని పెట్టిన వాటిని వెనక్కి తెచ్చేసేది. ఈ నాలుగేళ్ల లో వాటిని రెండు మూడు సార్లు వేసిందేమో అంతే .

చాలా రోజుల తరువాత ఎలాగో ఈ రోజు పరికిణి వేసుకుంది .అదీ ...వారం రోజుల నుండి నాతో బ్రతిమాలించుకుని , రకరకాల గొంతెమ్మ కోర్కెలన్నీ కోరి. నాతో గులాబ్ జాం,పాలకోవ చేయించుకుని తిని,దానికి ఇష్టమైన ఈత పాయల జడ వేయించుకుని , తప్పదురా అను కుంటూ వేసుకుందామని తీస్తే అది కాస్తా కురసైపోయింది .మళ్లి దాని ఫిల్టు విప్పి సరిచేసి దానితో ఆడ్రస్ వేయించే టప్పటికి నాతల ప్రాణం తోకకి వచ్చినంత పనైంది . .
ఈత పాయల జడ .రెండు పాయలు తీసి ,మళ్ళి చిన్న పాయలు తీసి జడ లా అల్లుతారు.

29, అక్టోబర్ 2010, శుక్రవారం

కొండగాలి తిరిగింది

"కొండగాలి తిరిగింది ..కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది "ఎంత చక్కని పాట!ఎన్ని సార్లు విన్నా విసుగురాదు.చిన్నప్పుడు రేడియో లో వినటమే కానీ ఈ మధ్య వినలేదు .ఒకరోజు ఎఫ్ ఎం రేడియోలో విని , డౌన్ లోడ్ చేద్దామని చూస్తుంటే ఇదిగో ఇలా మిక్స్ చేసిన వీడియో దొరికింది .

ఘంటసాల గారు ఆలపించిన ఈ అద్భుతమైన పాట ఈ మధ్య నే చనిపోయిన కె.బి.తిలక్ గారి దర్శకత్వంలో 1965 లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాలోది. పెండ్యాల నాగేశ్వరరావ్ గారు స్వరపరిచారు .వ్రాసింది ఆరుద్ర గారు.
ఘంటసాల గారు పాడిన ఇటువంటి మెలోడి పాటలను , ఈ లోకాన్ని మరిచి పోయి ఆనందంగా ఎంతసేపైనా వినేయవచ్చు.







కొండగాలి తిరిగిందీ ..కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...


పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...ఆ ఆ
పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికింది....గట్టు మీద కన్నె లేడి గంతులేసి ఆడిందిఆ ..ఆ..


పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది ఆ ఆ ఓ ఓ ఆ ఆ ...
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది పట్టరాని లేతవలపు పరవశించి పాడింది

కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ... .. ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...

మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయిందదీ ....
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయింది నాగమల్లి పూలతో నల్లని జడ నవ్విందిఆ ఆ ఆ ... ఆ..ఆ..ఆ..

పడుచుదనం అందానికి తాంబులమిచ్చిందదీ ...ఆ ఆ ఆ ... ఆ..ఆ..ఆ...
పడుచుదనం అందానికి తాంబులమిచ్చింది ప్రాప్తమున్న తీరానికి పడవ సాగి పోయింది ఆ ఆ ఆ... ...

కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ ఆ ఆ .....ఆ ఆ ఆ ...

25, అక్టోబర్ 2010, సోమవారం

ఆటపాటల అట్లతద్ది ఈ రోజే నండోయ్


కన్నెపిల్లలు ఎంతగానో ఎదురుచూసే పండుగ ఇది. . కాబోయే భర్త గురించి వారి ఊహలు, ఆశలు నెరవేరాలని కోరుకుంటూ.... నోచుకునే నోము కావడం ఈ పండగలో ప్రత్యేకత." ఆశ్వీయుజ బహుళ తదియ" నాడు అట్లతద్ది పండుగ వస్తుంది. తెలుగింటి ఆడపిల్లలంతా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. చల్లని రాత్రి చేతులకు గోరింతాకు పెట్టుకుని ... దుప్పటి ముసుగుతన్ని నిదురోయిన ఆడపిల్లలు తెల్లవారు జామునే నిదుర లేచి, పండిన గోరింటాకును చూసుకుని మురిసిపోవడం, తక్కువగా పండితే ముసలి మొగుడొస్తాడని వేళాకోళాలాడుకోవడం, పొద్దు పొడిచే లోపలే చద్ది తినడం,ఆడపిల్లలంతా ఒక్కచోటచేరి ఆటలాడటం, ఉయ్యాలలూగడం అన్నీ సరదాలే.

ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తాబవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ, పాటలు పాడుతూ, నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటారు. ఊరిలో వుండే పెద్ద పెద్ద వేప ,మామిడి చెట్లకు ఉయ్యాలలు కట్టి ఉగుతూ... అమ్మాయిలంతా అక్కడచేరి ఆడిపాడతారు.


అన్ని వ్రతాలకి ఉపవాసముండి తరువాత పూజ చేస్తారు .అట్లతద్దికి అలా కాదు ,సూర్యోదయానికి ముందే బోజనం చేసి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి ,పూజ చేసుకుని వాయినాలిస్తారు.నోము చేసుకునే స్త్రీలు ముతైదులకు తలంటు స్నానానికి కుంకుడుకాయలు పంపిస్తారు . పసుపు, కుంకుమలు, రవికలగుడ్డ, తాంబూలంతోపాటుగా పదకొండు అట్లను వాయనంలో ఇస్తారు. పది సంవత్సరాలు ఈ నోమును నోచుకుంటారు. సంవత్సరానికి ఒక ముతైదుకు వాయినం ఇచ్చేవారు కొందరైతే, పదిమందికీ ఒకేసారి ఇచ్చేవారు కొందరు. వాయినం పుచ్చుకున్న అట్లను వారుతప్ప వేరొకరు తినకూడదనే నియమం వుంటుంది.

ఇప్పుడు అట్లతద్ది అంటే అట్లు వేసుకుని తినడమే... . మా చిన్నప్పుడు అమ్మావాళ్ళు పూజలు చేసుకుని వాయినాలు ఇచ్చుకోవడం తెలుసు . కానీ మేమూ .. అట్లతద్ది రోజు ప్రతేకంగా ఏమీ పూజకూడా చేయట్లేదు.మా గోదావరి జిల్లాల వైపు పెళ్ళైన వారం లోపులో తద్ది పూజ చేయిచేయించి , ముత్తైదులకు వాయినాలు ఇప్పిస్తారు. తరువాత నాలుగైదేళ్ళు తద్ది ఉపవాసం ఉండి .... అట్లతద్ది జరుపుకుంటాము .తరువాత అదీ ఉండదు.కాకపొతే అట్లతద్ది రోజు అట్లేసి , బెల్లంచారు కాసి పాలేళ్ళకి,కూలీలకి,చాకలి,మంగలి ఇలా అందరికీ పెడతాము. అదేమాకు అట్లతద్ది పండుగ. ఓపిక గా చేయాలి అనుకునే వాళ్ళు ఇలా అన్నా చేస్తున్నారు . .

ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర వంటి వాటిని తినడం ద్వారా కంటిసమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గోర్లకు ఆరోగ్యం కూడా. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత అని ఇట్టే అర్థం అవుతుంది


పట్నాల సంగతెలా ఉన్నా ,పల్లెల్లో కుడా ఇటువంటి కొన్ని పండుగలు అలా ..అలా ... నెమ్మిదిగా మరుగున పడిపోతాయేమో!.

21, అక్టోబర్ 2010, గురువారం

మా పెరట్లో తిరిగే సీతాకోకచిలుకల చిత్రాలు

మా ఇంట్లో రకరకాల పూల మొక్కలు ఉండడం తో సీతాకోకచిలుకలు బాగా వస్తుంటాయి. రంగురంగుల రెక్కలను అల్లల్లాడిస్తూ అవి పువ్వుల్లో మకరందం కోసం ......ఒకపువ్వు పై నుండి ఇంకో పువ్వు పై వాలుతూ ...అటూ,ఇటూ ఎగురుతుంటే చూడడానికి బలేఉంటుంది. ఫోటో తీయాలంటే మాత్రం చాలా కష్టం సుమండీ....


ఈ సీతాకోకచిలుకల ను ఫోటోల్లో బందించడానికి అష్ట కష్టాలు పడుతుంటాను.అవి అసలు ఒక పువ్వు మీద నుండి ఇంకో పువ్వు మీదకి అలా తిరుగుతూనే ఉంటాయి .ఒక్కో పువ్వు మీదా అరనిముషం ఉంటాయేమో ,ఫోటో తీయడానికి రెడీ అయ్యేలోపు వెళ్లి పోతుంటాయి .వాటి వెనకాల పరిగెడుతూ ఎలాగో తీస్తాను. ఒక్కోసారి గులాబీ ముళ్ళు గుచ్చుకుంటాయి .కానీ ఫోటోలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది.




ఇదేంటో ఇలా మడ్డి రంగులో ఉంటుంది .ఇది మిగిలిన వాటిలా ఓ ఎగిరిపోదు దేనిమీద వాలితే దానిమీదే ఉంటుంది బద్దకంగా .ఇది సీతాకోకచిలుక ల్లో ఒక జాతంట.

















ఇది పెద్దగా ఉండి లైట్ నీలం రంగు రెక్కలతో చాలా బాగుంటుంది.