=''/>

19, ఫిబ్రవరి 2014, బుధవారం

నేనూ నడుస్తున్నా !


మా ఊళ్ళో    సాయంత్రపు నడకకు పోయే  లేడీస్ బాచ్ ఒకటుంది .బాచ్ అంటే ఓ పది మందుంటారు  కానీ ఎప్పుడూ మానకుండా వెళ్ళేది మాత్రం ఐదారుగురే . మిగిలిన వాళ్ళు అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా  వెళ్ళే వాళ్ళు . 

వాకింగ్  కి వెళితే  నాలుగైదు కిలో మీటర్లన్నా  నడవాలి కదా అందుకే  పొలం  వెళ్ళే దారినే  వాకింగ్ కి  ఎంచుకున్నారు. 

సాయంత్రం  మూడు గంటలకే నడకకు పోయే వాళ్ళు అరుగుల మీదకి చేరిపోతారు.ఒకవేళ ఆ టైమ్లో ఎవరన్నా పెండ్లి పిలుపులకు వచ్చినా వాకింగ్  వెళ్ళేవాళ్ళు  ఎవరో ,ఎక్కడుంటారో తెలిసిన వాళ్ళైతే అక్కడికే వెళ్లి చెప్పేస్తారు .   

 అందరూ వచ్చి బయలుదేరే లోపు వాళ్ళ కబుర్ల  లో మూడు  వీదుల  విశేషాలూ దొర్లిపొతాయి.  అంటే మరీ సినిమాల్లో చూపినట్టు ,పుస్తకాల్లో రాసినట్టు కాదండోయ్ .. చింత పండు ఎవరు ఎక్కడనుండి తెప్పించారు? ఎక్కడ మంచిది దొరుకు తుంది?పండు మిరపకాయలు వచ్చాయా? వడియాలు  ఎవరెప్పుడు పెట్టుకుందాం ?ఇంకా  ఇలాంటి చాలా సంగతులన్న మాట ! వర్షా కాలం లో  సన్నగా వర్షం పడుతున్నా  గోడుగులేసుకుని  మరీ  వాళ్ళ నడక ను సాగిస్తారు . 

మా పిన్నైతే ఇంట్లో ఎంత పనున్నా వాకింగ్ మాత్రం మానదు. పనున్నప్పుడు కూడా వాకింగ్  ఎందుకు ? మానేయొచ్చుగా అంటే  ఆ టైం కి అలా వెళ్ళాల్సిందే  లేకపోతే  ఏదో  లేనట్టే  ఉంటుంది అంటుంది .  

అసలు ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే ...  ఎప్పటినుండో అంటే ఐదారేళ్ళ నుండీ  సాయంత్రపు నడకకు పోవాలని బద్దకిస్తూ వస్తున్న నేను  ఎలాగో ఆ  బద్దకాన్ని కాస్త వదిలించుకుని ఈ మధ్యే  మా వాకింగ్ బాచ్  లో  
 జాయినయ్యా :)  . ఆబ్సెంట్లు ఎక్కువ లేకుండా  సాధ్యమైనంతవరకూ  రోజూ  మానకుండా  వాకింగ్ కి వెళ్లాలని గాట్టిగా  నిశ్చయించేసుకున్నా :) 

పచ్చని పొలాల మధ్య లో ,సాయం సంధ్య  వేళ  నడక  మాత్రం భలే  ఉంది . అసలు  నడిచినట్టే ఉండటం లేదు .చుట్టూ ఇలాంటి దృశ్యాలు కనబడుతుంటే  వాటిని చూస్తూ పోతుంటే  ఎంత దూరం వెళ్ళామో ? ఏం తెలుస్తుంది !

                      
                                                       

ఇప్పుడు పుగాకు సీజన్ కావడంతో ఎటు చూసినా పుగతోటలే కనిపిస్తాయి. 




                            

                                                          రేగి చెట్టు

                                                               
                                                                         పొలంలో చెరువు


                       

                                                           


  

6, ఫిబ్రవరి 2014, గురువారం

తెలి మంచు కురిసిందీ .. మా ఊరిలో..

 సీతాకాలం  పోతూ పోతూ  చక్కని ఉదయాన్ని చూపించిందోరోజు   ! ఈ రోజుల్లో ఇంచు మించు రోజూ ఇలానే ఉంటుంది కానీ  ఆ  రోజైతే ఇంకాస్త బావుంది .  

      మా ఊరి చుట్టూ పొలాలు,కొబ్బరి చెట్లూ  ఉండటంతో  ఎటు చూసినా పచ్చగానే కనిపిస్తూంటుంది . ఇక   ఆ పచ్చదనాని కి    పుగ మంచు కూడా  జతైతే   సీతాకాలపు  ఉదయాలు నాకైతే  చూడటానికి అధ్బుతంగా ఉంటాయి  
నిరుడు  మంచుకురుసే  వేళలో  .. మా ఊరు  ఎలా ఉందో  చూసారు .   మరేమో నాకు  ఇంకా బాగా వర్ణించి కాస్త కవితాత్మకంగా చెప్పడం రాదు కదా ! అందుకని  ఆ అందాన్ని  నా కళ్ళనిండా నింపుకుని ఈ ఏడు   కూడా ఇలా   చిత్రాల ద్వారా మీకు చెప్తున్నానమాట  ! 



















ఇలా సీతాకాలపు  ఉదయాలు చూస్తుంటే స్వాతికిరణం సినిమాలో వాణీ జయరామ్  గారు అధ్బుతంగా పాడిన  తెలిమంచు కరిగింది పాట గుర్తొస్తూ ఉంటుంది . నాలా ఎవరికైనా గుర్తొస్తే ఓ సారి ఈ పాట   చుసేయండి  మరి!

2, జనవరి 2014, గురువారం

ఈ ఉదయం ..

రోజూ ఉదయం పనవ్వగానే కాసేపు మొక్కలలో తిరగడం ఓ అలవాటు .

కొత్త చిగుళ్ళను ,విచ్చుకున్న పువ్వులను ఓ మాటు అలా కళ్ళతో పలకరించి,  కోతుల బారిన పడ్డ ,కలుపు పెరిగి  చిన్న సైజు అడవిలా మారిన పెరటికి వెళ్ళా .


పిల్లా  పీచుతో సహా వారానికోసారి పొలాల్లోనుండి మా ఊరికి  పెద్ద కోతి గుంపు దండయాత్రకి వస్తుంటుంది  .నాలుగు రోజుల క్రితం ఉదయమే ఎంచక్కా   బ్రేక్  ఫాస్ట్  టైం కి  వచ్చేసాయి. ఇప్పుడిప్పుడే కాస్తున్న టమాటాలను  ,వంకాయలను మేం చూసి కొట్టే లోగా  కోసేసి ,పోనీ వాటికీ కావలసినవి కోసుకుని ఊరుకుంటాయా ? పిందె లతో సహా కోసి కొరికి  పాడేసాయి.పైగా అవేమన్నా తెలివి తక్కువియ్యా  ఆపక్కగా నున్న మిరప మొక్కల జోలికే  పోలేదు . ఎలా తెలుస్తాయో సరిగ్గా మళ్ళి పిందెలు పెరిగే టైం కి వచ్చేస్తాయి.

పెరట్లో తిరుగుతూ మాకు దక్కకుండా కోతులకు విందౌతున్న  వాటిని  చూసి  ఫీలౌతుంటే  చుట్టూ చక్కని కనుల విందైన దృశ్యాలు  కట్టిపడేసాయి.




 మంచు ముత్యపు పోగులతో అల్లినట్టున్న సాలిగూడు



రాత్రి కురిసిన మంచులో తడిసి ముత్యాలను సింగారించుకున్న గడ్డిమొక్కలు


ఎప్పటినుండో నా నుండి తప్పించుకుని తిరుగుతున్నమాయలేడి  దొరికింది !

                                   
                                                           మట్టి పుష్పాలు



ఏవో గడ్డిపువ్వులు !


గుంటగలగలగర  మొక్క .ఆయుర్వేదంలో వాడతారు.


 బుజ్జి  సీతమ్మలు  బోల్డున్నాయి  హాయిగా  విహరించేస్తున్నాయి .

10, డిసెంబర్ 2013, మంగళవారం

ఉడుతలు బంతి పువ్వులు కూడా తింటాయా ??

 మా ఇంట్లో చాలా ఉడుతలు   తిరుగుతాయి .అవేప్పుడూ ఏదోకటి తింటూనే ఉంటాయి.వాటి  చిన్నిబొజ్జకి ఎంత ఫుడ్ కావాలో మరి ?అస్తమానూ ఒకదాని వెనుకాల ఒకటి తిరుగుతూ ,చెట్లెక్కి దిగుతూ ..పరుగులు పెడుతూనే ఉంటాయి .అందుకేనేమో  అలా తింటుంటాయి . 

చివరాకరికి బంతి పువ్వుల్ని కూడా అవి వదల్లేదు. 

రోజూ బంతి మొక్కల కొమ్మలు విరిగి పోయి,మొక్కల కింద పువ్వులు  చించేసి ఉంటున్నాయి.  ఎవరబ్బా ..అలా దొంగ చాటుగా పువ్వులు కోసి చించేసేది? అనుకున్నాం .

అసలు విషయం నాలుగైదు రోజులకి  తెలిసిందనమాట. ఆ దొంగలు ఈ ఉడుతులుం గార్లే అని ! 
 దొంగెవరో తెలిసిందిగా ...ఓ రోజు మాటేసి వాటినిలా పట్టేసా ! 

 చూడండి ! ఎంతందంగా ,ముద్దుగా తింటున్నాయో ..

























2, డిసెంబర్ 2013, సోమవారం

మా కార్తిక వనభోజనాలు !!


కార్తిక మాసం మోదలైనప్పుడనుకున్నాం  వనభోజనాలకెళ్లాలని ! ఈ రోజుతో కార్తిక మాసం అయిపోతుందని  నిన్న వెళ్లాం !

మావి ఓన్లీ లేడిస్ వనభోజనాలు అన్నమాట :))

ఇప్పుడసలే పొగాకు సీజన్ మొదలైంది .అందరూ బిజీ బిజీ గా ఉంటారు .దగ్గరలో ఉన్న  పొలమైతే ఎవరినీ   తీసుకెళ్ళమని అడగక్కర్లేదు ,సుబ్బరంగా నడిచి  వెళ్లిపోవచ్చనుకున్నాం.

ఓ నలభై మందిమయ్యాం .ఎవరు ఏమేం  తేవాలో  ముందే   చెప్పుకున్నాం .అన్నీ సిద్దం చేసుకుని  తొమ్మిది గంటలకల్లా వెళ్ళాలనుకున్నాం కానీ  అందరం కలిసి పొలం వెళ్ళేటప్పటికే పది దాటి పోయింది ..

ఉసిరి చెట్టుకి  (కొమ్మ )పూజా కార్యక్రమాలు  అయ్యాక , పాలు పొంగించి పరమాన్నం చేసారు .

అందరూ తలా కాస్త ప్రసాదం తీసుకున్నాక ,మోదలెట్టేసాం మా ఆటలు ,పాటలు :))

మొదట అందరం హౌసీ   ఆడాం.అందులో సగం మందికి  (పెద్దవాళ్ళు )నేర్పి మరీ ఆడాం .ఫుల్  హౌసీ కి ఫ్రైజ్ కూడా ఇచ్చామండోయ్ :)


తారువాత అంత్యాక్షరి ! ఆపాట , ఈ పాట అని లేదు గీత శ్లోకాలు,బజన పాటలు ఎవరికొచ్చినవి వాళ్ళు పాడేయటమే :)..అంత్యాక్షరికి అంతం ఉంటుందా ?ఎంతసేపైనా అలా సాగుతూనే ఉంటుంది గా ..

అసలే నడిచి  వెళ్ళామేమో ,ఆపై ఆటలు !  భోజనాలకు  లేటైందని పిల్లల్ని   చూస్తే  గానీ గుర్తురాలే! అలా  లీనమయ్యారంతా.

ఇంతకీ మా వనభోజనాల మెనూ చెప్పలేదు కదా !

నా వంతుగా పులిహోర ,దొండ కొబ్బరి ఫ్రై,ఇంకా పాలతాలికలు , కొబ్బరన్నం ,గుమ్మడి కాయ కూర , నాటు చిక్కుడు టమాట ఇగురు ,పచ్చి చింతకాయ పప్పుచారు.

ముందు వాళ్లకి కానిచ్చి  మా భోజనాలు కూడా అయ్యేటప్పటికి టైం రెండు గంటలు!

 ఇక మిగిలిన ముడుగంటల్లో ..

 మ్యూజికల్ చైర్ ఆడాం (ఆడించాం).వయసులు వారీగా మూడు బ్యాచ్ లనమాట ! అంటే  ఒకటి యూత్   మా  కోడళ్ళ ,కూతుళ్ళ బ్యాచ్ .రెండో బ్యాచ్  పిల్లలు . మూడో బ్యాచ్ ఎవరో తెలిసిందిగా   :))

అదయ్యేటప్పటికి స్నాక్స్, టీ టైం అన్నమాట ! మిరపకాయ బజ్జీతో అక్కడే టీ పెట్టుకుని తాగాం .

తరువాత చాకిరేవు బల్ల ,పరుగుపందాలు ,కోకో  ,ఇలా ఏవేవో ,ఎప్పటివో స్కూల్లో ఆడినవన్నీ గుర్తు చేసుకుని మరీ ఆడేసాం :))

హ్మ్ !  అసలే సీతాకాలం పొద్దు ! ఐదు గంటలకే  పొద్దువాలిపోద్ది . సర్దుళ్ళు మొదలు పెట్టి అన్నీ సర్దుకుని , వచ్చే ఏడుకి సరిపడా జ్ఞాపకాల్ని మోసుకుంటూ , ఈ ఏడు  వనభోజనాల్లో వచ్చిన లోటు పాట్లను వచ్చే  ఏడాదికి ఎలా సర్దుబాటు చేసుకోవాలో చర్చించుకుంటూ ఇళ్ళకి బయలుదేరాం :))















పొలాల పక్కన కంచెల్లో పువ్వులు ! ఫొటో తీయమని నన్నెప్పుడూ ఊరిస్తుంటాయి :)) నిన్నటికి కుదిరింది .



పుగాకు తోటలో పైపాటు ! అంటే కలుపు రాకుండా దున్నడం .



ఈ పువ్వుల పేరూ తెలీదు .కంచెలపై తీగలు అల్లుకుపోయి ఉంటాయి.   

23, నవంబర్ 2013, శనివారం

ఈ రోజు సూర్యోదయం

మాకు హెలెన్ తుఫాన్ ప్రభావం అంతలేదు .కానీ ,వాతావరణం  నాలుగు రోజుల నుండీ మబ్బు ,గాలీ వానతో ఉంది .

ఈ రోజు  అక్కడక్కడా ఉన్న మబ్బుల మధ్యనుండి సూర్యోదయం ఇలా కనిపించింది .


















 










14, నవంబర్ 2013, గురువారం

ఈ పువ్వులు నిజంగా దేవకాంతలే !!


 శరద్కాలం లో చెట్టునిండా విరబూస్తాయి ఈ దేవకాంత పువ్వులు.ఈ పువ్వులు  నా దృష్టిలో నిజంగా దేవకాంతలే !! అంతందం వాటిది !

దారిన పోయే ప్రతీఒక్కరి కన్నూ ఆ చెట్టు పైనే ఉంటుంది.ఇక నేనైతే పువ్వులున్నన్ని  రోజులూ కాసేపైనా  దాని చుట్టూ తిరుగుతూ ,చూస్తూ ఉంటా...ఉదయం చెట్టు చుట్టూ రేకలు రాలి పడుంటే  చుట్టానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి !

అందుకే మూడో కన్నుతో కూడా చూస్తా! అప్పుడప్పుడూ :)) 

మీరు కూడా చూస్తారా? మా దేవకాంతల్ని ...