=''/>

9, ఆగస్టు 2014, శనివారం

ఓ చక్కని జంట మా ఇంట !

ఓ  నెల క్రితం మా ఇంటికి బుజ్జి ,చూడ  చక్కని  పిచ్చుక జంట వచ్చింది . 

   ఉదయాన్నే  ఈ పిచ్చుక జంట కిచ కిచ మంటూ మా పెరట్లో తిరుగుతూ అక్కడక్కడా కనపడ్డ గడ్డి పరకలను నోటకరచుకుని ఎగిరిపోతుండటం  రోజూ చూస్తున్నా .

ఎక్కడో గూడు కట్టుకుంటున్నట్టున్నాయబ్బా అనుకుని  ... వాటిపైకాస్త  గూడచారి పని చేసి వెంటిలేటర్ లో దూరి కష్టపడి  కట్టుకుంటున్నాయని  ఓరోజు మాటేసి    కనిపట్టేసా  .















4, జులై 2014, శుక్రవారం

ఊడ్పులు మొదలయ్యాయి !

అసలు ఈ రోజులొచ్చేటప్పటికి వర్షాలు పడుతూ ఊళ్ళో రైతులూ,పనులకి పోయేవాళ్ళూ కూడా బిజీ బిజీ అయిపోతారు. 

అటువంటిది జూలై నెలొచ్చినా  వడగాలులతో కూడిన ఎండలు ఉంటే ఇంకా ఏం పనులు జరుగుతాయి.
ఈ ఎండలకి కరెంట్ కూడా ఉండక సమయానికి తడుల్లేక పంటలు చాలా చోట్ల ఎండి పోతున్నాయి.మాకు త్రీ ఫేస్ కరేంట్ వుంటే కాస్తలో కాస్తైనా ఏదో పనులు జరుగుతుంటాయి.

వర్షాలు లేకపోయినా సమయానికి పనులు మొదలు పెట్టడం రైతు కి అలవాటైన పని కదా !

ఓ వారం పది రోజుల కైనా కాలం కలిసొచ్చి వానలు పడతాయన్న నమ్మకంతో.. . .ఆ వచ్చే పోయే కరెంట్ నే నమ్ముకుని  దమ్ములు చేసి ఊడుపులు మొదలుపెట్టారు !











27, జూన్ 2014, శుక్రవారం

చిన్న పని కి పెద్ద సంతోషం :)


ఈ రెండు రోజుల నుండీ కాస్త చల్ల బడింది కానీ ఈ వేసవి లో  ఎండలు ఎలా మండిపోయాయీ ..

మా ఇంటి చూట్టూ  చెట్లూ  ,పక్కనే పొలం వుండటం వల్ల పక్షులూ ,ఉడుతలూ  ఇంట్లో బాగా తిరుగుతుంటాయి.
అసలే వేసవి పాపం ఆ చిన్ని ప్రాణాలు ఈ వేడిని ఎలా తట్టుకుంటాయా అనిపించేది వాటిని చూస్తుంటే.

వేసవి లో వాటికి ఉదయాన్నే ఓ గిన్నెలో నీళ్ళు పోసి పెట్టడం అలవాటు. అదో   పెద్ద  సంతోషాన్నిచ్చే పని .  అలా పెట్టిన నీళ్ళు అవి తాగుతుంటే  చుట్టానికి  భలే  వుండేది .  వీటిని  ఫోటో తియ్యడానికి నాకు నాలుగు రోజులు పట్టింది .  ఏ  మాత్రం సడైనా  తుర్రు మనేవి . ఎలాగో  సడి   చప్పుడూ  చెయ్యకుండా వాటిని క్యాచ్ చేసేసా :)























16, జూన్ 2014, సోమవారం

కొబ్బరచ్చు (కోకోనట్ బర్ఫీ)

పిల్లలకి బాగా నచ్చే ,తేలికగా చేసుకునే స్వీట్ ఈ" కొబ్బరచ్చు " ! దీనిని కోకోనట్ బర్ఫీ అంటారు  . మేమైతే కొబ్బరి పాలకోవా  అనికూడా అంటాం . 

నేను పిండివంటలూ,స్వీట్సూ అస్తమానూ చేస్తూనే ఉంటా కానీ , చాలా వాటికి  కోలతలు మర్చిపోతుంటా .చెయ్యడానికి అన్నీ దగ్గర పెట్టుకుని అత్తయ్య కో ,అమ్మమ్మ కో ఫోన్ చేసి కొలతలన్నీ వివరంగా తెలుసుకుని  మొదలుపెడతానన్నమాట . ఎప్పటికప్పుడు ఈసారి పుస్తకం లో రాసుకోవాలి అనుకుంటా కానీ ఆ పనయ్యాక బద్దకం వచ్చేస్తుంది. 

ఇంతకీ ఈ స్వీట్ గురించి చెప్పకుండా నాబద్దకం  గురించి ఎందుకు చెబుతున్నానంటే ..

ఈ కొబ్బరచ్చు  చెయ్యాడానికి తీసుకునే సరుకుల పాళ్ళన్నీ సమానంగా తీసుకుంటే చాలు.అందుకని   ఇది చేసినప్పుడు మాత్రం   ఎవరికీ ఫోన్ కొట్టే పనుండదు .ఈజీగా పనై పోయినట్టుంటుంది    . 

 కొబ్బరచ్చు  చెయ్యడానికి  కావలిసినవి  - కొబ్బరి కోరు,పంచదార ,పాలు  . 

 ముందు చెప్పినట్టే  అన్నీ సమానంగా తీసుకోవాలి . తీపి తక్కువగా  తినేవాళ్ళు  పంచదార కాస్త తగ్గించుకుని వేసుకోవచ్చు . 



 

అడుగు మందమున్న  గిన్నెలోకి కానీ,మూకుట్లోకి కానీ కొబ్బరి కోరు,పంచదార ,పాలు సమానంగా తీసుకుని ,పొయ్యి మీద పెట్టి  పాలు మొత్తం ఇగిరి పోయి ముద్దైపోయేలా తిప్పుకోవాలి . 




 ఆఖరి కొచ్చేట్టప్పటికి మంట తగ్గించుకుని సన్న మంట పై తిప్పుకుంటే  అడుగంటుకుని రంగు మారకుండా ఉంటుంది . 



 ఇంత  దగ్గరగా మూకుడు కి అంటుకోకుండా ఉండాలా,ముద్దలా  అయిపోతుంటే దింపేసుకోవచ్చు . లేకపోతే  ప్లేట్లో  కాస్త వేసి , ఉండ చేసి చూసుకుంటే  తెలుస్తుంది .


ప్లేటుకి  నెయ్యి రాసి దానిపై  ఉడికిన ముద్దవేసి , పలచగా  అద్ది (అద్దే టప్పుడు  చేతులక్కూడా నెయ్యి రాసుకుంటే  చెయ్యి కాలకుండా ఉంటుంది . అద్దేటప్పుడు  చేతికి అంటుకోదు ) కాస్త వేడిగా ఉన్నప్పుడు ముక్కలుగా  కోసుకుంటే విరిగి పోకుండా వస్తాయి.


అదండీ మరి ! నేను కొలతలు మరిచిపోకుండా ,తేలికగా చేసే కొబ్బరచ్చు సంగతి !

చాలా ఈజీగా  చెప్పేసేరు కానీ  చెప్పినంత తేలిక కాదు చెయ్యడం అనుకుంటున్నారేమో ! ఒక్కసారి చేసి  చూడండి  . అప్పుడు మీరే  చెప్తారు కొబ్బరచ్చు చెయ్యడం చాలా ఈజీ .. ఇట్టే  చేసుకోవచ్చు అని :)

తేలికగా చేసేరో ?కష్టంగా చేసేరో ?చేసేక   చెప్పాలి మరి !  

2, జూన్ 2014, సోమవారం

ఈ మధ్య తీసిన కొన్ని ఫొటోలు !

ఇవి వాకింగ్ కి వెల్తూ తీసినవన్నమాట !


 వాకింగ్ కి వెళ్తుంటే  మధ్య మధ్యలో  ఇదుగో ఇలా ఎవరోకరు కనిపిస్తుంటారు ..వాళ్ళూ ,వాళ్ళునిల్చున్న ,కూర్చున్న తీరు చూస్తే   టక్కున ఆగిపోయి ,టిక్కున ఓ ఫొటో  తీసేయాలనిపించి ఆగిపొతుంటా . ఈ లోపు నా వాకింగ్ మేట్స్  చక చకా నడుస్తూ ముందుకు పోతారు . 

అయినా సరే  టిక్ టిక్ మని  ఇలా వీళ్ళ ఫీలింగ్స్  ని ,చేసే పనులని   అందుకుని  నేనూ వాళ్ళని కలవడానికి  ఆ విధం గా ముందుకు  పోయానన్నమాట :)





  


                                         

                                             







10, మే 2014, శనివారం

గిజిగాళ్ళు -గూళ్ళు

మా ఇంటి పక్కనున్న కొబ్బరి తోటలో ..  ఈ మధ్య  ఉదయమే  బోల్డన్ని పిచ్చుకలు   సందడి సందడి గా  ,కిచ కచలాడుకుంటూ  అటూ ఇటూ ఎగురుతూ కనిపిస్తున్నాయి. ఇదివరకు ఇంతిలా  కనపడలే.. వినపడలే .. ఏమిటా అని ఓ రోజు కాస్త నిశితంగా గమనించి  .. పరికించి చూస్తే  ...   

ఇవిగో ఈ గిజిగాళ్ళ దన్నమాట  ఆ సందడి ! కొబ్బరాకుల్ని  సన్నని  ఈనెల్లా చీల్చుకుని ఈ గూళ్ళు కట్టుకుంటున్నాయి .. ఓ రోజు వట్టినే ఎలా గూళ్ళు కట్టుకుంటున్నాయో  చూద్దామని వెళ్ళా . నేనున్నా ఐదు  నిముషాల్లోనే  సగం  గూడు  కట్టేసిందో గిజిగాడు !

 ఈ రోజు  మబ్బు  మబ్బుగా  ఉంది  . మళ్లీ వర్షం పడితే అవుంటాయో వేరే చోటకి వెళ్ళిపోతాయో  అనుకుని   బద్దకించకుండా వెళ్లి  వాటిని  అట్టే విసిగించకుండా   ఐదు నిముషాల్లో ఓ పది స్నాప్స్  తీసుకుని వచ్చేసా .. 
అమ్మో ఐదు నిముషాలు మెడ పైకెత్తి వాటిని ఫోటోలు తీసేప్పటికి  నా మెడ పట్టేసింది .. కాసేపట్లో సర్దుకుంది లెండి. 

    భలే చిత్రం కదా వాటి నైపుణ్యం !  



















6, మే 2014, మంగళవారం

నువ్వులు - నూనె - చిమ్మిలి !!



ఇప్పుడు నువ్వులు పంట వచ్చేరోజులు  కదా ! 

మా ఊళ్లో గిట్టుబాటవ్వడం  లేదని చాలా మంది నువ్వులు పండించక పోయినా ..   ఊరగాయ  పచ్చళ్ళ  లో నూ ,కూరల్లో వాడకానికి నూనె కి ,,పప్పు  కోసం ఇలా సంవత్సరమంతా వాడకానికి సరిపడా బస్తానో ,రెండు బస్తా లో ఎవరి వాడకాన్ని బట్టి వాళ్ళు   పండిన చోటనుండి తెప్పించు కోవడమే . 

ఈ సంవత్సరం బస్తా నువ్వులు ఏడు వేల రూపాయలు .నిరుటి మీద రెండు వేలు పెరిగింది . రేటు పెరిగినా సంవత్సరానికి  సరిపడా నిల్వ  చేసుకోవడానికి తప్పదు కదా !

నువ్వులు తెప్పించుకోవడం తేలికే కానీ అవి కడగడం అంటే  బాబోయ్ ! చాలా పెద్ద పని .నాకైతే  అపన్నయ్యే వరకూ  నిద్రే పట్టదు . 

 ఇక మాకేమో   ఈ రోజుల్లో కరంటు  ఒక  పూటే  ఉంటుంది .   నీళ్ళ కరెంట్ అంటే త్రీ ఫేస్ కరెంట్ ఇస్తాడు. ఓ వారం పుద్దన్న , ఓ వారం   మధ్యాహ్నం  అన్నమాట .. 
నువ్వులు కడగడానికి  బోల్డన్ని నీళ్ళు  పడతాయని ఉదయం కరెంట్ ఉన్నప్పుడే  కడగడానికి ముహూర్తం పెట్టుకుంటారంతా .. 

నువ్వులు కడగాలంటే ... నీళ్ళు పట్టుకోవడాలు, కడగడానికి మనుషుల్ని పోగేసుకోవడాలు !

రెండు మూడు రోజుల ముందే ఇద్దరి పాలేళ్ళకి  ,ఇద్దరు  నువ్వులు తెల్లగా కడగి ,చెరిగి బాగు చేసే   ఆస్థాన కూలి అమ్మాయిలకీ  పలానా రోజు నువ్వులు కడుక్కోవాలి మానకుండా రండి  బాబూ,అమ్మా  అని బుక్ చేసుకోవాలన్నమాట !

నువ్వులు రాత్రి  నీళ్ళ లో పోసి  నానబెట్టుకుని  తెల్లార  గట్ల  నుండి గడగటం మొదలెట్టేస్తారు . నువ్వుల నునె కోసమైతే ,నానిన నువ్వులు కొద్ది కొద్ది గా తీసుకుని  ఇనప బకెట్ లో  కానీ ,రోట్లో కానీ  వేసి  రోకళ్ళతో  రెండు మూడు నిముషాలు తొక్కి తీసేసి వాటిని నువ్వులు కడుక్కునే చిల్లుల డబ్బా ఉంటుంది .దాన్లో  వేసి రెండు మూడు సార్లు కడిగితే సరిపోతుంది . వాటిని ఎండలో పోసి ఆరబెట్టి ,ఆరాక శుబ్రం  గా చెరిగించి  జాగర్త చేసుకుని నునె కోసం మిల్లుకి  పంపించడమే !

 నువ్వు పప్పుకోసం  ఐతే  నానిన నువ్వుల్ని కాస్త ఎక్కువ సేపు పోటెయ్యాలి . వీటిని నువ్వులు కడుక్కునే డబ్బాలో వేసి ,   తెల్లగా కడగడానికి టాంక్ లో నీళ్ళ న్నీ  అయిపోవాల్సిందే .  ఒక్కోసారి కరెంట్ పొరపాటున ఆగిపోతే పక్కన పొలాల్లో టాంక్ వద్ద కెళ్ళి ఎలాగో పని పూర్తి చేసుకొస్తారు  పాపం .పొ ట్టు మొత్తం నీళ్ళలో పోవడంతో  కడిగిన నువ్వు పప్పు  ఎండలో ఆరబెట్టుకుని  నూపప్పు జల్లిడి తో  జల్లించుకుంటే సరిపోతుంది 

అప్పుడే కడిగిన నానుంటుందేమో నువ్వు పప్పు తినడానికి భలే రుచిగా ఉంటుంది :)

నువ్వు పప్పు  చేసుకున్న రోజే " చిమ్మిలి "  తోక్కుకోవడం అలవాటు మా వైపు .. 

చిమ్మిలి !   మన రాష్ట్రం లో అందరికీ  తెలుసా ? కోస్తా ప్రాంతం వాళ్ళ కే  తెలుసా ? అని నాకు ఎప్పటి నుండో డౌట్  ! 
తెలిస్తే ఎవరైనా చెప్పండే :)

                                            

చిమ్మిలి కి కేజీ నువ్వు పప్పుకి ,అరకేజీ బెల్లం కొలత ! 

నువ్వు పప్పు రోట్లో వేసి పొడయ్యాక ,బెల్లం కుడా వేసి ,బాగా కలిసి ముద్దయ్యే వరకూ తొక్కి ఉండలు చుట్టు కోవడమే.   మిక్సీ లో  వేసి కూడా అప్పుడప్పుడూ మధ్యల్లో చేస్తుంటాం కానీ   నువ్వు పప్పు ఫ్రెష్ గా ఉన్నప్పుడు చేసుకున్నదే రుచి బావుంటుంది . చిమ్మిలి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది . 

                                                   
                                                  


వెనకటికి  అత్తోరింటికి  వచ్చిన ఓ  కొత్తల్లుడు కి  చిమ్మిలి పెడతానంటే  ... మొహమాటానికి పోయి వద్దన్నాడట .  రాత్రి అందరూ  నిద్రోయాక మొహమాటపు  అల్లుడి కి చిమ్మిలి రుచి చూడాలనిపించి రోలు నాకడానికి   రోట్లో తలెడితే  .... తల  రోట్లో ఇరుక్కుపోయి లబో దిబో మన్నాడట !  అని చిమ్మిలి తొక్కినప్పుడల్లా నానమ్మ చెబుతుండేది :)



14, ఏప్రిల్ 2014, సోమవారం

బెజవాడ కృష్ణమ్మ వద్ద ఓ సాయంత్రం !

మొన్నో రోజు బెజవాడ వెళ్ళినప్పుడు సంధ్యా సమయంలో  కృష్ణమ్మ వద్ద కాసేపు గడిపాము .

చల్లగా వీస్తున్న గాలిలో పరవళ్ళు తొక్కుతూ సాగిపోతున్న కృష్ణవేణీ నది ! 

నెమ్మిది నెమ్మిదిగా పశ్చిమ దిక్కువేపు వాలిపోతున్న సూర్యుడు !  

చూస్తుండగానే చీకటి తెరలు కమ్ముకున్నాయి.

ప్చ్ !  ఈ సూర్యుల వారికి వారి డ్యూటీ ముంగించడానికి అంత తొందరేమిటో !

ఇక నేనేమో చాన్సు దొరికింది కదా అని వారినిలారకరకాల కొణాలలో దొరకబుచ్చుకున్నాన న్నమాట  :-)